జ్ఞాపకాల వాన

27 Jul, 2021 21:15 IST|Sakshi

రోళ్లు పగిలే రోహిణీ కార్తె ఎండలను చీల్చుకుంటూ, భగ భగమని మండే గ్రీష్మతాపాన్ని వెక్కిరిస్తూ, నల్లటి మబ్బులు ఆకాశమంతా పహారా కాసే దృశ్యం ఓ అద్భుతం. ఎండవేడికి ఎడారిలా మారిన  నేలతల్లిని ఆకాశం చూరు నుండి జారిపడ్డ వాన నీటి బొట్టు ముద్దాడే వేళ... గతజన్మను గుర్తు చేసే మట్టి పరిమళం.. ఎండాకాలపు కష్టాలన్నింటినుండీ విముక్తం చేసే ప్రకృతి మంత్రం. ఆకాశపు జల్లెడ నుండి కురిసే వర్షపు నీటి ధారలు చూస్తుండగానే పిల్లకాలువలై, ఏటి వాగులై, నదీ నదాలై... పరుగులు పెట్టే చల్లదనపు ప్రవాహం వర్షాకాలపు తొలి సంతకం. 

వాన చినుకు పడితే చాలు... ఈ రోజు బడికి సెలవిచ్చే స్తారన్న ఆనందాన్ని అనుభవించని బాల్యం ఉంటుందా అసలు? మాస్టార్‌ ఇచ్చిన హోమ్‌ వర్క్‌ చేయని రోజున ఈ ఒక్కరోజుకు వర్షం పడితే బాగుండునని దేవుడికి కోటి మొక్కులు మొక్కే చిన్నారుల ఆకాంక్షలు మేఘాలూ వింటాయి. విని చల్లటి వానతో మురిపించి బడికి సెల విప్పించిన వానాకాలపు చదువురోజులు అనుభవంలోకి రానివారెంతమంది?

బడికెళ్లేటపుడు వాన లేకపోయినా, బడికెళ్లిన వెంటనే తరగతి గదిలో ఏ అప్పారావు మాస్టారో సుమతీ శతకపు పద్యాన్ని వల్లెవేయించేటపుడు పెంకుటింటి బడి పైకప్పుపై అమాంతం పెద్ద వాన పడి... పిల్లల పుస్తకాలపై వాన నీటి బొట్లు టపటపా రాలి పడుతుంటే.. అవే ముత్యాలుగా ఏరుకుని సెలవు పిలుపు ప్రకటించే బడిగంట కోసం ఆత్రుతగా ఎదురు చూసే చిన్ని చెవుల్లో ఇక పద్యాలు వినపడని హాయిని అందరూ చూసిన వాళ్లమే కదా. సెలవిచ్చి ఇంటికి రాగానే ఇంటి  చూరు నుంచి నయాగరా జలపాతాల్లా జారిపడే వర్షపు నీటి చప్పుడుకు లయబద్ధంగా దానికి కోరస్‌ పాడే కప్పల బెక బెక కచేరీలను ఆలకిస్తూ... లోకాన్ని  మర్చిపోవడం ఎంత గొప్ప జ్ఞాపకం.


వాన నీటి కాలువలో... కాగితపు పడవలు వేసి అవి వేగంగా దూసుకుపోతూ ఉంటే... టైటానిక్‌ షిప్‌ యజమానుల వలే గర్వంగా నవ్వుకునే బాల్యం ఆనందాన్ని ఎవరైనా కొలవగలరా అసలు? అలా గమ్యం తెలియని తీరానికి వెళ్లే పడవ కాస్తా ఏ బుల్లి సుడిగుండంలోనో చిక్కుకుని మునిగి పోతే... మనసంతా బాధతో నిండిపోయి... ఏడుపొచ్చేసి కంటి చూరు నుంచి జారిపడే కన్నీటి బొట్లు బుగ్గలను ఓదారుస్తూ కిందకి జారిపోయే తియ్యటి బాధలు మళ్లీ మళ్లీ వస్తే బాగుండునని అనుకునే ఉంటారు కదా. వర్షం తగ్గాక ఇంటి కెదురుగా మోకాల్లోతు నీటిలో ఆడుతూ పాడుతూ తిరగడం ఎంత ఆనందం? ఆ తర్వాత ఇంట్లో అమ్మో నాన్నో చూసి వీపు విమానం మోత మోగిస్తే... ఉక్రోషంతోనూ... తమ రాజ్యం నుంచి తమని బలవంతంగా గెంటివేసిన శత్రుసైన్యంలా అమ్మానాన్నలపై మనసులోనే కోపంతో రగిలిపోయే ఆక్రోశం గుర్తొస్తే ఇపుడు నవ్వొస్తుంది కదూ.

వానలో తడిసి ముదై్ద తల సరిగ్గా తుడుచుకోక ముతక వాసన వేయడం.. తడిసిన తల సరదాగా జలుబు తెచ్చి పెట్టడం.. ముక్కు కారుతూ ఉంటే ఎగపీల్పులతో... వర్షంతో పోటీ పడ్డం పిల్లలకు ఓ ఆటే. కానీ పెద్దాళ్లకు మాత్రం... వెధవా చెబితే విన్నావు కాదు... అంటూ ఓ టెంకిజెల్ల ఇచ్చుకుని... బల వంతంగా పొగలు కక్కే మిరియాల కషాయంతో పనిష్‌ మెంట్‌ ఇచ్చే చేదు జ్ఞాపకాలకూ కొదవుండదు. కషాయం తాగించడం కోసమే బెల్లం ముక్క తాయిలాన్నీ చేతిలో పెట్టుకునే పెద్దాళ్ల గడుసుతనం... ఆ బెల్లం ముక్క తీపిని ఊహించుకుంటూనే కారపు కషాయాన్ని అమాంతం గుటకేసి తాగేసే బాల్యం... ఇంటింటా ఓ అద్భుత చిత్రమే.

ఎక్కడో శత్రు సేనలు గొడవ పడుతున్నట్లుగా వర్షా కాలంలో ఉరుములు చేసే బీభత్సం... మెరుపులు సృష్టించే భయానక వాతావరణం... కాసేపు భయపెట్టినా.. వాన చిను కులు పడుతుండగానే మళ్లీ ప్రత్యక్షమయ్యే ఎండను వాన ముద్దాడినపుడు ఆకాశంపై ఈ మూల నుండి ఆ మూలకి వయ్యారంగా వంగి మెరిసే ఏడురంగుల ఇంద్రధనుస్సు ఏ దేవుడు గీసిన రంగుల బొమ్మో? లేదా ఏ చిత్రకారుడు నేలపై కోపంతో ఆకాశంపై గీసిన చిత్రకళాఖండమో? తేల్చుకోవడం కష్టమే.

ఆకుపచ్చ దనాన్నీ, హాయిదనాన్నీ అందరికీ అందించే ప్రకృతి ఖజానా ...వాన. వానాకాలపు జ్ఞాపకాలు ఎవరి జీవితంలోనైనా మధురంగానే ఉంటాయి. ప్రతీ వాన చుక్కకీ ఓ అనుభవం. నైరుతీ చుట్టాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హుషారుగా తిరిగేస్తున్నారు. వానాకాలం చల్లగా వచ్చేసింది. దాన్ని సాదరంగా స్వాగతించి... ఈ వానాకాలమంతా ఎన్నో జ్ఞాపకాలను గుండెల్లో పదిలంగా దాచుకుంటారనే ఈ పాత జ్ఞాపకాల వానను మీ ముందుంచింది.
– సి.ఎన్‌.ఎస్‌. యాజులు

మరిన్ని వార్తలు