Goparaju Venkata Ananta Sharma: నేతాజీ అంగరక్షకుడు

27 Aug, 2022 14:06 IST|Sakshi

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కాంగ్రెస్‌ రాజకీయాలను వదిలేసి విదేశాలకు వెళ్లి బ్రిటిష్‌ వాళ్లపై యుద్ధం ప్రకటించిన రోజులవి. అప్పట్లో ఆయన అంగరక్షకునిగా పనిచేసిన అచంచల దేశభక్తుడు గోపరాజు వేంకట అనంత శర్మ, ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ గోదావరి జిల్లా ఆలమూరులో 1920లో జన్మించిన ఆయన 1941లో బ్రిటిష్‌ ఇండియా ఆర్మీ (బీఐఏ)లో గుమాస్తాగా చేరారు. తరువాత ఆఫీసర్‌గా ఎంపికై శిక్షణ నిమిత్తం మలేషియాలోని కోటాబహార్‌కు వెళ్లారు. బ్రిటన్‌– జపాన్‌ల మధ్య జరిగిన యుద్ధంలో వేలాదిమంది బీఐఏ సైనికులు యుద్ధ ఖైదీలుగా జపాన్‌కు చిక్కారు. అందులో గోపరాజు ఒకరు.

జపాన్‌తో ఒప్పందం కుదుర్చుకొని ఆ దేశస్థుల సాయంతో భారత మాతకు విముక్తి కలిగించాలని నేతాజీ తన ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ (ఐఎన్‌ఏ) ద్వారా ప్రయత్నించారు. ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులైన గోపరాజు నేతాజీని బ్యాంకాక్‌లోని రత్నకోసిన్‌ హోటల్‌లో కలిసి ఐఎన్‌ ఏలో చేరారు. నేతాజీ అంగరక్షకులలో ఒకరుగా పనిచేశారు. ఎప్పుడూ మిలటరీ దుస్తులలో ఉండే నేతాజీని చూసి ఎంతో ప్రేరణ, గౌరవం కలిగేదని గోపరాజు అంటూ ఉండేవారు. బ్రిటిష్‌ వాళ్లు ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీవారిని యుద్ధఖైదీలుగా ఫిరోజ్‌పూర్‌ కంటోన్మెంటుకు తరలించారు. వారిలో గోపరాజు అనంత శర్మ కూడా ఉన్నారు. (క్లిక్‌: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!)

స్వాతంత్య్రోద్యమ దీప్తి నేతాజీ... కనుసన్నలలో గడిపిన మూడేళ్ల కాలం తన జీవితంలో స్వర్ణమయ సమయం అనేవారు వేంకట అనంత శర్మ. ఈయన కొంతకాలం పాటు స్వాతంత్య్ర సమరయోధుల సంఘానికి కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రోత్సాహంతో భారతీయ రైల్వేలో ఉద్యోగిగా చేరి ట్రావెలింగ్‌ టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా పదవీవిరమణ చేశారు. ఈమధ్య జూలై నెలలో ఐకానిక్‌ వారోత్సవాల వేడుకలలో అమృతోత్సవమును పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే వారు విజయవాడలో స్వాతంత్య్ర సమరవీరులైన శర్మ కుటుంబ సభ్యులను ఉచిత రీతిన గౌరవించడం ముదావహం. (క్లిక్‌: సమానతా భారత్‌ సాకారమయ్యేనా?)

– డాక్టర్‌ ధర్మాల సూర్యనారాయణ మూర్తి, చాంగీ కాండో, సింగపూర్‌

మరిన్ని వార్తలు