ఇక త్రివిక్రమాంధ్ర!

2 Aug, 2020 00:24 IST|Sakshi

జనతంత్రం

గంగ స్నానం–తుంగ పానం లోకోత్తరం. పవిత్ర స్నానానికి గంగాజలాలను మించినవి లేవనీ, దాహానికి తుంగభద్ర నీటి కంటే మధురమైనవి లేవని మన పూర్వీకుల నమ్మకం. అందుకే కాబోలు తుంగభద్ర తీరంలోని కుందేళ్లు సైతం వేట కుక్కలను తరిమికొట్టాయన్న కథ వ్యాప్తిలోకి వచ్చింది. ఈ కారణంగానే ఆ ప్రదేశంలో విజయనగర సామ్రాజ్యానికి పునాదులు పడ్డాయన్న కథ కూడా ప్రచారంలో ఉంది. తుంగభద్ర తీరంలోని ప్రధాన మైన తెలుగు పట్టణం కర్నూలు. ప్రసిద్ధి చెందిన కమ్మనైన సన్న బియ్యాన్ని పండించే వరాన్ని కర్నూలు రైతుకు ప్రసాదించింది కూడా తుంగభద్రమ్మే. తెలంగాణలోని జోగులాంబ జిల్లా సహా తన పరీవాహక ప్రాంతవాసుల నోళ్లనూ, వారి మనసుల్నీ కూడా మధురం చేస్తూ కృష్ణవేణిలోకి ఒరిగిపోతుంది తుంగభద్ర. అక్క డనుంచి శ్రీశైలం మల్లన్నను అభిషేకించి నాగార్జునకొండను ముట్టడించి, ఖనిజ నిక్షేపాల పలనాడు మీదుగా ధాన్యరాశుల వెలనాడుకు వెళుతుంది. దారిలో అమరేశ్వరుడు కొలువైన అమ రావతి సీమకు ముక్కారు పంటల సౌభాగ్యాన్ని ప్రసాదించింది కృష్ణా నది. అక్కడ దుర్గాభవానికి ప్రణమిల్లి నెమ్మదిగా సాగ రంలో కరిగిపోతుంది. కృష్ణానదితోపాటు ఈ దేశంలో ప్రవహిం చిన అనేక నదులను తనలో కలుపుకున్న బంగాళాఖాతం తీరంలో కొండల నడుమ కొలువుదీరిన నిండు జాబిలి వంటి నగరం విశాఖపట్టణం. సముద్రపు అలలకు ఎప్పుడూ విశాఖ అభిమాన యాత్రాస్థలమే. ఈ తీరంలోని కెరటాల సాక్షిగానే ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి గురజాడ పురుడుపోశాడు. శ్రీశ్రీ కవితల కవాతుకు నేపథ్య సంగీతమై సముద్రం ఘోషించింది విశాఖ తీరంలోనే. కోడి రామ్మూర్తి భుజబల విన్యాసాలను తిలకించడానికి దూర తీరాల నుంచి సముద్రపు అలలు విశాఖవైపు వచ్చేవి. ద్వారం వేంకటస్వామినాయుడు సారంగి రాగాలకు సాగర కెరటాలు తల లూపింది ఇక్కడే. చలం సాహితీ మైదానం ఇదే.

ఉపనదినీ, నదినీ, సముద్రాన్నీ అనుసంధానిస్తూ మూడు రాజధానుల వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లో అమలులోకి వచ్చింది. శాసనసభ ఆమోదించిన తీర్మానానికి గవర్నర్‌ ఆమోదముద్ర లభించడంతో కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా రూపుదాల్చాయి. మూడు ప్రాంతాల అభివృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందన్న ఆశాభావం మెజారిటీ ప్రజల్లో వ్యక్త మైంది. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ ‘అమరావతి తరహా’ ప్రయోగాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించింది. గ్రీన్‌ఫీల్డ్‌ (సరి కొత్తగా నిర్మితమయ్యే) నగరాలు ప్రపంచంలో ఎక్కడా విజయం సాధించలేదనీ, ఇక్కడ కూడా సాధించే అవకాశం లేదనీ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. గుంటూరు–విజయవాడల మధ్యన రాజధాని ఏర్పాటు ఏమాత్రం భావ్యం కాదనీ, దాని ఫలితంగా మూడు పంటలు పండే భూములను వ్యవసాయేతర అవసరాలకు పెద్ద ఎత్తున బదలాయిస్తారనీ, అందువలన దేశ ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుందని కూడా శివరామ కృష్ణన్‌ కమిటీ హెచ్చరించింది. కమిటీ సిఫార్సులకు పూర్తి విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అమరా వతి రాజధానిగా ప్రకటించింది.

రాజధానికోసం గత ప్రభుత్వం భూ సమీకరణ పేరుతో అనుసరించిన విధానం తీవ్ర వివాదాస్పదమైంది. ముఖ్య మంత్రి, ఆయన అనుయాయులకు భారీ లబ్ధి చేకూరేవిధంగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. బినామీ లను రంగంలోకి దించి పాలకపక్షం నేతలే భూములు కొను గోలు చేశారన్న ఆరోపణలకు తగిన ఆధారాలు కూడా బయట పడ్డాయి. ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించి, భూసమీకర ణకు ఇచ్చి కొందరు ప్రబుద్ధులు ప్రభుత్వం ఇచ్చే ప్లాట్లకు లబ్ధి దారులయ్యారు. ఇక రాజధాని నిర్మాణం కోసం సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీలతో ఎటువంటి పారదర్శకత లేకుండా చేసు కున్న చీకటి ఒడంబడికలు ప్రభుత్వ పెద్దల రహస్య వ్యూహానికి అద్దంపట్టాయి. రాజధాని ప్రాజెక్టును ప్రపంచంలోనే అతిపెద్ద దైన ఒక రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌గా ప్రభుత్వం చేపట్టిందని నిపు ణులు తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి కుటుంబానికి, ఆయన అనుయాయులకు దీర్ఘకాలంలో లక్షల కోట్ల లాభాలను ఆర్జించి పెట్టే అక్షయపాత్రగా ఈ ప్రాజెక్టును డిజైన్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర అవసరాలనూ, ప్రజల ఆకాంక్షలనూ పట్టించు కోకుండా కేవలం సంపాదన యావతో అమరావతి ప్రాజెక్టును తలకెత్తుకోవడం ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఒక విషాద ఘట్టం.

తన భూభాగంలో రాజధాని నగరం లేకుండానే వందల యేళ్లపాటు కాలం వెళ్లదీసిన చరిత్ర ఈ రాష్ట్రానిది. ఒక చారిత్రక అన్యాయం ఇది. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు మాత్రం ఒక మూడేళ్లపాటు కర్నూలు రాజధానిగా ఉన్నది. విశా లాంధ్ర ఏర్పాటై హైదరాబాద్‌ రాజధాని కావడంతో కర్నూలు రాజధాని కథ మూడేళ్ల ముచ్చటగానే ముగిసింది. ఉమ్మడి మద్రాసులో భాగంగా ఉన్న సమయంలోనే తెలుగువారికొక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయితే రాజధాని ఎక్కడుండాలి? మంత్రి వర్గ, శాసనసభల కూర్పులు ఎలా ఉండాలి అనే అంశాలపై కోస్తా, రాయలసీమ నేతల మధ్య చర్చోపచర్చలు జరిగాయి. ఇందులో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఇంట్లో (శ్రీబాగ్‌) జరిగిన ఒడంబడిక ముఖ్యమైనది. ఈ ఒడంబడిక ప్రకారం రాష్ట్ర విభజన జరిగితే, మద్రాసు తెలుగువారికి వచ్చే పక్షంలో మద్రాసే రాజధానిగా ఉంటుంది, లేనిపక్షంలో రాయలసీమలో నూతన రాజధాని ఏర్పడాలి. శ్రీబాగ్‌ ఒడంబడిక జరిగిన పద హారేళ్లకు మద్రాసు రాష్ట్రం నుంచి సీమాంధ్ర ప్రాంతం విడి పోయింది. మద్రాసు నగరంపై ఆంధ్ర నాయకులు పంచాయితీ పెట్టారు. సహజంగానే అది దక్కలేదు. అప్పుడు కర్నూలును రాజధానిగా ఉంచేందుకు అంగీకరించారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. అప్పటికే దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలపై చర్చ మొదలైంది. హైదరాబాద్‌ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రాన్ని విలీనం చేయాలన్న ఆలోచ నకు కేంద్రం వచ్చింది. మద్రాసు నగరం కోసం ఆంధ్ర నాయ కత్వం పేచీ పెట్టిన సందర్భంలో త్వరలో మీకు హైదరాబాద్‌ నగరం రాజధానిగా రానుందనీ, అందువల్ల మద్రాస్‌ డిమాం డ్‌ను వదిలేసుకోవాలనీ ఒక సూచన కేంద్ర నాయకత్వం నుంచి అందిందనీ చెబుతారు. ఫలితంగానే తాత్కాలిక ఏర్పాటుగానే కర్నూలును ఆంధ్ర నాయకత్వం సమ్మతించిందనే అభిప్రాయం ఉండేది.

రాజధాని కోరిక మూడేళ్ల ముచ్చటగా మిగిలిన గాయంతో పాటు సాగునీటి గాయాలు కూడా అడపాదడపా ప్రజలను బాధి స్తూనే వచ్చాయి. వివక్షకు గురవుతున్నామన్న భావన ఉత్తరాంధ్ర ప్రజల్లో కూడా చాలాకాలం నుంచి వుంది. యాభయ్యేళ్ల కిందనే శ్రీకాకుళం గిరిజన తిరుగుబాటు రూపంలో అది వ్యక్తమైంది. నీళ్లు, నిధులు, నియామకాల్లో నిర్లక్ష్యానికి గురవుతున్నామన్న భావనతో తెలంగాణలో ప్రత్యేక ఉద్యమం మొదలైంది. దీనికి కొన్ని రాజకీయ కారణాలు, కేసీఆర్‌ నాయకత్వ చాతుర్యం తోడ వడంతో రాష్ట్రం విడిపోయింది. ఈ అనుభవాలు కళ్లముందు కని పిస్తున్నప్పుడు కొత్త రాష్ట్ర ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? కేవలం స్వప్రయోజనాలకోసం పాకులాడే స్వార్థ సంకుచిత రాజకీయ నాయకత్వం మాత్రమే అమరావతి తరహా ప్రాజెక్టును తలకెత్తుకోగలదు. నిస్సందేహంగా వైఎస్‌ జగన్‌ తీసు కున్న మూడు రాజధానుల నిర్ణయం ఆయన రాజకీయ పరిణతికి, రాజనీతిజ్ఞత (స్టేట్స్‌మన్‌షిప్‌)కు అద్దంపడుతున్నది. రాజకీయ పరిపక్వతకు సుదీర్ఘ అనుభవం ఒక కొలమానం కాదని ఈ చారి త్రక ఘట్టం చాటిచెప్పింది. ప్రపంచంలో మూడు రాజధానులు ఎక్కడైనా ఉన్నాయా అని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదొక వెర్రి వాదన. గ్రామ సచివాలయాలు ఎక్కడైనా ఉన్నాయా? వలం టీర్ల వ్యవస్థ ఎక్కడైనా ఉందా? అవి సత్ఫలితాలను ఇవ్వడం లేదా? మిగిలిన రాష్ట్రాలు, కొన్ని దేశాలు అనుకరించబూనలేదా? మారుతున్న ప్రజల అవసరాలను గుర్తించడం, ప్రజల ఆకాంక్ష లను గౌరవించడం ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రాథమిక సూత్రం. అందుకు అనుగుణంగా తీసుకునే సృజనాత్మక నిర్ణయాలు ఇతరు లకు కూడా మార్గదర్శకంగానే నిలుస్తాయి.

మూడు రాజధానుల నిర్ణయం చట్ట రూపం దాల్చి అమలు లోకి వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్ష నేత ఇంకా అడ్డుకుంటానని చెప్పడం ఎవరిని మభ్యపెట్టడానికి? రాజధాని అంశం రాష్ట్రం పరిధిలోని విషయమనీ, తాము జోక్యం చేసుకోలేమని కేంద్రం పార్లమెంట్‌ సాక్షిగా లిఖితపూర్వకంగా తెలియజేసింది. రాజ్యాం గంలో పొందుపరిచిన అంశాలకు భిన్నమైన లేదా విరుద్ధమైన నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటే తప్ప న్యాయ స్థానాలు కూడా జోక్యం చేసుకోలేవని నిపుణులు చెబుతున్నారు. రాజధాని అంశంపై రాజ్యాంగంలో ఎటువంటి ప్రస్థావన లేదు. మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్‌ నిర్ణయాలు తీసుకుం టారు. అసెంబ్లీ సమావేశాలను ఏ ప్రాంతంలోనైనా నిర్వహించే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా ఏ ప్రాంతాన్నయినా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసుకోవచ్చు. ఇందుకు అడ్డుపడే రాజ్యాంగ నిబంధనలేవీ లేవు. ఇంకా ఏదో బ్రహ్మాండం బద్దలౌతుందనీ, మూడు రాజధానులు ఆగిపోతా యనీ చెప్పడం కేవలం ప్రజలను మోసగించడమే. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు గుర్తుకొచ్చి ప్రతిపక్ష నేత కళ్లలో నీళ్లు తిరిగాయని మీడియాకు లీకులు ఇచ్చారు. మరి పోలవరం ప్రాజె క్టుకు భూములిచ్చింది రైతులు కాదా? అప్పుడెందుకు రాలేదు కన్నీళ్లు? బందరు పోర్టుకు భూములిచ్చింది రైతులు కాదా? భోగాపురం రైతులకోసం ఎందుకని కన్నీరు ఉబికి రాలేదు? కరెంటు చార్జీలు తగ్గించాలని కోరుతూ ప్రదర్శన చేసిన రైతు లను కాల్చి చంపినప్పుడు ఆ కళ్లు జలజలమని రాలలేదెందుకు? వందలాదిమంది రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఎందుకు కన్నీటి ధారలు ఊరలేదు. అమరా వతి రైతుల ప్రత్యేకత ఏమిటీ? వాళ్లిప్పుడు నష్టపోయిందెక్కడ? వాస్తవానికి రైతులకు, ఆ ప్రాంత పౌరులకూ ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వమే విస్మరించింది. ఎగవేసిన పేదల పెన్ష న్లను, బకాయిపెట్టిన రైతుల వార్షిక కౌలునూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెల్లించింది. పైగా రైతులు ఇచ్చిన భూములు, రైతులకు అభివృద్ధి చేసి ఇస్తామన్న భూములూ నిక్షేపంగా అక్కడే ఉన్నాయి. ఎవరికీ బదలాయించలేదు. కనుక రైతుల పేరుతో చేసే వర్చువల్‌ ఆందోళన కార్యక్రమాలు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్లుగానే మిగిలిపోతాయి. రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తి ప్రారంభమైన నాలుగున్నర నెలల్లో కేవలం రెండు రోజులు మినహా మిగిలిన రోజులన్నీ ఐసోలేషన్‌లోనే ఉండి చంద్రబాబు జాతీయ రికార్డు సృష్టించారని చెబుతున్నారు. ఇదే విధానాన్ని కొనసాగిస్తే ఇక శాశ్వత పొలిటికల్‌ ఐసోలేషన్‌ తప్పకపోవచ్చు.

muralivardelli@yahoo.co.in
వర్ధెల్లి మురళి

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా