Sri Lanka: రుణ ఉపశమనం కాదు.. రుణ న్యాయం కావాలి

5 Aug, 2022 13:45 IST|Sakshi
శ్రీలంక అధ్యక్షుడు విక్రమ సింఘె, ప్రధాని గుణవర్దనె

శ్రీలంక పార్లమెంటులో జూలై 20న అధ్యక్షుడిగా విక్రమసింఘె ఎన్నిక, కొత్త ప్రధాని గుణవర్దనె నియామకం, ప్రధాని మోదీ వారిని అభినందించటం ఇటీవలి వార్తలు. విక్రమ సింఘె గెలుపు ఖాయమని ముందు రోజునే తేలిపోయిందనీ, గెలుపునకు భారత ప్రభుత్వ సహాయ సహకా రాలున్నాయనీ, ఆ ఇద్దరూ అమెరికా, యూరప్, ఇండియాలకి ఆమోదయోగ్యులే అని విశ్లేషణలు వెలువడ్డాయి. జూలై 19నే కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో శ్రీలంక ప్రభుత్వానికి పూర్తి సహకారం, ఐఎంఎఫ్‌ రుణం పొందటానికి తగిన సాయం చేస్తామని విదే శాంగమంత్రి జయశంకర్‌ చెప్పారు. పనిలోపనిగా ఇక్కడి రాష్ట్రాల రుణాలను, సబ్సిడీలను ఈ సందర్భంగా తప్పుపట్టే రీతిలో వివరించారు. ఇది అప్రస్తుతమనీ, శ్రీలంక ‘దేశం’ అప్పులను ‘రాష్ట్రాల’ అప్పులతో పోల్చి గందర గోళం సృష్టిస్తున్నారనీ, ఆ పేరుతో ఇక్కడ ‘రాజకీయాలు’ చేయటం, పరోక్షంగా రాష్ట్రాలను నిందించటం తగదనీ వివిధ పార్టీలు నిరసన తెలిపాయి. 

శ్రీలంకకు చెందిన 30 మంది ఆర్థిక, సామాజిక శాస్త్రాల నిపుణులు; మాజీ అధికారులు, విద్యార్థి కార్మిక రైతాంగం మత్స్యకారుల సంఘాల నేతలు అధ్యక్ష ఎన్నిక తర్వాత ఒక ప్రకటన విడుదల చేశారు. నిజానికి శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి ముఖ్య కారణం ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, ఇంటర్నేషనల్‌ సావరీన్‌ బాండ్‌ (ఐఎస్‌బీ), అమెరికా, యూరపు దేశాల, ‘బ్లాక్‌ రాక్‌’ వంటి కమర్షియల్‌ రుణాలూ, వారి షరతులే. 2022 మే నెలలో శ్రీలంక రుణాలు 5 వేల కోట్ల డాలర్లు కాగా అందులో సగానికి పైగా పైన పేర్కొన్న రుణ సంస్థల వాటాయే. నిజానికి ఈ ఏడు కట్టాల్సిన రుణం 500 కోట్ల డాలర్లే. కోవిడ్, ఉక్రెయిన్‌ యుద్ధం, వాటివల్ల  భారాలు పెరిగి, టీ వంటి ఎగుమతులూ, టూరిజం ఆదాయం తగ్గి, అనేక దేశాల్లాగే శ్రీలంకా దెబ్బతిన్నది. స్వతంత్రం వచ్చాక శ్రీలంకలో బాకీలు తీర్చలేని స్థితికి చేరడం ఇదే మొదటిసారి. కాగా అతిశయోక్తులతో, తప్పుడు సమాచారంతో పై పాశ్చాత్య శక్తులు, వారి మీడియా విదేశీమారకం (డాలర్ల) కొరతనీ ‘దివాళా స్థితిగా చిత్రించి’ రుణదిగ్బంధనం వంటిది చేశారు.

మానవాభివృద్ధి సూచికలో పైకి వచ్చిన శ్రీలంకని ప్రస్తుత రుణ సంక్షోభంతో ఇప్పుడు ‘అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశం’గా (ఎల్‌డీసీ) పునర్వర్గీకరించ చూస్తున్నారు. అలాంటి దేశాలకు ఆర్థిక విదేశాంగ వ్యవహారాల్లో అటానమీ, సార్వభౌమాధికారం నిరాకరించబడుతుంది. ఇది నిజంగా దివాళా కాదు, ఇది వారు ‘సృష్టించిన డిఫాల్ట్‌’. తమ వ్యూహా నికి తగినట్టుగా వారు శ్రీలంక వనరులను, ఆస్తులను, పెట్టుబడులను తగ్గించి చూపి, ఆర్థిక–ద్రవ్య లెక్కలనూ, సూచికలనూ, అల్గారిథమ్స్‌– మ్యాట్రిసెస్‌నూ తారుమారు చేస్తున్నార’’నేది ఆ ప్రకటన సారాంశం.

శ్రీలంకలో ‘ఆర్థిక ప్రజాస్వామ్య సమష్టి వేదిక’ పేరిట ఉన్న ఈ ప్రకటనలో ఐఎంఎఫ్‌తో కొద్దివారాల క్రితమే మొదలైన చర్చలలో పారదర్శకత బొత్తిగా లేదని ఆరోపించారు. ప్రపంచ సముద్ర రహదారుల్లో కీలక స్థావరంగా ఉన్న శ్రీలంక ‘క్వాడ్‌’లో చేరాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. ‘కోవిడ్‌–19 బెయిల్‌ అవుట్‌ ఫండ్‌’ పేరిట అమెరికా ప్రభుత్వం అనేక పేద దేశాలకు రుణాలు ఇచ్చి ఆయా దేశాల సంపదల్ని కాజేయటానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల్నీ, ప్రాజెక్టుల్నీ... చౌకగా, చాటుగా అమ్మేసే, ప్రైవేటీకరించే రీతిలో స్థానిక వనరుల ఆస్తుల విలువను తగ్గించి చూపుతున్నారనీ; దేశ ఇంధనం, ఆహార భద్రతలనూ, సార్వభౌమత్వాన్నీ బలిపెడుతున్నారనీ ఆరోపించారు. ‘యుగ ఘనవి పవర్‌ ప్లాంట్‌’ని ఇప్పటికే అమె రికాకు చెందిన కంపెనీ ‘న్యూఫోర్ట్రెస్‌’కు కారుచౌకగా కట్ట బెట్టారని ఉదహరించారు.

‘ఇప్పుడు కావల్సింది రుణ ఉపశమనం కాదు, రుణ న్యాయం’ అన్నారు. అర్జెంటీనా, గ్రీస్, లెబనాన్‌ దేశాల్ని ఉదహరించి, ‘సంక్షోభానికి ఐఎమ్‌ఎఫ్‌ కారణమే కాని పరిష్కారం కాజాలదు’ అని చెప్పారు. డాలరు ఏకచ్ఛత్రాధిపత్యాన్ని రద్దు చేసి, వివిధ కరెన్సీల బాస్కెట్‌తో లావాదేవీలు జరపాలనీ... కుబేరులపై పన్నులు వేసి వసూలు చేయాలనీ, ‘స్థానిక ఉత్పత్తుల్ని కొనాలి’ అన్న ఉద్యమాన్ని ప్రోత్సహిం చాలనీ వారు కోరారు. రాజపక్స కుటుంబాల వంటి వాటికాజేసిన ఆస్తులను రాబట్టడం అవసరమే కానీ అంతకు మించి రుణ న్యాయం, రుణాల రద్దు అవసరమని అన్నారు. మొత్తం మీద ఈ ప్రకటన శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితినీ, ప్రజల ఆకాంక్షలనూ ప్రతిబింబిస్తోంది. (క్లిక్‌: పై కోర్టుల్లోనూ రిజర్వేషన్లు ఉండాలి)


- డా. ఎమ్‌. బాపూజీ 
సీఎస్‌ఐఆర్‌ విశ్రాంత శాస్త్రవేత్త

మరిన్ని వార్తలు