Yadadri Temple: రూ.1,300 కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా? 

22 Jul, 2022 00:34 IST|Sakshi

సందర్భం

యాదాద్రి దేవాలయాన్ని వేలాది సంవత్సరాలు మన్నే విధంగా నిర్మించామని ప్రభుత్వం చెబుతున్న మాటలు నీటిమూటలని తేలి పోయింది. ఈదురుగాలులూ, వర్షాలకు ఆలయ సముదాయ నిర్మాణంలోని డొల్లతనం బయటపడుతోంది. గతంలో వీచిన గాలులకు ప్రధానాలయ విమాన గోపురంపై ఉన్న సుదర్శన చక్రం ఒరిగిపోయింది. ఇటీవల కురి సిన వర్షాలకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దక్షిణ దిశలో స్టోన్‌ ఫ్లోరింగ్‌ కుంగింది. ఇప్పటికే ప్రధాన ఆలయంతో పాటు ప్రసాద కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్‌ ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడ్డాయి. దక్షిణ రాజగోపురం ప్రాంతంలో కృష్ణశిల స్టోన్‌ ఫ్లోరింగ్‌కు పగుళ్లు వచ్చి కుంగింది. అష్టభుజి మండపంలో వర్షపునీరు లీకేజీతో డంగు సున్నం బయటకు వస్తోంది. ఇవన్నీ చూస్తుంటే నిర్మాణం ఎంత ‘గొప్ప’గా చేశారో అర్థమవుతోంది. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎనిమిదేళ్లలో దాదాపు 25 సార్లకు పైగా యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చి, వ్యక్తి గత శ్రద్ధ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ప్రణాళికా లోపం, నమూనాలు, డిజైన్లలో లోపాలు, అధికారుల బాధ్యతా రాహిత్యం, కాంట్రాక్టర్ల కక్కుర్తి, సమన్వయ లోపం వంటివి ప్రస్తుత పరిస్థితికి కారణా లుగా చెప్పవచ్చు. ‘అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రం’ అంటూ రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ఆలయ పునర్నిర్మాణం చేపట్టింది. ఈ సందర్భంగా తరతరా లుగా వస్తున్న ‘యాదగిరిగుట్ట’ పేరును సైతం ‘యాదాద్రి’గా మార్చేసింది. గుట్ట పునర్నిర్మాణానికి ఏకంగా రూ 1,300 కోట్లు వెచ్చించింది. ఈ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరేనా? 

ఆలయ నిర్మాణంలో నీటిపారుదల వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల కొండపైనా, కింద కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రధాన ఆలయం శిల్పాల పనుల నుంచి కొండ దిగువన నిర్మా ణాల వరకు 14 మంది కాంట్రాక్టర్లు పనిచేశారు. ప్రభుత్వ పరంగా ఉన్న స్థానిక ఇంజనీర్లను కాదని కాంట్రాక్టు సంస్థలకు చెందిన సైట్‌ ఇంజనీర్లతోనే పను లన్నీ చేపట్టారు. గుట్ట చుట్టూ నిర్మాణాలు చేస్తున్న ప్పుడు స్థానిక ఇంజనీర్లను సంప్రదించకుండానే పనులు చేశారు. వర్షాలు కురిసినప్పుడు ఎటునుంచి వరద వస్తుంది... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది గుర్తించకపోవడంతో రోడ్లు ఎక్కడికక్కడ కోతకు గురవుతున్నాయి. గత మే నెలలో కురిసిన వర్షానికి ఆలయం చిత్తడిగా మారింది. ప్రధాన ఆలయంలో పంచతల రాజగోపురం నుంచి.. ధ్వజస్తంభం వరకు వాన నీరు చేరింది. 

మొదటి నుంచీ ఆలయ పునర్నిర్మాణ తీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. శిల్పాలు చెక్కే సమ యంలో దేవాలయ స్తంభాలపై మసీదు, పీర్లు, చర్చి, ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ, కేసీఆర్‌ చిత్రాలు (రిలీఫ్‌ ఫిగర్స్‌) చెక్కారు. అంతటితో ఆగలేదు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల లోగోలను కూడా చెక్కారు. దీంతో విశ్వహిందూ పరిషత్‌ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేయడంతో ఆ రిలీఫ్స్‌ను తొలగించారు. 

ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌  ‘కాశీ అనేది పవిత్ర పుణ్యక్షేత్రం... అక్కడ రాజకీయాలు లేకుండా హిందువుల మనోభావాలు గౌరవించే స్థాయిలో నిర్మాణాలు చేపట్టాలి. కానీ... నట్లు, బోల్టు లతో ఆలయం నిర్మించి తప్పు చేశారు. వర్షం పడితే ఆలయ గోపురం కూలింది, అది అరిష్టం’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి ఆరోపించారు. మరి యాదాద్రిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి ఏమంటారు? నిజానికి కాశీలో నిర్మిం చిన ఆలయంలో ఎటువంటి అపశ్రుతులు దొర్ల లేదనే విషయం గమనించాలి. ఇతరులను విమర్శించే ముందు తాను చేసిన పనిని సమీక్షించుకోవాల్సిందిగా కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం.

పగుడాకుల బాలస్వామి
వ్యాసకర్త ప్రచార ప్రముఖ్, విశ్వహిందూ పరిషత్, తెలంగాణ ‘ మొబైల్‌: 99129 75753

మరిన్ని వార్తలు