రాష్ట్రాలపై రుణభారం అసంబద్ధం

10 Oct, 2020 00:51 IST|Sakshi

విశ్లేషణ

భారతీయ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం నిధుల పంపిణీ ప్రక్రియ ఇప్పుడొక జాతీయ సమస్యగా మారిపోయింది. ఇతరత్రా అనేక సమస్యల్లో మన ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా కొట్టుమిట్టాడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలను ఎవరు తీసుకోవాలి అనే విషయమై ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం సమంజసంగా లేదు. కానీ కేంద్రానికి అన్నిరకాలుగా ఉన్న సౌలభ్యం రీత్యా తక్కువ వడ్డీకి మార్కెట్లో రుణాలు సేకరించి వాటిని రాష్ట్రాలకు పంపిణీ చేయడమే భేషైన పని. కానీ ఆవైపుగా ఆలోచించకుండా పట్టుదలకు పోతున్న కేంద్రవైఖరి సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగిస్తోంది. రాష్ట్రాలే మార్కెట్‌ నుంచి రుణాలు తీసుకుని ఖర్చుపెట్టుకోవాలనడం ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో అసంబద్ధమే అవుతుంది.

ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం.. గత 85 సంవత్సరాలుగా భారతదేశం కనీవిని ఎరుగని రీతిలో ఎదుర్కొంటున్న మాంద్యాన్ని జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితిగా లెక్కించి దాంతో ఆ స్థాయిలో వ్యవహరించడానికి అంగీకరిస్తే, పలు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న డిమాండును అది వెంటనే ఆమోదించాల్సి ఉంటుంది. మార్కెట్లో తక్కువ వడ్డీ రేట్లకు కేంద్రమే అదనపు నిధులను రుణంగా తీసుకుని వాటిని వెంటనే తమకు ఆర్థిక వనరుల కింద అప్పగించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్‌. తార్కికంగా చూస్తే ఇది సమంజసమైన ప్రతిపాదనగానే చెప్పాలి. కానీ జీఎస్టీ (సరుకులు, సేవల పన్ను) భేటీలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య ఇది తెమలని తగవుగా కొనసాగుతూ వస్తోంది.

ఇటీవలి చరిత్రలో కనీవినీ ఎరుగని సంక్షోభం మధ్యలో, ఈ సమస్యలో ఏ ఒక్క భాగాన్ని కూడా కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య తగవుగా మోదీ ప్రభుత్వం భావించకూడదు. వాస్తవానికి, 2008 సంక్షోభంలో ద్రవ్య మార్కెట్లు కుప్పగూలిపోయాక, అమెరికా ప్రభుత్వం, ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంకు, రాష్ట్రాలు కలిసికట్టుగా ఒకే విభాగంగా పనిచేసి, అవసరమైన ప్రతి చర్యనూ సంయుక్తంగా చేపట్టాయి. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంతో పోలిస్తే 2008నాటి ద్రవ్యమార్కెట్ల పతనం అనేది ఒక లెక్కలోకి కూడా రాదు. ప్రత్యేకించి భారత ఆర్థిక వ్యవస్థ ఈసారి తీవ్రాతితీవ్రంగా దెబ్బతినింది. ఎందుకంటే కోవిడ్‌–19 మహమ్మారి విరుచుకుపడక ముందే ప్రైవేట్‌ పెట్టుబడి, ఉపాధికల్పన వంటి నిజమైన ఆర్థిక పరామితులలో భారత్‌ వ్యవస్థాగతమైన క్షీణతను చవిచూసింది.  ఇలాంటి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ప్రాథమిక అవసరాలను తీర్చగలిగిన నిధుల పంపిణీ విషయంలో ఎవరు మొదట అప్పు చేయాలి అనే అంశంపై కేంద్రం ముసుగులో గుద్దులాటకు దిగడం ఏరకంగా చూసినా భావ్యం కాదు.

ఆర్థిక వ్యవస్థ ఏటా 14 శాతం వృద్ధిని సాధిస్తుందన్న ప్రాతిపదికన తమకు పూర్తి పరిహారం అందించాలని ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్‌ చేయడం సమర్థనీయం కాదని ఎవరికైనా అనిపించవచ్చు. అయితే రాష్ట్రప్రభుత్వాలను ఒక అంశంలో పూర్తిగా సమర్థించాల్సి ఉంది. కోవిడ్‌–19 నేపథ్యంలో ప్రాథమిక సంక్షేమ కార్యక్రమాలు, ఇతర ఖర్చులను తీర్చడానికి అందుబాటులో లేకుండాపోయిన ఆదాయ వనరుల కోసం ఆర్బీఐ నుంచి లేక మార్కెట్‌ నుంచి కేంద్ర ప్రభుత్వమే రుణంగా సేకరించి తమకు ఇవ్వాలనే అంశంపైనే రాష్ట్రాలు కేంద్రంతో తగవులాడుతున్నాయి. రాష్ట్రాల వైఖరి సమర్థనీయమైంది కూడా. మొత్తంమీద స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 3 శాతంకంటే తక్కువకు క్షీణించినప్పుడు బడ్జెట్‌ అవసరాల కోసం కేంద్రప్రభుత్వం ఆర్బీఐ నుంచి రుణంగా తీసుకోవచ్చని ఆర్థిక బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎమ్‌) చట్టం ఆదేశపూర్వకంగా వెల్లడించింది. అందుకే ఈ చట్టాన్ని ఇప్పుడు కేంద్రం ఎందుకు అమలు చేయడానికి సిద్ధపడటం లేదని కొన్ని రాష్టాలు ఇప్పటికే కేంద్రాన్ని ప్రశ్నించాయి. ఎందుకంటే ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ చట్టం పార్లమెంటు ద్వారా రూపొందింది కాబట్టి ఇది తప్పకుండా ప్రజల సంకల్పాన్నే ప్రతిబింబించాల్సి ఉంది.

కేంద్ర, రాష్ట్రాల మధ్య అవిశ్వాసం
ఈ నేపథ్యంలో జీడీపీలో 3 శాతం పరిమితికి మించి అప్పు తీసుకోవడంపై అన్నిరకాల షరతులు విధిస్తూనే మరోవైపు రాష్ట్రాలనే అదనపు రుణాలను తీసుకోవాలని కేంద్రం ఒత్తిడి చేయడం విచారకరం, మన రాజకీయ నాయకత్వంలో ఉండాల్సిన సమాఖ్య స్ఫూర్తికి ఇది వ్యతి రేకం. పెట్టుబడులు, ఉపాధికల్పన, రాబడులు వంటి పలురంగాల్లో సంస్థాగత పతనానికి ప్రధానంగా మోదీ ఆలోచనా రాహిత్యం, రాష్ట్రాలను సంప్రదించకుండానే చేపట్టిన పెద్ద నోట్ల రద్దు వంటి అప్రజాస్వామికమైన ప్రయోగాలే కారణమని, కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవలసి ఉంది. అత్యంత అసమర్థకరమైన రీతిలో అమలు చేసిన జీఎస్టీ, అసంఘటిత రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేయడం కూడా దీనికి తోడయ్యాయి. ఇప్పటికీ వ్యవసాయ క్షేత్రాల బిల్లులు, విద్యుత్‌ చట్టాల్లో మార్పులు వంటి రాష్ట్రాల పరిధిలో ఉన్న అంశాలపై అతిపెద్ద నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో కూడా కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలను మాత్రం సంప్రదించడం లేదు.

గత కొన్నేళ్లుగా ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కేంద్రం ఘోర వైఫల్యం చెందిందనటంలో ఏమాత్రం సందేహం లేదు. పైగా, కోవిడ్‌–19 నేపథ్యంలో అవసరమైన ఖర్చులు తీర్చుకోవడానికి రాష్ట్రప్రభుత్వాలకు గల అదనపు రుణం అవసరాలపై ఏకపక్ష షరతులను కేంద్రం విధించడం అంటే సమాఖ్య తత్వం పట్ల పరమ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడమే కాకుండా ఉద్దేశ్యపూర్వకంగానే ఆ స్ఫూర్తిని అగౌరవపర్చడం కూడా అవుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థలో ఎమర్జెన్సీని తలపిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థలో పన్ను రూపేణా రాబడి 24 శాతానికి అంటే అత్యంత భారీస్థాయిలో ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికం కాలానికి పడిపోయింది. బడ్జెట్‌లో అంచనా వేసిందానికంటే మొత్తం రాబడులు 25 నుంచి 35 శాతం మేరకు తగ్గిపోయాయి. దీంతో రాష్ట్రాలు నిర్వహిస్తున్న ఆరోగ్యం, విద్య, పారిశుద్ధ్యం, శాంతి భద్రత వంటి రంగాల్లో బడ్జెట్‌లో భాగంగా పెట్టాల్సిన ఖర్చులు పూర్తిగా అడుగంటిపోయాయి.

దీనికి తోడుగా రాష్ట్రాలకు ఇవ్వవలసిన జీఎస్టీ రూపంలో ఇవ్వాల్సిన 2.35 లక్షల కోట్ల మేరకు పరిహారాన్ని చెల్లించలేకపోతున్నట్లు కేంద్రప్రభుత్వం పేర్కొంది. ఇలా బకాయి పడిన మొత్తాన్ని 2022 లోపలే చెల్లిస్తానని కేంద్రం అంగీకరించింది. అయితే భారీ ఎత్తున అవసరమైన స్వల్పకాలిక నిధుల సేకరణ కోసం మాత్రం రాష్ట్రప్రభుత్వాలు మార్కెట్‌ నుంచి తమ శక్తి మేరకు రుణాలను స్వీకరించవచ్చని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చెప్పడం సరైంది కాదు. ఈ వ్యాసం మొదట్లోనే చెప్పినట్లు రుణాలు లేక నిధులను ఎవరు సేకరిస్తారు అనేది జాతీయ సంక్షోభ సమయంలో పెద్ద విషయమే కాదు. ప్రస్తుత విపత్కర స్థితిలో చౌక వడ్డీలకు సమర్థంగా రుణాలను సేకరించగలిగిన కేంద్రప్రభుత్వమే అందుకు పూనుకోవాల్సి ఉంటుంది. మార్కెట్‌ నుంచి తక్కువ వడ్డీతో రుణాలు సేకరించడం కేంద్రప్రభుత్వానికే సులభమైన పని అని రాష్ట్రప్రభుత్వాలు వాదిస్తున్నాయి.

భారతీయ రిజర్వ్‌ బ్యాంకు రూపొందించిన ప్రత్యేక విండో ద్వారా దాదాపు లక్ష కోట్ల రూపాయలలో కొంత భాగాన్ని రాష్ట్రాలకు కేంద్రం సహాయ నిధికింద ఇవ్వవచ్చు. వడ్డీ ఖర్చులను తగ్గించడానికి, సెస్సు ద్వారా రాష్ట్రాల రుణ సేవలను చెల్లించడానికి కూడా తాను సిద్ధమేనని కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఇలాంటి సంక్లిష్టమైన అంశాల్లో తలదూర్చడంకంటే, కేంద్రప్రభుత్వమే నేరుగా మార్కెట్లోంచి రుణాలు సేకరించి అలా వచ్చే డబ్బును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడమే ఉత్తమమైన పని. కానీ ఈ పనిచేయడానికి మాత్రం ప్రధాని నరేంద్రమోదీ ఏమాత్రం సుముఖత చూపుతున్నట్లు లేదు. జీఎస్టీ సంస్కరణల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, 31 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఒప్పందం కుదుర్చుకోవడానికి కారణమైన సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రస్తుతం రుణాలను ఎవరు కల్పించాలి అనే విషయమై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి ఎలా పనిచేయాలి అనే అంశంలో అటు కేంద్రానికీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య అవిశ్వాసం పెరుగుతూ వస్తోంది.

సామరస్యంగా పరిష్కారం అవశ్యం
కేంద్రప్రభుత్వం 2017 సంవత్సరంలో జీఎస్టీని అమలు చేసినప్పుడు రాష్ట్రాలకు తాను ఇచ్చిన హామీలను అమలు పర్చాల్సిన గురుతర బాధ్యత కేంద్రంమీదే ఉంటుంది. ఎవరు రుణాలు తీసుకోవాలి అనే ప్రస్తుత వివాదానికి సంబంధించి కనీసం 10 రాష్ట్రాలు జీఎస్టీ కౌన్సిల్‌లో వ్యతిరేకంగా ఓటు వేస్తామని హెచ్చరిస్తున్నాయి. కేంద్ర నిర్ణయాన్ని ఇన్ని రాష్ట్రాలు వ్యతిరేకించబోవడం ఇదే మొదటిసారి. ఇప్పటికే 20 బీజేపీ పాలిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల దన్ను కలిగి ఉన్న కేంద్రప్రభుత్వం తాజాగా జీఎస్టీ కౌన్సిల్‌లో ఓటింగ్‌ జరగకూడదని చూస్తోంది. ఎందుకంటే ఇంతవరకు చర్చించడం ద్వారా, ఏకాభిప్రాయ సాధన ద్వారానే జీఎస్టీలో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకున్నారు. ఒకవేళ ఓటింగ్‌ తప్పనిసరైతే కేంద్రప్రభుత్వానికి అనుకూలంగా 75 శాతం ఓట్లు అవసరమవుతాయి. ప్రయత్నిస్తే కేంద్రం దీన్ని సాధించి ముందుకుపోవచ్చు. కానీ సమాఖ్య స్ఫూర్తిని సాగించడానికి భారత్‌లో మూడేళ్ల నుంచి మాత్రమే అమలవుతున్న జీఎస్టీలో ఓటింగ్‌ వరకు రాకుండా జాగ్రత్తపడటం కేంద్రానికి మంచిది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న 10 రాష్ట్రాలతో రాజీపడి ఏకాభిప్రాయ సాధన ద్వారానే ప్రస్తుత సమస్యను పరిష్కరించడానికి కేంద్రప్రభుత్వం పూనుకుంటేనే పరస్పర సంతృప్తి ఇరుపక్షాలకూ మిగులుతుంది.
(ది వైర్‌ సౌజన్యంతో)

ఎంకే వేణు
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు

మరిన్ని వార్తలు