ప్రతిపక్షాల ఐక్యత గాలిలో దీపమేనా?

3 Jul, 2021 01:12 IST|Sakshi

బీజేపీని ఇప్పటికిప్పుడు అధికారానికి దూరం చేయడానికి దేశం సిద్ధంగా లేదు. మోదీని ఎన్నికల్లో తిరస్కరించగలిగేంత స్థాయిలో అసంతృప్తి కూడా ప్రజల్లో ఇప్పటికైతే లేదు. యావద్దేశానికి నమ్మకం, దార్శనికతతో కూడిన సందేశం ఇచ్చే శక్తి ప్రతిపక్షానికీ లేదు. దేశభవిష్యత్తుకు హామీ ఇచ్చే నేతలు మనకు ఇప్పుడు అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే దేశానికి ఇప్పుడు విపక్షం కాదు... ప్రతిపక్షం అవసరం. విపక్షం అనేది అధికారం మీదే దృష్టి పెడుతుంది. అదే ప్రతిపక్షం జాతీయ ప్రయోజనానికి అనుగుణంగా వ్యవహరిస్తుంది. విపక్షం ఎన్నికల సమయంలో మాత్రమే చురుగ్గా ఉంటుంది. ప్రతిపక్షం అన్ని కాలాల్లో శక్తిమంతంగా, విమర్శనాత్మకంగా ఉంటుంది.

దేశంలో ప్రతిపక్షాల మధ్య ఐక్యత ప్రస్తుతం అత్యంత బడాయితో కూడిన భావనగా ఉంటోంది కానీ ఎవరికి వారు ముందే సొంతం చేసుకుంటున్న నిరుపయోగకరమైన ఆలోచనగా అది మారిపోయింది. ప్రస్తుత భారత రాజ కీయాల సంధి దశలో ఇది ఒక సంక్లిష్టమైన ప్రశ్నగానూ, అదేసమయంలో ఒక నిరర్థకమైన అన్వేషణగానూ ఉంటోంది. ప్రత్యేకించి గడచిన మాసంలో ఇది రాజకీయ పార్టీలన్నింటికీ ఇష్టమైన సుగంధ పరిమళంగా మారిపోయింది. ప్రధానంగా పశ్చిమబెంగాల్‌లో బీజేపీని మమతా బెనర్జీ ఓడించడంతో ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తుకు కొత్త తలుపులు తెరిచినట్లయింది. అన్ని రాజకీయ పార్టీల మధ్య చర్చలకు దారితీసిన ఒక ముచ్చటైన వ్యవహారంలా ఇది తయారైంది. 

జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలనే ఏ ప్రాజెక్ట్‌ అయినా సరే.. 2019లో బీజేపీ లేదా దాని మిత్రపక్షాల కూటమికి దేశం మొత్తంలో 63 శాతం మంది ఓట్లు వేయని వాస్తవాన్నే ప్రాతిపదిక చేసుకోవలసి ఉంటుందని అర్థం చేసుకోవడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అందుకే ప్రతిపక్ష ఐక్యత కోసం ప్రయత్నాలకు మరోసారి ఇప్పుడు ఊతం దొరికినట్లయింది. ప్రధానంగా 3 అంశాల పట్ల మనకు స్పష్టత ఉంటే తప్ప ప్రతిపక్ష ఐక్యత గురించి చర్చించడం అర్థరహితమే అవుతుంది. ప్రతి పక్షంగా ఎవరిని లెక్కిం చాలి? ఎలాంటి ఐక్యత గురించి మనం మాట్లాడుతున్నాం? ముఖ్యంగా మోదీ నేతృత్వంలోని బీజేపీతో తలపడటానికి ప్రతిపక్ష ఐక్యత అనేది మనకు అవసరమేనా?ఎలాంటి ప్రతిపక్షం అవసరం?

ప్రధాని నరేంద్రమోదీని వ్యతిరేకిస్తున్న, బీజేపీని దాని ప్రస్తుత భావజాలాన్ని వ్యతిరేకిస్తున్న ఏ పార్టీనైనా, ఏ వ్యక్తినైనా ఒకటిగా చేయడమే ప్రతిపక్షం అనే భావన అసాధ్యమే కాదు.. అది వ్యతిరేక ఫలితాలను తీసుకొస్తుంది. పైగా ప్రతిపక్షం అనే విశాలమైన చట్రం పరిధిలో ఉన్న వ్యక్తులు, నేతలందరి అహాలను, ఆకాంక్షలను, ఎత్తుగడలను సామరస్యపూర్వకంగా ఐక్యపర్చడం అనేది మానవ సాధ్యం కాని పని. ఒకవేళ ఇలాంటి అద్భుతం సాధ్యపడినప్పటికీ, ఇలాంటి కూటమిని కలిపి ఉంచడం అనేది దాని రాజకీయ ప్రయోజనాలకు చాలా భారంగా పరి ణమిస్తుందన్నది స్పష్టం. మరోవైపున ఇలాంటి మొత్తం ప్రతిపక్ష ముఠాతో ఒంటరిగా పోరాడుతున్న అసహాయ వీరుడిగా మోదీ కీర్తి మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. 

ఎలాంటి ఐక్యతతో కూడిన కూటమి ఏర్పాడాలి అనే అంశాన్ని ప్రతిపక్షం చాలా తెలివిగా ఎంచుకోవలిసి ఉంది. కూటమిలో ప్రవేశించే ఇలాంటి నేతలు  తమ డిమాండ్లను చర్చల్లో తీసుకువస్తారు కూడా. గట్టిగా ఓట్లు సాధించుకుని వచ్చే వారే ఈ కూటమిలో బలమైన అభ్యర్థులుగా ఉంటారనేది స్పష్టం. అంతకుమించి కాంగ్రెస్‌ లేకుండా, అనేకసార్లు ఇప్పటికే రాష్ట్రాల్లో బీజేపీని ఓడించిన ముఖ్యమైన ప్రాంతీయ పార్టీలు లేకుండా ఏర్పడే ప్రతిపక్ష కూటమి అర్థరహితంగానే ఉంటుంది. సామూహిక లక్ష్యం కోసం వ్యక్తిగత లేక పార్టీపరమైన ఆకాంక్షలను వదులుకోవడానికి సిద్ధపడటం మాత్రమే ఇలాంటి ఐక్యతకు గీటురాయిగా ఉంటుంది. అలాగే, ప్రతిపక్షం అనే భావనకు నిర్వచనం రాజకీయ పార్టీలకు మాత్రమే పరిమితం కారాదు. పార్టీలతో సంబంధంలేని వ్యక్తులే బీజేపీ ఆధిపత్య ధోరణికి నిజమైన ప్రతిపక్షంగా ఉంటున్నారన్న వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు.

ఐక్యత అంటే ఏమిటి? 
ఒక్కసారికి మాత్రమే ఎన్నికల పొత్తును కుదుర్చుకోవడం అనే పరిధిని దాటి దీర్ఘకాలికంగా రాజకీయ ఐక్యతను కలిగి ఉండేలా ఐక్యతా భావాన్ని విస్తరింపజేయాలి. ప్రతిపక్ష ఐక్యత అంటే ఇంతవరకు సాధారణంగా ఉంటున్న అవగాహన ఏమిటంటే సీట్ల పంపకం, ఓట్లను రాబట్టడం కోసం బీజేపీయేతర పక్షాలు ఎన్నికలకు ముందస్తుగా కూటమి గట్టడం అని మాత్రమే. కానీ భారతదేశంలోని అనేక రాష్ట్రాల విషయంలో ఇలాంటి ఐక్యత అసందర్భమైనదని మనం మరిచిపోతున్నాం. ఉదాహరణకు కేరళ, పంజాబ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలను చూడండి. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికీ బలమైన శక్తిగా లేదు. పైగా బీజేపీయేతర శక్తుల మధ్య ఐక్యతకు వీటిలో కొన్ని రాష్ట్రాలు పిలుపునిస్తున్నాయి, ఆలోచిస్తున్నాయి. ఇంకా పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి బీజేపీయేతర పార్టీల ఆధిపత్యంలో ఉన్న రాష్ట్రాలకు కూటమి భాగస్వామి అసలు అవసరం లేదు.

మరోవైపున బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పరస్పరం తలపడుతున్న మధ్యప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, రాజస్తాన్‌ వంటి అనేక రాష్ట్రాలు కూడా ఉంటున్నాయి. ఇక్కడ ప్రతిపక్ష ఐక్యత లేకపోవడం అనేది సమస్యగా లేదు. ప్రతిపక్షం లేకపోవడమే ఇక్కడ అసలు సమస్య. కాంగ్రెస్‌ ఈ రాష్ట్రాల్లో బీజేపీతో తలపడలేకపోతోంది.  పైగా పొత్తు కుదుర్చుకోవడానికి బలమైన పార్టీలు కూడా ఇక్కడ దానికి అందుబాటులో లేవు. మొత్తం మీద చూస్తే కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌ వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికలకు ముందస్తుగా కూటమి ఏర్పర్చే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. 200 కంటే ఎక్కువ లోక్‌సభా స్థానాలు కలిగి ఉన్న ఈ రాష్ట్రాలకు చాలా ప్రాధాన్యం ఉంది కానీ, ఇతర రాష్ట్రాల్లో ప్రతిపక్ష ఐక్యతకు ఒక నమూనాను ఏర్పర్చే స్థాయిని కలిగిలేవు.

ఈ దశలో ఎన్నికల ఐక్యత కంటే రాజకీయ ఐక్యత అవసరం ఎక్కువగా ఉంటోంది. జాతీయ వ్యాప్తంగా ఎన్నికల కూటమికి పరి ణతి లేని, గ్రూప్‌ చర్చలు అవసరం లేదు. రాజకీయ ఐక్యతను ప్రదర్శించడం ఇప్పుడు ప్రతిపక్షానికి చాలా అవసరం. ప్రత్యేకించి బీజేపీతో ఇటీవలికాలంలో విసిగిపోయి ఉన్న ఓటర్లకు మోదీ వ్యతిరేక నేతలపై విశ్వాసం కూడా ఏర్పడుతోందంటే సందేహించాల్సిన పని లేదు. ప్రతిపక్ష నేతలు అర్థవంతంగా ఐక్యత కుదుర్చుకోగలరా అని మాత్రమే ఇలాంటి ఓటర్లు సందేహిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు మరింత మెరుగైన, సుస్థిరమైన ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పర్చగలవా అని వీరు సందేహిస్తున్నారు. కనీసం కొంత కాలమైనా ప్రతిపక్షాలు కలిసి ఉంటాయా అని వీరి సందేహం. కాబట్టి ఒక నిర్దిష్ట ప్రయోజనం, పరస్పరం ఆమోదించిన ఎజెండా, (కనీస ఉమ్మడి పథకాన్ని ఆదరాబాదరా ముందుకు తీసుకురావడం కాదు) మాత్రమే ప్రతిపక్షంలో విశ్వాసాన్ని పెంచగలదు. ఇది మాత్రమే తమ మధ్య విభేదాలను పక్కనబెట్టి తాము పాలించడానికి ప్రత్నామ్నాయ శక్తిగా ఉండగలం అనే భరోసాను ఓటర్లకు అందిస్తుంది.

ఒకటి మాత్రం నిజం.. బీజేపీని ఇప్పటికిప్పుడు అధికారానికి దూరం చేయడానికి దేశం సిద్ధంగా లేదు. మోదీని ఎన్నికల్లో తిరస్కరించగలిగేంత స్థాయిలో అసంతృప్తి కూడా ప్రజల్లో ఇప్పటికైతే లేదు. 2014లో దేశం ముందు తనకుతాను ప్రత్యామ్నాయంగా మోదీ ప్రదర్శించుకున్నంత స్థాయి ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మన ప్రతిపక్షానికి అలాంటి స్థాయి, శక్తి లేవ న్నది వాస్తవం. యావద్దేశానికి నమ్మకం, దార్శనికతతో కూడిన సందేశం ఇచ్చే శక్తి ప్రతిపక్షానికి ప్రస్తుతానికి లేదు. దేశభవిష్యత్తుకు హామీ ఇచ్చే నేతలు మనకు ఇప్పుడు అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే దేశానికి ఇప్పుడు విపక్షం కాదు ప్రతిపక్షం అవసరం. విపక్షం అనేది అధికారం మీదే దృష్టి పెడుతుంది. అదే ప్రతిపక్షం జాతీయ ప్రయోజనానికి అనుగుణంగా వ్యవహరిస్తుంది. విపక్షం ఎన్నికల సమయంలో మాత్రమే చురుగ్గా ఉంటుంది. ప్రతిపక్షం అన్ని కాలాల్లో శక్తిమంతంగా ఉంటుంది. ప్రజలతో విస్తృత సంబంధాలను ఏర్పర్చుకోవడం, యాంత్రిక అవగాహనతో కొట్టుకుపోకుండా జాగ్రత్త పడటం మన ప్రతిపక్షాల లక్షణంగా ఉండాలి. దేశ ప్రజలు మొత్తంగా విశ్వసించే స్థాయికి ప్రతిపక్షం చేరుకున్నప్పుడు అలాంటి కూటమే ఎన్నికల ప్రయోజనాలకు ప్రాతిపదికగా ఉంటుంది.


వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ సంస్థాపకులు
(‘ది ప్రింట్‌’ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు