రక్షణలో... వంద మెట్లు పైకెదిగాం!

14 Aug, 2021 16:27 IST|Sakshi

మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు పూర్తయింది. 75వ ఏడాదిలోకి అడుగు పెట్టాం. ఇన్నేళ్లలో భారత్‌ అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించింది. అలాగే రక్షణ రంగంలో కూడా గొప్ప పురోగతిని సాధించింది. పాకిస్తాన్, చైనాలతో తొలినాళ్లలో జరిగిన యుద్ధాలతో పోలిస్తే ఇప్పుడు మనదేశ రక్షణ రంగం పూర్తి స్థాయిలో బలోపేతం అయింది. మనం శత్రువును దీటుగా ఎదుర్కోగలిగిన సామర్థ్యాన్ని పెంచుకున్నాం.

బరువు తగ్గింది:
మన రక్షణరంగం ఇప్పుడు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను సంతరించుకుంది. సైనికుల దుస్తుల దగ్గర నుంచి ఆయుధాల వరకు ప్రతిదీ అధునాతనమైంది. బరువైన హెల్మెట్‌ల స్థానంలో బుల్లెట్‌ ప్రూఫ్‌ ఫైబర్‌ హెల్మెట్‌లు వచ్చాయి. తేలికపాటి బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌లున్నాయి. మైనస్‌ నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలో డ్యూటీ చేయడానికి వీలుగా షూస్, కళ్లద్దాల వంటివి గతంలో ఉండేవి కాదు. ఇప్పుడవన్నీ ఉన్నాయి. నైట్‌ విజన్‌ గాగుల్స్, బైనాక్యులర్స్, గుడారాల మెటీరియల్‌ నుంచి పారాషూట్‌ల వరకు ప్రతిదీ అధునాతనమైనదే. ఒక్కమాటలో చెప్పాలంటే టెక్నాలజీ అభివృద్ధి చెందినంత వేగంగా రక్షణ రంగం కూడా మెరుగవుతూ వచ్చింది. ఎంత కఠినమైన ప్రదేశాల్లో అయినా ప్రయాణించగలిగిన వాహనాలను, అదికూడా తక్కువ బరువు కలిగి, ఎక్కువ మైలేజీనిచ్చే ప్రత్యేక లక్షణాలతో వాహనాలను దేశీయంగా తయారు చేసు కున్నాం. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో కొండల మధ్య ఇరుకుదారులను రహదారులుగా మార్చుకున్నాం. ఒకప్పుడు... ప్రత్యర్థి మన భూభాగంలోకి వచ్చినట్లు తెలిసిన తర్వాత మన సైన్యం ఆ ప్రదేశానికి చేరడానికి రోజులు పట్టేది. ఇప్పుడు గంటలో చేరి పోగలుగుతున్నాం. 

గురి పెరిగింది:
ఆయుధ సంపత్తి విషయానికి వస్తే... రైఫిల్స్‌ నుంచి యుద్ధట్యాంకుల వరకు ప్రతిదీ ఒక మెట్టు... రెండు మెట్లు కాదు... వందమెట్లు పై స్థాయికి చేరినట్లు చెప్పుకోవాలి. మొదట్లో మనం బోల్ట్‌ యాక్షన్‌ రైఫిల్స్‌ వాడే వాళ్లం. తర్వాత వచ్చిన 7.62 ఎంఎం రైఫిల్స్‌ కూడా బరువుగానే ఉండేవి. ఇప్పుడున్న 5.56 ఎంఎం రైఫిళ్లు తేలికగా ఉండడంతోపాటు సమర్థవంతమైనవి. టూ ఇంచ్‌ మోటార్‌లు, రాకెట్‌ లాంచర్లు, మెషీన్‌గన్, మిస్సైల్స్‌... అన్నీ అప్‌గ్రేడ్‌ అయ్యాయి. ట్యాంకులయితే టీ 55, టీ 72 నుంచి అత్యుత్తమ శ్రేణి అర్జున్‌ ట్యాంకులున్నాయి. మనం రాడార్‌ వ్యవస్థ మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించడంతో... మన సరిహద్దుకు ఇవతల ఎంతో లోపల ఉండి కూడా సరిహద్దు అవతల ప్రత్యర్థి కదలికలను అంచనా వేయగలుగుతున్నాం. బ్యాటిల్‌ ఫీల్డ్‌లో ఉన్న సైనికులకు కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వగలుగుతున్నాం. మన సైనికులు సురక్షితమైన రహస్య ప్రదేశం నుంచి దూరాన ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలిగిన ఆయు ధాలున్నాయి.

నీటి నుంచి నింగి వరకు:
నేవీ రంగం... మిస్సైల్‌ షిప్‌లు, సబ్‌మెరైన్‌లు, న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ల సంఖ్యను బాగా పెంచుకుంది. ఎక్కడ అవసరం వస్తే తక్షణం అక్కడ మోహరించగలిగినంత శక్తిమంతంగా ఉంది. ఎయిర్‌ఫోర్స్‌లో విక్రాంత్, విరాట్‌ ఉండేవి. ఇప్పుడు ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య వంటి ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌లు మన యుద్ధ సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. మిగ్‌ 21, 23, 27, జాగ్వార్‌తోపాటు రఫెల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ వంటి ఫిఫ్త్‌ జనరేషన్‌ సిస్టమ్‌ యుద్ధ సామగ్రిని సమకూర్చుకున్నాం. పైగా ప్రస్తుతం మన సైనికులకు ప్రపంచ స్థాయి నాణ్యతతో శిక్షణ నిస్తున్నాం.

గెలుపు ధీమా: 
ఇన్ని ప్రత్యేక చర్యల ద్వారా మన సైనికుల్లో గెలిచి తీరుతామనే ధైర్యం పెరిగింది. ఒక తరం కనీస సదుపాయాలు కూడా లేని పరిస్థితుల్లో యుద్ధం చేస్తూ... ‘ఎలాగైనా సరే మనం గెలిచి తీరాలి’ అనే పట్టుదలతో పోరాడింది. ఇప్పుడు మనదేశం సాధించిన యుద్ధనైపుణ్యం సైనికులకు భరోసానిస్తోంది. సైనికుల్లో  ‘ఎంతటి ప్రత్యర్థి మీద అయినా సరే ఒక మెట్టు మెరుగ్గా పోరాడి విజయం సాధించగలం. భారత్‌ను గెలుపు పీఠం మీద నిలబెట్టగలం’ అనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.


- కల్నల్‌ పి. రమేష్‌ కుమార్‌ (రిటైర్డ్‌)

వ్యాసకర్త డైరెక్టర్, సైనిక్‌ వెల్ఫేర్, తెలంగాణ 
(సంభాషణ: వాకా మంజులారెడ్డి)

మరిన్ని వార్తలు