నిత్య హరిత విప్లవం అభిలషణీయం

19 Aug, 2022 01:56 IST|Sakshi

విశ్లేషణ

మన జనాభాలో దాదాపుగా మూడింట రెండొంతుల మందికి వ్యవసాయమే జీవిత విధానంగా, ప్రధాన జీవనాధారంగా ఉంటోంది. వ్యవసాయంలో స్తబ్ధత కొనసాగినట్లయితే మనం పురోగతి సాధించలేమన్నది స్పష్టమే. 1960ల మొదట్లో ప్రదర్శించిన చిత్తశుద్ధిని నేడు మళ్లీ చూపించాలి. తృణధాన్యాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. పోషకాహార విలువలు కలిగిన స్థానిక పంటలను ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగం చేయాలి. పర్యావరణ, ఆర్థిక ప్రాతిపదికన సేంద్రియ వ్యవసాయం, పంటలు, పశువుల సమీకృత విధానాన్ని ప్రోత్సహించాలి. కనీస మద్దతు ధరతో పాటు సమర్థమైన రైతు కేంద్రకమైన మార్కెటింగ్‌ వ్యవస్థను ఉనికిలోకి తేవాలి. సగటు ఆహార భద్రత నుంచి వ్యక్తుల్లో పోషకాల భద్రత వైపు మన ప్రాధాన్యతలు మారాల్సి ఉంది.

దేశమంతా అలుముకుంటున్న వ్యవసాయ రంగ సంక్షోభం వ్యవసాయదారుల సమస్య లను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఎత్తి చూపింది. 1960ల మొదట్లో ప్రదర్శించిన అదే చిత్తశుద్ధిని వ్యవసాయం పట్ల నేడు మళ్లీ  చూపించా ల్సిన అవసరం ఉంది. అనేక అంచనాల ప్రకారం, వ్యవసాయం ఇప్పుడు ఫలదాయకం కాదు. ఏదైనా అవకాశం ఉంటే, 40 శాతం మంది రైతులు వ్యవసాయాన్ని వదులుకోవాలని అనుకుంటున్నారు.

మన జనాభాలో దాదాపుగా మూడింట రెండొంతుల మందికి వ్యవసాయమే జీవిత విధానంగా, ప్రధాన జీవనాధారంగా ఉంటోంది. వ్యవసాయంలో స్తబ్ధత కొనసాగినట్లయితే మనం పురో గతి సాధించలేమన్నది స్పష్టమే.

హరిత విప్లవం అనేది ఉత్పాదకత పెంపుదల ప్రక్రియ కోసం కనుగొన్న పదబంధం. 1960లు, 70లలో ఆవిర్భవించిన హరిత విప్లవం గోధుమ, వరి, జొన్న ఇతర పంటలకు సంబంధించిన కొత్త జన్యు వంగడాల అభివృద్ధి, విస్తరణలపై ఆధారపడింది. నీటిని, సూర్యకాంతిని, మొక్కల పోషకాలను సమర్థంగా వినియోగించుకుని వాటిని ధాన్యాలుగా మార్చడంలోని సామర్థ్యమే ఈ హరిత విప్లవం ప్రాతిపదిక. వాయవ్య భారత్‌లోని నీటి లభ్యత గల ప్రాంతాలకు మాత్రమే ఈ హరిత విప్లవం పరిమితమైంది. అయితే, ఇక్కడ కూడా, తీవ్రమైన పర్యావరణ, ఆర్థిక కారణాల వల్ల వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోతోంది. దీనికి తోడు రైతుల రుణభారం కూడా పెరిగిపోతోంది. ఇప్పుడు సవాలు ఏమిటంటే, హరిత విప్లవాన్ని దాని కేంద్రంలోనే విఫలం కానివ్వకుండా అధిగమించడానికి పోరాడటమే.

అటు రుతుపవనాలు, ఇటు మార్కెట్‌తో మన వ్యవసాయం రెండు రకాలుగా జూదంలా మారిపోయింది. నీటిపారుదలపై ప్రభుత్వ వ్యయం పడిపోతోంది కానీ, భారత్‌ నిర్మాణ్‌ ప్రోగ్రాం ద్వారా దీన్ని మార్చేయవచ్చని ఆశ కలుగుతోంది. నీటి అవసరం తక్కువగా ఉండే తృణధాన్యాలు, నూనె గింజలు, ఇతర అధిక విలువ కలిగిన పంటలు పండే మెట్టభూముల్లో ఉత్పాదకతను పెంచవలసిన అవసరం ఉంది. అయితే వీటిలో చాలా భాగం మనం దిగుమతి చేసుకుంటున్నాం. బీటీ కాటన్‌ వంటి వ్యయభరితమైన టెక్నాలజీలను ఈ ప్రాంతాలకు వర్తింపజేస్తే సన్నకారు రైతులకు నష్టదాయకం అవుతుంది. ఎందుకంటే వ్యవసాయ ఖర్చులకోసం భారీ రుణాలను వీరు తీసుకోవలసి ఉంటుంది. పైగా పంట విఫలమైతే తట్టుకునే సామర్థ్యం వీరికి ఉండదు.

రాగి, సజ్జ లాంటి తృణధాన్యాలు, పశుదాణా లాంటి సంప్ర దాయ పంటలను విత్తనాల మార్పిడి కోసం ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా పునరుద్ధరించి, ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. పర్యావరణ, ఆర్థిక ప్రాతిపదికన సేంద్రియ వ్యవసాయం, పంటలు, పశువుల సమీకృత విధానాన్ని ప్రోత్సహించాల్సి ఉంది. అయితే ఇది సరిపోదు. ఇలాంటి మెట్ట ప్రాంతాల్లోని రైతులకు అత్యవసరమైనది ఏమిటంటే, కనీస మద్దతు ధర. దాంతోపాటు సమర్థమైన రైతు కేంద్రకమైన మార్కెటింగ్‌ వ్యవస్థను ఉనికిలోకి తీసుకురావడం. ధాన్యాలు, తృణధాన్యాలు వంటి పోషకాహార విలువలు కలిగిన స్థానిక పంటలను ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగం చేయాలి. దిగుమతి చేసుకున్న పంటలపై కాకుండా, స్థానికంగా పెంచిన పంటలపై మన ఆహార భద్రతా వ్యవస్థ ఆధారపడి ఉండాలి.

పర్యావరణానికి హాని కలిగించకుండానే పంటల ఉత్పాదకతను మెరుగుపర్చడానికి ఉద్దేశించిన నిత్య హరిత విప్లవం కోసం టెక్నాలజీని, పబ్లిక్‌ పాలసీని వృద్ధి చేయవలసిన అవసరం గురించి నేను 15 సంవత్సరాల క్రితం నొక్కి చెప్పాను. సేంద్రియ వ్యవ సాయం, హరిత వ్యవసాయం, పర్యావరణ హిత వ్యవసాయం, మైక్రో ఆర్గానిజంపై ఆధారపడిన వ్యవసాయం వంటి విభిన్న స్వావ లంబనా వ్యవసాయ విధానాలను తగిన విధంగా అమలు పర్చడంపై ఆధారపడినదే నిత్య హరిత విప్లవం.

సేంద్రియ వ్యవసాయం అనేది ఖనిజ ఎరువులు, రసాయనిక పురుగు మందుల ఉపయోగాన్ని మినహాయించాలి. జన్యుపరంగా మెరుగుపర్చిన పంటలు, సమీకృత చీడ, పోషకాల నిర్వహణ సూత్రంపై ఆధారపడి చైనాలో విస్తృతంగా చేస్తున్న హరిత వ్యవసాయాన్ని అమలు చేయాలి. దీంతోపాటు సహజ వనరుల వినియోగం, పెంపుదలను సమీకృతం చేయాలి. వర్షాధార, సాగునీటి ప్రాంతాలు రెండింటిలోనూ విభిన్న వ్యవసాయ–పర్యా వరణ, సామాజిక వాతావరణాలకు అనువైన వైవిధ్యపూరితమైన స్వావలంబనా వ్యవసాయ పద్ధతులను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పర్యావరణపరంగా స్వావలంబనతో కూడిన వ్యవసాయ సాంకేతికతలు అందుబాటులో ఉండే ‘డూ–ఎకాలజీ’ వైఖరిని మనం చేపట్టాల్సి ఉంది. ఉదాహరణకు, తప్పనిసరిగా వర్షపునీటిని నిల్వ చేయడం, మూడు సంవత్సరాల రొటేష¯Œ  పద్ధతి ఈ ‘డూ–ఎకాలజీ’ పద్ధతిలో ఉంటుంది. ఈ మూడేళ్ల పద్ధతిలో ఖరీఫ్, రబీ సీజన్లు రెండింట్లోనూ చిక్కుళ్లను పండిస్తారు. దీనివల్ల రైతు కుటుంబాలకు, దేశానికి కూడా విజయం కలిగేలా ఇది తోడ్పడుతుంది.

ఆహార భద్రతలో మూడు ప్రధానమైన కోణాలు  ఉంటున్నాయి. తగినంత కొనుగోలు శక్తి లేకపోవడంతో దీర్ఘకాలికంగా క్షుద్భాధ; ఆహారంలో విటమిన్‌ ఏ, ఐరన్, అయోడిన్, జింక్‌ వంటి సూక్ష్మ పోషకాల కొరత వల్ల శరీరంలో దాగి ఉండే ఆకలి; క్షామం, వరదలు, తుపానులు, ఇతర పర్యావరణమైన మార్పుల కారణంగా విచ్ఛిన్నత ద్వారా కలిగే నిరంతర క్షుద్బాధ. ఆకలిని తగ్గించే ఏ వ్యూహమైనా ఈ మూడు అంశాలనూ తప్పకుండా పరిష్కరించాల్సి ఉంది. సగటు ఆహార భద్రత నుంచి వ్యక్తుల్లో పోషకాల భద్రత వైపు మన ప్రాధాన్యతలు మారాల్సి ఉంది.

సమతుల్య ఆహారాన్ని శారీరక పరంగా, ఆర్థికపరంగా, పర్యావరణపరంగా, సామాజికంగా అందు బాటులో ఉంచడమే పోషకాల భద్రతకు ఉత్తమ నిర్వచనంగా ఉంటుంది. రక్షిత మంచి నీరు, పర్యావరణ పరమైన పారిశుధ్యం, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, ప్రాథమిక విద్య అనేవి కూడా దీంట్లో భాగమే. పోషకాల భద్రతలో ఆహారం, ఆహారేతర అంశాలకు కూడా సమ ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తుంది.

మన దేశంలోని ప్రతి పంచాయతీ కూడా తనదైన సామాజికార్థిక, సాంస్కృతిక, పర్యావరణ పరిస్థితులకు అనుగుణమైన లక్ష్యాలను సాధించడానికి సొంత ప్రణాళికను అభివృద్ధి చేసుకోవలసి ఉంది. పోషకాహార లేమిని అధిగమించాలంటే అత్యంత సమర్థవంతమైన పద్ధతి ఏదంటే, వ్యవసాయాన్ని పోషణ, ఆరోగ్యంతో మేళవించడమే. పోషణ కోణాన్ని జోడిస్తూ తమ సాంప్రదాయిక వ్యవసాయ వ్యవస్థ లను పునర్నిర్మించుకోవడంలో రైతులు శిక్షణ పొందాలి. రెండు దశల్లో దీన్ని చేయవచ్చు. ఒకటి: అవసరమైన సూక్ష్మ పోషక విలువలు, మాంసకృత్తులను అందించే మొక్కలను రైతులకు అందించేలా, జీవరక్షణ మొక్కలతో కూడిన జెనెటిక్‌ గార్డె¯Œ ని ఏర్పర్చాలి. విటమిన్‌ ఏ కొరతను పరిష్కరించే ఆరెంజ్‌ స్వీట్‌ పొటాటో (చిలగడదుంప లాంటిది) వంటివి వీటిలో కొన్ని. రెండు: స్థానిక సమాజాల సభ్యు లకు సమాజ ఆకలి వ్యతిరేక యోధుల్లా శిక్షణ అందించాలి. వీరికి ఆ ప్రాంత పోషకాహార సమస్యలను అధిగమించే పద్ధతులను గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగించాలి.

ఈరోజు మన రైతులు ప్రాణరక్షణ మద్దతు కోసం విలపి స్తున్నారు. కొద్ది సంవత్సరాల తర్వాత ఫలాలను అందించే పథకాలను మాత్రమే వారు కోరుకోవడం లేదు. బలమైన, ఉజ్వలమైన, సంపద్వంతమైన వ్యవసాయ దేశంగా మారడంలోనే భారత్‌ భవి ష్యత్తు ఆధారపడి ఉంది. 

ఎం.ఎస్‌. స్వామినాథన్‌
వ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త
(‘బిజినెస్‌ లైన్‌’ సౌజన్యంతో) 

మరిన్ని వార్తలు