ఈ అభిజాత్యం సబబేనా?

19 Oct, 2021 01:04 IST|Sakshi

రెండో మాట

‘మా’ సంస్థను బహుళార్థసాధక, సాంస్కృతిక సంస్థగా రూపొందించే ఉద్దేశంతో... ప్రత్యామ్నాయ ఎజెండాతో ముందుకు వచ్చినంత మాత్రాన తోటి కళాకారుడిగా ప్రకాష్‌ రాజ్‌ని న్యూనపరిచే సంస్కృతి ‘మా’ లోని ‘పొట్టిబావల’కు ఉండకూడదు! ఉభయ వర్గాల మధ్య జరిగిన శషభిషల మధ్య నలిగిపోయి, ఆంధ్ర– కన్నడల ఉమ్మడి చారిత్రక బంధాలకే చేటుకూడినంత పనయింది! కనీసం ‘తెలుగదేలయన్న దేశంబు తెలుగు’ అని గుర్తుచేసిన కృష్ణదేవరాయలు కూడా ‘మా’ సభ్యులకు గుర్తు రాకపోవడం ఆశ్చర్యం. ప్రకాష్‌రాజ్‌ నోట... చివరికి నేను తెలుగువాడిని కాదన్న మాట ఇప్పుడు తెలిసివచ్చిందన్న ప్రకటనలోని బాధను, మనోవేదనను ఇప్పటికైనా ‘మా’ తెలుసుకోవాలి.

‘అంటరానితనంబునట్టి భారతజాతి ప్రపంచ సభ్యతనే కోల్పోయింద’ ని భావిం చిన మహాకవి జాషువా. అలా తామె పుట్టరాని చోట పుట్టామన్న అనంతమైన బాధను ఎందుకు గుండె బరువుతో మరింత కొంత ముందుకు సాగి ఇలా వ్యక్తం చేయవలసి వచ్చిందో గమనించండి.

‘ఎంత కోయిలపాట వృ«థయయ్యెనో కదా/ చిక్కు చీకటి వన సీమలందు / ఎన్ని వెన్నెల వాగులింకిపోయెనో కదా/ కటిక కొండల మీద మిటకరించి/ ఎన్ని కస్తూరి జింక లీడేరెనో కదా/ మురికి తిన్నెల మీద పరిమళించి/ ఎన్ని ముత్తెపురాలు ఖిన్నమయ్యెనో కదా/ పండిన వెదురు జొంపములలోన / ఎంత గంధవహన మెంత తంగెటి జున్ను / యెంత రత్నకాంతి యెంత శాంతి/ ప్రకృతి గర్భమందు! భగ్నమై పోయెనో / – పుట్టరాని చోట పుట్టుకతన’’!

ఎందుకంతగా జాషువా భగ్నహృదయుడు కావలసి వచ్చింది? మనుషులు ఎదిగారు గానీ మనసులు ఎదగలేదని ‘పొట్టిబావ’ లాంటి ఒక బొటనవేలంత ఎత్తుకు మించని ఒకానొక ‘మా’ సంస్థ తన స్థాయిని మించి యావదాంధ్ర ప్రేక్షక లోకాన్ని కల్లోల పరచడానికి ఎందుకు ప్రయత్నించింది! ఈ కల్లోలంలో భాగంగానే సుప్రసిద్ధ కళాకారుడు, కన్నడ అభ్యుదయ కథా రచయిత, ప్రగతిశీల ఉద్యమా లకు వెన్నుదన్నుగా ఉన్న ప్రకాష్‌రాజ్‌ ‘ఓహో నేను తెలుగువాణ్ణి కాను, ఇప్పుడు గుర్తించాల్సి వచ్చింద’న్న బరువైన ప్రకటన ఎందుకు విడుదల చేయవలసివచ్చింది? ‘మా’ సంస్థను బహుళార్థసాధక, సాంస్కృతిక సంస్థగా రూపొందించే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ ఎజెండాతో ముందుకు వచ్చినంత మాత్రాన తోటి కళాకారుడిగా ఆయనను న్యూనపరిచే సంస్కృతి ‘మా’ లోని ‘పొట్టిబావల’కు, మిగతా ‘మా’ సభ్యులకు ఉండకూడదు! పరస్పరం ఉభయ వర్గాల మధ్య జరిగిన శషభిషల మధ్య నలిగిపోయి మరుగున పడిన ఆంధ్ర– కన్నడల ఉమ్మడి చారిత్రక బంధాలకే చేటుకూడినంత పనయింది! యావత్తు దక్షిణాపధాన్నే తెలుగు (16వ శతాబ్దం దాకా) ఏలుతూ వచ్చిన కాలం మరుగున పడిపోయింది. ప్రాంతాలకు, కులాలకు, మతాలకు, వర్గ, వర్ణ వివక్ష రంగులు పులిమి ఏలుతున్న కాలంలో ఆ వివక్షలకు దూరంగా ఉండి కన్నడ ప్రపంచంలో కళా, సాంస్కృతిక రంగాలలో, భావ విప్లవంలో భాగంగా అత్యంత అభినవ భావాలతో సంస్కృతీ పరులకు, ఉద్యమకారులకు ప్రకటనలలోనే కాదు, ఆచరణలో స్ఫూర్తిగా నిలబడుతున్న వ్యక్తి ప్రకాష్‌ రాజ్‌. 

ఎప్పుడైతే ‘పొట్టిబావల’ సంస్థగా మారిన ‘మా’లో ఫలానావారు స్థానికులు, మిగతావారు బయటివారనీ, కళాకారుల మధ్య వివక్షకు తావిచ్చారో, ఆ క్షణంలోనే ప్రకాష్‌రాజ్‌కు తాను ‘కన్నడవాడినే కానీ, తెలుగువాడిని కాను కాబోలు’ నని అంతవరకూ లేని భావన, బాధ కలుగజొచ్చాయి. ఈ పరిణామమే ప్రకాష్‌రాజ్‌ ‘మా’ నుంచి తప్పు కోవడానికి కారణమై ఉండాలి! గత వైభవ చరిత్రతో సంబంధాలు తెగిపోయిన దరిమిలా కనీసం ‘‘తెలుగదేలయన్న దేశంబు తెలుగు’’ అని గుర్తుచేసిన కృష్ణదేవరాయలు కూడా ‘మా’ సభ్యులకు గుర్తు రాకపోవడం ఆశ్చర్యం. రాయల తెలుగుదేశమే ప్రకాష్‌రాజ్‌దీ.

ఆంధ్ర– కన్నడల మధ్య అభేదాన్ని గుర్తు చేస్తూ రెండూ ఒకేదేశం, అదే తెలుగు సువిశాల దేశం అని ప్రకటించాడు రాయలు! 16వ శతాబ్దంలో రాయల యుగం ముగిసేదాకా ఆంధ్ర– కర్ణాటకలు ఒక తల్లి బిడ్డలే. ఏక రక్త సంబంధీకులు. ఆనాటి రాయలకు అమరావతి (కర్ణాటక) నగరంతోపాటు, రాయలసీమలోని పెనుగొండ కూడా రాజధాని, రెండవ రాజధానిగా ఉండేవని మరచిపోరాదు! అందుకే సుప్రసిద్ధ సాహితీవేత్త రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ ఆర్ద్రతతో... ఆంధ్ర– కన్నడ రాజ్యలక్ష్ముల అరతి నీలపుదండ పెనుగొండ కొండ’’ అని చాటవలసి వచ్చింది! పెనుగొండ రెండవ రాజధానిగా ఏలిన రాయలు రాయలసీమ నలుమూలలా అనేక చెరువులు తవ్వించి కరువుసీమను పంటసీమగా రూపొందించినవాడు. ఈ విషయంలో కూడా కాకతీయులు నిర్మించుకున్న చెరువులను రాయలు రాయల సీమకు ఆదర్శంగా తీసుకున్నాడని మరువరాదు. అంతేకాదు, ఆంధ్ర –కన్నడ ప్రాంతాలు ఉమ్మడిగా ఒక గొడుగు నీడనే ఎదిగినంత కాలం రాయలయుగ పరివ్యాప్తి ఉత్తరాన గజపతుల దిశవరకూ వ్యాప్తి చెందింది. బహమనీ సుల్తానుల చెరనుంచి తెలంగాణలోని వరం గల్‌ను విముక్తి గావించిన చారిత్రక సత్యాన్నీ మరువరాదు! 

ఇంతటి సంయుక్త ఉమ్మడి వైభవోజ్వల చరిత్రను మరిచినప్పుడు మాత్రమే ఈనాటివారిలో పిదప బుద్ధులు పుట్టుకొస్తున్నాయి. ప్రాంతీయ తగాదాలు ముదిరిపోతున్నాయి. దారీతెన్నులేక ఎక్కడి కక్కడ ప్రాంతాలు, మతాలు, కులాలు, వర్గాలుగా ఏర్పడి మానవతా వైఖరికి చెల్లుచీటి ఇచ్చుకుంటున్నారు. బహుశా అందుకే ఒక సంద ర్భంగా ప్రకాష్‌రాజ్‌ ఈ ప్రపంచంలో బతకలేని మనుషులు చాలా మంది ఉన్నారు. కొంచెం ఆలస్యమైనా, మోసపోయినా ఆ లిస్టులో నేనూ, మీరూ, ఎవరైనా చేరుకోవచ్చునని ప్రకటించాల్సి వచ్చింది. అంతేకాదు, ద్రోహం అనేది ఇతరులకు చేయనక్కర్లేదు, మనకు మనమే చేసుకోవచ్చునని కూడా ప్రకటించాడు! 

ఇలా అనేక సామాజిక అంశాలపైన పరిణామాలపైన ప్రకాష్‌ రాజ్‌ ఒక చేయి తిరిగిన ప్రసిద్ధ రచయితగా అనంతమైన అభ్యుదయ కోణాల్ని ఆవిష్కరించాడు. రైతాంగ సమస్యలు, మహిళా సమస్యలు, పెట్టుబడిదారీ, ఫ్యూడల్‌ వ్యవస్థను, దోపిడీ సమాజంలోని పెక్కు పరి ణామాల పట్ల, పౌరహక్కుల ఉద్యమాలు, ప్రజాస్వామ్య హక్కులు, వాటిపై ఎక్కుపెట్టిన ప్రజాతంత్ర శక్తుల పోరాటాలపైన, ఆ హక్కుల సాధనలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారులపైన పరోక్షంగానే కాదు ప్రత్యక్షంగానే ధైర్యసాహసాలతో ఒక ప్రజాకళాకారునిగా బాహా టంగా నిరసన తెలుపుతూ వచ్చినవాడు ప్రకాష్‌రాజ్‌. కర్ణాటక ఉద్యమకారిణి, ప్రసిద్ధ పత్రికా సంపాదకురాలైన గౌరి లంకేష్‌ హత్యను, ప్రొఫెసర్‌ కల్బుర్గి, తదితర పౌరహక్కుల నాయకుల హత్యల్ని, రాజ్యహింసను, బాహటంగా నిరసించి, ఉద్యమించిన కళానిధి ప్రకాష్‌రాజ్‌ అని గుర్తుకు తెచ్చుకుంటే ఒకనాడు శ్రీశ్రీ... కాంగ్రెస్‌ ఉనికిని ప్రశ్నిస్తూ ‘పొట్టిబావ కాంగిరేసు మేజరయ్యేదె ప్పుడు’ అని వేసిన ప్రశ్నే ‘మా’లోని పొట్టిబావ’లకూ ఎదురయింది. 

అందుకే ప్రకాష్‌రాజ్‌ ‘భాష అనేది ఒక అభివ్యాప్తి రూపం. సుఖ దుఃఖాల్ని వ్యక్తపరచుకునే ఒక మాధ్యమం. బసవన్న 12వ శతాబ్దపు గొప్ప వచనకారుడు, దార్శనికుడు. బింద్రే, కువెంపు, తేజస్వి, లంకేష్, కె.ఎస్‌.ఎన్‌ వంటి ప్రముఖ కన్నడ కవులూ, రచయితలూ ఇలాంటి ఆలోచనా సరళికి, జీవితాన్ని ధారపోసిన రచయితల్ని తెలుసు కోకుండానే, కేవలం వ్యాపార లావాదేవీలకు మాత్రమే భాషను నేర్చుకొనే మనఃస్థితి ఉన్నందువల్ల, మన అస్తిత్వాన్నే పోగొట్టుకుని అనామకులుగా నిలబడిపోయాం’ అన్నాడు. అంతేకాదు ‘జీవితంలో కొన్నింటిని ఏ కారణం వల్లనూ మార్చలేం. నేను పుట్టిన కులానికీ, నాకూ ఏ సంబంధం లేదు. అది నామీద వృ«థాగా మోపబడింది అని దాన్ని మార్చవచ్చు. నా మతం నాకు నచ్చలేదని మరో మతాన్ని ఎంచుకోవచ్చు. కానీ ఎవరికీ తన మాతృభాషను మార్చు కోవడానికి కుదరదు’ అన్నది ప్రకాష్‌రాజ్‌ భావన! 

అలాగే ప్రకృతి ఎంత కిలాడిదో వివరిస్తూ మనిషిలోని దురాశను ప్రకృతిపరంగా అందంగా చెప్పిన కళాకారుడు ప్రకాష్‌రాజ్‌. పూవు కాయగా మారటం, కాయ పండుగా మారే విధానం ఉందే... దీన్ని మనకు అర్థం చేయించేది ప్రకృతి. ప్రకృతి మీకు ఎంత కావాలో అంతే ఇస్తుంది. మీ ఆశకు మరికొంచెం ఇస్తుంది. కానీ దురాశను మాత్రం ఇవ్వదు. దీన్ని మనం తెలుసుకొని ఉండాల్సింది. నేర్చుకొని ఉండా ల్సింది అన్నాడు. ఇన్ని గుణపాఠాలు, స్వీయానుభవం నుంచి చెప్పిన ప్రకాష్‌రాజ్‌ నోట చివరికి నేను తెలుగువాడిని కాదన్న మాట ఇప్పుడు తెలిసివచ్చిందన్న ప్రకటనలోని బాధను, మనోవేదనను ఇప్పటికైనా ‘మా’లోని ‘పొట్టి బావ’లు తెలుసుకోవడం అందరికీ శ్రేయస్కరం.

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు