క్రీమీ లేయర్‌ పరిమితిని 30 లక్షలకు పెంచాలి

28 Jul, 2020 01:54 IST|Sakshi

సందర్భం
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం బి.పి. శర్మ కమిటీ నివేదికను ఆమోదించి ఉద్యోగుల జీతాలను సంపన్న శ్రేణి నిర్ధారణలో కలిపినట్లయితే దేశంలో కోట్ల మంది ఓబీసీ విద్యార్థులు, నిరుద్యోగ యువత రిజర్వేషన్లు కోల్పోతారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు కూడా కోల్పోవలసి వస్తుంది.

కేంద్ర ప్రభుత్వం దేశంలో ఓబీసీలను గుర్తించి రిజర్వేషన్ల అమలుకు 1953–55లో మొదటి జాతీయ బీసీ కమిషన్‌ నియమించింది. కానీ సదరు నివేదికను బుట్టదాఖలు చేసింది. రెండవ జాతీయ బీసీ కమిషన్‌ను 1978–80లో బి.పి. మండల్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసింది. ఆ కమిషన్‌ 41 సిఫార్సులతో 1980లో నివేదిక సమర్పించినప్పటికీ 1990 వరకు ఇనుప బీరువాలో భద్ర పరిచారు. మండల్‌ తీర్పు ద్వారా 1993 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. అప్పటికే కేంద్రంలో లక్షలాది ఉద్యోగాల భర్తీ జరిగి పోయింది. మరొకవైఫు ప్రైవేటీకరణ మొదలైంది. ఫలితంగా ఓబీసీల ప్రాతినిధ్యం గ్రూపు–ఏ 13%, గ్రూపు–బి 14%, గ్రూపు–సి 22%, గ్రూపు–డి 14% మొత్తం సరాసరి 21% శాతానికి మించిలేదు.

సామాజికంగా, విద్యాపరంగా వెనుక బడిన తరగతులకు సంబంధించిన రిజర్వేషన్లు కులాల పరంగా అమలు జరపవలసిన రిజర్వేషన్లు కావు. అయినప్పటికీ సామాజికంగా వెనుకబాటుకు ప్రామాణికం మన దేశంలో కులమే కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులాలను ఓబీసీ/ బీసీ జాబితాల్లో చేర్చి రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి. కావున ఆయా కులాల్లో సామాజికంగా వృద్ధి చెందిన వారిని ఓబీసీ రిజర్వేషన్ల నుండి తొలగించి మిగతా వారికీ 27% కేంద్రంలో అమలు చేసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అందుకు కేంద్రం 1993లో జాతీయ స్థాయిలో ఓబీసీల్లో సంపన్న శ్రేణి వారిని గుర్తించడానికి జస్టిస్‌ రామ్‌ నందన్‌ ప్రసాద్‌ అధ్యక్షతన కమిటీని వేసింది. కమిటీ ఆరు తరగతులలో ఉన్నవారి సంతానాన్ని గుర్తించింది. 1.రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారు. 2.గ్రూపు–1 లేదా తల్లి – తండ్రి గ్రూపు–2లో నియమించ బడిన వారు. 3.ఆర్మీ, పారా మిలటరీలలో కల్నల్‌ లేదా ఆ పై స్థాయి అధికారులు. 4. వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తల పిల్లలు. 5.స్థిర, చరాస్తులు కల్గినవారు. 6. ఆదాయ పరిమితి. చివరిదైన ఆదాయ పరిమితిలో ఉద్యోగుల జీత భత్యాలు మరియు వ్యవసాయ ఆదాయాన్ని మినహాయించారు.

మొదట 1993లో వార్షిక ఆదాయం ఒక్క లక్షగా నిర్ధారించారు. ప్రతి మూడు సంవత్సరాలకు సమీక్షించి ఆదాయ పరిమితిని పెంచాలని స్పష్టంగా ఉత్తర్వుల్లో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో 27 సంవత్సరాల నుండి ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తోంది. అనగా నేటికి ఆదాయ పరిమితిని తొమ్మిదిసార్లు సమీక్షించి పెంచి ఉంటే వార్షిక ఆదాయ పరిమితి ముప్పై లక్షల్లో ఉండేది. కానీ కేవలం నాలుగుసార్లు మాత్రమే సమీక్షించి ఎనిమిది లక్షలుగా ఉద్యోగుల జీతభత్యాలు, వ్యవసాయ ఆదా యాన్ని మినహాయించి నిర్ధారించారు. ఇదే విధానాన్ని అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అనేక సందర్భాల్లో ఈ విధానానికి సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది.

కేంద్రంలో 1989లో జనతాదళ్‌ ప్రభుత్వం వి.పి. సింగ్‌ ప్రధానిగా బీజేపీ మద్దతుతో ఏర్పడింది. 1990లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కేంద్ర ఉద్యోగాల్లో ప్రకటిం చగానే బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించు కుంది. మొదటి నుండి ఓబీసీ రిజర్వేషన్ల పట్ల బీజేపీ వైఖరి ఏమిటో దీనివల్ల అర్థం అవుతుంది. బీజేపీ 2014లో సొంత మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. బీసీల పక్షాన ఉన్నట్లుగా నటిస్తూ జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా అధికారాలను కల్పించింది. ఉత్తర భారతదేశంలోని జాట్‌ కులస్తులు, గుజరాత్‌లో పటేళ్లు, మహారాష్ట్రలో మరాఠాలు, ఆంధ్రప్రదేశ్‌లో కాపులు, ఇతర అగ్రకులాల వారు ఓబీసీ జాబితాలో తమను చేర్చాలని రాజకీయ ఉద్యమాలు చేస్తున్నారు. ఈ రాజకీయ ఒత్తిడికి తగ్గింపు చర్యగా 2019 జనవరిలో 103వ రాజ్యాంగ సవ రణ ద్వారా అగ్ర కులాల్లోని పేదలకు 10%  రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది.

2019లో బి.పి.శర్మ అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. 2017కి సంబంధిం చిన సివిల్‌ సర్వీసెస్‌ ఓబీసీ అభ్యర్థుల సమస్య పరి ష్కారం, ఓబీసీలకు సంబంధించిన క్రీమీలేయర్‌ విధా నాన్ని సరళీకృతం చేసి ఆదాయ పరిమితిని పెంచాలని ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ కమిటీలో ఒక్క సభ్యుడు కూడా ఓబీసీ కులానికి చెందినవారు లేకపోవడం బీజేపీ వెనుక రిజర్వేషన్ల వ్యతిరేక హిందుత్వ శక్తులు ఎంత శక్తి మంతంగా పని చేస్తున్నాయో తెలియజేస్తోంది. ఓబీసీల సంక్షేమం, ఇతర సమస్యలపై రాజ్యాంగ బద్ధమైన బీసీ కమిషన్‌ను నియమించిన తర్వాత బి.పి. శర్మ కమిటీకి చట్టబద్ధత, రాజ్యాంగ బద్ధత లేదని గమనించాలి. బి.పి శర్మ కమిటీ ఓబీసీ కుల సంఘాలతో, ఉద్యోగ సంఘా లతో, రాజకీయ పార్టీలతో సంప్రదించకుండా ఏక పక్షంగా అశాస్త్రీయంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల జీత భత్యాలను కలిపి క్రిమీలేయరు వార్షిక ఆదాయ పరిమితిని 8 లక్షల నుండి 12 లక్షలకు పెంచాలని నివేదిక సమ ర్పించింది. కేంద్రం వెంటనే కేబినెట్‌ నోట్‌ తయారు చేయడం రాజ్యాంగ తప్పిదంగా భావించాలి.

ఒక వైపు రాజ్యాంగ బద్ధమైన ఓబీసీ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షులు గణేష్‌ సింగ్‌ ఆధ్వర్యంలో సమర్పించిన నివేదికలో క్రీమీలేయరు వార్షిక ఆదాయాన్ని ఉద్యోగుల జీతభత్యాలు, వ్యవసాయ ఆదాయం మినహాయింపుతో 8 లక్షల నుండి 15 లక్షలకు పెంచాలని ప్రభుత్వానికి సూచించింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం బి.పి. శర్మ కమిటీ నివేదికను ఆమోదించి ఉద్యోగుల జీతాలను సంపన్న శ్రేణి నిర్ధారణలో కలిపినట్లయితే దేశంలో కోట్లమంది ఓబీసీ విద్యార్థులు, నిరుద్యోగ యువత రిజర్వేషన్లు కోల్పోతారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు కూడా కోల్పోవలసి వస్తుంది.

దేశంలో 70 కోట్ల మందికి సంబంధించిన రిజర్వేషన్లపై చర్చ జరుగుతున్నప్పుడు జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు స్పందించకపోవడం వారికి ఓబీసీ రిజర్వేషన్ల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఎంతో అర్థం అవుతోంది. ఇప్పటివరకు తమిళనాడు నుండి డీఎంకే పార్టీ బి.పి. శర్మ కమిటీ నివేదికను రద్దు చెయ్యాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ లేఖను సమర్పించింది. అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలి. క్రీమీలేయరు వార్షిక ఆదాయాన్ని ఉద్యోగుల జీతభత్యాలు, వ్యవసాయ ఆదాయం మినహాయింపుతో 8 లక్షల నుండి 30 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేయాలి.

వ్యాసకర్త జాతీయ అధ్యక్షులు,
జాతీయ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం
మొబైల్‌ : 94909 59625
కోడెపాక
కుమార స్వామి 

మరిన్ని వార్తలు