అఫ్ఘాన్‌ మాటున పాక్‌ ద్వంద్వ నీతి

10 Jan, 2022 00:40 IST|Sakshi

అఫ్ఘానిస్తాన్‌ పరిణామాలను అడ్డుపెట్టుకుని పాకిస్తాన్‌ ఆర్థిక ప్రయోజనాలు పొందటానికి పావులు కదుపుతోంది. కానీ దాని వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. పాక్‌ నిర్వహించిన... మధ్య ఆసియాలోని అఫ్ఘానిస్తాన్‌ పొరుగున ఉన్న కజకస్తాన్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్‌ విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం నుంచి ఆయా దేశాల మంత్రులు అర్ధంతరంగా వైదొలగి... తాలిబన్‌ పాలన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలపై చర్చించడానికి ఢిల్లీలో తలపెట్టిన విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరవ్వడం చూస్తే... పాక్‌కు అంతర్జాతీయ సమాజంలో ఉన్న గౌరవం తెలిసిపోతోంది. ఒక పక్క అమెరికా తలపెట్టిన ‘ఉగ్రవాదంపై యుద్ధం’లో పాల్గొంటున్నట్లు నటిస్తూనే, మరోవైపు తాలిబన్లకు సాయం చేసి అఫ్ఘాన్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పాక్‌ ద్వంద్వ నీతిని అమెరికాతో సహా దాని మిత్రదేశాలు గుర్తించాయి. అందుకే అవి అఫ్ఘాన్‌ సమస్యపై పాక్‌ చూపిస్తున్న చొరవను నమ్మే పరిస్థితిలో లేవు.

పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వా, ఆయన తర్వాత  2022 నవంబర్‌ 1న సైన్యాధ్యక్ష పదవిని అధిష్ఠిస్తాడని అనుకుంటున్న  ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) మాజీ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఫయాజ్‌ హమీద్‌ల మధ్య విభేదాలు సృష్టించడంలో విజయం సాధించిన మొదటి ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌ చరిత్ర సృష్టించారని చెప్పవచ్చు. కాబూల్‌ నుండి కాందహార్‌కు ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ను తరిమేసిన హక్కానీ నెట్‌వర్క్‌ ఉగ్రవాదులకు అన్ని విధాలా తన ఐఎస్‌ఐ ద్వారా సహాయ సహకారాలు అందించిన వాడిగా హమీద్‌ ప్రపంచవ్యాప్తంగా బోలెడంత అపఖ్యాతిని మూట గట్టుకున్నాడు. హమీద్‌ సమక్షంలోనే కొత్త అఫ్ఘానిస్తాన్‌ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగిపోయింది.

ఇమ్రాన్‌ ఖాన్‌  ఇందుకు మద్దతు ఇచ్చినప్పటికీ, ఈ చర్య ఆయనకు కొత్త సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలే ఎక్కువ. హమీద్‌ వారసుడు లెఫ్టినెంట్‌ జనరల్‌ నదీమ్‌ అహ్మద్‌ అంజుమ్‌... ఇమ్రాన్‌ ఖాన్‌ చెప్పినట్లు వినే పరిస్థితి కనిపిం చడం లేదు. పాకిస్తాన్‌ ఆక్రమణ నుండి విముక్తి పొంది బంగ్లాదేశ్‌ 50వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న సమయంలో ఈ పరిణా మాలు చోటుచేసుకోవడం గమనార్హం. బంగ్లాదేశ్‌కు సంబంధించిన అనేక ఆర్థిక సూచీలను గమనించినప్పుడు... పాకిస్తాన్‌ కంటే బంగ్లా దేశ్‌ చాలా మెరుగ్గా ఉన్నట్లు అర్థమవుతోంది. కాగా పాకిస్తాన్‌ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

పాకిస్తాన్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్త పర్వేజ్‌ హుడ్భోయ్‌ ‘‘ఇవ్వాళ కొంతమంది ఆర్థికవేత్తలు బంగ్లాదేశ్‌ తదుపరి ‘ఆసియా పులి’ అవుతుందని అంటున్నారు. గత ఏడాది భారత్‌ (8 శాతం)తో సమానంగా వృద్ధి రేటు (7.8 శాతం)సాధించింది. అదే సమయంలో పాకిస్తాన్‌ (5.8 శాతం) కంటే బాగా ముందుంది. బంగ్లాదేశ్‌ తలసరి రుణం 434 డాలర్లు. ఇది పాకిస్తాన్‌ తలసరి రుణం (974 డాలర్లు)లో సగం కన్నా తక్కువే. బంగ్లాదేశ్‌ విదేశీ మారక నిల్వలు 32 బిలియన్‌ డాలర్లు కాగా పాకిస్తాన్‌ నిల్వలు 8 బిలియన్‌ డాలర్లు మాత్రమే. అంటే పాకిస్తాన్‌ కన్నా నాలుగు రెట్లు ఎక్కువన్నమాట. ఆర్థిక పరంగా భారత్‌తో సమాన స్థాయిని తానూ కలిగి ఉన్నానని పాకిస్తాన్‌ పేర్కొన్నప్పటికీ, భారతదేశ విదేశీ మారక నిల్వల్లో కేవలం 1.25 శాతం మాత్రమే పాకిస్తాన్‌ దగ్గర ఉన్నాయి...’’ అని పేర్కొన్నారు.

ఇస్లామాబాద్‌ నిర్వహించిన... మ«ధ్య ఆసియాలోని అఫ్ఘానిస్తాన్‌ పొరుగున ఉన్న ఇస్లామిక్‌ కజకస్తాన్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్‌ విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం నుండి ఆయా దేశాల మంత్రులు అర్ధంతరంగా వైదొలగి... తాలిబన్‌ పాలన నుండి ఉత్పన్నమయ్యే సమస్యలపైన, ప్రాంతీయ సహకారంపైనా చర్చించడానికి ఢిల్లీలో జరుగుతున్న విదేశాంగ మంత్రుల సమావేశా నికి హాజరయ్యారు. ఈ పరిణామం ఏమంత ఆశ్చర్యపడవలసిందేమీ కాదు. ఇస్లామాబాద్‌ సదస్సును పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రారం భించారు. అయితే, ఈ సమావేశానికి హాజరైనవారిలో చాలా మంది నుంచి సహాయం అందే అవకాశం లేదు. ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కో–ఆపరేషన్‌ (ఓఐసి) వ్యవస్థాపక దేశంగా సౌదీ అరేబియా మాత్రం ప్రాథమికంగా కొంత సహాయం చేసింది. 

అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల పాలన వల్ల ప్రçపంచంలో తలెత్తిన ఆందోళనలను తనకు అనుకూలంగా మార్చుకొని ఆర్థిక లబ్ధి పొందడానికే పాకిస్తాన్‌ తనను తాను అఫ్ఘాన్‌ పరిణామాలపై చర్చా వేదికగా ప్రకటించుకుంది. ఇదే సమయంలో ఇమ్రాన్‌ ఖాన్‌ తన సొంత దేశంలో అనేక అంతర్గత సవాళ్లను ఎదుర్కోవలసిన పరిస్థితిలో ఉన్నారు. మహిళలకు విద్య, ఉద్యోగ అవకాశాలను నిరాకరించిన తాలిబన్ల విధానానికి ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతు తెలపడం వల్ల... అమెరికా, ఐరోపా లేదా ఇతర ఇస్లామిక్‌ మిత్రదేశాల నుంచి అతడికి మద్దతు దొరికే అవకాశం లేదు. అఫ్ఘానిస్తాన్‌కు అంతర్జాతీయ సహాయం అందించేందుకు సంప్రదింపులు, చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో భారత్, ఇరాన్‌... వాటి ఇతర మధ్య ఆసియా భాగస్వామ్య దేశాలు ఇరాన్‌లోని చాబహార్‌ ఓడరేవును రవాణా కారిడార్‌గా చేసుకొని అఫ్ఘానిస్తాన్‌కు మరింత అంతర్జాతీయ సహాయం అందించడానికి చర్యలు చేపట్టాలి.

2023లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో... రానున్న రెండు సంవత్సరాలు ఇమ్రాన్‌ ఖాన్‌కు కీలకం కాబోతు న్నాయి. ఈ ఎన్నికలకు ముందే పాకిస్తాన్‌ తదుపరి సైన్యాధిపతి ఎవరు అనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. ఇమ్రాన్‌ ఖాన్‌కు, సైన్యాధి పతి జనరల్‌ బజ్వాకు మధ్య సత్సంబంధాలు లేవనేది రహస్యమేమీ కాదు. ఆర్మీ చీఫ్‌ నామినీ లెఫ్టినెంట్‌ జనరల్‌ నదీమ్‌ అహ్మద్‌ అంజుమ్‌ను కొత్త ఐఎస్‌ఐ చీఫ్‌గా నియమించాలని,  ఐఎస్‌ఐ మాజీ చీఫ్‌ జనరల్‌ ఫయాజ్‌ హమీద్‌ను సైనిక దళాల అధిపతిగా బదిలీ చేయాలని ప్రస్తుత సైన్యాధిపతి జనరల్‌ బజ్వా నిర్ణయించ డంతో... ఆ నిర్ణయాన్ని అమలుచేసే విషయంలో ప్రధాని ఇమ్రాన్, జనరల్‌ బజ్వా మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి.

అమెరికా తల పెట్టిన ‘ఉగ్రవాదంపై యుద్ధం’లో తాను కూడా పాల్గొన్నానని పాకి స్తాన్‌ చెప్పుకుంటున్నప్పటికీ... అది తాలిబన్లకు సహాయం చేసి నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ‘ఉగ్రవాదంపై యుద్ధం’లో పాకిస్తాన్‌ చేరినందుకు ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ విచారం వ్యక్తం చేశారు. ఈ చర్యను పాకిస్తాన్‌ ‘తనకు తాను చేసుకున్న గాయం’గా ఆయన అభివర్ణించారు. రెండు దశాబ్దాలుగా ఆర్థికంగా, సైనికంగా అమెరికా నుంచి సహాయం పొందిన  పాకిస్తాన్‌ ఇప్పుడు వాషింగ్టన్‌ పట్ల నిరాశాజనకంగా మాట్లాడటం ఆసక్తిదాయకం. ఎన్నికైన అఫ్ఘాన్‌ ప్రభుత్వాలకు రక్షణ, ఆర్థికపరమైన సహాయాలను అందించినప్పటికీ, అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా చేపట్టిన ‘ఉగ్రవాదంపై యుద్ధం’లో సైని కంగా పాల్గొనకుండా భారతదేశం తగిన విధంగా వ్యవహరించింది. 

అయితే, పాకిస్తాన్‌ ఆలోచనా ధోరణిలో కొంత మార్పు కనిపిస్తు న్నప్పటికీ... ఆ దేశానికి తానిస్తున్న స్థానమేంటో... అమెరికా అధ్య క్షుడు బైడెన్‌ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే వెల్లడించారు. పాకిస్తాన్‌ పేరుకు ప్రజాస్వామ్య దేశమైనా... పాలనలో సైన్యం ప్రధాన పాత్ర వహిస్తుందనే వాస్తవాన్ని విస్మరించి,  తాను ఎంతో ప్రచారార్భాటాలతో నిర్వహించిన ‘ప్రజాస్వామ్య దేశాల శిఖరాగ్ర సమావేశం’ (సమ్మిట్‌ ఆఫ్‌ డెమోక్రసీస్‌)కు పాకిస్తాన్‌ను ఆహ్వానించి పాక్‌ పట్ల తమకున్న గౌరవాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో దక్షిణాసియాలో ప్రజాస్వామ్యం వేళ్లూనుకొనిపోయిన బంగ్లాదేశ్, శ్రీలంకలను ఆహ్వానించకపోవడం గమనించదగిన విషయం. అయితే అమెరికా పాకిస్తాన్‌కు ఇంత ప్రాధాన్యం ఇచ్చినా స్పష్టంగా చైనా ఒత్తిడితో ఇమ్రాన్‌ ఖాన్‌ అమెరికా ఆహ్వానాన్ని తిరస్కరించారు.

ఈ పరిణామాలన్నింటినీ భారతదేశం గమనిస్తూనే ఉంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌ పర్యటన... భారతదేశం తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకోవాలని అనుకుంటున్నట్లు ప్రపంచానికి స్పష్టం చేసింది. తాను ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో వ్యూహా త్మక భాగస్వామ్యం కలిగి ఉండాలనే విషయంలో బైడెన్‌ న్యూఢిల్లీని బలవంతం చేయలేడని పుతిన్‌ పర్యటన స్పష్టం చేసింది. 

ఇటీవల అఫ్ఘానిస్తాన్‌–పాకిస్తాన్‌ మధ్య ఉన్న వివాదాస్పద డ్యూరాండ్‌  రేఖ సరిహద్దులో కంచె వేయడానికి పాకిస్తాన్‌ సైనికులు  చేసిన ప్రయత్నాన్ని తాలిబన్లు భగ్నం చేయడం విశేషం. బ్రిటిష్‌ వాళ్లు అఫ్ఘానిస్తాన్‌కు, పాకిస్తాన్‌కు మధ్య నిర్ణయించిన సరిహద్దురేఖ డ్యూరాండ్‌.  పాక్‌ తలపెట్టిన ఈ సరిహద్దు కంచెను ‘చట్టవిరుద్ధం’ అని  అఫ్ఘాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇనయతుల్లా ఖ్వారిజ్మీ అభివర్ణించారు. ఈ మొత్తం సంఘటనను అఫ్ఘాన్లు వీడియో తీశారు. వివాదాస్పదమైన 2,600 కిలోమీటర్ల సరిహద్దు వెంబడి ఇటువంటి సంఘటనలకు పాకిస్తాన్,  అఫ్ఘాన్‌లో అధికారం పొందటంలో దాని నుంచి సహాయం పొందిన తాలిబన్‌ సిరాజుద్దీన్‌ హక్కానీలు భవి ష్యత్తులో పరస్పరం ఎలా ప్రతిస్పందిస్తారో వేచి చూడాలి.

– జి. పార్థసారథి
వ్యాసకర్త పాకిస్తాన్‌లో భారత మాజీ హైకమిషనర్,
జమ్మూ సెంట్రల్‌ యూనివర్సిటీ ఛాన్సలర్‌
 

మరిన్ని వార్తలు