అక్షరాస్యతతోనే దేశాభివృద్ధి

8 Sep, 2020 00:57 IST|Sakshi

ఏ దేశాభివృద్ధి అయినా ఆ దేశ ప్రజల అక్షరాస్యతపై ఆధారపడి ఉంటుంది. అక్షరా స్యులైన ప్రజలు వస్తుసేవల ఉత్పత్తిలో పాల్గొని దేశ జీడీపీ పెరుగుదలకు తమ వంతు సహకారాన్ని అందిస్తారు. అభివృద్ధిలో మాత్రమే కాదు సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాల్లో ఆరోగ్యకరమైన మార్పులకు తోడ్పడుతారు. యునెస్కో తన 14వ సర్వసభ్య సమా వేశం అక్టోబర్‌ 26, 1966న జరిపి, సెప్టెంబర్‌ 8వ తేదీని అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవంగా జరు పుకోవాలని ప్రకటించింది. తరువాతి సంవత్సరం 1967 నుంచి జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా 86.3 శాతం ప్రజలు అక్షరాస్యులుగా ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అక్షరాస్యత 99.2 శాతంగా ఉంది. ప్రపంచంలోని 78.1 కోట్ల నిరక్షరాస్యుల్లో 75 శాతానికి పైగా దక్షిణాసియా, పశ్చిమాసియా, ఉప సహార ఆఫ్రికాల్లో ఉన్నారు. 

యునెస్కో వారి ‘గ్లోబల్‌ మానిటరింగ్‌ రిపోర్ట్‌ ఆన్‌ ఎడ్యుకేషన్‌’ ప్రకారం దక్షిణాసియా అత్యల్ప ప్రాంతీయ వయోజన అక్షరాస్యతా శాతాన్ని కలిగి ఉంది. దేశాల జాబితాలో చైనా 62, శ్రీలంక 93, బంగ్లాదేశ్‌ 129, నేపాల్‌ 137, భూటాన్‌ 138, పాకిస్తాన్‌ 148వ స్థానాల్లో ఉంటే, భారత్‌ 128వ స్థానంలో ఉంది. భారతదేశంలో అక్షరాస్యత వృద్ధి రేటు పురుషుల్లో 6.9 శాతంగా, మహిళల్లో 11.8 శాతంగా, ఉమ్మడిగా 9.2 శాతంగా ఉంది. మహిళల వృద్ధి రేటు ఎక్కువగా ఉండటం శుభపరిణామం. ఈ వృద్ధిరేటుతో భారతదేశం నూరు శాతం అక్షరాస్యత సాధించాలంటే 2060 వరకూ ఆగాల్సిందే. 

ఏడు సంవత్సరాల పైబడ్డవారు ఏ భాషలోనైనా చదవగల, రాయగల వారిని అక్షరాస్యులు అంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశంలో 74.04 శాతం ప్రజలు అక్షరాస్యులుగా ఉన్నారు. ఇది పురు షుల్లో 82.14 శాతం, మహిళల్లో 65.46 శాతం. అత్యధికంగా కేరళలో 93.4 శాతంగా, అతి తక్కువగా బిహార్లో 63.82 శాతంగా నమోదైంది. దేశంలో అక్షరాస్యతా స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌ 32, తెలంగాణ 35, బిహార్‌ 36వ స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ అక్షరాస్యత 2011 లెక్కల ప్రకారం 66.46 శాతం. అత్యధికంగా హైదరాబాద్‌లో 80.96 శాతం ఉండగా, అతితక్కువగా మహబూబ్‌నగర్‌లో 56.6 శాతంగా ఉంది. తెలంగాణ ఆర్థిక సర్వే 2018 ప్రకారం రాష్ట్రంలో 2018 నాటికి అక్షరాస్యత 84.11 శాతానికి పెరిగింది.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరక్షరాస్యతకు అనేక కారణాలు ఉన్నాయి. విద్యా ఉపయోగాలు తెలియకపోవటం, పేదరికం, వలసలు, తల్లిదం డ్రులు ఎక్కువగా వ్యవసాయ రంగంపై ఆధారపడి పిల్లలను ఆయా పనుల్లో నిమగ్నం చేయడం, పాఠ శాల సౌకర్యాలు లేకపోవడం, సామాజిక అసమాన తలు ముఖ్యమైనవి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 45 ఉచిత నిర్బంధ విద్యా సౌకర్యాలు కల్పించాలని స్పష్టంగా పేర్కొంది. కొఠారి కమిషన్‌ విద్యకు జీడీ పీలో 6 శాతం నిధులను ఖర్చు చేయాలని చెప్పింది. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం కూడా 4 శాతం కంటే ఎక్కువగా ఖర్చు చేయలేదు.

రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ 2009, 1 ఏప్రిల్‌ 2010 నుంచి అమల్లోకి వచ్చింది. ఐక్యరాజ్య సమితి సుస్థి రాభివృద్ది ఎజెండా– 2015 నాలుగవ లక్ష్యంగా అందరికీ నాణ్యమైన విద్యను 2030 నాటికి సాధిం చాలని నిర్దేశించింది. దీనికిగానూ తల్లిదండ్రులకు ఉపాధి కల్పించి పిల్లల చదువుపై అవగాహన పెంచడం, సౌకర్యవంతమైన పాఠశాల సమయాన్ని అందించడం, పాఠశాల స్థాయిలోనే వృత్తివిద్యా శిక్షణ ఇవ్వడం మొదలైన చర్యలు అవసరం. నూతన విద్యా విధానం 2020లో పూర్వ ప్రాథమిక, ప్రాథమిక విద్యా స్థాయిలో ఆశించిన సంస్కరణలు ఉన్నప్పటికీ ఆచరణలో ఎలా ఉంటుందో చూడాలి.

ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినా అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఒక దృఢ ప్రణాళికతో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన ప్పుడే భవిష్యత్‌ తరం తమ కాళ్ళపై తాము నిల బడుతుంది, దేశాన్ని నిలబెడుతుంది.

వ్యాసకర్త : జుర్రు నారాయణ యాదవ్‌, టీటీయూ జిల్లా అధ్యక్షులు, మహబూబ్‌నగర్‌
‘ మొబైల్‌ : 94940 19270  

మరిన్ని వార్తలు