దేశానికే ఆదర్శంగా, పారదర్శకంగా ‘నాడు–నేడు’

15 Dec, 2020 04:37 IST|Sakshi

సందర్భం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా రూపొందించి అమలు చేస్తున్న నాడు నేడు కార్యక్రమం రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతోంది. దీని నాణ్యతలో ఎక్కడా రాజీపడలేదు. నాడు నేడు సామగ్రి మొత్తం మార్కెట్లో పేరు మోసిన బ్రాండ్లే. ఉదాహరణకు జాగ్వర్‌ బాత్రూం ఫిట్టింగ్స్‌ని కనీసం మధ్య తరగతి వారు కూడా తమ ఇళ్లలో వాడే పరిస్థితి లేదు. అలాంటి ఖరీదైన బ్రాండ్లు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో వాడుతున్నారు. ప్రతి సెకనుకు ఎంత ఖర్చు అవుతుందో అత్యంత పారదర్శకంగా http://nadunedu.se.ap.gov.in/STMS Works// ద్వారా చూడవచ్చు.
 
ఇంగ్లిష్‌ మీడియం విషయంలో రాష్ట్రంలో ఒక విచి త్రమైన వైరుధ్యమైన పరిస్థితి నెలకొని ఉంది. ఇంగ్లిష్‌ మీడియంపై తల్లిదండ్రులకు వల్లమాలిన అభిమానం ఉంది. దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాలలు బలహీనపడటానికి ఇది ప్రధాన కారణం. రాష్ట్రంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలలు, 15 వేల ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. అయితే విద్యార్థుల సంఖ్యలో ప్రైవేట్‌ పాఠశాలలు ప్రభుత్వ బడులతో పోటీగా ఉన్నాయి. కానీ ఇన్ని దశాబ్దాలుగా ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం కొనసాగుతున్నా తెలుగు భాష అంతరించిపోతుందని ఎవరూ ప్రశ్నించలేదు. అదే బడుగు బలహీన వర్గాలకు ఇంగ్లిష్‌ మీడియం అనగానే వారికి తెలుగు భాషపై మమకారం పుట్టుకొచ్చింది. ప్రాథమిక దశలో విద్యాబోధన పరాయి భాషలో జరిగితే పిల్లలు కాన్సెప్ట్‌ అర్థం చేసుకోలేరు అని మేధావులు వాదిస్తున్నారు. మరి ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు కాన్సెప్ట్‌ అవసరం లేదా? ఇదే లాజిక్‌ ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం చదివిన విద్యార్థులకు అధిక విషయావగాహన ఉండాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నత చదువుల్లో వాళ్లే ముందు ఉండాలి. వాస్తవ పరిస్థితి అందరికీ తెలుసు. మీడియం, కాన్సెప్ట్‌ అంశాలను పక్కన పెడితే పేదరికం వల్ల విద్యార్థులకు సమాన అవకాశాలు లేకుండా పోవడం న్యాయమేనా?

నాలుగైదేళ్ల పిల్లల్లో మెదడు ఎదుగుదల అధికంగా ఉంటుందని ఇది చాలా కీలకమైన దశ అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫీజు కట్టే స్తోమత ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎల్‌కేజీ, యూకేజీ కోసం ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. బడుగులకు ఉన్న అవకాశం అంగన్‌వాడీ కేంద్రాలు. ఇప్పుడు వీటిలో బోధన అంతంత మాత్రమే. ఇది కేవలం పౌష్టికాహారాన్ని అందించే కేంద్రాలుగా ఉపయోగపడుతున్నాయి. అయితే వైఎస్‌ జగన్‌ వీటి దశ దిశ మార్చడానికి నడుం బిగించారు. రాష్ట్రంలోని దాదాపు 55 వేల అంగన్‌వాడీ కేంద్రాలు వైఎస్సార్‌ ప్రాథమిక పాఠశాలలుగా రూపు మార్చుకోనున్నాయి. అత్యంత సుందరంగా పిల్లలను ఆకర్షించే విధంగా రూపుదిద్దుకోనున్నాయి. అంగన్‌ వాడీ కేంద్రాలకు కూడా నాడు నేడు అమలు చేయనున్నారు. వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో అమలు చేయవలసిన సిలబస్‌ కోసం దేశదేశాల పాఠ్యాంశాలను నిపుణులతో అధ్యయనం చేయించారు.

రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల నాణ్యత ప్రమాణాలు పెంచడానికి ప్రాథమిక, ఉన్నత విద్య నియంత్రణ–పర్యవేక్షణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. జాతీయ విద్యా విధానం– 2020 అన్ని రాష్ట్రాల కమిషన్లను ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే అది ఇంకా ముసాయిదా దశలో ఉన్నప్పుడే ఏపీ సీఎం ఈ కమిషన్లను ఏర్పాటు చేయడం ఆయన దార్శనికతకు నిదర్శనం. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం అయిన తర్వాత విద్యార్థులకు నాణ్యమైన వసతులు సౌకర్యాలు అందేలా చేయడంలో ఈ కమిషన్లు కీలకపాత్ర వహించనున్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌కి విద్య పట్ల ఉన్న చిత్తశుద్ధి ఒక నవశకానికి నాంది పలుకుతోంది. రాబోయే కాలంలో కామన్‌ స్కూల్‌ సిస్టమ్‌ కల నెరవేరవచ్చు. కలెక్టర్‌ పిల్లలు, పేదవాడి పిల్లలు ఒకే బడిలో చదివే రోజులు మరెంతో దూరంలో లేదని అనిపిస్తుంది. ఒక సరికొత్త ఉదయం కోసం ఈ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తోంది. దశాబ్దాల తర్వాత చరిత్ర ఒక మలుపు కోసం రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌ విద్యారంగానికి ఉజ్వల భవిష్యత్తు తప్పకుండా ఉంది. 

 వ్యాసకర్త కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌
ఆలూరు సాంబశివారెడ్డి 

మరిన్ని వార్తలు