నూతన శకానికి నాందీ క్షణం

1 Aug, 2020 05:05 IST|Sakshi

సందర్భం
అనేక తరాలు గత అయిదు శతాబ్దాల సుదీర్ఘకాలం నిరీక్షించిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తున్న సమయంలో భారతీయులందరూ ఈ శుభప్రదమైన, మంగళకరమైన సందర్భాన్ని సంతోషంతో తిలకిస్తారనడంలో సందేహం లేదు. ఇది ఒక ఆలయ నిర్మాణానికి నాంది మాత్రమే కాదు.. ఈ ఘనమైన దేశ చరిత్రలో ఒక నూతన శకానికి కూడా నాంది పలుకుతున్న క్షణం. భూమిపూజా కార్యక్రమంతో కోట్లాదిమంది రామ భక్తులు అయిదు శతాబ్దాలుగా సాగించిన పట్టుదల, భక్తి, తపస్సులు పరిసమాప్తి చెందినట్లవుతుంది. 2020 ఆగస్టు 5న జరగనున్న ఆ గొప్ప కార్యాన్ని వీక్షించనున్న కోట్లాదిమంది సనాతన హిందువులకు అదొక సంతోషకరమైన, ఆహ్లాదకరమైన, అద్భుతమైన ఆధ్యాత్మిక స్ఫూర్తిని కలిగిస్తున్న క్షణంగా మిగులుతుంది. దేశాన్ని సౌభాగ్యవంతం చేయాలని. ప్రజలందరినీ ఆశీర్వదించాలని మనందరం శ్రీరాముడిని ప్రార్థిద్దాం రండి.

ఆగస్టు 5వ తేదీన మధ్యాహ్నం 12.30, 12.40 గంటల మధ్య శుభముహూర్తం వేళ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంఖుస్థాపన చేసినప్పుడు, కోట్లాదిమంది భక్తులు అయిదు శతాబ్దాలుగా సాగించిన పట్టుదల, భక్తి, తపస్సులు పరిసమాప్తి చెందినట్లవుతుంది. అయోధ్యలో రాముడి జన్మస్థలంలో రామాలయాన్ని చూడాలని దీర్ఘకాలంగా వేచి చూస్తున్న భక్తులకు ఇదొక మంగళప్రదమైన క్షణంగా చెప్పాలి.

ఓర్పు తప్పకుండా ఫలితం సాధిస్తుంది. అయిదు శతాబ్దాల సామాజిక, న్యాయ, ఆధ్యాత్మక చిక్కులన్నీ ఇంత చక్కటి ఆధ్యాత్మక స్ఫూర్తితో, గొప్ప సందర్భంతో ముగియడం మానవుల విశ్వాసాలను, భావోద్వేగాలను అచ్చంగా నిజం చేసినట్లయింది. నిజానికి, 2020 ఆగస్టు 5న జరగనున్న ఆ గొప్ప కార్యాన్ని వీక్షించనున్న కోట్లాదిమంది సనాతన హిందువులకు అదొక సంతోషకరమైన, ఆహ్లాదకరమైన, అద్భుతమైన ఆధ్యాత్మక స్ఫూర్తిని కలిగిస్తున్న క్షణంగా మిగులుతుంది.

ఈరోజు శ్రీరాముడు మన తరానికి మన జీవితపర్యంతమూ నిలుపుకోవలసిన గొప్ప అవకాశాన్ని ఇస్తూ, రాబోవు తరాలు ఆరాధించుకునే ఒక ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఇవ్వడం అనేది మనం నిజంగా కృతజ్ఞత తెలుపాల్సిన సందర్భమే. ఈ చారిత్రక క్షణాన్ని మనతో చూడలేని వేలాది భక్తుల త్యాగాలను మనందరం స్మరించుకుని మదిలో నింపుకోవలసిన గొప్ప సమయం ఇది. దయాళువైన శ్రీరాముడు వారందరికీ తన పాదాల చెంత చోటు ఇస్తాడని మనం కోరుకుందాం. దేవుడిపై విశ్వాసం, నమ్మకం అనేవి భూమ్మీద ఏ శక్తీ తోసిపుచ్చలేనంత శక్తిని మీకు ఇస్తాయనడంలో ఆశ్చర్యపోవలసింది ఏదీ లేదు.

చిరకాలంగా ఎదురుచూస్తున్న రామాలయ భూమి పూజ కార్యక్రమం నన్ను భావోద్వేగానికి గురిచేస్తూ దివంగత గోరక్షా పీఠేశ్వర్‌ మహంతి దిగ్విజయనాథ్, దివంగత గోరక్షా పీఠేశ్వర్‌ మహంతి అవైద్యనాథ్‌లను గుర్తుకు తీసుకొస్తున్నాయి. ఈ చారిత్రక సందర్భంలో తమ సంతోషాన్ని పంచుకోవడానికి వారు ఇప్పుడు మనతో లేరు కానీ వారి ఆత్మలు అత్యున్నత సంతృప్తినీ, అపరిమితానందాన్ని అనుభూతి చెందుతుంటాయని నేను నమ్ముతున్నాను. నిజానికి, 1934, 1949 సంవత్సరాల మధ్య రామాలయ నిర్మాణం అనే లక్ష్యాన్ని మొట్టమొదటిసారిగా మహంతి దిగ్విజయనాథ్‌ మహరాజ్‌ ప్రకటించారు.

బ్రిటిష్‌ వారి పాలనలో 1949 డిసెంబర్‌ 22, 23 తేదీల మధ్య రాత్రిపూట వివాదాస్పద నిర్మాణంలో రామ్‌ లాలా విగ్రహాలు కనిపించినప్పుడు, మహంత్‌ దిగ్విజయనాథ్‌ మహరాజ్‌ కొంతమంది సన్యాసులతో కలిసి అక్కడే కీర్తనలు పాడారు. 1969 సెప్టెంబర్‌ 28న ఆయన పరమపదించిన తర్వాత మహంత్‌ అవైద్యనాథ్‌ తన గురుదేవుల దీక్షను తమదిగా చేసుకోవడమే కాకుండా, అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం నిర్ణయాత్మక ఉద్యమాన్ని ప్రారంభించారు.

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ మార్గదర్శకత్వంలో, విశ్వహిందూ పరిషత్‌ నాయకత్వంలో స్వాతంత్య్రానంతర భారతదేశంలో అతిపెద్ద సాంస్కృతిక ఉద్యమంగా అందరూ అభివర్ణించిన అయోధ్య ఉద్యమం ఘనమైన మన సంస్కృతి, వారసత్వం, నాగరికతల వైపుగా భారతీయుల విశ్వాసాన్ని తిరిగి జ్వలింపచేసింది. వాస్తవానికి మహంత్‌ అవైద్యనాథ్‌ని 1984 జూలై 21న శ్రీరామ జన్మ భూమి యజ్ఞ సమితి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మన గొప్ప రుషులు, సన్యాసులు సంవత్సరాలుగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన జాతీయవాద భావజాలానికి ప్రమాదకరంగా మారిన కొంతమంది కుహనా లౌకికవాదుల, మతపరమైన బుజ్జగింపు వాదుల పాక్షికతత్వాన్ని అయోధ్య ఉద్యమం మొత్తంగా ఎండగడుతూ వచ్చింది. ఇదేమంత సులభంగా జరిగిన పరిణామం కాదు. మహంత్‌ అవైద్యనాథ్, పరమపూజ్యులైన పరమహంస రామచంద్ర మహారాజ్‌ రామాలయ నిర్మాణం కోసం తొలిసారిగా భూమిని లాంఛనప్రాయంగా తవ్వినప్పుడు అది ఒక చారిత్రక క్షణానికి నాంది పలికినట్లయింది.

పూజనీయులైన సన్యాసులు, విశ్వహిందూ పరిషత్‌ నాయకులు అశోక్‌ సింఘాల్‌ ప్రారంభించిన చొరవతో, కామేశ్వర్‌ చౌపాల్‌ రామాలయ నిర్మాణం కోసం మొట్టమొదటి శిలను స్థాపించారు. అదృష్టవశాత్తూ కామేశ్వర్‌ ప్రస్తుతం శ్రీరామ్‌ జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్‌ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాముడి జన్మభూమి ప్రాంతాన్ని విముక్తి చేయడం కోసం జరిగిన అయోధ్య ఉద్యమం సుదీర్ఘ కాలం కొనసాగి సత్యానికి, న్యాయానికి మహత్తర విజయంగా మారింది. ఇది రానున్న తరాలను కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే గతానికి చెందిన చేదు అనుభవాలను మర్చిపోయి ఉల్లాసం, విశ్వాసం, అభివృద్దితో కూడిన కొత్త చరిత్రను రాయవలసిన సమయం ఇది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్గదర్శకత్వంలో నడుస్తున్న ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఈ పరమపవిత్రమైన నగరానికి చెందిన గత వైభవాన్ని పునరుద్ధరించడానికి నిబద్దతతో ఉంది. రాజకీయ శత్రుత్వం కారణంగా అయోధ్య చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చింది. మేం అభివృద్ది, సౌకర్యాల కల్పన విషయంలో అయోధ్యను ప్రపంచ చిత్రపటంలో సమున్నతంగా నిలపడానికి ప్రణాళికా బద్ధమైన ఆలోచనతో ముందుకు సాగుతున్నాం. అయోధ్య నగరాన్ని ఆధునిక సంస్కృతికి నమూనాగా మార్చబోతున్నాం. గత మూడేళ్లుగా యావత్ ప్రపంచం అద్భుతమైన దీపావళి వేడుకలను చూస్తూ వచ్చింది. ఇప్పుడు అయోధ్యను మతం, అభివృద్ధిల మేలుకలయిగా తీర్చిదిద్దడానికి ఇది సరైన తరుణం.

ఈ ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో జరుగనున్న చారిత్రక కార్యక్రమంలో పాల్గొనేందుకు కోట్లాదిమంది భక్తులు ఉత్సాహంతో ఎదురుచూస్తుంటడాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ప్రపంచ మహమ్మారి అందుకు అనుమతించడం లేదు. మనం దీన్ని దైవేచ్చగానే గుర్తించి ఈ వాస్తవాన్ని అంగీరించాలి. దేశంలోని 125 కోట్లమంది ప్రజల సమష్టి ఆకాంక్షలకు ప్రతినిధిగా ప్రధాని నరేంద్రమోదీ ఈ గొప్ప కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. రామాలయ నిర్మాణ శిలాఫలకాన్ని ఆయన సంస్థాపించే సమయంలో మనందరికీ అది గర్వించదగిన క్షణం అవుతుంది. అనేక తరాలు గత అయిదు శతాబ్దాలపాటు సుదీర్ఘకాలం నిరీక్షించిన తర్వాత ప్రధాని భూమి పూజ నిర్వహిస్తున్న సమయంలో ప్రతి భారతీయుడూ ఈ శుభప్రదమైన, మంగళకరమైన సందర్భాన్ని తిలకిస్తారనడంలో సందేహం లేదు. ఇది ఒక ఆలయనిర్మాణానికి నాంది మాత్రమే కాదు.. ఈ ఘనమైన దేశ చరిత్రలో ఒక నూతన శకానికి కూడా నాంది పలుకుతున్న క్షణం.

మన దేశాన్ని రామరాజ్యం వంటి ఆదర్శపూరితమైన దేశంగా మార్చాలని ఈ నూతన శకం పిలుపునిస్తోంది. ఈ శుభసందర్భంగా మనందరం శ్రీరాముడి ఆదర్శాలను మనసు నిండా నింపుకోవాలి. ఈ సందర్భంగా ఓర్పు, పట్టుదల గురించి శ్రీరామచంద్రుడి జీవితం మనకు గుర్తు చేస్తుందని భావిస్తున్నాను. ఈ శుభసందర్భం జరిగే క్షణంకోసం మీరంతా ఆనందోత్సాహాలతో ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు కానీ ఇప్పుడు కూడా మీరు నిగ్రహాన్ని పాటిస్తూ సంయమనంతో ఉండాలి. కరోనా నేపథ్యంలో మనందరికీ ఇది పరీక్షా సమయం కాబట్టి భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాల్సి ఉంది.

రామభక్తులందరూ వారు ఎక్కడున్నా సరే, ఆగస్టు 4, 5 తేదీల్లో తమ తమ ఇళ్లలో ఒక దీపాన్ని వెలిగించాలని నేను అభ్యర్థిస్తున్నాను. అదే సమయానికి సన్యాసులు, ధర్మాచార్యులు కూడా దీపాలు వెలిగించి ఆలయాల్లో అఖండ రామాయణ పఠనాన్ని కొనసాగించాలి. ఈ చారిత్రక క్షణాన్ని చూడకముందే లోకం నుంచే తప్పుకుని మనల్ని వదిలి స్వర్గం చేరిన మన పూర్వీకులందరికీ మనం కృతజ్ఞతలు తెలియజేయాలి.
 
దేశాన్ని సౌభాగ్యవంతం చేయాలని. ప్రజలందరినీ ఆశీర్వదించాలని మనందరం శ్రీరామచంద్రుడిని ప్రార్థిద్దాం రండి. శ్రీరాముడు ఎల్లప్పుడూ మనల్ని ఆశీర్వదిస్తూ, మన సంక్షేమాన్ని పట్టించుకుంటాడని ఆశిద్దాం.

జై శ్రీరామ్, జై శ్రీరామ్‌

యోగి ఆదిత్యనాథ్‌
యూపీ సీఎం 

మరిన్ని వార్తలు