అక్కడి ఆకలి కేకలు వినండి!

12 Nov, 2021 01:27 IST|Sakshi

ఉగ్రవాదుల హింస, తీవ్ర దుర్భిక్షం కారణంగా రెండుకోట్లమందికి పైగా అఫ్గాన్‌ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అయిదేళ్ల లోపు వయసున్న 32 లక్షల మంది పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపాన్ని ఎదుర్కోనున్నారు. 2022 మధ్యనాటికి 97 శాతం అఫ్గాన్‌ ప్రజలు దారిద్య్ర పరిస్థితులను ఎదుర్కోనున్నారని ఐక్యరాజ్య సమితి అంచనా. తాలిబన్ల మానవహక్కుల హనన రికార్డును నిర్లక్ష్యం చేయకుండానే, మానవీయ సహాయాన్ని అందించడానికి అంతర్జాతీయ సమాజం దారి వెతకాల్సి ఉంది. తాలిబన్ల జోక్యం ఎంతో కొంత తప్పని పరిస్థితుల్లో సహాయాన్ని అందించే దేశాలు, సంస్థలు తాము చేసే సహాయానికి పరిమితులు ఉన్నాయని గుర్తించాలి. తాలిబన్లను గుర్తించే విధంగా సహాయం ఉండకూడదని పాశ్చాత్య దేశాలు స్పష్టతతో ఉన్నాయి. తాలిబన్లకు లాంఛనప్రాయంగా కూడా గుర్తింపు అందజేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

అఫ్గాన్‌ ప్రభుత్వ పగ్గాలు తాలిబన్ల చేజిక్కడంతో ప్రపంచానికి కొన్ని కఠినమైన వాస్తవాలు ఎదురయ్యాయి. ఇటీవలి వారాల్లో అఫ్గాని స్తాన్‌లో శరవేగంగా ఏర్పడుతున్న మానవీయ అత్యవసర పరిస్థితి గురించి అంతర్జాతీయ సమాజం ప్రమాద హెచ్చరిక చేసింది. శీతాకాలంలో లక్షలాదిమంది అఫ్గాన్‌లకు అత్యవసర సహాయం అందించాలని పిలుపునిచ్చింది. మరోవైపున నూతనంగా ఏర్పడిన తాలిబన్‌ ప్రభుత్వం క్రమానుగతంగా అఫ్గాన్‌ ప్రజల హక్కులను హరించివేయడమే కాకుండా వారి ప్రాథమిక మానవ హక్కులపై తీవ్రంగా ఆంక్షలు విధించింది. ప్రత్యేకించి మహిళలు, బాలికల విద్యపై ఉక్కుపాదం మోపింది. అత్యవసర మానవీయ అవసరాల పట్ల ప్రతిస్పందించడంలో తాలిబన్లు, అంతర్జాతీయ సమాజ వైఫల్యం కారణంగా అఫ్గానిస్తాన్‌ దుర్భిక్షంలో కూరుకుపోనుంది.

దేశజనాభాలో సగంపైగా అంటే 2 కోట్ల 30 లక్షలమంది ప్రజలు రాబోయే నెలల్లో తీవ్రమైన ఆకలి బాధలను ఎదుర్కోబోతున్నారని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే అంచనా వేసింది. అలాగే అయిదేళ్ల లోపు వయసున్న 32 లక్షల మంది పిల్లలు ఈ సంవత్సరాంతం లోపు భయంకరమైన పోషకాహార లోపాన్ని ఎదుర్కోనున్నారు. అంతర్జాతీయ సమాజం తాలిబన్లకు ప్రోత్సాహం ఇవ్వకుండానే, వారి మానవహక్కుల రికార్డును నిర్లక్ష్యం చేయకుండానే అత్యవసరమైన మానవతావాద సహాయాన్ని అందించడానికి తప్పకుండా దారి వెతకాల్సి ఉంది. తాలిబన్ల పాలనలో కొన్ని తెగల నిర్మూలన, లింగ వివక్ష వాస్తవం. అఫ్గానిస్తాన్‌ పౌరజనాభా భవిష్యత్తుకు ఇవి హానికరం కూడా.

హింస, దుర్భిక్షంతో పెరుగుతున్న సంక్షోభం
ఆగస్టు నెలలో తాలిబన్లు పాలనను కైవసం చేసుకోవడానికి ముందే అఫ్గానిస్తాన్‌ తీవ్రమైన మానవీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ వచ్చింది. గత సంవత్సరం దేశంలో దాదాపు సగం జనాభా జాతీయ దారిద్య్ర రేఖకు దిగువన ఉండిపోయింది. సంవత్సరాలుగా కొనసాగిన ఉగ్రవాద హింస, దేశంలో పలు ప్రాంతాలు దుర్బిక్షానికి లోనుకావడం, మహమ్మారి కలిగించిన బీభత్సమే దీనికి కారణాలు. తాలిబన్ల పాలనతో ఈ సంక్షోభం మరింతగా పెరిగింది. దేశం తాలిబన్ల కైవసం అయిన వెంటనే  విదేశాల్లోని దాదాపు 9.5 బిలియన్‌ డాలర్ల అఫ్గాన్‌ ఆస్తుల్ని అమెరికా స్తంభింపజేసింది. దీంతో దేశ ద్రవ్య, ప్రభుత్వ రంగ సంస్థలు కుప్పగూలి పోయాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం 30 శాతం వరకు పడిపోనుంది. దీంతో ప్రజలు మరింతగా దారిద్య్రంలో కూరుకుపోవడం ఖాయం. 2022 మధ్యనాటికి 97 శాతం అఫ్గాన్‌ ప్రజలు దారిద్య్ర పరిస్థితులను ఎదుర్కోనున్నారని ఐక్యరాజ్య సమితి అంచనా.

సహాయ పంపిణీలో తాలిబన్లను జోక్యంపై కలవరం
తమను అంతర్జాతీయ సమాజం గుర్తించాలనీ, అమెరికా స్తంభిం పజేసిన అఫ్గాన్‌ ద్రవ్య రిజర్వులను విడుదల చేయాలని తాలిబన్లు డిమాండ్‌ చేశారు. యూరోపియన్‌ యూనియన్‌ కూడా అఫ్గానిస్తాన్‌కి అందిస్తున్న అభివృద్ధి నిధులపై కోత విధించింది. దాదాపు 40 కోట్ల అమెరికన్‌ డాలర్ల సహాయ నిధిని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సస్పెండ్‌ చేయగా, ప్రపంచ బ్యాంక్‌ కూడా ఈ సంవత్సరం ఆ దేశానికి అందించాల్సిన 80 కోట్ల డాలర్ల సహాయనిధిని స్తంభింపజేసింది. అఫ్గానిస్తాన్‌ మానవ విధ్వంస పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, తాలిబన్‌ నిర్బంధ పాలనను బలోపేతం చేయకుండానే, అత్యవసర సహా యాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికతీరులో పంపిణీ చేయవచ్చా అనే అంశం ఆందోళన కలిగిస్తోంది.

అఫ్గానిస్తాన్‌కు వెళ్లే ఏ నిధులైనా సరై ఉగ్రవాదానికి సహాయపడేందుకే ఉపయోగించవచ్చని, సహాయ నిధిని కూడా కబ్జా చేస్తారని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ హెచ్చరించింది. మానవహక్కులను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చే తాలిబన్లు అంతర్జాతీయ సమాజం పంపే సహాయ నిధులను  సమర్థంగా, న్యాయబద్ధంగా పంపిణీ చేస్తారనేది ప్రశ్నార్థకమే. లింగపరంగా మనుషులను వేరుచేసి వివక్ష చూపే తాలిబన్ల విధానాలవల్ల మహిళలు పెద్ద ఎత్తున శ్రామికరంగం నుంచి దూరమైపోయారు. ప్రాథమిక విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో అత్యవసరమైన పాత్ర పోషించడం మినహా దాదాపు మహిళలందరినీ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలనుంచి నెట్టేశారు. దీంతో వారి ఆదాయంపై జీవిస్తున్న అసంఖ్యాకమైన కుటుంబాలు దుర్బరపరిస్థితుల్లో కూరుకుపోయాయి. పాఠశాలలకు, విశ్వవిద్యాలయాలకు హాజరు కాకుండా లక్షలాది మంది అఫ్గాన్‌ బాలికలను ఇప్పటికే నిషేధించారు. తాలిబన్ల ఈ విధానాలు సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీరికే అధికంగా మానవతా సహాయం అందించాల్సిన అవసరం ఉంది. మహిళా సహాయ కార్యకర్తలపై తాలిబన్లు విధించిన కఠిన ఆంక్షల కారణంగా దేశంలోని మహిళల్లో చాలామందికి ఈ సహాయం అందడం అసాధ్యమనే చెప్పాలి.

పైగా, హజారా మైనారిటీ ప్రజలను ఇళ్లనుంచి, పొలాలనుంచి బలవంతంగా ఖాళీ చేయించడం ద్వారా భారీస్థాయిలో భూముల ఆక్రమణ దందాలో తాలిబన్లు మునిగితేలుతున్నారు. గత ప్రభుత్వంతో సంబంధాలున్న ఇతర ప్రజలను లక్ష్యంగా చేసుకుని సామూహిక శిక్షలు విధిస్తున్నారు.  ప్రజలను ఇలా పెద్ద ఎత్తున ఆస్తులకు దూరం చేయడం, ఇస్లామిక్‌ స్టేట్‌ స్థానిక ముఠా ద్వారా మైనారిటీలపై ఘాతుక దాడులకు పాల్పడటం వంటివి అఫ్గానిస్తాన్‌లో జాతిహనన కాండకు దారితీస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత ప్రభుత్వాన్ని బలపర్చిన బృందాలను, వ్యక్తులను చిత్రహింసలకు గురిచేస్తూ, సామూహికంగా ఉరి తీస్తున్న ఘటనలు అనేకం నమోదవుతున్నాయి. తాలిబన్లను తీవ్రంగా నిరోధించిన పంజ్‌షేర్‌ ప్రావిన్స్‌లో పౌరులను కూడా హింసించి చంపుతున్నారని ఆరోపణలు వచ్చాయి.

సహాయం ఎలా చేయాలి?
అఫ్గాన్‌లో దీర్ఘకాలం కొనసాగే శీతాకాలంలో ప్రాణరక్షణ సామగ్రిని పంపడం ద్వారా అంతర్జాతీయ దాతలు తక్షణ సహాయం అందించడం ముఖ్యం. అయితే తాలిబన్ల కోరికమేరకు వారిని గుర్తించకుం డానే, సహాయ నిధులను వారు నేరుగా నియంత్రించని విధంగా ప్రపంచం ఇప్పుడు అఫ్గానిస్తాన్‌ని ఆదుకోవలసి ఉంది. దీనికోసం జి–20 దేశాలు ఇప్పుడు దారులు వెతుకుతున్నాయి. తాలిబన్‌ ప్రభుత్వ జోక్యం ఎంతో కొంత అవసరమైన పరిస్థితుల్లో సహాయాన్ని అందించే దేశాలు, సంస్థలు తాము చేసే సహాయానికి పరిమితులు ఉన్నాయని తప్పకుండా అర్థం చేసుకోవలసి ఉంది. తాలిబన్లతో ఒప్పందం కోసం యూనిసెఫ్‌ ఇప్పటికే చర్చలు జరిపింది. దీని ప్రకారం తాలిబన్‌ నియంత్రణ సంస్థల చేతిలో నిధులు పడకుండా టీచర్లకు నేరుగా వేతనాలు చెల్లించవచ్చు. ఇది విజయవంతమైతే, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లోనూ ఈ నమూనాను సమర్థంగా అమలు చేయవచ్చు.

ఇక మానవీయ సహాయాన్ని అందించడానికి, దాతలు, ఎన్జీవోలు ఇప్పటికే ఉనికిలో ఉన్న కమ్యూనిటీ యంత్రాంగాలను ఉపయోగించుకోవచ్చు. అఫ్గాన్‌కి తక్షణ సహాయంగా బిలియన్‌ యూరోలను అంది స్తానని యూరోపియన్‌ యూనియన్‌ హామీ ఇచ్చింది. దీంట్లో సగభాగాన్ని దేశంలో పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థల ద్వారా అందించనున్నారు. దేశంలోకి సహాయం రూపంలో పంపిస్తున్న నిధులు తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించేవిధంగా ఉండకూడదని పాశ్చాత్య దేశాలు స్పష్టమైన అవగాహనతో ఉన్నాయి. తమకు అంతర్జాతీయ గుర్తింపును సాధించుకోవడం కోసం, ప్రపంచదేశాలు పంపే అంతర్జాతీయ సహాయాన్ని తాలిబన్లు ఉపయోగించుకోకుండా చేయాలి. తాలిబన్లు నిజమైన చిత్తశుద్ధిని ప్రదర్శించకుంటే, ప్రపంచం ఆచరణాత్మకంగా, మానవీయ ప్రాతిపదికన మాత్రమే తాలిబన్లతో వ్యవహరించాల్సి ఉంది. ప్రస్తుత నేపథ్యంలో తాలిబన్లకు లాంఛనప్రాయంగా కూడా గుర్తింపు అందజేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

– సైఫుల్లా తయే, పరిశోధకుడు, డేకిన్‌ వర్సిటీ
– నియమతుల్లా ఇబ్రహీం, లెక్చరర్, లా ట్రోబ్‌ వర్సిటీ 

మరిన్ని వార్తలు