వైఎస్సార్‌ సీపీ బలాన్ని నిరూపించిన చంద్రబాబు

6 Mar, 2021 01:03 IST|Sakshi

తాను అధికారంలో ఉన్న కాలంలో 2018లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల ఊసు కూడా ఎత్తకుండా, ఇప్పుడు అవే ఎన్నికల కోసం ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ మీద ఒత్తిడి తెచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలను ఎందుకు తెచ్చిపెట్టుకున్నానురా అని తీరికగా విచారిస్తూ ఉండివుంటారు! ఆయన భయం ఆయనది. తన కాలంలో నియమితులైన నిమ్మగడ్డ పదవీకాలం ఈ నెలా ఖరుతో ముగుస్తుంది. ‘మనవాడు’ ఉన్నప్పుడే ఎన్నికలకు వెళ్తే ఎన్నో కొన్ని పంచాయతీలైనా దక్కకపోతాయా అని ఆశ పడ్డారు. తీరా ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక మొత్తం స్థానాల్లో పాతిక శాతం వైసీపీకి ఏకగ్రీవాలు కావడంతో చంద్రబాబు గుండె గుభేలుమంది. ఆ దెబ్బకు ఠారెత్తిపోయి ఏమి మంత్రం ప్రయోగించారో గానీ అకస్మాత్తుగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ గారికి కరోనా భూతం కళ్ళముందు ప్రళ యతాండవం చేసింది. ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏకపక్షంగా ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేసి చేతులు దులుపుకున్నారు.

అయితే మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ కొందరు ఉద్యమం చేస్తుండటంతో చంద్రబాబులో మళ్ళీ సరికొత్త ఆశలు చిగురించాయి. జగన్‌ మీద వ్యతిరేకత ప్రబలిందని రంగుల స్వప్నాల్లో విహరించారు. ఎన్నికల కమిషనర్‌ చంద్ర బాబు సంగీతానికి అనుగుణంగా డ్యాన్సులు  చెయ్యడం మొదలైంది. కరోనా పేరు చెప్పి ఎన్నికలను ఎక్కడ ఆపారో, అక్కడినుంచే మళ్ళీ మొదలుపెడతామని కోర్టుకు హామీ ఇచ్చిన సంగతిని నిర్లక్ష్యం చేసి కొత్తగా పంచాయితీ ఎన్ని కలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. నిజాయితీపరులైన ఉన్నతా ధికారులను అవమానిస్తూ, వారి ఉద్యోగ జీవితాన్ని కూడా సర్వనాశనం చెయ్యడానికి తెగించారు. వారి సర్వీస్‌ రికా ర్డుల్లో అభిశంసనను నమోదు చెయ్యాలని ఆదేశించారు. వారికి ఉద్యోగ విరమణకు సంబంధించిన ప్రయోజనాలు కూడా రావని బెదిరించారు. తన చిత్తానుసారం కలెక్టర్లను, ఎస్పీలను బదిలీ చేశారు.

నిమ్మగడ్డ ఇస్తున్న ఇలాంటి ఆదేశాల వెనుక ఆడించే శక్తి ఏమిటో అందరికీ తెలుసు. తెలుగుదేశం అనుకూల పచ్చ మీడియా అయితే నిమ్మగడ్డ ఈ శతాబ్దపు టీఎన్‌ శేషన్‌ అనీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన విక్రమార్కుడనీ, ఆకాశానికి ఎత్తేసింది. పచ్చ విశ్లేషకులను కూర్చోబెట్టుకుని చంద్రబాబు గ్రాఫ్‌ విపరీతంగా పెరిగిపోవడంతో జగన్‌ భయపడిపోతు న్నాడనీ, నిమ్మగడ్డ కీర్తి ఆచంద్రతారార్కం వెలిగిపోతుందనీ భజించడంలో మునిగితేలాయి. కరోనా టీకా  కార్యక్రమానికి విఘాతం కలుగుతుందని ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు తల ఊపక తప్పలేదు.

నిమ్మగడ్డ ఆదేశాలన్నీ రాజ్యాంగ విరుద్ధమని అందరికీ తెలుసు. అయినప్పటికీ ప్రభుత్వం సంయమనంతో వ్యవహ రించింది. ‘కేంద్ర ఎన్నికల సంఘానికున్న అధికారాలన్నీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఉంటాయని’ సుప్రీంకోర్టు చేసిన ఒక వ్యాఖ్యను పట్టుకుని ఎన్నికల కోడ్‌ ముగిసేంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం తన చెప్పు కింద తేలులా పడివుండాలని నిమ్మగడ్డ ఆశించారు. ప్రభుత్వం ఏనాడో ప్రకటించిన ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్నారు.  ఇంటిం టికీ రేషన్‌ సరుకులను అందించే వాహనాల రంగులను మార్చాలన్నారు. చివరకు సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చెయ్యాలనీ, ఆయన మీడియా ముందు మాట్లాడకూడదనీ ఆంక్షలు విధించారు. ఇవే ఆంక్షలను ఆ మరునాడు మరొక మంత్రి కొడాలి నానిమీద కూడా విధించారు. ఇల్లిల్లూ తిరిగి ప్రజలకు పింఛన్‌ అందించే వలంటీర్ల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

విశేషం ఏమిటంటే, ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే వరకు నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పులు ఇచ్చిన హైకోర్టు, ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక నిమ్మగడ్డ ఇస్తున్న ఆదేశాలను ఏమాత్రం ఆమోదించలేకపోయింది. నిమ్మగడ్డ నిరంకుశ ఆదేశాలు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి ఆటంకంగా ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయ పడటంతో కథ అడ్డం తిరిగింది. నిమ్మగడ్డ ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని కోర్టులు కొట్టేశాయి. మంత్రుల నిర్బంధం నుంచి వలంటీర్ల ఫోన్ల వరకు నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలన్నీ చెల్లని కాసులుగా తేలిపోయాయి. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించడమే ఎన్నికల సంఘం విధి తప్ప వారికి అంతులేని అధికారాలేవీ రాజ్యాంగం ప్రకారం లేవని స్పష్టం చేసినట్లయింది.  

పంచాయతీ ఎన్నికల ఫలితాలతోనే తెలుగుదేశం సత్తా ఏమిటో వెల్లడయింది. పంచాయతీ ఎన్నికలకు కూడా మేనిఫెస్టోను విడుదల చేసి ఎన్నికల చరిత్రను తిరగరాసింది తెలుగుదేశం. ఆ మేనిఫెస్టో రాష్ట్రం మొత్తం చేరిపోయాక తీరి కగా దాన్ని రద్దు చేస్తున్నట్లు నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ మీద తెలుగుదేశం తరపున కాకి వెళ్లి కబురు చేసినా ఆగమేఘాలమీద చర్యలు తీసుకున్న నిమ్మగడ్డ... తెలుగుదేశం మీద వైసీపీ నాయకులు వెళ్లి ఫిర్యాదులు చేసినా నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరించారు.

అయినప్పటికీ ఎనభై శాతం పంచాయతీలు వైసీపీ పరం కావడంతో తెలుగుదేశం కూసాలు కదిలిపోయి నట్లయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు పంచా యతీ ఎన్నికల్లో శృంగ భంగం కాగానే మునిసిపల్‌ ఎన్నికల్లో అయినా తమ ప్రతాపాన్ని చాటాలని ఎన్ని యుక్తులు పన్నినప్పటికీ వాటిల్లోనూ అధికభాగం ఇప్పటికే వైసీపీ ఖాతాలోకి చేరిపోయాయి. కొన్ని చోట్ల అయితే తెలుగుదేశం పార్టీకి ఒక్క వార్డు కూడా దక్కలేదు. మరీ ఘోరం ఏమి టంటే మొన్నటిదాకా తిరుగు లేని అధికారాన్ని చలాయించిన టీడీపీ తరపున నామినేషన్లు వెయ్యడానికి అభ్యర్థులు కూడా దొరకలేదు!

ఇప్పుడు వచ్చిన మునిసిపల్‌ ఫలితాలను చూశాక చంద్రబాబునాయుడుకు భవిష్యత్‌ దర్శనం బహు బాగా అయ్యుంటుంది. రాష్ట్రంలోని డెబ్బై అయిదు మునిసి పాలిటీల్లో తెలుగుదేశం పార్టీకి ఒక్కటి కూడా దక్కే అవకాశం కనిపించడం లేదు. అలాగే కార్పొరేషన్లు కూడా! ఈ ఫలితాల వలన తెలుగుదేశం గత రెండేళ్లలో రవ్వంత కూడా పుంజు కోలేదనీ, పైగా ఇంకా అణిగిపోయిందనీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాభవం గత అసెంబ్లీ ఎన్నికలకన్నా మరింతగా పెరిగిందనీ విస్పష్టంగా ప్రజలకు తెలిసిపోయింది. అనవస రంగా వైసీపీ బలం తగ్గలేదని ఎందుకు నిరూపించానా అని చంద్రబాబు ఇప్పుడు అంతర్మథనానికి గురి అవుతుం టారు! ఏం చేస్తాం మరి? చేసుకున్న వారికి చేసుకున్నంత అని పెద్దలు చెప్పారు కదా!


ఇలపావులూరి మురళీమోహనరావు 
వ్యాసకర్త సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు

మరిన్ని వార్తలు