ఒకే దేశంలో ద్వంద్వ ప్రమాణాలా?

9 Apr, 2022 01:43 IST|Sakshi

సందర్భం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల దేశ రైతాంగం ఆందోళన చెందుతున్నది. వారి నిర్ణయాలు పరిశీలిస్తే రైతులపై వారికున్న కక్ష, దుగ్ధలు అర్థమవు తాయి. వ్యవసాయ రంగంలో కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా కేంద్రం మూడు సాగు చట్టాలు తీసుకువచ్చి విఫలమైంది. ఇప్పుడు వ్యవసాయ కరెంట్‌ మోటర్లకు మీటర్లు బిగించే చట్టాన్ని తెచ్చి రైతులకు భారాన్ని మోపేందుకు ప్రయత్నం చేస్తున్నది.

ఇప్పటికే రైతులు అనేక వ్యయభారాలతో కుంగి పోతున్నారు. దీనికి తోడు ఇప్పుడు కరెంటు బిల్లులను వడ్డించాలనడం విడ్డూరం. రైతులను క్లిష్ట పరిస్థితుల నుంచి బయట పడే సేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్ని స్తోంది. అందులో భాగంగానే ఉచిత విద్యుత్తును అందిస్తు న్నది. అయినా కేంద్రం తెచ్చే రైతు వ్యతిరేక చట్టాల వల్ల మీటర్లను బిగించే పరిస్థితి ఏర్పడుతున్నది.

దేశంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేండ్లయింది. కానీ సామాన్య ప్రజానీకానికి, రైతాంగానికి వారితో ఒరిగిందేమీ లేదు. కాగా కష్టాలు పెరిగాయి. ముఖ్యంగా తెలంగాణ మీద కేంద్రం వివక్ష చూపుతున్నది. రైతులను నట్టేట ముంచడమే పనిగా పెట్టుకున్నది. రైతులు ఏ పంట పండించినా దానికి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదే. అయినా పంటల కొను గోళ్లపై ఆంక్షలు పెట్టడం వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీయడమే. ఆరేండ్లలో వరికి రూ. 470 మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం... యూరియా, ఎరువులు, విత్తనాలు, పెట్రోల్, డీజిల్‌ ధరలను అంతకన్నా ఎక్కువగా పెంచింది. ఇదంతా రైతాంగాన్ని దోచుకోవడమే. ఇప్పటికైనా కేంద్రం దిగిరాకుంటే,  కేంద్రంపై ఉద్యమ స్ఫూర్తితో యుద్ధం తప్పదు.

తెలంగాణ రైతుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అలుపెరుగని పోరాటం చేస్తున్నది. కేంద్ర వ్యవసాయ విధానంలోని డొల్లతనాన్ని టీఆర్‌ఎస్‌ బట్టబయలు చేస్తున్న తీరును పలువురు  జాతీయ విపక్ష నేతలు ప్రశంసిస్తున్నరు. ఇప్పుడు జరగాల్సింది ఇదేన ంటున్నరు. ఒకవైపు టీఆర్‌ఎస్‌ రైతుల బాగు కోసం పోరాడుతుంటే మన రాష్ట్ర విపక్ష నేతలు సహాయ నిరాకరణతో పీత రాజకీయాలు చేస్తున్నరు. 

దేశానికి రైతే వెన్నెముక అని మాటల్లో చెప్తూనే మోదీ సర్కార్‌ కర్షకులను కన్నీట ముంచుతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనమంటే కొర్రీలు పెడుతూ తెలంగాణ రైతులను మార్కెట్‌ శక్తుల కోరలకు బలి చేస్తున్నది. తెలంగాణలో యాసంగి పంటగా వచ్చే వరిధాన్యాన్ని కొనేది లేదని చెప్పటం బాధ్యతా రాహిత్యమే కాదు, వివక్షాపూరితం కూడా.

వానకాలం నుంచి రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. రైతుల ఇబ్బందులు, కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ముంగిటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ధాన్యం కొన్నది. కేంద్రం మాత్రం రైతులను ఇబ్బందులు పెట్టేలా వ్యవహరిస్తున్నది. 

సీఎం కేసీఆర్‌ భగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం ప్రాజెక్టు కింద పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిర్మించారు. దీంతో ఈ ప్రాంతానికి పుష్కలంగా సాగునీరు అంది వరి విస్తీర్ణం పెరిగింది. ఈ విషయం తెలుసుకోకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో కిరికిరీ పెడుతోంది. ఒకే దేశంలో రెండు విధానాలు ఎలా ఉంటాయి? పంజాబ్‌ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం కేంద్రం కొనుగోలు చేస్తున్నది. తెలంగాణ ప్రాంత రైతులు పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయరనేది సూటి ప్రశ్న! దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమా ధానం చెప్పడం లేదు.

పైగా అవమానిం చేలా కేంద్ర మంత్రి మాటలున్నాయి. గత యాసంగితో పోల్చుకుంటే ఈ సారి రాష్ట్ర ప్రభుత్వ సూచనతో రైతులు వరి సాగును కొంత తగ్గించారు. అయినా ధాన్యం కొనుగోలు చేయలేమని సవా లక్ష కారణాలను కేంద్రం ఏకరువు పెడుతోంది. మరో నెల రోజులైతే, యాసంగి ధాన్యం రైతుల చేతికి వస్తుంది. ఈ లోగా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. 

తెలంగాణ ప్రజలను నూకలు తినమని అన్న కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పార్టీకి నూకలు చెల్లడం ఖాయం. నూకలు తినాలన్న వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకో వాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుండడంతో వారు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా వ్యవహ రించాల్సిన కేంద్రం, తెలంగాణ రైతాంగాన్ని తిప్పలు పెట్డడం సరికాదు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు రేషన్‌ బియ్యం పరిస్థితి దారుణంగా ఉండేది. నూకలు, పురుగుల బియ్యం సరఫరా అయ్యేవి. పంజాబ్‌ నుంచి వచ్చిన బియ్యం ఏ మాత్రం నాణ్యత లేకుండా ఉండేవి. అలాంటి బియ్యం తిన్న అనుభవమున్న తెలంగాణ ప్రజలకు... రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థానికంగా పండించిన ధాన్యాన్ని ఆడించిన తర్వాత వచ్చిన నాణ్యమైన బియ్యాన్నే ప్రభుత్వం పంపిణీ చేస్తు న్నది. ఈ తరుణంలో యాసంగి బియ్యాన్ని మర ఆడించి వచ్చిన నూకల బియ్యాన్ని మీ ప్రజలకు తినడం అలవాటు చేయండని కేంద్రమంత్రే అనడం చూస్తే వారి అహంకారం ఏంటో అర్థమవుతుంది. 

ఇదంతా చూస్తుంటే... రాష్ట్రం ఏర్పాటుకు ముందు పరిస్థితి రావాలని కేంద్రం కోరుకుంటున్నట్లుంది. తెలం గాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాలకూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తున్నది. కేంద్రం పెద్దన్న పాత్రలో ఉంటూ రాష్ట్రానికి న్యాయం చేయాల్సిందిపోయి అన్యాయం చేస్తోంది. అన్ని రాష్ట్రాలనూ సమానంగా చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం తమకు నచ్చిన చోట ఒకలా, నచ్చని చోట మరోలా చూస్తున్నది. ఇలా పక్షపాతంతో...  కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ రాష్ట్ర రైతాంగాన్ని గోస పెట్టడం ఎంతవరకు సమంజసమో కేంద్రం ఆలోచించాలి.


-పువ్వాడ అజయ్‌ కుమార్‌
వ్యాసకర్త రాష్ట్ర రవాణా శాఖ మంత్రి

మరిన్ని వార్తలు