MV Ramana Reddy: మనకాలం వీరుడు ఎమ్వీఆర్‌

30 Sep, 2022 13:29 IST|Sakshi

2001వ సంవత్సరం. అమీర్‌ పేటలో ఆర్టిస్ట్‌ మోహన్‌ ఆఫీసు. ఉదయం పది గంటలకి ఎం.వి. రమణారెడ్డి ఫోన్‌ చేశారు. ‘హైద రాబాద్‌ బస్టాండ్‌లో వున్నా. అర గంటలో మీ ఆఫీసుకి వస్తాను’ అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హెన్రీ షారియర్‌ నవల ‘పాపిలాన్‌’ని ఆయన అనువ దించారు. కవర్‌ పేజీ బొమ్మ కోసం వస్తున్నారు. ఆయన చాలా రోజుల ముందే చెప్పినా మోహన్‌ బొమ్మ వేయలేదు. తాపీగా ఒక ఎ4 సైజ్‌ బాండ్‌ పేపర్‌ తీసుకుని, రెక్కలతో ఒక మనిషి ఎగురుతున్న ఒక చిన్న బొమ్మ వేశాడు. దాన్ని స్కాన్‌ చేసి, పచ్చని అడివి వున్న ఒక బ్రోషర్‌ తీసి ఇచ్చి, దాన్ని బ్యాక్‌ గ్రౌండ్‌గా వాడమని కంప్యూటర్‌ ఆపరేటర్‌కి చెప్పాడు. ఆ పని అయ్యేలోగా ‘రెక్కలు సాచిన పంజరం – ఎం.వి. రమణారెడ్డి’ అని అక్షరాలు రాసిచ్చాడు. 

కవర్‌ పేజీ పైన అడివి, కింద సముద్రం అలలు, మధ్యలో ఎగిరే స్వేచ్ఛాజీవి– 20 నిమిషాల్లోనే రెడీ అయింది అందమైన కవర్‌ డిజైన్‌. ఎమ్వీఆర్‌ వచ్చారు. హాయిగా నవ్వి ‘బాగుంది’ అన్నారు. నాకు ఒకటే ఆశ్చర్యం. ప్రొద్దుటూరు ఫ్యాక్షనిస్టూ, హత్య కేసులో జైలుకెళ్లిన మనిషీ, వైద్యం చేసే డాక్టరూ, ఉద్యమాలూ నడిపి, నిరాహార దీక్షలు చేసి, ఎమ్మెల్యేగా గెలిచి రాయలసీమ కోసం గొంతెత్తినవాడూ, పుస్తకాలు రాసినవాడూ ఈయనేనా? సౌమ్యంగా, వినమ్రంగా, సంస్కారవంతంగా, స్నేహశీలిగా ఉన్న ఈ నిరాడంబరమైన బక్కపలచని మానవుడేనా?

ఎమ్వీఆర్‌గా ప్రసిద్ధుడైన మల్లెల వెంకట రమణా రెడ్డి తెలుగు సాహిత్యానికి కొన్ని అరుదైన కానుకలు ప్రసాదించిన ప్రతిభామూర్తి. విప్లవ కారుడూ, తిరుగుబాటుదారుడూ అయిన ఎమ్వీఆర్‌ మహాభారతాన్ని లోతుగా అధ్యయనం చేసినవాడు. ‘గుడిపాటి వెంకటచలం వచనం నాకిష్టం. ఆ ప్రభావం నా మీద వుంది’ అని ప్రకటించినవాడు. ఎంత విస్తృ తంగా చదువుకున్నాడో ఆయన రచనల్లోని వైవిధ్యమే మనకి చెబుతుంది. మార్గరెట్‌ మిషెల్‌ ‘గాన్‌ విత్‌ ది విండ్‌’, గోర్కీ ‘అమ్మ’, ఆర్‌కె నారాయణ్‌ ‘పెద్దపులి ఆత్మకథ’, ‘మాటకారి’ నవలలు తేట తెలుగులోకి అనువదించారు ఎమ్వీఆర్‌. 

‘ఆయుధం పట్టని యోధుడు’ టైటిల్‌తో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జీవిత చరిత్ర రాశారు. భారతంలో ద్రౌపది ప్రాధా న్యాన్నీ, విశిష్టతనీ తెలియజెప్పే ‘తెలుగింటికొచ్చిన ద్రౌపది’ ఒక అరుదైన రచన. ఎమ్వీఆర్‌ రాసిన ‘రాయల సీమ కన్నీటి గాథ’ ప్రజాదరణ పొందిన ఒక సీరియస్‌ డాక్యుమెంట్‌. జీవిత చరమాంకంలో రాసిన ‘తెలుగింటి వ్యాకరణం’ ఒక అసాధారణమైన రచన. ‘టూకీగా ప్రపంచ చరిత్ర’ అని ఏకంగా నాలుగు సంపుటాలు రాసిన మన హెచ్‌.జి. వెల్స్‌ ఎమ్వీ రమణారెడ్డి. నవ చైనా సామాజిక జీవితం గురించి ఒక బ్రిటిష్‌ డాక్టర్‌ రాసిన పుస్తకాన్ని ‘పురోగమనం’ పేరుతో అనువదించారు. 

ఎనిమిది ఉత్తమ తెలుగు చిత్రాలకు ఆయన రాసిన సమీక్షలు ఎప్పటికీ మరిచిపోలేనివి. ‘తెలుగు సినిమా స్వర్ణయుగం’లో మల్లీశ్వరి, జయభేరి, దొంగరాముడు, దేవదాసు, బంగారు పాప, పాతాళ భైరవి, మాయాబజార్, విప్రనారాయణలను ఆయన సమీక్షించిన తీరు పాఠకుల్ని పరవశుల్ని చేస్తుంది. అవి డాక్టోరల్‌ థీసిస్‌కు ధీటైన పరిశోధన చేసి రాసినవని ముళ్ళపూడి వెంకట రమణ కితాబిచ్చారు. (క్లిక్: కన్యాశుల్కం నాటకాన్ని గురజాడ ఎందుకు రాశారు!?)

ఎమ్వీ రమణారెడ్డి అనే పదహా రణాల ప్రజల మనిషి, అక్షరాలా ఉత్తమ సాహితీవేత్త మన సాహిత్యానికి చేసిన కంట్రిబ్యూషన్‌ వెలకట్టలేనిది. కడప జిల్లా ప్రొద్దుటూరు అంటే ఆనాడు ‘శివతాండవం’ చేసిన పుట్టపర్తి నారాయణాచార్యులవారు, ప్రొద్దుటూరు అంటే తెలుగు సాహితీ పతాకాన్ని నీలాకాశం చేసి ఎగరేసిన ఎమ్వీ రమణారెడ్డి... అనే మనకాలం వీరుడు. ఉద్యమం, అధ్యయనం, ఆదర్శం కలిసి ప్రవహిస్తే... అదే ఉజ్వలమైన, ఉత్తేజకరమైన ఎమ్వీఆర్‌ జీవితం. (క్లిక్: దళిత సాహిత్య కృషికి దక్కిన గౌరవం)


- తాడి ప్రకాష్‌ 
సీనియర్‌ జర్నలిస్ట్‌
(సెప్టెంబర్ 30న ప్రొద్దుటూరులో ఎమ్వీఆర్‌ విగ్రహ ఆవిష్కరణ)

మరిన్ని వార్తలు