ఎలక్ట్రిక్‌ వాహన ప్రయాణం భళా!

27 Aug, 2021 12:44 IST|Sakshi

ఓలా అంటే స్పానిష్‌ భాషలో ‘హలో’ అని అర్థం. క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ఓలా ఇప్పుడు ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు హలో చెబుతోంది. ఒక దశాబ్దం కంటే స్వల్పకాల వ్యవధిలోనే ఓలా తన వ్యాపారాన్ని వినూత్న రీతిలో విస్తరించింది. (అద్దంలో నా ముఖం చూసుకోవడం మానేశాను..)

ఓలాను 2010లో నెలకొల్పారు. 2012లో దాని క్రియాశీల క్యాబ్‌ సేవలు ప్రారంభమైనాయి. మార్కెట్‌లోకి ప్రవేశించే సమయంలో, ప్రయాణీకులకు మూడు ఉచిత రైడ్‌లను అందించింది. ఈ తరహా ఉచిత వ్యూహం భారతీయ మధ్యతరగతిని టాక్సీల వైపు ఆకర్షించింది. రవాణాలో సౌలభ్యం, ప్రయాణీకులకు భద్రత, సకాలంలో గమ్యానికి చేర్చడం, ధర అంచనాలను సులభతరం చేసే సాంకేతిక పరిజ్ఞానంతో అతి స్వల్పకాలంలోనే ప్రయాణీకుల నమ్మ కాన్ని గెలుచుకుంది. ఓలా యాప్‌పై ట్రావెల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌గా అద్భుతమైన నిబద్ధతను చూపి, కారు ఎక్కాలనే అనేకమంది భారతీయుల వాంఛను నెరవేర్చింది. అలాగే దేశవ్యాప్తంగా ఉపాధిని సృష్టిం చింది. 2018 నాటికి, సంస్థకు పది లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు. వారి ప్రోత్సాహకాలు వినియోగ దారుల రేటింగ్, ఫీడ్‌బ్యాక్‌పై నిర్ణయమయ్యేవి.

ఇంతేకాకుండా కొంత డిపాజిట్‌ మొత్తాన్ని డ్రైవర్ల నుండి సేకరించి, వారికి క్యాబ్స్‌ని ఫైనాన్స్‌ రూపంలో కట్టబెట్టింది. ఈ తరహా మోడల్‌లో డ్రైవర్లకు వాహనాలను ఏర్పాటు చేయడం రిస్క్‌తో కూడుకున్నది. అయినప్పటికీ, సాహసం చేసి బీమాలో తన ఉనికిని చాటుకుంది. మరో వైపు ప్రారంభ ఫిన్‌టెక్‌ సంస్థగా ఓలా మనీని ఉపయోగించి, వివిధ ఆర్థికసేవలను నిర్వహించింది. కృత్రిమ మేధస్సు సాయంతో విని యోగదారుల అసాధారణమైన ప్రవర్తనా మార్పులను గమనిస్తూ, మెరుగైన సేవలు అందిస్తోంది. అయితే తదుపరి ఊబర్‌తో పోటీ మూలంగా ధరల యుద్ధం, క్యాబ్‌ వాహనాల పెరుగుదల, ప్రోత్సాహ కాలలో కోత, ఇంకా డ్రైవర్లకు సంబంధించిన సమస్య లతో కష్టాలను మూటగట్టుకుంది. కరోనా మహ మ్మారి, లాక్‌డౌన్లు సంస్థను మరింత సంక్షోభంలోకి  నెట్టాయి. గత్యంతరం లేక కొంతమంది పూర్తికాల ఉద్యోగులను తొలగించింది. మహమ్మారి కారణంగా భద్రత కోసం వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగి, క్యాబ్‌లు, ఆటోలవైపు వినియోగదారులు ముఖం చాటేయడంతో మరింత నష్టం వాటిల్లింది. (చదవండి: ఈ విద్యావిధానం దేశానికే ఆదర్శం)

అయితే తన తదుపరి ఎత్తుగడగా ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను ఆవిష్కరిస్తూ ఆటోమోటివ్‌ రంగంలోకి ప్రవేశించింది. తద్వారా పర్యావరణ పరిరక్షణ, సమర్థత, ఉపాధి కల్పనకు పూనుకుంటోంది. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను రిజర్వ్‌ చేసుకోవడానికి ప్రారంభ ధరను రూ. 499గా నిర్ణయించింది. ఈ బుకింగ్‌ ధర ఒక సాధారణ మొబైల్‌ రీఛార్జ్‌ ప్లాన్‌కు సమానం. ఇది ఆటోమోటివ్‌ రంగంలో ఓలా తెచ్చిన విప్లవాత్మక మార్పు. సగటున నెలవారీగా కోటి మంది వినియోగదారులు గనుక 499 చెల్లిస్తే, అడ్వాన్సుల రూపంలో వడ్డీ లేని డబ్బు అందుతుంది. దీనివలన భారీగా రుణభారం తగ్గుతుంది. ముఖ్యంగా ఆటోమొబైల్‌ పరిశ్రమలో సింహభాగం రుణాలుగా ఉంటుంది. కస్టమర్‌ డిపాజిట్ల రూపంలో ఓలా దీనికి స్వస్తి పలుకుతోంది.

ఒక్క కారు కూడా సొంతంగా లేకుండానే ఓలా క్యాబ్స్‌ విజయవంతమైంది. దీనికి విరుద్ధంగా, ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లను ఓలా తయారు చేస్తుండటం మూలాన వాటిని సరుకుగా చూపాల్సి ఉంటుంది. ఇది ఓలా వ్యాపార నిర్వహణ మోడల్‌లో చాలా పెద్ద మార్పు. ఇంకా, టెక్నాలజీ రంగం నుండి తయారీ రంగానికి మారుతుండటం దేశంలో మొదటిసారిగా ఓలా చేస్తున్న సాహసం. ట్యాక్సీ వ్యాపారంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు లేరు. కానీ ఇప్పుడు వారు ఈ కొత్త నమూనాలో పెద్ద శ్రామిక శక్తిని కలిగి ఉంటారు. ఓలా ట్యాక్సీ ప్రారంభంలో పెద్దగా పోటీ ఎదుర్కో లేదు. దానివల్ల ఫస్ట్‌–మూవర్‌ ప్రయోజనాన్ని పొందింది. కానీ ఇప్పుడు హీరో, బజాజ్, హోండా, ఇంక అనేక అభివృద్ధి చెందుతున్న సంస్థలతో పోటీ పడాలి. ఏదేమైనా, భారత ప్రజలు ఇంధనం కోసం తక్కువ ఖర్చు చేయాలని అనుకుంటున్న తరుణంలో వస్తున్న ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అనేక భారతీయ కంపెనీలు తయారీ రంగం నుండి టెక్నాలజీ వైపునకు మారాయి. దీనికి భిన్నంగా ఓలా తన బ్రాండ్‌ని, టెక్నాలజీని పణంగా పెట్టి ధైర్యంగా ఆటోమోబైల్‌ దిగ్గజ సంస్థలకు సవాల్‌ విసురుతోంది. ఒక దశాబ్దం క్రితం టాటా నానో ఫలితాన్ని దేశం చవిచూసింది. ఇప్పుడు ఓలా తన హైటెక్‌ ఫీచర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌తో ఆటోమోటివ్‌ పరిశ్రమకు అఘాతం కలిగించే సాహసం చేస్తోంది. ఈ స్కూటర్‌ విజయవంతమైతే గనుక భారీ ఉపాధి సృష్టి జరుగుతుంది, ఎగుమతులు పెరుగుతాయి, పర్యావరణ పరిరక్షణలో సాయపడుతుంది, ఇంధనం ఆదా అవుతుంది. అంతేకాకుండా భారతీయ సిలికాన్‌ వ్యాలీని నిర్మించడానికి దేశంలోని యువ పారిశ్రామికవేత్తలలో కావాల్సిన ఉత్సాహాన్ని నింపుతుంది. 75వ భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలు ప్రత్యేకమైనవి. ఒలింపిక్స్‌లో బంగారు, వెండి, కాంస్య పతకాలతో మువ్వన్నెల జెండాను క్రీడాకారులు రెప రెపలాడించిన రోజే, ఓలా తన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను ఆవిష్కరించింది. మున్ముందు బ్రాండ్‌ విలువ పరంగా ఓలా తదుపరి కోలాగా మారే అవకాశం ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు.

- డాక్టర్‌ మైలవరం చంద్రశేఖర్‌ గౌడ్‌ 
వ్యాసకర్త సహాయ ఆచార్యులు, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు