లెక్కల ‘అంతు’ తేల్చినవాడు

22 Dec, 2020 00:20 IST|Sakshi

ఇన్‌బాక్స్‌

శ్రీనివాస రామానుజన్‌ 1887 డిసెంబర్‌ 22న తమిళనాడులోని ఈరోడ్‌ పట్టణంలో జన్మించాడు. ఒకసారి ఓ ఉపాధ్యాయుడు ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే ఒకటి వస్తుందని చెబితే– ఈ నియమం సున్నాకు కూడా వర్తిస్తుందా అని ప్రశ్నించాడు. పన్నెండేళ్ళ వయసులోనే డిగ్రీ స్థాయి గణిత పుస్తకాల్లోని త్రికోణమితి, ఆయిలర్‌ సూత్రా ల్లో నిక్లిష్ట సమస్యలను సులువుగా సాధించేవాడు.

15 ఏళ్ల వయసులో గణిత శాస్త్రవేత్త జి.ఎస్‌.కార్‌ రాసిన ‘సినాప్సిస్‌ ఆఫ్‌ ప్యూర్‌ మ్యాథ మాటిక్స్‌’ చదివి, అందులోని ఆరువేల పైచిలుకు సిద్ధాంతాలను అధ్యయనం చేశాడు. కళాశాలలో గణితంలో కనబరచిన ప్రతిభ కారణంగా ఉపకార వేతనం అందుకున్నాడు. గణితంపై ఎక్కువ శ్రద్ధ చూపుతూ మిగిలిన సబ్జెక్టులను సరిగా చదవక పోవటంతో పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యాడు. దీంతో ఆ ఉపకార వేతనం రద్దయింది.

1913లో కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయ గణిత ప్రొఫెసర్‌ జి.హెచ్‌.హార్డీకి తన 120కి పైగా సిద్ధాంతాలను, సూత్రాలను వివరిస్తూ ఉత్తరం రాశాడు. రామానుజన్‌ ప్రతిభను గుర్తించిన హార్డీ  కేంబ్రిడ్జ్‌కి పిలిపించుకు న్నారు. రామానుజన్‌ కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కళాశాలలో పరిశోధక విద్యార్థిగా చేరాడు. అనంత శ్రేణులు, సంకలనం, ప్రధాన సంఖ్యలు, మాక్‌ తీటా ప్రమేయాలు, శృంఖలిత భిన్నాలపై అనేక పరిశోధనలు చేశాడు. 20వ శతాబ్దపు గణిత మేధావుల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. అనారోగ్యంతో భారతదేశం తిరిగి వచ్చిన రామానుజన్‌ 1920 ఏప్రిల్‌ 26న తన 33వ ఏట కన్నుమూశాడు. ఆయన జన్మదినాన్ని  జాతీయ గణితశాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
(నేడు జాతీయ గణితశాస్త్ర దినోత్సవం)
చల్లా చంద్రశేఖర్‌ రెడ్డి 
కలువాయి, నెల్లూరు జిల్లా. మొబైల్‌: 94409 28666

మరిన్ని వార్తలు