అందరూ బాగుపడాలి కదా!

30 Mar, 2022 14:00 IST|Sakshi

మన దేశీయ ఉత్పత్తుల విదేశీ ఎగు మతులు మొదటిసారి అనుకున్న సమయానికన్నా ముందే వార్షిక లక్ష్యం 400 బిలియన్‌ డాలర్లకు చేరిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఈ విజయానికి కారకులైన రైతులు, చేనేత కార్మికులు, మత్స్య కారులు, ఎంఎస్‌ఎంఈ, ఔత్సాహికులను అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర పరిశ్రమలు–వాణిజ్య శాఖా మంత్రి పీయూష్‌ గోయల్‌ ఢిల్లీ– ‘ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో’లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ– ‘‘ఇన్నాళ్లుగా ప్రభుత్వానికి – ఉత్పాదక రంగానికి మధ్య ఈ లక్ష్యాన్ని చేరడానికి అవరోధంగా వున్న ప్రతి అడ్డంకినీ, ధ్వంసం చేయడం వల్ల ఇది సాధ్యమయింది’’ అంటూ, ప్రభుత్వంలో ఉంటూ ‘ధ్వంసం’ అనే కొత్త పద ప్రయోగాన్ని అధికారిక వేదిక మీది నుంచి వ్యక్తం చేశారు! ఈ విశేషమైన లక్ష్యాన్ని సాధించడానికి ‘మొత్తం ప్రభుత్వ విధానం’ – ‘మొత్తం దేశ విధానం’ కూడా తదుపరి స్థాయికి చేరిందని గోయల్‌ అభివర్ణించారు.

పదమూడు కొత్త జిల్లాలు ఏర్పడుతున్న చారిత్రక సందర్భంలో ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించడం అంటే... రాష్ట్ర విభజనను ‘సమైక్యం’ అంటూ అడ్డుకోబోయి, భంగపడి నిస్సహాయంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణాన్ని ఐదేళ్ల తర్వాత – ‘తదుపరి స్థాయికి’ తీసుకువెళ్లడమే ఇప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది కూడా. ‘రాజ్యానికి – ప్రజలకు’ మధ్య ఇన్నాళ్లు అవరోధంగా ఉన్న ప్రతి అడ్డంకినీ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ధ్వంసం చేస్తూ, మూడు రాజధానులు, పదమూడు కొత్త జిల్లాలతో ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థను, చిట్టచివరి ప్రాంత ప్రజలకు చేరువ చేస్తున్నది.

కానీ గత ప్రభుత్వ పెద్ద... ఇప్పటికీ– ‘కేంద్రీకృత అభివృద్ధి’ నమూనా అమలు కోసం పట్టుపట్టడం విస్మయం కలిగిస్తున్నది. రాష్ట్ర విభజనకు దారి తీసిన– శ్రీ కృష్ణ కమిటీ, రాజధాని ఎంపిక కోసం పనిచేసిన శివరామకృష్ణన్‌ కమిటీ... రెండూ కూడా రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్ర మూడు జిల్లాల వెనుకబాటుతనం గురించి చేసిన ప్రస్తావనను, గత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. విభజన చట్టంలోనే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కొన్ని విద్యా సంస్థలు ఈ ఏడు జిల్లాల్లో ఏర్పాటు చేయాలనే షరతు కారణంగా– సెంట్రల్‌ యూనివర్సిటీ అనంతపూర్, కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ విజయనగరం వంటివి వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పడటానికి మార్గం సుగమం అయింది. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ‘కోవిడ్‌ –19’ నీలిమేఘాలు కమ్మేశాయి. దేశంలో వివిధ ప్రాంతాలకు పొట్ట చేతపట్టుకుని వెళ్లిన వలస కార్మికులు ప్రాణాలు అరిచేతులో పెట్టుకుని – ఒడిస్సా, ఛతీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చమబెంగాల్, బిహార్, రాష్ట్రాలలోని ఇళ్లకు బయలుదేరిన వేళ, విజయవాడ జంక్షన్‌ అందుకు– సజీవ సాక్షి అయింది. మన రాష్ట్ర ప్రభుత్వ– ‘స్పర్శ’ ఆ అన్నార్తులకు ఆలంబన అయింది. ఈ మానవీయ దృక్పథమే– ‘సంక్షేమం’ పట్ల రాష్ట్ర ప్రభుత్వ ’ఫోకస్‌’ మరింత పెరగడానికి కారణం అయింది. దీన్ని తప్పు పడుతూ– ‘సంక్షేమ పథకాలతో ప్రజల్ని సోమరులను చేస్తున్నారు’ అంటున్నవారు ఇప్పటికీ వున్నారు. అయితే, ఇక్కడే వీరు ఒక కీలక అంశం దృష్టిలో ఉంచుకోవాలి. ఈ ప్రభుత్వ ద్రవ్య వినిమయంపై ‘కాగ్‌’ – ‘నీతి  ఆయోగ్‌’ వంటి కేంద్ర స్వతంత్ర సంస్థలు వెలువరిస్తున్న వార్షిక నివేదికల గురించి, జగన్‌ కఠోర విమర్శకులు సైతం నోరు మెదపడం లేదు! (క్లిక్‌: ఎవరిది యజ్ఞం? ఎవరు రాక్షసులు?)

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ళ తర్వాత... వేరే సందర్భంలో– ‘తదుపరి స్థాయికి’ చేరడానికి అడ్డంకులను–‘కూల్చడం’ అని కేంద్ర మంత్రి అని వుండవచ్చు. కానీ తొలి కలెక్టర్ల సమావేశం ముగిసిన తర్వాత, 24 జూన్‌ 2019న నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం నదీ గర్భంలో నిర్మించిన– ‘ప్రజావేదిక’ను కూల్చి భవిష్యత్‌ ఎలా ఉంటుందో సింబాలిక్‌గా చెప్పారు జగన్‌. ఈ వ్యవహారాన్ని కేవలం కట్టడాల తొలగింపుగా చూస్తే స్పష్టత రాదు. ఇందులో యాభైకి పైగా నిర్లక్ష్యానికి గురైన జాతుల అభివృద్ధికి కార్పొరేషన్లు, వాటికి– చైర్మన్లు, చైర్‌–పర్సన్లు, వైస్‌– చైర్మన్లు, డైరక్టర్ల నియామకాల్ని... జగన్‌  కొత్తగా తొలగిస్తున్న పాత అడ్డుగోడలు దృష్టి నుంచి చూడవలసివుంది. రాబోయే కొత్త జిల్లాల్లో తొలుత వీరు స్థానిక సంస్థల ప్రతినిధులుగా తర్ఫీదు పొంది, రేపు చట్టసభల ఎన్నికలకు పోటీదార్లు అవుతారు. అయితే ఈ సరికొత్త సామాజిక సరళీకరణ కదలికల్ని మొత్తంగా ఆపడానికి చేస్తున్న ప్రయత్నమే– ‘అమరావతి’! (క్లిక్‌: మీ అన్నను మాట్లాడుతున్నాను...)
 

- జాన్‌సన్‌ చోరగుడి 
అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత

మరిన్ని వార్తలు