ఇక్కడి వివక్షే కనిపిస్తుందా?

17 Nov, 2022 13:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అభిప్రాయం 

కొంతమంది నియోదళిత్‌ మేధావులకు, వామపక్షీయులకు ప్రతి విషయాన్నీ కులం లేదా మత కోణంలో చూసే ధోరణి గత 30 సంవత్సరాలుగా అలవాటైంది. అకడమిక్స్‌లో కూడా ఈ ధోరణి రావడం ప్రమాదకరం. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన కులాలు, ముస్లింలు, క్రిష్టియన్లు, అగ్ర వర్ణాల వారు కూడా వివక్షను ఎదుర్కొంటున్నారు. 130 కోట్ల జనాభాలో, దాదాపుగా 30 కోట్ల మంది దళితులు ఉన్న భారతదేశంలో... కేవలం కొన్ని సంఘటలను చూపించి రిపోర్టులు తయారు చేసి, దేశమంతా వివక్షత ఉందని చెప్పడం ఎంతమాత్రమూ శాస్త్రీయం కాదు. 

అధర్మమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలో చాలా దేశాల్లో దారుణమైన వివక్ష నేటికీ కొనసాగుతోంది. మన నియోదళిత్‌ మేధావులు వాటిని ఏమాత్రం ప్రస్తావిం చకుండా భారతదేశానికీ, హిందూమతానికీ వ్యతిరేకంగా పని చేసే కొన్ని సంస్థల రిపోర్టుల గురించి మాట్లాడుతున్నారు. రాజీవ్‌ మల్హోత్ర, అరవిందన్‌ నీలకంఠన్‌ రాసిన ‘బ్రేకింగ్‌ ఇండియా – వెస్ట్రన్‌ ఇంటర్వెన్షన్స్‌ ఇన్‌ ద్రవిడియన్‌ అండ్‌ దళిత్‌ ఫాల్ట్‌ లైన్స్‌’ అనే పుస్తకంలో ఇటువంటి విదేశీ సంస్థలూ, అధ్యయన కేంద్రాలూ, ఎన్జీఓలూ వంటివి భారతదేశాన్ని, హిందూమతాన్ని విచ్ఛిన్నం చేయడానికి గత 30 సంవత్సరాలుగా చేస్తున్న ఒక బహిరంగమైన కుట్ర బట్టబయలైంది.

ఇక ప్రపంచంలోని వివక్షకు వస్తే మొదటగా అమెరికాలో ఉన్న నల్లజాతీయులపై వివక్ష నేటికీ కొనసాగుతోంది. అయినా వారికి భారతదేశంలో దళితులలాగా రాజ కీయాలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు లేవు. దక్షిణాఫ్రికాలో నల్లజాతి వివక్ష (అపారై్థడ్‌) 1992 వరకు చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా జరిగింది. ఇప్పటికి కూడా దక్షిణాఫ్రికాలో వాళ్ళు రిజర్వేషన్లు కావాలని అడగలేదు. 1883 వరకు అమెరికాల్లో నల్ల జాతీయులు బానిసలుగా ఉండేవాళ్ళు, 1970 వరకు అమెరికాలో నల్లజాతీయులకు ఓటు హక్కులేదు. ఇప్పటికీ యూఎస్‌తో సహా అనేక దేశాల్లో జాతి, మతపరమైన వివక్ష ఉంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 1930లలో భారత్‌లో షెడ్యూల్డ్‌ కులాల వివక్షమీద అంబేడ్కర్‌ పోరాటం చేస్తున్న సమయంలోనే అమెరికాలో కూడా వివక్ష మీద పోరాటం జరుగుతోంది. ప్రముఖ అమెరికన్‌ నల్లజాతీయుల నాయకులు చానీతో బియాస్, బెంజమిన్‌ మేస్‌ లాంటి వారు భారతదేశానికి వచ్చి గాంధీని కలిసి వివక్షతపై చర్చలు జరిపారు. 1938లో హోవర్డ్‌ తురిమెన్‌ అనే ప్రముఖ నల్ల మతాధికారి అమెరికాకు వచ్చి పోరాటం సాగించాలని గాంధీని కలిసి విన్నవించారు. ప్రముఖ నల్ల జాతి హక్కుల ఉద్యమకారుడు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌... గాంధీజీనే ఆదర్శంగా తీసుకున్నారు. అలాగే దక్షిణాఫ్రికాలో అపార్థైడ్‌కు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్‌ మండేలా తదితరులు కూడా మహాత్మా గాంధీనే ఆదర్శంగా తీసుకున్నారు.

ఇక్కడ నియో దళిత మేధావులు, వామపక్ష వాదులు దాచి పెట్టేదేమిటంటే... పైన పేర్కొన్న నాయకులు ఎవ్వరూ కూడా అంబేడ్కర్‌ను కలవలేదు. వీరెవ్వరు కూడా ఆయా దేశాల్లో రిజర్వేషన్లు కోరలేదు. ఎందుకంటే ఈక్వాలిటీ అనే యూనివర్సల్‌ ప్రిన్సిపుల్‌కు రిజర్వేషన్లు అనేవి బద్ధ వ్యతిరేకం కాబట్టి. 

దేశం 200 సంవత్సరాల బ్రిటిష్‌ పాలనలో కొన్ని శతాబ్దాల కాలం వెనుకబడింది. 1951 నాటికి అక్షరాస్యత కేవలం 16.7 శాతం. గ్రామీణ ప్రాంతాల్లో 9 శాతం, కాబట్టి కేవలం దళితులే కాదు అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు వెనకబడే ఉన్నారు. దళితుల పరిస్థితి ఇంకా దయనీయమనే చెప్పాలి. అయితే ల్యాండ్‌ సీలింగ్‌ వల్ల వచ్చిన భూమిలో 46 శాతం దళితులకే వచ్చింది. అయినా ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉంది. (క్లిక్‌ చేయండి: నిరసనకారులకు గుణపాఠమా?!)


- డాక్టర్‌ పి. కృష్ణ మోహన్‌ రెడ్డి 
అసోసియేట్‌ ప్రొఫెసర్, చరిత్ర విభాగం
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం

మరిన్ని వార్తలు