మందులు విఫలమైతే కొత్త సమస్యలు

16 Jul, 2022 00:00 IST|Sakshi

విశ్లేషణ

రోగకారక బ్యాక్టీరియాను నిర్మూలించే యాంటీబయాటిక్స్‌ పనిచేయకుండా పోవడం అతిపెద్ద ఉత్పాతానికి దారితీయనుంది. అవసరానికి మించి యాంటీబయాటిక్స్‌ ఉపయోగించడం కారణంగా బ్యాక్టీరియాపై వాటి ప్రభావం సన్నగిల్లిపోతోందని రెండు అంతర్జాతీయ అధ్యయనాలు బయట పెట్టాయి. కోవిడ్‌–19 మహమ్మారి ప్రభావంతో వీటిని ఎవరూ పట్టించుకోలేదు. 2019లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో దాదాపు 50 లక్షలు ఏఎంఆర్‌ (యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌) సంబంధిత మరణాలే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయవలసిన సాంక్రమిక వ్యాధుల నియంత్రణ వ్యూహాల్లో మార్పులు తప్పనిసరి. యాంటీబయాటిక్స్‌ను హేతుపూర్వకంగా వాడేలా బలమైన క్రమబద్ధీరణ వ్యవస్థలు అవసరం. అంతర్జాతీయ వైద్య పత్రికల్లో ఈ సంవ త్సరం రెండు ప్రమాదకరమైన కథనాలు ప్రచురితమయ్యాయి. సూక్ష్మజీవులు నిరోధకత పెంచుకుంటున్న విషయాన్ని అవి ఎత్తి చూపాయి. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌ వంటి వాటి కారణంగా వచ్చే ఇన్‌ఫెక్షన్లను నిరోధించడానికి వాడే మందులు పనిచేయడం లేదని తెలిపాయి. టైఫాయిడ్‌ జ్వరానికి కారణమయ్యే బ్యాక్టీరియా అయిన సాల్మోనెల్లా టైఫీకి వాడే మందులు పనిచేయక పోవడం గురించి ‘లాన్సెట్‌’ తాజా అధ్యయనం చర్చించింది. జనవరి మొదట్లో లాన్సెట్‌ ‘గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ బ్యాక్టీరియల్‌ యాంటీమై క్రోబియల్‌ రెసిస్టెన్స్‌ ఇన్‌ 2019’ అనే మరొక అధ్యయనం కూడా చేసింది. సూక్ష్మజీవుల ఏజెంట్లలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు వాటిపై వాడే మందులు పనిచేయడం లేదని కూడా ఈ అధ్యయనం తెలిపింది. పొంచి ఉన్న విపత్తు గురించి ఈ రెండు అధ్యయనాలు వెల్లడించిన అంశాలను కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, భారతదేశం నుంచి 2016–19 మధ్య టైఫాయిడ్‌ బ్యాక్టీరియాకు సంబంధించిన జీనోమ్‌ స్వీక్వెన్స్‌ను పరిశీలించినందున టైఫాయిడ్‌పై చేసిన తాజా అధ్యయనం చాలా పెద్దదనే చెప్పాలి. 1905 నుంచి 2018 వరకు 70కి పైగా దేశాలనుంచి 4,000 సూక్ష్మజీవి రకాలను పరిశీలించగా, పై నాలుగు దేశాలనుంచి వేరుపర్చిన  3,489 కొత్త సీక్వెన్స్‌ రకాలను పరిశోధకులు తాజాగా ఆవిష్కరించారు. సూక్ష్మజీవి సంహారకాలకు తట్టుకుని, వివిధ భౌగో ళిక ప్రాంతాలకు బ్యాక్టీరియా వ్యాప్తి చెందిన విధాన్ని వీరు పరిశీలిం చారు. బ్యాక్టీరియా జన్యు ఉత్పరివర్తనాలు సిప్రోఫ్లాక్సాసిన్, ఎరిత్రో మైసిన్‌ వంటి సాధారణంగా ఉపయోగించే యాంటీబయాటిక్స్‌కు నిరోధకత పెంచుకున్నాయి. గత 30 సంవత్సరాల్లో ఒక ఖండంలో కానీ, ఇతర ఖండాల్లో కానీ యాంటీబయాటిక్స్‌కి నిరోధకత దాదాపు 200 రెట్లు పెరిగిందని గుర్తించారు. జన్యు ఉత్పరివర్తనాలు, వ్యాప్తి మూలాలకు సంబంధించి చూస్తే దక్షిణాసియా 90 శాతం మ్యుటే షన్లతో అతిపెద్ద ప్రాంతంగా నిలిచింది. అలాగే దక్షిణాసియా నుంచి అగ్నేయాసియాకు, దక్షిణాఫ్రికాకు ఈ మ్యుటేషన్లు విస్తరించాయిని తాజా అధ్యయనం తెలిపింది. పైగా యూరప్‌కూ, రెండు అమెరికన్‌ భూఖండాలకూ ఇవి వ్యాపించాయని కనుగొన్నారు.

దీనివల్ల రోగులకు ట్రీట్‌మెంట్‌ ఇవ్వడం కష్టసాధ్యమైపోయింది. చికిత్స చేస్తున్నప్పుడు వైఫల్యాల సంఖ్య పెరిగింది. రోగులు ఆసుపత్రుల్లో గడపాల్సిన వ్యవధి పెరగడంతో ఖర్చు పెరిగింది. మరణాల రేటు కూడా పెరిగింది. నిరోధకత పెంచుకున్న బ్యాక్టీరియా రకాలు వివిధ దేశాలకే కాకుండా వివిధ ఖండాలకు కూడా వ్యాపిం చాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయవలసిన సాంక్రమిక వ్యాధుల నియంత్రణ వ్యూహాల్లో మార్పు చేయడం తప్పనిసరి. యాంటీబయాటిక్స్‌కి ఏమాత్రం లొంగని బ్యాక్టీరియా రకాల ఆవి ర్భావం కారణంగా, వ్యాధి నిరోధక పద్ధతులను కూడా మార్చు కోవాలి. టైఫాయిడ్‌ సాంక్రమికంగా వచ్చే దేశాల్లో టైఫాయిడ్‌ వ్యాక్సిన్లను కూడా మార్చవలసి ఉంటుంది.

ఈ సంవత్సరం మొదట్లో ప్రచురితమైన అధ్యయనం సూక్ష్మజీవి సంహారకాలకు నిరోధకత (ఏఎంఆర్‌) అంతర్జాతీయ తలనొప్పిగా మారినట్లు పేర్కొంది. దాదాపు 200 దేశాల్లో ఇది పొడసూపటమే కాదు, 20 పైగా బ్యాక్టీరియా వ్యాధికారకాలు కూడా బయటపడ్డాయి. 2019లో చేసిన ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంభ వించిన మరణాల్లో దాదాపు 50 లక్షల మరణాలు ఏఎమ్‌ఆర్‌ (యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌) సంబంధిత మరణాలే. అంటే బ్యాక్టీరియాను సంహరించే మందులు పనిచేయక ఇన్ని మరణాలు సంభవించాయన్నమాట. వీటిలో నాలుగింట మూడొంతుల మర ణాలు ప్రధానంగా ఆరు బ్యాక్టీరియా రకాల వల్లే సంభవించాయి. ఈ ఆరింటిలో ఈష్చెరిషియా కోలి అనేది ప్రమాదకరమైనదిగా పరిణ మించింది. శ్వాససంబంధ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సోకాయని ఈ అధ్య యనం తెలిపింది. దీన్నే సాధారణ పరిభాషలో నిమోనియా అని పిలుస్తుంటారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఆరు కీలక బ్యాక్టీరియాలు అత్యధికంగా మందులకు నిరోధకతను సాధించడం ఆందోళన కలిగిస్తోంది.

బ్యాక్టీరియా నిరోధక యాంటీబయాటిక్స్‌ను డాక్టర్లు అతిగా సిఫార్సు చేయడం లేదా దుర్వినియోగం చేయడం వల్ల సమస్య తీవ్రమైంది. 2016లో అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం అమెరికాలో డాక్టర్లు సిఫార్సు చేసిన యాంటీబయాటిక్‌ ప్రిస్క్రిప్షన్లలో 30 శాతం వరకు అనవసరమని తేలింది. జ్వరం, గొంతు నొప్పి, సైనస్‌ వంటి సాధారణ సమస్యలకు కూడా యాంటీబయాటిక్స్‌ను సిఫార్సు చేశారని తేలింది. భారతదేశం విషయంలో ఇది మరింత ఎక్కువగానే ఉంటుందనడంలో సందేహమే లేదు. మన దేశంలో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లతో పనిలేకుండా, ఫార్మసిస్టులు, అనధికారిక వ్యక్తులు కూడా వీటిని నేరుగా రోగులకు ఇచ్చేయడం  రివాజు. దగ్గు, డయే రియా, పొత్తికడుపు నొప్పి వంటి అతి సాధారణ జబ్బులకు కూడా వీటిని సిఫార్సు చేస్తున్నారు. చెప్పాలంటే ఆసుపత్రుల్లో చేరే ప్రతి వాళ్లకూ వేగంగా ఉపశమించేలా బ్యాక్టీరియా సంహారక మందులను రాసిపడేస్తున్నారు.

నాణ్యత లేని మందులు కూడా బ్యాక్టీరియా విస్తరణకు కారణం అవుతున్నాయి. అవసరం లేని చోట వాడుతున్న యాంటీబయాటిక్స్‌ జన్యు ఉత్పరిపర్తనాలకు దారి తీస్తోంది. దీనివల్ల ఒక ప్రత్యేక ఏజెంట్‌ కంటే మొత్తం డ్రగ్స్‌కే బ్యాక్టీరియా అలవాటుపడుతోంది. కొన్నేళ్ల క్రితం చేసిన ఒక అధ్యయనంలో, పేదదేశాల్లో వాడే యాంటీబయా టిక్స్‌లో ఎనిమిదింట ఒకటి, మలేరియా మందుల్లో ఐదింట ఒకటి నాణ్యత లేకుండా ఉన్నాయని బయటపడింది. నాణ్యత లేని లేబ రేటరీ పరీక్షలు, డాక్టర్లు సూచించిన చికిత్సను రోగి చివరివరకూ పాటించకపోవడం, యాంటీబయాటిక్స్‌ని ఇష్టానుసారం మార్చడం కూడా పరిస్థితిని దిగజార్చుతున్నాయి. కోళ్ల పరిశ్రమలో, జంతువుల్లో యాంటీబయాటిక్స్‌ ఉపయోగించడం భయానక పరిస్థితిని సృష్టిస్తోంది. మందులను, ఆసుపత్రుల్లో వ్యర్థాలను డిస్పోజ్‌ చేయడంలో లోపాలతో పాటు కొన్ని పరిశ్రమల వల్ల పర్యావరణం నేరుగా కాలుష్యానికి గురవుతోంది. వాతావరణంలో మానవ, జంతు సూక్ష్మజీవికణాలు కలగలిసిపోతున్నాయి. దీంతో మానవులు, జంతువులలో కూడా బ్యాక్టీరియా వ్యతిరేక నిరోధకత తగ్గిపోతోంది. యాంటీబయాటిక్‌ మందు అయిన కోలిస్టిన్‌ను దశాబ్దాలుగా పశువులకు ఇస్తూ రావడం వల్ల అవి నేరుగా మానవుల్లో ఇన్‌ఫెక్షన్లకు దారితీసి బీభత్సం సృష్టించింది. ఇన్‌ఫెక్షన్‌కు చివరి ప్రయత్నంగా మాత్రమే కోలిస్టిన్‌ వాడాల్సి ఉంటుంది. కానీ ఆ అంశానికి ఎవరూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.

రోగక్రిమి నాశకాల శక్తి తగ్గిపోవడానికి సంబంధించి భారత్‌ మేలుకోవలసిన తరుణం ఆసన్నమైంది. యాంటీబయాటిక్స్‌ను హేతుపూర్వకంగా రాసే, ఉపయోగించే బలమైన క్రమబద్ధీరణ వ్యవస్థలు అవసరం. వీటి ఉత్పత్తిలో నాణ్యతను తప్పక పాటించేలా చూడాలి. ‘ఏఎంఆర్‌’ను కనుగొని పర్యవేక్షించే పద్ధతులను ప్రారంభిం చాలి. యూరప్, అమెరికాల్లో లాగా మన ఆసుపత్రుల్లో సాంక్రమిక వ్యాధుల విభాగాల ప్రత్యేక వ్యవస్థను తప్పక ఏర్పాటుచేయాలి. అప్పుడే అధికంగా యాంటీబయాటిక్స్‌ ఉపయోగించడాన్ని నియంత్రించడం, పర్యవేక్షించడం సాధ్యపడుతుంది.



రాకేశ్‌ కోచర్‌ 
వ్యాసకర్త మాజీ అధ్యక్షుడు, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)
 

మరిన్ని వార్తలు