ఈసారి వైట్‌హౌస్‌ ఎవరి సొంతం?

24 Oct, 2020 00:33 IST|Sakshi
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, జో బైడెన్‌

విశ్లేషణ 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గతంలో కీలక ఘట్టంగా భావించే ప్రధాన అభ్యర్థుల మధ్య తుది డిబేట్‌ ముగిసింది. పోలింగ్‌ పది రోజుల్లో పూర్తవుతుంది. బైడెన్‌ గెలిస్తే మధ్య తరగతి ప్రజలపై పన్నులు ‘రెండు, మూడు, నాలుగు రెట్ల వరకూ పెంచేస్తారు’ అని ట్రంప్‌ తన ప్రసంగాల్లో హెచ్చరిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో జయాపజయాలు నిర్ణయించే మధ్య తరగతికి బైడెన్‌ నుంచి పన్నుల భయం వెంటాడడం ట్రంప్‌కు కలిసొచ్చే అంశం. బైడెన్‌ గెలిస్తే ఇతర దేశాల నుంచి అమెరికాకు అవసరం లేని, తగినన్ని నైపుణ్యాలు లేని వారు పెద్ద సంఖ్యలో వస్తారనీ, దేశం కమ్యూనిజం వైపు పయనిస్తుందన్న ట్రంప్‌ మాటలను నమ్మే జనం ఇంకా ఉన్నారు. అయితే వారు ఆయన్ని గెలిపించేంత సంఖ్యలో ఉన్నారా అనేది ప్రశ్న. ఈ 59వ అధ్యక్ష ఎన్నికల్లో దేశాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి గెలిచి వైట్‌హౌస్‌లో కొనసాగుతారో, డెమొక్రాట్‌ జోసెఫ్‌ బైడెన్‌ విజయం సాధించి 46వ ప్రెసిడెంట్‌ అవుతారో నవంబర్‌ నాలుగున తేలిపోతుంది.

కిందటి ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి డెమొ క్రాటిక్‌ పార్టీ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారని ఎన్నికల సర్వేలు చెబుతున్నాయి. 2016లో తొలి మహిళా అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌.. రిప బ్లికన్‌ ప్రత్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై సునాయాసంగా గెలిచేంత ఆధిక్యం సాధించారని అప్పటి ఒపీనియన్‌ పోల్స్‌ సూచిం చాయి. ఆ ఎన్నికల్లో హిల్లరీ ట్రంప్‌ కన్నా రెట్టింపు మొత్తంలో ఎన్నికల నిధులు సేకరించగలిగారు. ఇప్పుడు ట్రంప్‌ కంటే మూడు రెట్లు ఎక్కువగా బైడెన్‌ ఖాతాలో ఎన్నికల నిధులున్నాయి. కిందటి పోలింగ్‌ రోజు ఎగ్జిట్‌ పోల్స్‌ సైతం హిల్లరీకే విజయం త«థ్యమని స్పష్టం చేశాయి. చివరికి అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ ట్రంప్‌ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అనుకూల సర్వే ఫలితాలు, పుష్కలంగా ఎన్నికల నిధులు, ట్రంప్‌ నాలుగేళ్ల గందరగోళ పాలన వంటి అంశాల ఆధారంగా బైడెన్‌ కచ్చితంగా గెలుస్తారనే నమ్మకం ఎన్నికల పరిశీలకుల్లో కనిపించడం లేదు. తనకు వ్యతిరేక పరిస్థితు లున్నాయని మీడియా, రాజకీయ పండితులు చెబుతున్నా గెలుపు తన దేన్నట్టు ట్రంప్‌ మాట్లాడుతున్నారు. ఏ మూలనో ఓటమి అనుమానం ఉన్న కారణంగా తాను ఓడిపోతే అమెరికాకు అంతా కీడే జరుగుతుం దని హెచ్చరిస్తూ, పరాజయం పాలయ్యాక దేశం విడిచిపోతాననే వరకూ వెళ్లారు ట్రంప్‌. 

ముందస్తు భారీ ఓటింగ్‌తో ఉత్కంఠ
ట్రంప్, బైడెన్‌ మద్దతుదారులు కోవిడ్‌–19 మహమ్మారితోపాటు రాజ్యాంగం కల్పించిన వెసులుబాటుతో ముందస్తు పోలింగ్‌లో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. గురువారం సాయంత్రానికి పోలింగ్‌ కేంద్రాల్లో, మెయిల్‌ ద్వారా ఓట్లేసిన ఓటర్ల సంఖ్య దాదాపు నాలుగు కోట్ల 75 లక్షలు దాటిపోయింది. వారిలో సగం మంది బైడెన్‌ మద్దతు దారులని, 25 శాతం మంది ట్రంప్‌కు ఓటేశారని సర్వేల అంచనా. కరోనావైరస్‌ 33 కోట్లమంది అమెరికన్లను ఈ ఏడాది మార్చిలో నలు వైపుల నుంచి చుట్టుముట్టే వరకూ ట్రంప్‌కు అనుకూలంగా జనాభి ప్రాయం ఉంది. ఆయన 2017 జనవరి 20న పదవి చేపట్టినప్పటి నుంచి మార్చి వరకూ కొత్త ఉద్యోగాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా ముందుకు సాగుతోంది. ఫలితంగా ట్రంప్‌ మరో 4 సంవత్సరాల పాలన ఖాయమనే అంచనాలను కరోనా తారు మారు చేస్తుందేమోననే అనుమానాన్ని తాజా పరిణామాలు బలపరి చేలా కనిపిస్తున్నాయి. 

కరోనా వైరస్‌ సోకి దాదాపు మూడు లక్షల మంది అమెరికన్లు మరణించారని అంచనా. మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభం వల్ల దేశంలో నేడు నిరుద్యోగం 14 శాతం దాటింది. ట్రంప్‌ ఈ పరిణా మాల వల్ల తనకు ఎన్నికల్లో నష్టమని భావించడం లేదు. మొదట్నించీ ట్రంప్‌ కరోనాను ప్రమాదకరమైన వైరస్‌ కాదనే రీతిలో మాట్లాడారు. తాను మాస్క్‌ చాలా నెలలు ధరించకపోవడమేగాక, ప్రజలకు కూడా దాని అవసరం లేదని చెప్పారు. చివరికి ఇటీవల కోవిడ్‌ వైరస్‌ సోకినా ఆస్పత్రిలో త్వరగా కోలుకుని నాలుగు రోజులకే బయటికొచ్చేశారు. స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు పెద్దపీట వేసే అమెరి కన్లలో ఎక్కువమందికి మాస్క్‌ పెట్టుకోవడం, ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ పేరిట కార్యకలాపాలు బంద్‌ చేయడం నచ్చలేదు. లాక్‌డౌన్‌ వల్ల ప్రాణాలు కాపాడుకునే విషయం దేవుడెరుగు, పనీపాటా లేక తమ ఉపాధి కోల్పోయామనే భావన సాధారణ జనంలో నెలకొంది. ఇలాంటి అమెరికన్లకు లాక్‌డౌన్‌ అనవసరమనే ట్రంప్‌ ధోరణి తమకు అనుకూలంగా ఉందనిపిస్తోంది. కరోనా అదుపులోకి రాకముందే లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించా లని ట్రంప్‌ రాష్ట్రాలపై ఒత్తిడి చేయడం కూడా గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల ప్రజలను ఆకట్టుకుంది.

ఈ అంశాలు దృష్టిలో పెట్టుకునే ట్రంప్‌ రెండ్రోజుల క్రితం ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ,‘‘ట్రంప్‌ సూపర్‌ రికవరీకి (కోవిడ్‌ నుంచి నాలుగు రోజులకే కోలుకుని ప్రచారంలోకి దూకడం), బైడెన్‌ కుంగుబాటుకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి’’ అని ప్రకటించారు. కరోనా అదుపు విషయంలో అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫాచీ ధోరణిని దుయ్యబడుతూ ఆయనను మూర్ఖుడని ట్రంప్‌ దూషిం చారు. అయినా, ఈ మహమ్మారి విషయంతో తన చర్యలు, ప్రవర్తన సగటు అమెరికన్లకు నచ్చాయన్న ధీమా ట్రంప్‌లో కనిపిస్తోంది. కోవిడ్‌–19తో తాను ఎన్నికల్లో నష్టపోయేది లేదనే ఆయన అంచనా వేస్తున్నారు. ఇంకా ఓటేయని ట్రంప్‌ మద్దతుదారుల్లో ఉన్న ఉత్సాహం బైడెన్‌ సానుభూతి పరుల్లో లేదని కూడా కొన్ని సర్వేలు సూచిస్తు న్నాయి.

‘కమలా హ్యారిస్‌ మీ మొదటి మహిళా ప్రెసిడెంట్‌ కాజాలరు’
మొన్న పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో, ‘‘కమలా, కమలా.. మీ మొదటి మహిళా అధ్యక్షురాలు కాలేరు. మీరు అలా జరగనివ్వకూడదు!’’ అంటూ ఓటర్లను రెచ్చగొట్టేరీతిలో ట్రంప్‌ మాట్లాడారు. ఒకవేళ డెమొక్రాట్‌ బైడెన్‌ గెలిచి రెండేళ్లకే కన్ను మూస్తే–రాజ్యాంగం ప్రకారం వైస్‌ ప్రెసిడెంట్‌ పదవిలో ఉండే కమలా హ్యారిస్‌ అధ్యక్షురాలయ్యే ప్రమాదం ఉందని ట్రంప్‌ ఇలా పరోక్షంగా ప్రజలను హెచ్చరిస్తున్నారు. సగం భారతీయ, మరో సగం ఆఫ్రికన్‌ మూలాలున్న కమల అమెరికా అధ్యక్షురాలైతే దేశం నాశనమౌతుందని ఆయన భయపెడుతున్నారు. ఇంకా, బైడెన్‌ గెలిస్తే మధ్య తరగతి ప్రజలపై పన్నులు ‘రెండు, మూడు, నాలుగు రెట్ల వరకూ పెంచేస్తారు’ అని కూడా ట్రంప్‌ తన ప్రసంగాల్లో హెచ్చరిస్తున్నారు. అధ్యక్ష ఎన్ని కల్లో జయాపజయాలు నిర్ణయించే మధ్య తరగతికి బైడెన్‌ నుంచి పన్నుల భయం వెంటాడడం ట్రంప్‌కు కలిసొచ్చే అంశం. దేశంలోకి చదువుల పేరుతో, ఉద్యోగాల కోసం వచ్చే విదేశీయుల వలసలను కట్టడి చేస్తానంటూ 2016 ఎన్నికల్లో స్థానిక అమెరికన్ల ఓట్లను కొల్ల గొట్టారు ట్రంప్‌. ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా హెచ్‌1బీ, ఇతర వీసాల జారీని కఠినతరం చేశారు. 
ఈ నాలుగేళ్లలో విదేశాల్లో పుట్టి అమెరికాకు వరదలా వచ్చిపడే వారి సంఖ్యను ట్రంప్‌ గణనీయంగా తగ్గించగలిగారు. అగ్రరాజ్యంలో పెరుగుతున్న పేదరికం, ప్రపంచీకరణ వల్ల అమెరికాలో ఫ్యాక్టరీలు మూతబడిన నేపథ్యంలో ఆసియా దేశాల నుంచి వస్తు, సేవల దిగు మతులు పెరగడాన్ని ట్రంప్‌ కట్టడి చేశారు. దీంతో ట్రంప్‌నకు దేశంలో మూడో వంతు జనం గట్టి మద్దతుదారులయ్యారు. చైనా విషయంలో ట్రంప్‌ వైఖరి ఈ వర్గం ప్రజలను ఆకట్టుకుంటోంది. బైడెన్‌ గెలిస్తే ఇతర దేశాల నుంచి అమెరికాకు అవసరం లేని, తగినన్ని నైపుణ్యాలు లేని వారు పెద్ద సంఖ్యలో వస్తారనీ, దేశం కమ్యూనిజం వైపు పయని స్తుందన్న ట్రంప్‌ మాటలను నమ్మే జనం ఇంకా ఉన్నారు. అయితే, వారు ఆయనను గెలిపించేంత సంఖ్యలో ఉన్నారా అనేది నవంబర్‌ మొదటి వారంలో మాత్రమే తేలుతుంది. 

ఫలితాలు వచ్చే వరకూ విజేతపై సస్పెన్స్‌ తప్పదు!
మాజీ ఉపాధ్యక్షుడు బైడెన్‌ గెలుస్తారని ఎన్నికల సర్వేలు, ట్రంప్‌దే విజయమని రాజకీయ జ్యోతిష్యులు చెబుతున్నా మునుపెన్నడూ లేనంత ఉత్కంఠను అమెరికా అధ్యక్ష ఎన్నికలు రేకెత్తిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం దేశ అధికార పీఠాలకు ‘బయటి వ్యక్తి’గా ప్రచారం చేసుకుని ట్రంప్‌ గెలిచారు. కానీ, వైట్‌హౌస్‌లో కూర్చుని ఇన్నేళ్లు పాలించాక ఆయనకు గొప్ప పాలకుడనే పేరైతే రాలేదు. సరిగ్గా ఎన్నికల ఏడాదిలోనే కష్టాలు చుట్టుముట్టాయి. ఒకవేళ ఓడిపోతే, గత 32 ఏళ్ల అమెరికా ఎన్నికల చరిత్రలో ఒకసారి మాత్రమే అధ్యక్ష పదవికి ఎన్నికైన జేమ్స్‌(జిమ్మీ) కార్టర్, జార్జి హెచ్‌ డబ్ల్యూ బుష్‌ (సీనియర్‌ బుష్‌) జాబితాలో ట్రంప్‌ చేరతారు. అలాగే, జో బైడెన్‌ విజయం సాధిస్తే రెండో రోమన్‌ కేథలిక్‌ అధ్య క్షుడిగా రికార్డుకెక్కుతారు. (1960 ఎన్నికల్లో 43 ఏళ్ల వయసులో గెలిచిన జాన్‌ ఎఫ్‌ కెనడీ మొదటి కేథలిక్‌) అంతేగాక, ఉపాధ్యక్షునిగా పనిచేసి అధ్యక్షుడైన నేతగా సీనియర్‌ బుష్‌ తర్వాత 32 ఏళ్లకు బైడెన్‌ పేరు చరిత్రకెక్కుతుంది. కాకతాళీయమైనా మరో ఆసక్తికర విషయం ఏమంటే–1946లో పుట్టిన ముగ్గురు నేతలు అమెరికా అధ్యక్షుల య్యారు. ఆ ఏడాది ట్రంప్‌ కన్నా కొన్ని నెలలు ఆలస్యంగా పుట్టిన బిల్‌ క్లింటన్, జార్జి డబ్ల్యూ బుష్‌ (జూనియర్‌ బుష్‌) రెండుసార్లు అధ్యక్షుల య్యారు. మరి ఇదే ఆనవాయితీ కొనసాగితే ట్రంప్‌ కూడా 2020లో గెలవాలని ఆయన అభిమానులు ఆశపడుతున్నారు.


ఎం. నాంచారయ్య

వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు
మొబైల్‌ : 79819 42329

మరిన్ని వార్తలు