Munugode Bypoll: సర్కార్‌ ఎవల్తోని నడుస్తున్నది?

21 Oct, 2022 13:57 IST|Sakshi

అట్లుంటది

జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ల బొందలగడ్డ దిక్కు బోయిండు. గాడ బేతాలుని రొండంత్రాల బంగ్ల ముంగట మోటరాపి హారన్‌ గొట్టిండు. బేతాలుడు ఇవుతలకొచ్చిండు. మోటర్‌ ఎన్క సీట్ల గూసుండు. 

‘‘ఎత్తుగడ్డలు, గుంతలు సూడకుంట మోటర్‌ నడ్పుతనే ఉంటవు. బల్రు అడ్డం రావొచ్చు. ఎవడన్న సైడియ్యక పోవచ్చు. ట్రాఫిక్ల ఇర్కపోతే తిక్కలేవొచ్చు. బేచైన్‌ గాకుంట ఉండెతంద్కు రొండు ముచ్చట్లు జెప్త ఇను’’ అని అన్నడు.

‘‘నువ్వు జెప్తె ఇనకుంట ఉన్ననా?’’ అని  విక్రమార్కుడన్నడు.
‘‘మునుగోడు అంటె ఏందో ఎర్కేనా? మును అంటె ముందుగాల, గోడు అంటె గోస. బై ఎలచ్చన్లు వొచ్చె బట్కె సంటర్‌ మంత్రులు, ముక్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్ని పార్టీల లీడర్లు  గదిస్తం గిదిస్త మనుకుంట బొంబై తమాస సూబెడ్తున్నా ఇక ముందుగాల గుడ్క జెనం గోస బదలాయించదు.’’
‘‘బాగనే ఉన్నది గని ఇంతకు జెనమేమంటున్నరు?’’

‘‘గిదొక జాత్ర. అందరితాన పైసల్‌ దీస్కుంటం. మేం జేసేది జేస్తం. తింటం. తాగుతం. ఇంట్ల పంటం. ఏ పార్టి లీడరొస్తె గా పార్టి కండ్వలు గప్పుకుంటం. ఇదువర దాంక ఏ లీడరేం బీకలేదు. ఇంక నాల్గు నెలలల్ల ఏం బీక్తరు. ఫ్లోరైడ్‌ నీల్లట్లనే ఉంటయి. తొవ్వలల్ల గుంతలట్లనే ఉంటయి’’ అని మునుగోడు జెనమంటున్నరు.
‘‘మునుగోడుల ఎవ్వలెట్ల ప్రచారం జేస్తున్నరు?’’

‘‘రూపాయలు ఏర్ల లెక్క బారుతున్నయి. మా పార్టి చోటామోటా లీడర్లు, సర్పంచ్‌లు మమ్ములనే డిమాండ్‌ జేస్తున్నరు... అవుతల లచ్చల రూపాయిల ఆఫర్‌ ఉన్నదంటున్నరు. గిట్లయితె ఏం జెయ్యాలెరో అని ఒక కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే మొత్తుకుండు.’’

‘‘రాహుల్‌ గాంది బారత్‌ జోడో అసరు మునుగోడు మీద ఏమన్న ఉంటదా?’’ అని విక్రమార్కుడు అడిగిండు.
‘‘గాయిన జోడో అంటె గీల్లు తోడో అన్కుంట కొట్లాడ్తున్నరు. కాంగ్రెస్ల ఏ లీడర్‌ కా లీడర్‌ తీస్మార్‌ఖాన్‌ ననుకుంటడు. మునుగోడుల ప్రచారం జేసెతందుకు నా అసువంటి హోంగార్డుల అవుసరం లేదు. ఎస్పీలే పోతరు. గాయిన మీద నూరు కేసులు పెట్టినా వొచ్చే అసెంబ్లీ ఎలచ్చన్ల గెలిపిచ్చి కాంగ్రెస్‌ను హుకూమత్లకు దెస్తనని ఒక పెద్దమన్సి అన్నడు. గాయిననే మునుగోడుల కాంగ్రెస్‌ను గెలిపిస్తడని గా పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిని బనాయించిండు.’’

‘‘బీజేపీ, టీఆర్‌ఎస్ల సంగతేంది?’’
‘‘బీజేపీ దిక్కుకెల్లి నిలబడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రొండెక్రాలల్ల క్యాంప్‌ ఆపీస్‌ బెట్టిండు. దినాం మటన్, చికెన్‌ తోని వెయ్యిమంద్కి దావత్‌ ఇయ్యబట్టిండు. ప్రచారం జేస్కుంట అవ్వా నీ ఓటు నాకే ఎయ్యాలె అని గాయిన అన్నడు. తప్పకుంట చెయ్యి గుర్తుకే ఓటేస్త అని గామె అన్నది. చెయ్యి గాదు పువ్వు అన్కుంట రాజగోపాల్‌ రెడ్డి మొత్తుకుండు.’’

‘‘బండి సంజయ్, కేటీఆర్‌ల సంగతేంది?’’
‘‘ప్రగతి బవన్ల ఒక మంత్రగానితోని కేసీఆర్‌ పూజలు జేపిస్తున్నడు అని బండి సంజయ్‌ అన్నడు. పిచ్చి ముదురుతున్నది, కరుస్తడేమో అని కేటీఆర్‌ అన్నడు. కావలి కుక్క లెక్క ఉండుమని కుర్సిమీద గూసుండబెడ్తె కచరా కుక్కల్లెక్క, పిచ్చికుక్కల్లెక్క కర్సెతంద్కు ఊరిమీద బడ్డరు అని బండి సంజయ్‌ అన్నడు. పూజూల్గ గీ లీడర్లు మమ్ములను బద్నాం జేస్తున్నరనుకుంట పట్నంల కుక్కలన్ని రాస్తారోకో జేసినయి.’’

‘‘చండూరు ర్యాలీ ఎట్లయింది?’’
‘‘టీఆర్‌ఎస్‌ దిక్కుకెల్లి నిలబడ్డ కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి నామినేసన్‌ ఏసినంక చండూరుల మీటింగ్‌ బెట్టిండ్రు. కేటీఆర్‌ పక్కపంటే మైకు బట్కోని, నామినేషన్‌ కొచ్చిన నందమూరి తారక రామారావు గారికి, తమ్మినేని సీతారాం గారికి అనుకుంట కూసుకుంట్ల మాట్లాడబట్టిండు. యాల పొద్దుగాలే మందుగొట్టినట్లున్నడు అని కేటీఆర్‌ గాయినను ఎన్కకు బొమ్మన్నడు. ఒక మంత్రి అయితె మన బీఎస్‌పి పార్టీ అనబట్టిండు. ఇంతకు టీఆర్‌ఎస్‌ లీడర్లు పగటీలనే మందు ఎందుగ్గొడ్తున్నరు. గీ సవాల్‌కు జవాబ్‌ జెప్పకుంటె నీ మోటర్కు టక్కరైతది’’ అని బేతాలుడన్నడు. (క్లిక్‌: బీఆర్‌ఎస్‌ అంటే ఏంది?)

‘‘గీ సర్కార్‌ ముక్యమంత్రితోని నడుస్త లేదు. మంత్రుల తోని నడుస్త లేదు. ఎమ్మెల్యేలతోని నడుస్త లేదు. పోలీసోల్లతోని నడుస్త లేదు. మందుతోని నడుస్తున్నదని గాల్లు పగటీలనే మందుగొట్ట బట్టిండ్రు’’ అని విక్రమార్కుడు జెప్పంగనే మోటర్‌ దిగి బేతాలుడు బంగ్ల దిక్కు బోయిండు.


- తెలిదేవర భానుమూర్తి
సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు