నిశ్శబ్ద కార్యదక్షతకు ‘నూరేళ్ల’ నివాళి

27 Mar, 2021 15:57 IST|Sakshi

తెలంగాణ సమాజ చైతన్యానికి, వికాసానికి కృషి చేసిన మహానుభావుల్లో నూకల నరోత్తమ్‌రెడ్డి ముఖ్యులు. అరుదైన బహుముఖ ప్రజ్ఞ ఆయన సొంతం. నిరాడంబరంగా ఉండే నిశ్చల, నిశ్శబ్ద కార్యదక్షుడాయన. జనహితంలో చిన్న పనిచేసినా పెద్దగా ప్రచారం పొందడానికి ఎన్నో పాట్లు పడే మన వ్యవస్థలో.. ఏమాత్రం ప్రచారయావ లేకుండా , ప్రతిఫలాపేక్ష చూపకనే వివిధ రంగాలు, వర్గాల ప్రజలకు అపార సేవలు అందించిన మహనీయుడు. జర్నలిజం, సాహిత్యం, సాంస్కృతికం, క్రీడలు, విద్య, పరిపాలన, రాజకీయం... ఇలా ఎన్ని రంగాలో? కాలూనిన ప్రతిచోటా తనదైన ముద్రవేసిన ఆయన సామర్థ్యం గురించి వింటే ఎవరికైనా విస్మయమే! ఓ మనిషి, ఒక జీవిత కాలంలో ఇన్ని పనులు, ఇంత సమర్థంగా చేయడం అరుదు. అదీ మచ్చలేని రీతిలో పలువురు ప్రశంసించేలా నిర్వహించడం అసాధారణం. కానీ, నరోత్తమ్‌రెడ్డి తెలుగువారు మరచిపోని విధంగా ఆ కృషి చేసి చూపించారు. 

మహబూబాబాద్‌కు చెందిన ఆయన తెలంగాణ వైతాళికుల్లో ఒకరు. జర్నలిజం చదివి, దేశ స్వాతంత్య్రపు రోజుల్లో ముంబాయిలో నాటి ‘బొంబాయి క్రానికల్‌’కు పనిచేస్తున్నారు. సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక సంపాదకత్వం నుంచి తప్పుకున్నపుడు, కొత్వాల్‌ రాజ బహుదూర్‌ వెంకట్రామారెడ్డి సూచన మేరకు నరోత్తమ్‌రెడ్డి హైదరాబాద్‌ వచ్చి సదరు బాధ్యత చేపట్టారు. 

అలా.. గోల్కొండ సంపాదకులుగా (20 ఏళ్లు), రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా (10), ఆంధ్ర సారస్వత పరిషత్తు (నేటి తెలంగాణ సారస్వత పరిషత్తు) కోశాధికారిగా, చైర్మన్‌గా (30), లలిత కళా అకాడమీ చైర్మన్‌గా (25), రాజా కృష్ణదేవరావ్‌ పేరిట ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్‌ సంస్థ విద్యాకమిటీ నేతృత్వంలో (15), బాల్‌ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌గా (10), ఉస్మానియా విశ్వవిద్యాలయం సిండికేట్‌ సభ్యుడిగా, ఉప కులపతిగా కలిపి (20 ఏళ్లు) ఇలా, కొన్నిమార్లు ఏక కాలంలో వేర్వేరు బాధ్యతలూ నిర్వహించి నాయ కత్వానికి తానొక ప్రతీకగా నిలిచారు. 

ఇంకోరకంగా చెప్పాలంటే... బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం అన్నీ కలగలిపిన 63 ఏళ్ల పరిపూర్ణ జీవితంలో అంతకు రెట్టింపు కంటే ఎక్కువ సంవత్సరాలు, సుమారు 130 ఏళ్ల (వేటికవిగా లెక్కిస్తే!) క్రియాశీల జీవితం గడిపిన ధన్యజీవి! పార్లమెంటు సెషన్‌ నడుస్తున్నా.. విధిగా హైదరాబాద్‌ వచ్చి సమావేశాలకు హాజరయ్యే ఉస్మానియా విశ్వవిద్యాలయం, సారస్వత పరిషత్తులు ఆయన జీవితంలో అవిభాజ్య అంగాల య్యాయి. ఆయన చొరవవల్లే ఉస్మానియాలో జర్నలిజం విభాగం ఏర్పడింది. ఉద్యోగాల్లో ఉన్నవారు తీరిగ్గా ఉండే సాయం వేళల్లో చేసుకోవడానికి వీలుగా ఎంబీఏ, లా కోర్సులు తీసుకురావడంలోనూ ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

తొలిదశ తెలంగాణ ఉద్యమాలతో, స్పర్థలతో ఓయూ ప్రాంగణం మూడేళ్లు కల్లోలితమై 300 మందికి పైగా అసువులు బాశారు. విద్య–విద్యార్థులు చెల్లా చెదురైనపుడు ‘సాంత్వనకు ఓ కులపతి‘ అని సమాజమే కోరి తెచ్చుకున్న ఘనాపాటి! నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తెలుగునాట చేసిన ప్రసంగాలకు వేదికలపై అనువాదకుడిగా ఉండేవారాయన. ముఖ్యమంత్రులు సంజీవయ్య, పీవీ నర్సింహారావు, ప్రధానమంత్రులు నెహ్రూ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి వంటి అత్యున్నత వ్యక్తులతో సాన్నిహిత్యం ఉన్నా, పెరట్లో పనిచేసే తోటమాలికి కూడా సముచిత గౌరవం ఇచ్చే సమున్నత వ్యక్తిత్వం ఆయనది. 

ఇంతటి ఘన చరిత్ర కలిగిన నూకల నరోత్తమ్‌రెడ్డిని, ఆయన శతజయంత్యుత్సవాలు జరుపుకుంటూ స్మరించు కోవడమంటే, మనని మనం గౌరవించుకోవడం. ఆయన బహుముఖ ప్రజ్ఙను భావితరాలకు వారసత్వ సంపదగా పదిలపరిచి, పంపిణీ చేయడం. తెలుగు నాట తరాలతరబడి చైతన్యం రగిలించే స్ఫూర్తిని మరింత పరివ్యాప్తం చేయడం. ఆయన విశేష ప్రతిభ చూపిన సాహిత్యం, జర్నలిజం, లలితకళలు, క్రీడలు, విద్య, పాలన, రాజకీయాలకు సంబంధించి కనీసం ఒక్కోటి చొప్పున ఏడాది పొడుగునా కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఇదొక గొప్ప సందర్భం.

– సవ్యసాచి         
(మార్చి 27న నూకల నరోత్తమరెడ్డి శతజయంత్యుత్సవాలు ప్రారంభం)

మరిన్ని వార్తలు