YS Rajasekhara Reddy: నిలువెత్తు సంక్షేమ రూపం

2 Sep, 2021 01:01 IST|Sakshi

నేడు డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి వర్ధంతి

తన పంటకు మా ముఖ్యమంత్రి ఉన్నాడనే భరోసా రైతుకూ, తన వైద్యానికి మా ముఖ్యమంత్రి ఉన్నాడనే భరోసా రోగికీ, మా పిల్లల చదువుకు మా ముఖ్యమంత్రి ఉన్నాడనే భరోసా తల్లితండ్రులకూ, తలెత్తుకుని నడిచే సాధికారత మహిళలకూ, శేషజీవితానికి దిగుల్లేదనే భరోసా వృద్ధులకూ కల్పించిన గొప్ప మానవీయ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి. జలయజ్ఞంతో బీడుభూములను సస్యశ్యామలం చేశారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్‌ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలిచారు. రెండవ హరిత విప్లవాన్ని కలగన్నారు. అభివృద్ధి, సంక్షేమం తన రెండు కళ్లుగా పాలన సాగించారు వైఎస్‌.

కేవలం ఐదేళ్ల మూడు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు వైఎస్‌ రాజశేఖర రెడ్డి. అయినా ప్రజా సంక్షేమం కోసం ఎవరూ చేయలేని పనులు చేశారు. రాజకీయ నాయకుడిగా తొలి రోజులలోనే అసెంబ్లీలో విస్పష్టంగా సాగునీటి అవసరం గురించి మాట్లాడారు. ‘నేను యువకుడిగా కోస్తా ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ కాలువలలో పారుతున్న నీటిని చూసి కరువు ప్రాంతాలకు కూడా ఇలా నీటిని తీసుకుని వెళ్ళాలనే సంకల్పం నాలో ఏర్పడింది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాయలసీమకు నీళ్ళివ్వమని నేను అడిగితే, దోసిలి పట్టు పోస్తానని ఎగతాళిగా మాట్లాడారు. ఆ రోజున నా సంకల్పం మరింత బలపడింది’ అన్నారు వైఎస్‌. ఆ సంకల్పబలం నుండి ఉద్భవించిందే మహత్తరమైన జలయజ్ఞం.

సాగునీటి వనరుల అభివృద్ధి మొదలైన కృష్ణదేవరాయల పాలన నుండి వైఎస్‌ ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి వనరులు ఉన్న భూమి 80 లక్షల ఎకరాలు మాత్రమే. ఈ పరిస్థితిలో లక్ష కోట్లతో కోటి ఎకరాలకు నీరు అందిస్తానని ఆయన జలయజ్ఞం ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదట ప్రారంభించిన ప్రాజెక్టు పులిచింతల. కానీ మొదట పూర్తయ్యింది నిజామాబాద్‌ జిల్లాలోని అలీసాగర్‌. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేర్లు పెట్టినా ఏమాత్రం కూడా పనులు జరగని హంద్రీ–నీవా సుజల స్రవంతి, గాలేరు–నగరి సుజల స్రవంతులకు అవే పేర్లు కొనసాగించడం, ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతానికి జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టుకు కమ్యూనిస్టు నాయకుడు పూల సుబ్బయ్య పేరు పెట్టడం, కృష్ణా డెల్టా రైతుల చిరకాల స్వప్నమైన పులిచింతలకు కృష్ణా డెల్టా వాసి, ఆంధ్రప్రదేశ్‌ గర్వించే ఇంజనీర్‌ కె.ఎల్‌.రావు పేరు పెట్టడం ఆయన రాజకీయ విజ్ఞతకు నిదర్శనం. 

అలాగే ఆంధ్రరాష్ట్రానికి వరం, పోలవరం. ఈ ప్రాజెక్టు విషయంలో ఆయన కృషి మరువలేనిది. దీనికోసం గోదావరి జిల్లా వాసులు పోలవరం సాధనా సమితి పేరుతో అనేక ఉద్యమాలు చేసి చివరికి అది అసాధ్యం అనుకున్న తరుణంలో– అన్ని అనుమతులు సాధించి, ప్రాజెక్టును ప్రారంభించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే 70 శాతం పనులు పూర్తి చేయడం ఆయన కార్య శూరత్వానికి నిదర్శనం.


2004లో వైఎస్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే నాటికి వ్యవసాయ రంగం కుదేలైంది. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి. అయినా రైతులను ఆదుకోకపోగా ఈ విషయమై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎగతాళిగా మాట్లాడారు. కానీ వైఎస్‌ సీఎంగా మే నెల రెండవ వారంలో ప్రమాణ స్వీకారం చేస్తే జూన్‌ మొదటి వారంలోనే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు అనా«థలు కాకూడదని రెండు లక్షల రూపాయల పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతుకు వెన్నెముక. రైతులు అప్పుల కట్టలేక సహకార సంఘాలు దివాలా తీసే పరిస్థితిలో వైద్యనాథన్‌ కమిటీ సిఫారసులు అమలు చేసి రూ.1,800 కోట్ల సాయం అందించారు. పూర్తి నష్టాలలో ఉన్న సంఘాలను పక్క సహకార సంఘంలో కలిపి సహకార వ్యవస్థను కాపాడారు. పావలా వడ్డీకే రైతులకు పంట రుణాలు అందించారు.

ఒక ప్రాజెక్టు కట్టి ఒక ఎకరానికి నీరివ్వాలంటే ప్రభుత్వానికి లక్షలలో ఖర్చు అవుతుంది. పైగా నిర్వహణ భారం ప్రభుత్వానిదే. అదే భూగర్భ జలాలకైతే రైతు స్వయంగా బోరు వేయించుకోవడమో, బావి తవ్వడమో చేస్తాడు. దానికోసం అప్పు తెచ్చుకుంటాడు. దానికి అవసరమైన పూర్తి బరువు అతడే మోస్తాడు. ఈ తర్కం ఆధారంగా వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్‌ ఇవ్వాలని వైఎస్‌ సంకల్పించారు. కానీ అది జరిగేపని కాదని కొందరు వ్యంగ్యంగా మాట్లాడారు. అయినా ఆయన పట్టు వీడలేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇచ్చి చూపారు. ఆ పథకం దేశానికే ఆదర్శమై ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్‌ రాష్ట్రాల్లోనూ అమలవుతోంది. 

వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నప్పటికీ, వ్యవసాయ విధానాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. అందువలన కేంద్ర–రాష్ట్రాల సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలని గుర్తించి ఆయన చైర్మన్‌గా, సోమయాజులు వైస్‌ చైర్మన్‌గా  అగ్రికల్చర్‌ టెక్నాలజీ మిషన్‌ ఏర్పాటు చేశారు. 2006లో దాని ప్రారంభోత్సవం సందర్భంగా– ‘నీటిపారుదల, గిట్టుబాటు వ్యవ సాయ మూలంగానే రెండవ హరిత విప్లవం సాధ్యమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని భారతదేశానికే అన్నపూర్ణగా తీర్చిదిద్దడం నా లక్ష్యం’ అని ప్రకటించారు. అది ఆయన ఆత్మవిశ్వాసానికి సూచిక.

వ్యవసాయంలో ఉత్పత్తి వ్యయం ఎక్కువ. పండించిన పంటను లాభసాటి ధరకు అమ్ముకుంటేనే రైతుకు ఆదాయం వస్తుంది. పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా మద్దతు ధరలు లేవని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవి పెరిగేలా చేశారు. 

కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించడానికి కారణం వైఎస్‌ ప్రోద్బలమే. సన్న, చిన్నకారు రైతులు, కౌలు రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణాలు విద్య, వైద్యం ఖర్చు. అందుకే గొప్ప పథకాలైన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104 అమలు చేశారు. 

ఒక్క రూపాయి పన్ను పెంచకుండా, ఒక్క రూపాయి కొత్త పన్ను వెయ్యకుండా సంక్షేమ పథకాలన్నీ అర్హులందరికీ అందించారు. రాజశేఖరరెడ్డి పాలనలో రైతులకు భూములు అమ్ముకోవలసిన అగత్యం పట్టలేదు. వారి ఆదాయాలు పెరిగాయి. దీని ఫలితంగా వ్యవసాయ కార్మికులు, చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారుల ఆదాయం కూడా పెరిగింది. ప్రకృతి ప్రేమికులు పాలకులుగా ఉంటే ప్రకృతిమాత సహకారం  ఉంటుంది. ఇందుకు నిదర్శనం ఆయన పాలన సాగించిన ఐదేళ్లపాటు సకాలంలో వర్షాలు పడ్డాయి. ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. సంక్షేమ రాజ్యం సాక్షాత్కరించింది.

వ్యాసకర్త: ఎం.వి.ఎస్‌. నాగిరెడ్డి   
రైతు విభాగం అధ్యక్షుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌

మరిన్ని వార్తలు