మైనర్‌ బాలికలకు రక్షణనివ్వని ‘పోక్సో’

10 Feb, 2021 00:46 IST|Sakshi

సందర్భం

దేశంలో 18 ఏళ్ళ లోపు బాలికల సంరక్షణ కోసం 2012లో పోక్సో ప్రత్యేక చట్టం ఏర్పడింది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని శిక్షలు సరిపోనందు వల్ల ప్రభుత్వం ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫె న్సెస్‌ యాక్ట్‌ రూపొందిం చింది. కేసు తీవ్రతను బట్టి నేరస్తుడికి జీవిత ఖైదు, మరణశిక్ష కూడా విధించ వచ్చు. అయితే పోక్సో ప్రకారం శిక్ష పడ్డవారు పై కోర్టుకు వెళ్లగా వారి నేరాలను ఐపీసీ కింద జమకట్టి శిక్షలను తగ్గించడం ఆందోళన కలిగిస్తోంది.

జనవరిలో బొంబాయి హైకోర్టులోని నాగపూర్‌ బెంచి అడిషనల్‌ జడ్జి పుష్ప వీరేంద్ర గణేదివాలా  పోక్సో చట్టం ప్రకారం శిక్షించిన కేసుల్లో సరైన ఆధారాలు లేవని, అవి ఐపీసీ కిందికి వస్తాయని శిక్షలు తగ్గిస్తూ తీర్పిచ్చారు. లోపలికి వస్తే జామపండు ఇస్తా నని పన్నెండేళ్ల బాలికను 39 ఏళ్ల వ్యక్తి ఇంట్లోకి తీసు కెళ్ళి ఆమె ఛాతీపై నొక్కడంతో బాలిక భయపడి అరవ డంతో దొరికిపోయాడు. ఆయనకు పోక్సో చట్టంలో కనిష్టమైన 3 ఏళ్ల శిక్ష పడింది. పై కోర్టుకు అప్పీలుతో అదే కేసు జడ్జి పుష్ప ముందుకు వచ్చింది. చర్మానికి చర్మం తాకితేనే, అంటే రెండు శరీరాల పరస్పర స్పర్శ అయినట్లు రుజువైతేనే అది పోక్సో చట్టం,సెక్షన్‌ 7 కింద నేరమవుతుందని, అలాంటిదేదీ లేనందువల్ల ఈ నేరం ఐపీసీ సెక్షన్‌ 354 కిందికి వస్తుందని చెప్పి శిక్షను ఏడాదికి మార్చారు. 

యాభై ఏళ్ల మగమనిషి అయిదేళ్ల బాలిక చేయిని గట్టిగా అదిమి పట్టుకొని మరో చేత్తో ప్యాంట్‌ జిప్‌ తెరిచాడు. బాలిక అరవడంతో ఆమె తల్లి వచ్చి బాలి కను విడిపించి పోలీసులకు ఫిర్యాదు  చేసింది. కోర్టు విచారణలో అతడు మర్మాంగాన్ని బయటికి తీసింది తాను చూశానని తల్లి వివరించింది. సెషన్సు కోర్టు ఈ కేసును పోక్సో సెక్షన్‌ 10కి చెందిన నేరంగా స్వీకరించి ముద్దాయికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 25,000 జరిమానా లేదా మరో 6 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. అప్పీలుపై తన దగ్గరికి వచ్చిన ఈ కేసును జడ్జి పుష్ప విచారించారు. బాలికపై లైంగిక దాడి అంటే స్త్రీ పురుషుల మర్మాంగాలు ఒకటికొకటి తాకినట్లు రుజువులుండాలని, ఈ నేరానికి పోక్సో చట్టం 8, 10, 12 సెక్షన్లు వర్తించవని శిక్షను మూడేళ్లకు పరిమితం చేశారు.

అయితే జడ్జి పుష్ప తీర్పుల పట్ల ప్రజల నిరసనను పరిశీలించిన సుప్రీంకోర్టు జనవరి 27న  వీటిపై స్టే ఇచ్చింది. అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ సైతం ఈ తీర్పులు రాబోయే కాలంలో ప్రమాదకరంగా మారు తాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అడిషనల్‌ హోదాలో ఉన్న జడ్జి పుష్పను అదే పదవిలో శాశ్వతంగా నియమించాలని జనవరి 20న సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని 27న వాపసు తీసుకుంది. ఆమెపై ఎలాంటి వ్యక్తిగత వ్యతిరేకత లేదని, ఆమె న్యాయవాదిగా ఇలాంటి కేసులతో వ్యవహరించి ఉండకపోవచ్చునని, మరింత శిక్షణ, అవగాహన అవసరమున్నందువల్ల ఇలా చేయవలసి వచ్చిందని సుప్రీం వివరణ ఇచ్చింది.

అయితే జడ్జి పుష్ప గణేదివాలా విద్యాధికురాలు. చదువులో గోల్డ్‌ మెడలిస్ట్‌. న్యాయశాస్త్ర బోధకురాలు. ప్రాక్టీసులో ఉన్నప్పుడు పలు బ్యాంకులకు ప్యానెల్‌ అడ్వొకేట్‌గా ఉన్నారు. 2007 నుండి జడ్జిగా ఉంటూ పలు కీలక తీర్పులిచ్చారు. ఖైదీలకు పెరోల్‌ మంజూరు వారికున్న పరిమిత హక్కు అని, అది అధికారుల నిర్ణయంపై ఆధారపడే విషయం కాదని 2019లో తీర్పి చ్చారు. కరోనా సోకిన గర్భిణిని డెలివరీకి హాస్పిటల్‌లో చేర్చుకోని విషయం తెలుసుకొని ఆమెకు వైద్య సదు పాయాలు అందించమని ఆదేశించారు. ముంబై ఫ్యామిలీ కోర్టు జడ్జిగా ఎన్నో పెండింగు కేసులను పరి ష్కరించారు. ఈ నేపథ్యం గల న్యాయమూర్తి ఇలాంటి తీర్పులివ్వడానికి కారణం పోక్సో చట్టంలోని లొసుగు లేననే వాదన ఒకటుంది. ఆ చట్టంలో అత్యా చారానికి శిక్ష ఉంది గానీ, ప్రయత్నానికి ఎలాంటి వివరణ లేదని అంటున్నారు. అందువల్ల వీటిని ఉద్దేశపూర్వకంగా వక్రీకరించే అవకాశం కూడా ఉంది. పోక్సో చట్టానికి తూట్లు పొడిచే విధంగా మరిన్ని తీర్పులు రాకముందే పకడ్బందీ సవరణలు చేయాలి.


బి. నర్సన్‌ 
వ్యాసకర్త కవి, రచయిత ‘ 94401 28169

మరిన్ని వార్తలు