కాంగ్రెస్‌ లో–కమాండ్‌

30 Sep, 2022 00:26 IST|Sakshi

విశ్లేషణ

కాంగ్రెస్‌ పార్టీ మీద గాంధీ కుటుంబం తన ప్రాభవం కోల్పోతూ వస్తోంది. ఆ కుటుంబం ఎన్నికల్లో గెలుపును సాధించలేకపోతోంది. వరుస ఎన్నికలు దీన్ని రుజువు చేశాయి కూడా! భారత్‌ జోడో యాత్ర సందర్భంగా అసంఖ్యాక ప్రజల అభినందనలు అందుకుంటున్న రాహుల్‌ గాంధీ కూడా పార్టీకి ఓట్లు సంపాదించే స్థానంలో లేరు. కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ క్రియాశీలంగా వ్యవహరించడానికి ఆరోగ్యం అంతగా సహక రించడం లేదు.

ఇక కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుతం హై కమాండ్‌ అనేదే లేకుండా పోయిందని రాజస్థాన్‌ పరిణామాలు నొక్కి చెప్పాయి. లాంఛనప్రాయంగా అధిష్ఠానం ఉనికిలో ఉన్నప్పటికీ దాని ఆదేశాలు పని చేయడం లేదు. గాంధీ కుటుంబ ఆధిపత్యం లేని కాలంలోకి కాంగ్రెస్‌ ప్రవేశిస్తోందా?

సీతారాం కేసరిని 1998లో సాగనంపి, సోనియా గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజుల తర్వాత మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కలిసి పిచ్చాపాటీగా మాట్లాడాను. మా సంభాషణ క్రమంలో ఆయన ఏమన్నారంటే... ‘‘ఇప్పుడు ఈ పార్టీ రాబోయే 25–30 సంవత్సరాల కాలం వరకు ఈ కుటుంబం చేతుల్లోకి వెళు తుంది’’ అన్నారు. పీవీ నిజంగానే జ్యోతిష్యుడి అవతారమెత్తారు. పాతికేళ్లపాటు కాంగ్రెస్‌ వ్యవహారాలను శాసించిన నెహ్రూ–గాంధీ కుటుంబ ప్రభావం ఇప్పుడు క్షీణించిపోతోంది.

జీకే మూపనార్, ఎమ్‌ఎల్‌ ఫోతేదార్, బూటా సింగ్‌ లేదా సీతారాం కేసరి వంటి వారిని హైకమాండ్‌ దూతలుగా పంపినప్పుడు ఆయా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు వణికిపోయే కాలం ఒకప్పుడు ఉండేది. విషయం చెప్పగానే ఒకే ఒక వాక్యంతో రాజీనామా చేసి వెళ్లిపోయేవారు. లేదా కాంగ్రెస్‌ అధ్యక్షురాలికి కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే అధికారాన్ని కట్టబెడుతూ ఒక ఆదేశం వచ్చేది. దాన్ని అందరూ బుద్ధిగా పాటించిన కాలమది. 

కానీ భారతదేశం మారుతోంది. దానికి అనుగుణంగా కాంగ్రెస్‌ పార్టీ కూడా మారుతోంది. మారుతున్న ఈ వాస్తవాన్ని రాజస్థాన్‌ నాటకీయంగా నొక్కి చెప్పింది. ఈ నాటకీయ ప్రకటన కర్త మరెవరో కాదు, కాంగ్రెస్‌ సొంత ముఖ్యమంత్రి అశోక్‌ గెహలోత్‌ అని చెప్పాలి. జైపూర్‌లో కాంగ్రెస్‌ శాననసభా పక్ష సమావేశాన్ని ఏర్పర్చాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వయంగా చెప్పారు.

రాజస్థాన్‌ తదుపరి ముఖ్యమంత్రిని ఎంచుకునే అధికారాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షు రాలికి కట్టబెడుతూ సీఎల్పీ నుంచి ఒకే ఒక్క వాక్యంతో కూడిన తీర్మానాన్ని ఆమోదింపచేసుకునేందుకు వచ్చినవారు రాజస్థాన్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి, పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్‌ మాకెన్‌; సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే. సోనియాగాంధీ ఈ తరహా పని విధానాన్ని సంపత్సరాలుగా అమలు చేస్తూ వస్తున్నారు మరి.

రాజస్థాన్‌ కొత్త ముఖ్యమంత్రిగా సచిన్‌ పైలట్‌ని నియమించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. సచిన్‌కి సీఎం పదవిని కట్టబెడ తామని 2014 నుంచి అధిష్ఠానం హామీ ఇస్తూ వస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా అనుభవజ్ఞుడైన అశోక్‌ గెహలోత్‌ని జాతీయ స్థాయికి తీసుకురావాలని అధిష్ఠానం భావించింది. ఒక రకంగా ఇది ఇరువురు నేతలకూ గెలుపు కట్టబెట్టేదేనని అనిపించింది. యువకుడైన సచిన్‌ పైలట్‌ వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి పార్టీ గెలిచే స్థానాలను మరింతగా పెంచుతారని అందరూ భావిస్తున్నారు.

ఇక గెహలోత్‌ అయితే రాజస్థాన్‌లో పార్టీని నిర్మించారు. మూడుసార్లు ముఖ్య మంత్రిగా ఆయన పాలనానుభవం కానీ, కాంగ్రెస్‌ వ్యవస్థను, భారత దేశాన్ని 40 సంవత్సరాలుగా అర్థం చేసుకుంటూ వచ్చిన సీనియర్‌గా గానీ 2024 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్థానాలను మరింతగా పెంచగలరని అందరూ భావిస్తూ వచ్చారు. అధిష్ఠానం కూడా గెహలోత్‌పై చాలా ఆంచనాలు పెట్టుకుంది.

నరేంద్రమోదీ నేతృత్వం లోని బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఐక్యత కోసం చేసే ప్రయత్నంలో గెహలోత్‌ పార్టీలో అందరికీ ఆమోదయోగ్యమైన నేతగా ఉంటారని అధిష్ఠానం భావించింది. దానికి అనుగుణంగానే గాంధీ కుటుంబం విశ్వాసాన్ని గెహలోత్‌ పొందుతూ వచ్చారు. ఆ కుటుంబానికి నిజమైన విశ్వసనీయుడిగా ఆయన కనిపించారు కూడా.

అయితే పాతకాలపు కాంగ్రెస్‌ రాజకీయ నేత అయిన గెహలోత్‌ రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటూ అధిష్ఠానం మాట పెడచెవిన పెట్టారు. కాబట్టే అనుకున్న ప్రకారం రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం జరగలేదు. గెహలోత్‌ అనుయాయులుగా భావి స్తున్న 92 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మరోచోట సమావేశమై, నేరుగా స్పీకర్‌ నివాసానికి వెళ్లి తమ అసెంబ్లీ స్థానాలకు రాజీనామాలు సమర్పించారు. పైలట్‌ని సీఎంగా చేస్తే  అంగీకరించమని ధిక్కారం ప్రకటించారు.

వారు పార్టీకే మూడు షరతులు పెట్టారు. అక్టోబర్‌ 16 తర్వాతే అంటే గెహలోత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాతే రాజస్థాన్‌ సీఎం ఎవరనేది నిర్ణయించాలి(తాజాగా అశోక్‌ గెహలోత్‌ తాను అధ్యక్ష పోటీలో లేనని తేల్చేశారు); 2020లో సచిన్‌ పైలట్‌తో పాటు తిరుగుబాటు చేసిన వారిలో ఏ ఒక్కరినీ సీఎంగా చేయ కూడదు; చివరగా కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పరిశీలకులు ఎమ్మెల్యేలను బృందాలుగానే తప్ప వ్యక్తులుగా మాట్లాడరాదు. 

తన పక్షానే మెజారిటీ సభ్యులు ఉన్నారని గెహలోత్‌ పార్టీ అధిష్ఠానానికి స్పష్టమైన సందేశం పంపారు. అసెంబ్లీకి రాజీనామా చేస్తామని ఎమ్మెల్యేలు హెచ్చరించడంతో సూత్రరీత్యా చెప్పాలంటే పార్టీని చీల్చగలనని తేల్చి చెప్పినట్లే అయింది. అదే సమయంలో గెహలోత్‌కూ, సచిన్‌ పైలట్‌కూ మధ్య సంబంధాలు పూర్తిగా బెడిసి కొట్టాయి. అవి సాధారణ రాజకీయ విభేదాల స్థాయిని దాటి పోయాయి. జాతీయ నాయకత్వం కూడా వీరి మధ్య ఘర్షణను పరిష్కరించలేకపోయింది. 

భూపేందర్‌ సింగ్‌ హుడాకు విశ్వసనీయులైన హరియాణా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, 2016 రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ మద్దతున్న స్వతంత్ర సభ్యుడు సుభాష్‌ చంద్ర గెలుపొందడంలో సహాయం చేసినప్పుడు కూడా అధిష్ఠానం ఏమీ చేయలేకపోయింది. ఓటింగ్‌ సమయంలో ‘తప్పు పెన్‌’ వాడిన కారణంగా 14 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లవని ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఇటీవలి కాలంలో పంజాబ్‌లోనూ కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ను సీఎం పదవి నుంచి దింపేశాక, ఆ తర్వాత కాంగ్రెస్‌ ఆ రాష్ట్రంలోనే అధికారాన్ని కోల్పోయింది. 

నరేంద్ర మోదీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ గాంధీ కుటుంబం తన ప్రాభవం కోల్పోతూ వస్తోంది. పార్టీ కోసం ఆ కుటుంబం ఎన్నికల్లో గెలుపును సాధించలేకపోయింది. పైగా పార్టీకి అవసరమైన డబ్బును కూడా గాంధీ కుటుంబం సేకరించలేక పోయింది. ఆనాటి నుంచి వరుసగా జరుగుతూ వచ్చిన ఎన్నికలు దీన్ని రుజువు చేశాయి కూడా. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం భారత్‌ జోడో యాత్ర సందర్భంగా అసంఖ్యాక ప్రజల అభినందనలు అందు కుంటున్న రాహుల్‌ గాంధీ కూడా పార్టీకి ఓట్లు సంపాదించే స్థానంలో లేరు.

ప్రియాంకా గాంధీ వాద్రా ఆశించినంతగా ఫలితాలు సాధించ లేకపోతున్నారు. ఇకపోతే కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ క్రియాశీలకంగా వ్యవహరించడానికి ఆరోగ్యం అంతగా సహక రించడం లేదు. పైగా రాజస్థాన్‌ వంటి సంక్షోభ పరిస్థితుల్లో జోక్యం చేసుకుని, ఒప్పందం కుదిర్చి, తన సమస్యలను పరిష్కరించ గలిగే అహ్మద్‌ పటేల్‌ వంటి అనుభవజ్ఞుల సహాయం కూడా సోనియాకు ఇప్పుడు లభ్యం కావడం లేదు. 92 మంది ఎమ్మెల్యేలు అధిష్ఠానాన్నే ధిక్కరిస్తున్నప్పుడు రాజస్థాన్‌ వ్యవహారాలను చూస్తున్న పార్టీ పరిశీలకులు కనీసం తిరుగుబాటు జరుగుతున్న సంకేతాలను కూడా పసిగట్టలేకపోయారు.

రాష్ట్ర భవిష్యత్‌ ముఖచిత్రం తానేనని చాలామంది భావిస్తున్న ప్పటికీ రాజస్థాన్‌ పరిణామాలు సచిన్‌ పైలట్‌కి కూడా షాక్‌ కలిగిం చాయి. అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ అధిష్ఠానానికి చెంపపెట్టు అయి నట్లయింది. కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుతం హై కమాండ్‌ అనేదే లేకుండా పోయిందని రాజస్థాన్‌ పరిణామాలు నొక్కి చెప్పాయి. లాంఛన ప్రాయంగా అధిష్ఠానం ఉనికిలో ఉన్నప్పటికీ దాని ఆదేశాలు పని చేయడం లేదు. గాంధీ కుటుంబ ఆధిపత్యం లేని కాలంలోకి కాంగ్రెస్‌ ప్రవేశిస్తోందా? 1998లోనే పీవీ నరసింహారావు ఊహించినట్లు పార్టీలో గాంధీ కుటుంబ ఆధిపత్యం ముగిసిపోతున్నట్లేనా? 


వ్యాసకర్త: నీరజా చౌదరి, సీనియర్‌ జర్నలిస్ట్‌
(‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు