National Handloom Day: నేతన్నలకు ప్రభుత్వమే నేస్తం

7 Aug, 2021 14:22 IST|Sakshi

ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం

ప్రాచీనకాలం నుంచీ చరి త్రలో చేనేతకు సముచితమైన పాత్ర ఉంది. జాతీయోద్య మంతోనూ విడదీయరాని బంధం కలిగుంది. గ్రామీణ భారతంలో వ్యవసాయం తరువాత రెండో అతిపెద్ద ఉపాధి కల్పనదారు చేనేత పరిశ్రమ. రాష్ట్రంలో సుమారు ఒక లక్షా 80 వేల మగ్గాలు ఉండగా, ఉప వృత్తులు కలిపి సుమారు నాలుగు లక్షల మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారు. కాలానుగుణంగా చేనేత రంగం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూనే ఉంది. వైఎస్సార్‌సీపీ అధినేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో చేనేతల సాధకబాధకాలు తెలుసుకున్నారు. ధర్మవరం, వెంకటగిరి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పొందూరు, చీరాల, మంగళగిరి... ఇలా పలు చేనేత కేంద్రాల్లో కార్మికుల ఆర్థిక ఇబ్బందులను స్వయంగా గమనిం చారు. 

2019 ఎన్నికల్లో  వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా జగన్‌ చేనేతల సంక్షేమానికి నడుం బిగించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు నేతన్న నేస్తం పథకాన్ని అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 81,783 మంది చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 24,000 వంతున రూ. 196.28 కోట్ల తొలి విడత సాయాన్ని జమ చేశారు. ఆ తరువాత కరోనా విజృం భించడంతో చేనేత కార్మికులు ఉపాధికి దూర మయ్యారు. కార్మికుల సంక్షేమాన్ని కాంక్షించి, రెండో విడత నేతన్న నేస్తం పథకాన్ని ఆర్నెల్లు ముందుగానే అమల్లోకి తెచ్చారు. 81,024 మంది అర్హులైన లబ్ధి దారులకు రూ.24,000 వంతున రూ.194.46 కోట్ల మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేశారు. చేనేత దినోత్సవం సందర్భంగా మూడోసారి ఆర్థిక సాయం అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ముఖ్యమంత్రి రాజకీయంగా కూడా చేనేత వర్గాలకు పెద్దపీట వేశారు. మునుపెన్నడూ లేని విధంగా వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వాటికి పాలక వర్గాలను కూడా నియమించి చరిత్ర సృష్టించారు. చేనేతకు ఏకంగా నాలుగు (పద్మశాలి, దేవాంగ, తొగటవీర క్షత్రియ, కుర్నిశాలి) కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం విశేషం.

నేటి ఆధునిక యుగంలో యువత, మహిళల అభిరుచికి తగ్గట్టుగా వీవర్స్‌ సర్వీస్‌ సెంటరు సహకారంతో ఆప్కో తరపున నూతన వెరైటీల ఆవిష్కరణకు కృషి జరుగుతోంది. డిజైన్‌ చీరల తయారీకి ప్రణాళికలు సిద్ధం చేసి, సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోంది. ప్రధాన ముడిసరుకైన పట్టు (సిల్క్‌) కొరత రాష్ట్రంలో తీవ్రంగా వుంది. మలబారు సాగుకు అనుకూల పరిస్థితులున్న విశాఖ, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రసాయనాలు వినియోగించకుండా పండించిన పత్తి నుంచి నూలు, చెట్టు బెరడు, పూలు, పండ్లు, ఆకుల నుంచి సేకరిం చిన రంగులను వినియోగించి వస్త్రాలను ప్రయోగాత్మకంగా నేయిస్తోంది.

కృష్ణా జిల్లా పెడన, గుంటూరు జిల్లా ఇసుకపల్లి, తూర్పు గోదావరి జిల్లా అంబాజీ పేట తదితర ప్రాంతాల్లో ఆర్గానిక్‌ చేనేత వస్త్రాలు తయారవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ బ్రాండ్, మార్కెటింగ్‌ కల్పించేందుకు కేంద్ర చేనేత జౌళి శాఖకు అనుబంధంగా పనిచేసే హ్యాండ్లూమ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌(హెచ్‌ఈపీ సీ)తో సంప్రదింపులు జరుపుతోంది. భారతీయ సంప్రదాయ వస్త్రధారణకు దగ్గరగా ఉండే శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మలేసియా, సింగపూర్‌ వంటి దేశాలకు ఎగుమతి చేస్తే మన దేశ ఖ్యాతి ఇనుమడించడంతోపాటు ఇక్కడి కార్మికుల ఉపాధి మెరుగవుతుంది. చేనేత కార్మికుల ప్రయోజనాలే లక్ష్యంగా శ్రమించిన చేనేత బంధు, దివంగత రాజ్యసభ సభ్యుడు ప్రగడ కోటయ్య స్ఫూర్తితో, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ చేనేత విభాగం ముందుకెళ్తోంది. 


- చిల్లపల్లి మోహనరావు

వ్యాసకర్త ఆప్కో చైర్మన్, వైఎస్సార్‌సీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు

మరిన్ని వార్తలు