ఆత్మవిశ్వాసానికి నిండైన రూపం!

28 May, 2022 00:37 IST|Sakshi

సందర్భం

తెలుగు సినీ వినీలాకాశంలో రారాజుగా వెలుగొందుతున్న సమయంలో ‘ఢిల్లీ’ కాళ్లకింద తెలుగువాడి ఆత్మగౌరవం నలిగిపోతుంటే చూసి రగిలిపోయారు ఎన్టీఆర్‌. అందుకే రాజకీయ రంగప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ‘తెలుగువారి ఆత్మ గౌరవ’ నినాదంతో కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో అధికార పీఠాన్ని అధిరోహించారు. ‘రెండు రూపాయలకు కిలో బియ్యం’ ‘పేదలకు పక్కా ఇళ్ళు’ వంటి పథకాలు, బీసీలకు 29 శాతం అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించారు. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి బీసీలకు 50 శాతం అవకాశాలు కల్పిస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే – ఈ ఇద్దరు వ్యక్తులకూ శత్రువు ఒకరే కావడం!

‘‘నేను అవమానాల పాలైనప్పుడల్లా
మీరు గౌరవంతో కిరీటం పెట్టారు
నన్ను దుమ్మెత్తి పోస్తున్నప్పుడు
నా నిజాయితీ ఆదర్శంపట్ల విశ్వాసం ప్రకటించారు
నన్ను నియంతృత్వపు ఉక్కుపాదాల క్రింద నలుపుతున్నప్పుడు
మీ నాయకుడిగా గుర్తించారు
నన్ను నేను సమర్థించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు
మీరు నన్ను సమర్థించారు
ప్రతి సామాన్యమైన రీతిలో అత్యల్ప మానవునిగా
సేవ చేయుటయే గర్వంగా భావిస్తుంటే
మీరు నన్ను పైకెత్తి ప్రపంచం ముందు
మీ ప్రతినిధిగా నిలబెట్టారు’’

అనీబిసెంట్‌ ఇంగ్లిష్‌లో రాసిన కవిత అంటూ 1989లో తెలుగు దేశం పార్టీ ఓడిపోయాక గండిపేట ‘తెలుగు విజయం’ ఆఫీసులో జరిగిన పార్టీ మీటింగులో ఎన్టీఆర్‌ గారు ఈ కవితను వినిపించారు.పార్టీ పట్ల, సభ్యుల పట్ల, ప్రజల పట్ల ఆయనకున్న అపారమైన విశ్వాసాన్ని తనవారే భగ్నం చెయ్యటం ఆయన ఊహించని విషయం. చివరకు తనవారి చేతిలో ఘాతుకానికి బలైపోవటానికి కారణాలు ఆయన మంచితనం, నిష్కాపట్యమే తప్ప మరొకటి కాదు. అటు వంటి నాయకుడిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ వెన్నుపోటుదార్లుగా చరిత్ర ఉన్నంతవరకూ ఉంటారు. ఆయన వ్యక్తిగత జీవితం, సినిమా, రాజకీయ జీవితాలు పరిశీలిస్తే మాట తప్పని మనిషిగా, పేదవర్గాల పట్ల సానుభూతి ఉన్న నాయకుడిగా నమ్మి వచ్చిన స్త్రీకి తాళికట్టి గౌరవాన్ని కాపాడిన మేరు నగ ధీరుడిగా కన్పిస్తారు. ఎన్టీఆర్‌ నిజంగా చారిత్రక పురుషుడే. ఒక మనిషి జీవితంలో ఎన్ని ఆరోహణా సోపానా లుంటాయో అవన్నీ అధివసించిన వ్యక్తి. 

1923 మే 28న కృష్ణా జిల్లా, నిమ్మకూరు గ్రామంలో రైతుబిడ్డగా జన్మించి, ఉన్న ఆస్తులు పోగొట్టుకుని, కన్న ఊరుని విడిచి విజయవాడకు చేరింది ఆయన బాల్యం. తండ్రి చేసిన పాల వ్యాపారంలో తోడుగా నిలిచిన ఉత్తమ పుత్రుడు. నివసిస్తున్న పూరి పాకలో వర్షం వస్తే అది పడిపోకుండా తెల్లవార్లూ తండ్రితోపాటు నిట్టాడి కొయ్యను పట్టుకొని, కుటుంబాన్ని రక్షించుకొన్న కష్టజీవి. బ్రేకుల్లేని పాత హెర్క్యులస్‌ సైకిల్‌ మీద 60 కిలోల బరువును పెట్టుకొని పంక్చర్‌ అయిన సైకిల్‌ను నడిపించుకుంటూ 60 మైళ్ళు అర్ధరాత్రి విజయవాడ దాకా ప్రయాణం చేసిన సాహసి. స్నేహితుని వివాహానికి వెళ్లాల్సిన రైలు తప్పిపోతే ఆ పట్టాల వెంబడే 30 మైళ్ళు నడిచి వెళ్ళిన స్నేహశీలి.

అంతేకాదు, తమ్ముడు త్రివిక్రమరావుకు ‘పెదమద్దా’ వాళ్ళ అమ్మాయిని ఇస్తామని చెప్పి తీరా ముహూర్తాలు పెట్టుకునే సమయానికి రాకుండా మొహం చాటేసినప్పుడు... మధ్యవర్తుల ద్వారా త్రివిక్రమరావుకు చదువులేదు, ఆస్తి లేదు, అందువల్ల భార్యను పోషించలేడు కనుక ఈ సంబంధం వదిలేస్తున్నామని వారన్నట్లు తెలియడంతో... ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పెంపుడు తండ్రి ద్వారా తనకు సంక్రమించిన ఆస్తిని అప్పటికప్పుడే తమ్ముడి పేర మార్చి వివాహం జరిపించిన సోదర ప్రేమికుడు.

కష్టపడి బీఏ చదివి, సబ్‌ రిజిస్ట్రార్‌గా ఉద్యోగం సంపాదించి కూడా అక్కడ జరుగుతున్న అవినీతి నచ్చక ఆ ఉద్యోగం వదిలేసి సినీ రంగంలో భవిష్యత్తును వెతుక్కున్న నీతిమంతుడు. సినిమా రంగాన్ని 30 ఏళ్లకు పైగా శాసించిన కళాకారుడు. 1949లో ‘మనదేశం’లో చిన్న ఎస్సై పాత్రతో మొదలైన సినీ జీవితం అప్రతిహతంగా కొనసాగింది. సమయపాలన, అకుంఠిత దీక్ష అగ్రస్థానంలో నిలబెట్టాయి. నిర్మాతను ఎన్నడూ కష్టపెట్టలేదు. 1970 వరకు ఆయన రెమ్యునరేషన్‌ – వేలల్లోనే ఉండేది.

ప్రతి చిత్రంలో తన వేషాన్ని 6 వారాల్లోగా పూర్తి చేసేవారు. 1969 వరకు నెలకొక్క సినిమా చొప్పున చేశారు. 1964 ఒక్క సంవత్సరంలో మాత్రం 15 సినిమాలు చేసి రికార్డు సృష్టించారు. 1949 నుండి 1982 వరకు అంటే 33 సంవత్సరాల్లో సుమారు 300 సినిమాల్లో నటించారు. ఇందులో 140 చిత్రాలు వెయ్యి థియేటర్లలో 100 రోజులు ప్రదర్శితమయ్యాయి. 33 సినిమాలు 108 ప్రదర్శన శాలల్లో 25 వారాలు ప్రదర్శించబడి రజతోత్సవం జరుపుకున్నాయి. 

కళామతల్లికి ఎనలేని సేవ చేసి తన 60వ యేట రాజకీయాల్లో ప్రవేశించారు. తెలుగుభాష పట్ల మక్కువ కల్గిన ఆయన తన పార్టీకి ‘తెలుగుదేశం’ అని పేరు పెట్టుకుని, ఆత్మ గౌరవ నినాదంతో 1982 మార్చి 29న పార్టీని ప్రకటించి, కేవలం 9 నెలల్లోనే అధికారానికి తీసుకురావటం చారిత్రాత్మకం.

1965లో ఒకసారి, 1978లో రెండవసారి జరిపిన ప్రయోగాలు విఫలమై కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ శక్తి లేదనుకున్న తరుణంలో ఎన్టీఆర్‌ ఆకర్షణ ఆయన పార్టీకి బలంగా నిలబడి గెలిపించింది. నాడు కాంగ్రెస్‌ను ఎదిరించి నిలబడిన నాయకుడు ఎన్టీఆర్‌ అయితే... నేడు అదే కాంగ్రెస్‌ను రెండు రాష్ట్రాలలో మట్టి కరిపించిన ప్రజాకర్షణ మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డి గారిదే. ఇద్దరి ఆశయం ఒక్కటే. సామాజిక న్యాయం, అగ్రకులాధిపత్యంలో ఎన్నో ఏళ్లుగా నలిగి ఓటుకే తప్ప పదవికి దూరంగా ఉంచబడ్డ బడుగు, బలహీన వర్గాలను ఆదరించి అక్కున చేర్చుకుంది ఈ ఇద్దరు నాయకులే. ‘పటేల్‌–పట్వారీ’ వ్యవస్థను తొలగించి ‘మండల’ వ్యవస్థను తెచ్చి ఎన్టీఆర్‌ ప్రజల దగ్గరకు ప్రభుత్వాన్ని నడిపించారు. ‘రెండు రూపాయలకు కిలో బియ్యం’ ఇవ్వడం, పక్కా ఇళ్ళు నిర్మించడం, బీసీలకు 29 శాతం అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించారు. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి 50 శాతం అవకాశాలు ఇచ్చి ఆదుకుంటున్నారు.

ఆశ్చర్యం ఏమిటంటే – ఈ మంచి పనులు చేసిన ఇద్దరు వ్యక్తులకూ శత్రువు ఒకరే. రాజకీయం అంటే అడ్డదారులే అని నమ్మినవాడు, అవినీతిని జీవిత లక్ష్యంగా చేసుకుని సొంత మామనే అధికారం కోసం వెన్నుపోటు పొడిచి పదవిలోకి వచ్చినవాడు చంద్రబాబు. తన స్వార్థం కోసం ప్రజాస్వామ్యాన్ని 1995 ఆగస్టు 25న ఘోరంగా పాతిపెట్టిన వ్యక్తి. అతని వలన ఎంతోమంది తమ రాజకీయ జీవితాన్ని వదులుకోవలసి వచ్చింది. నాదెండ్ల దగ్గరనుండి నల్లపరెడ్డి వరకు అందరూ బలి పశువులే.

ఉన్నతమైన వ్యక్తిత్వంతో నిస్వార్థంగా ప్రజలకు మేలు చేద్దామనుకొని రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్‌ పదవినీ, పార్టీనీ లాక్కొని చెప్పులేయించాడు. చివరకు బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపచేసిన ఇటువంటి నీచ మనస్తత్వం మానవ జాతిలో కనిపించదు. అవమాన భారంతో అల్లుడి దుర్మార్గాలను ఎదిరించలేక అలసిపోయిన ఎన్టీఆర్‌... ఆడియో, వీడియోల రూపంలో చంద్ర బాబు వెన్నుపోటు తెలియజేసి చివరకు ఆక్రోశిస్తూనే 1996 జనవరి 18వ తేదీన ఈ లోకాన్ని విడిచిపెట్టారు.

‘‘ఆ పశ్చిమాశా విషాదాంత కావ్యమై వ్యాపించు కాల మేఘాళిలో’ అన్న శ్రీశ్రీ మాటలు ఈ విషాద దృశ్యానికి సాక్ష్యంగా నిలుస్తాయి. ఆయన ఆశయాల అడుగు జాడలలో నడుస్తూ, పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని బహుశా ఆయన ఆత్మ ఆశీర్వదిస్తూనే ఉంటుంది. ‘విషం కక్కే భుజంగాలో, మదం పట్టిన మాతంగాలో’ ఎవ్వరు అడ్డుపడినా జగన్‌మోహన్‌రెడ్డి తన ఆశయాల బాటలో ముందుకు సాగుతూనే ఉంటారు. ఉండాలి కూడా!


వ్యాసకర్త: డా‘‘ నందమూరి లక్ష్మీపార్వతి
రచయిత్రి, ఎన్టీఆర్‌ సతీమణి
(నేడు ఎన్టీఆర్‌ శతజయంతి సంవత్సరం ప్రారంభం)

మరిన్ని వార్తలు