సమస్యలను పక్కదారి పట్టించడానికే వైషమ్యాలు

25 May, 2022 13:02 IST|Sakshi

మోదీ ప్రభుత్వం తన విధానాలతో దేశ ప్రజలను ఎనిమిదేళ్లుగా నానా తిప్పలు పెడుతోంది. ‘అచ్ఛే దిన్‌’ అంటూ అధికారంలోకి వచ్చారు. తమ పాలనతో ‘బురే దిన్‌’ చేశారు. నిత్యావసర ధరలు వంద శాతం పెరిగాయి. ఈ సమస్యలను పక్కదారి పట్టించడానికి మైజారిటీ, మైనారిటీ వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు.

‘‘ఎక్కువ తక్కువలు, కులమత భేదాలుండటం మానవజాతికి అవమానకరం’’ 
– మహాత్మా గాంధీ

నేడు దేశాన్ని పాలిస్తున్నవారు జాతిపిత గాంధీజీ చెప్పిన మాటలకు పూర్తి భిన్నంగా వ్యవహరి స్తున్నారు. కుల, మత భేదాలు సృష్టించి దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నారు. దేశాభివృద్ధిని కోరు కుంటున్న ఏ ప్రభుత్వమైనా ప్రజలందరినీ సమాన దృష్టితో చూస్తుంది. కానీ దేశాన్ని ప్రస్తుతం పాలిస్తున్నవారి ఎజెండానే వేరు. ప్రజల మధ్య ఎంత వైషమ్యాలు పెరిగితే అది అంతగా తమకు లాభమనేది వారి ఆలోచన!  

ఇదేదో గాలికి చేస్తున్న విమర్శ కాదు. దేశంలో కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇదే అర్థమవుతుంది. ఓ వర్గం లక్ష్యంగా ఎప్పుడూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే జాతీయ పార్టీ నాయ కులు, వారికి తగ్గట్టు... ‘80 శాతం ఉన్న మనం’ అంటూ రాష్ట్రంలో యువత మెదళ్లలో మతతత్వపు పురుగును చొప్పిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి నెలకో ఇష్యూ చొప్పున తెరపైకి తెస్తున్నారు. 

జనవరిలో కర్ణాటకలో ‘హిజాబ్‌’ ఇష్యూతో దుమారం రేగింది. ఆ వివాదం నడుస్తుండగానే ‘హలాల్‌ మాంసం’ తినొద్దనీ, ముస్లింల షాపుల్లో వస్తువులు కొనొద్దనీ బీజేపీ పాలిత కర్ణాటకలో తీర్మానాలు చేశారు. అది సద్దుమణిగే లోపే ఫిబ్రవరిలో ‘కశ్మీరీ ఫైల్స్‌’ సినిమాతో మరో అగ్గి రాజేశారు. కశ్మీర్‌లో పండిట్లు, ఇతర వర్గాల మధ్య ఓ స్పష్టమైన విభజన రేఖను సృష్టించారు. ఈ సినిమాకు ప్రధానమంత్రి, హోంమంత్రి, కేంద్ర మంత్రులు ప్రచారకర్తలయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచితంగా సినిమా షోలు నడిపించాయి. దీనిని బట్టి... బీజేపీది విభజన వాదమనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏప్రిల్‌లో మహారాష్ట్రలో హనుమాన్‌ చాలీసా, లౌడ్‌ స్పీకర్లు అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మే నెలలో ఢిల్లీ షాహీన్‌ బాగ్‌ కూల్చి వేతలు మొదలు, తాజ్‌ మహల్, జ్ఞానవాపి మసీదు ఇష్యూ... వరకు అన్నీ ఓ వర్గాన్ని టార్గెట్‌ చేస్తున్న అంశాలే! 

ఎందుకీ రాద్ధాంతం? 
గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (జీఎస్టీ), నోట్ల రద్దు, కార్పొరేట్‌ల అనుకూల విధానాలు వంటివాటితో గత ఎనిమిదేళ్లలో ఘనత వహించిన మోదీ ప్రభుత్వం చేసిందేం లేదు. 8 ఏళ్ల క్రితం ‘అచ్ఛే దిన్‌’ (మంచిరోజులు) అంటూ అధికారంలోకి వచ్చారు. ఈ కాలంలో... ఉన్న అచ్చే దిన్‌ కాస్తా  ‘బురే దిన్‌’ (చెడ్డ దినాలు) అయ్యాయి. పేదవాడు ఓ పూట బుక్కెడు బువ్వ తినాలంటే ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన దుస్థితి దాపురించింది. 

నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. మోదీ ప్రధాని అయినప్పటి నుంచీ ఇప్పటివరకు చూసుకుంటే వంట నూనె, పెట్రోల్, డీజిల్‌ ధరలు వంద శాతం పెరిగాయి. రూపాయి విలువ దిగజారిపోయింది. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర 2014లో రూ. 414 గా ఉంటే... ఇప్పుడు రూ. 1,052కు పెరిగింది. లీటర్‌ పెట్రోల్‌ ధర 2014లో రూ. 71 ఉంటే ఇప్పుడు రూ. 120కి పెరిగింది. లీటర్‌ డీజిల్‌ ధర 2014లో రూ. 55 ఉంటే ఇప్పుడు రూ.105కు పెరిగింది. ఇటీవల నామ్‌ కే వాస్తే కొంత తగ్గించారు. ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. 42 ఏళ్లలో దేశ ఆర్థికవ్యవస్థ ఎన్నడూ లేనంత అత్యంత దారుణమైన పరిస్థితికి పడి పోయింది. నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ఠానికి పెరిగింది. 

కరోనా కాలంలో ఇచ్చిన ఉచిత రేషన్‌ తప్ప... కేంద్రం నుంచి పేదవాడికి వచ్చింది ఏమీ లేదు. రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వస్తున్న ధనమంతా ఎక్కడపోతోంది? దాదాపు 25 ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మేశారు. మొత్తం 36 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉప సంహరణ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం తలమునకలై ఉంది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఆ ఆమ్దానీ అంతా ఎటు పోయింది? 

ఇప్పుడు దేశ ప్రజలు అడుగుతున్న ఈ ప్రశ్నలకు మోదీ సర్కారు దగ్గర సమాధానం లేదు. జవాబు చెప్పలేనప్పుడు... జవాబు చెబితే పదవి పోయే పరిస్థితి అయినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మోదీ సర్కారు చేస్తున్న పనే చేయాలి. అసలు విషయాన్ని పక్కదారి పట్టించాలి. కొత్తగా బలమైన అంశాన్ని తెరపైకి తీసుకురావాలి. అది కూడా మెజార్టీ ప్రజలకు సంబంధించిన అంశమై ఉండాలి. సున్నితమైన అంశమైతే పాత విషయం మరిచిపోవడమే కాదు... మైలేజీ పెరుగుతుంది. ఇప్పుడు మోదీ సర్కారు నూటికి నూరు శాతం చేస్తున్నది ఇదే. (👉🏾చదవండి: ఇవాళ మనకు కావాల్సింది ఇదీ!)

బీజేపీ చేస్తున్న ఈ మతరాజకీయాన్ని ఆదిలోనే తుంచేయకుంటే దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. భరతమాతకు మతం పేరుతో బీజేపీ వేస్తున్న సంకెళ్లను తెంచడం మనందరి బాధ్యత. (👉🏾చదవండి:​​​​​​​ కోటి ఎకరాల మాగాణి కల నిజమౌతుంది!)


- వై. సతీష్‌ రెడ్డి 
తెరాస రాష్ట్ర సోషల్‌ మీడియా కన్వీనర్‌

మరిన్ని వార్తలు