Subhash Chandra Bose: ఉర్రూతలూగించిన నేత!

23 Jan, 2023 12:43 IST|Sakshi

క్రమశిక్షణ, దేశభక్తి, దైవభక్తి ఉన్న సేవాతత్పరుడు సుభాష్‌ చంద్రబోస్‌ మరణించి 78 ఏళ్లవుతోంది. అయినా ఆయన మరణానికి కారణమని చెబుతున్న విమాన ప్రమాద కారణం నేటికీ జవాబులేని ప్రశ్నగా నిలిచి పోయింది. ప్రభావతీ దేవి, జానకీ నాథ్‌ బోస్‌ దంపతుల సంతానంలో తొమ్మిదోవాడుగా సుభాస్‌ చంద్రబోస్‌ 1897 జనవరి 23న కటక్‌లో జన్మించారు. ఐసీఎస్‌లో అఖిల భారత స్థాయిలో నాలుగవ స్థానం పొందారు. బెంగాల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్‌ సహాయ కార్యదర్శిగా దేశమంతా పర్యటిస్తూ చేసిన ప్రసంగాలకు లక్షలాది మంది ప్రేరణ పొందారు. ఉప్పు సత్యా గ్రహం సందర్భంగా బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్‌ చేసి అనేక జైళ్లలో తిప్పి, చివరికి దేశ బహిష్కరణ శిక్ష వేసింది. 1933లో ‘ఇండియన్‌ స్ట్రగుల్‌’ పుస్తకాన్ని రాశారు. తండ్రి మరణంతో భారత్‌కు తిరిగి రాగా, ఆరోగ్యం క్షీణిస్తే, చికిత్స కోసం ప్రజలు చందాలువేసి మరీ వియన్నా పంపారు. అప్పుడే యూరప్‌ పర్యటించారు. ఆ రోజుల్లోనే ముస్సోలినీ, హిట్లర్, రోమరోల వంటివారిని కలిశారు.

నెహ్రూ అధ్యక్షతన లక్నోలో జరిగే కాంగ్రెస్‌ సమావేశాలకు హాజరయ్యేందుకు దేశంలో దిగగానే ఆయనను ఖైదు చేసి ఎరవాడ జైలుకు పంపారు. 1937లో విడుదల కాగానే అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడై దేశమంతా పర్యటిస్తూ ప్రజలను స్ఫూర్తిదాయక ఉపన్యాసాలతో ఉర్రూతలూగించి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడయ్యారు! ఆది ఆయన పట్ల అసూయాపరులను పెంచింది. రెండవ పర్యాయం మళ్ళీ పోటీజేసి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ గెలుపు కోసం ప్రయత్నించకుండానే పట్టాభి సీతారామయ్యపై గెలిచి కాంగ్రెస్‌ అధ్యక్షులు అయ్యారు. అయితే గాంధీజీకి ఆయన అధ్యక్షుడు కావడం ఇష్టం లేదు. దీంతో బోస్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానానికి రాజీనామా చేశారు. వెంటనే ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీని స్థాపించారు. వారపత్రిక కూడా వెలువరించడం మొదలు పెట్టి మరోసారి దేశమంతా పర్యటించారు.

1942 జనవరి 26న పులి బొమ్మతో రూపొందించిన జండా ఎగరేసి, బెర్లిన్‌లోనే ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ స్థాపించారు. 1941 ఫిబ్ర వరి 27న ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ రేడియోలో అద్భుత ప్రసంగం చేసి యావత్‌ భారతాన్నీ ఆయన ఆవేశంలో ముంచెత్తారు.  మహిళలకు రంగూన్‌లో ఝాన్సీ లక్ష్మీబాయి రెజి మెంట్‌ ఏర్పాటు చేసి యుద్ధ శిక్షణ మొదలు పెట్టారు. చలో ఢిల్లీ నినాదం ఇచ్చి ప్రత్యక్ష యుద్ధానికి ప్రణాళిక రచించి ఇంఫాల్, అండమాన్, నికోబార్‌లో స్వతంత్ర భారత పతాకాన్ని ఆవిష్కరించి సాగిపోయారు. ఇంతలో జపాన్‌ మీద అణుబాంబు పడ్డది. జపాన్‌ అతలాకుతలమై పోయింది. బోస్‌ నిస్సహాయుడై సహచరుల బలవంతంపై మంచూరియాలో సురక్షిత అజ్ఞాత స్థలానికి వెళ్ళడానికి అనిష్టంగానే జపాన్‌లో విమానం ఎక్కి తైపే వరకూ ప్రయాణించారు. 1945 ఆగస్ట్‌ 18న అకస్మాత్తుగా విమానంలో సాంకేతిక ఇబ్బంది వచ్చి కూలిపోయిందన్నారు. విమానంతో పాటే కోట్లాది భారతీయుల ఆశలూ నేల కూలాయి. 50 సంవత్సరాల వయసులోనే ఆ యోధునికి నూరేళ్ళూ నిండాయి. (క్లిక్ చేయండి:  ‘కోహినూర్‌ను బ్రిటన్‌ దొంగిలించింది’)

– నందిరాజు రాధాకృష్ణ 
(జనవరి 23 నేతాజీ జయంతి)

మరిన్ని వార్తలు