కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తున్న పుస్తకం ‘శూద్రాస్‌’

27 Feb, 2021 00:43 IST|Sakshi

సందర్భం 

ఏదైనా ఒక సమాజం అసమానతల ప్రాతిపదికన ఏర్పడినప్పుడు, దాని పునర్నిర్మాణం కోసం అడుగులు వేయడమొక అనివార్యమైన, అవసరమైన క్రియ. తరతరాలుగా అణచివేతకు గురైనవారు శూద్రులు. వారిని విముక్తి చేసే ప్రక్రియలో భాగంగా, జ్యోతిబా ఫూలే చాతుర్వర్ణ వ్యవస్థను సవాలు చేశాడు. దీన్నే గొప్ప కాంక్షతో అంబేడ్కర్‌ కూడా చేశాడు. హిందుత్వ బ్రాహ్మణీయ అధికార సంబంధాలను బహిర్గతం చేసి, సామాజిక పునర్నిర్మాణం కోసం తన వంతు పాత్రని నెరవేర్చడంలో భాగంగా వచ్చిన పుస్తకం ‘ద శూద్రాస్‌: విజన్‌ ఫర్‌ ఎ న్యూ పాథ్‌’. పెంగ్విన్, సమృద్ధ భారత్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘రీథింకింగ్‌ ఇండియా’ సిరీస్‌లో భాగంగా వచ్చిన 14వ సంపుటం ఇది. ఈ నెల 22న విడుదలైంది. సామాజిక, రాజకీయ తత్వవేత్త కంచ ఐలయ్య షెపర్డ్, జేఎన్యూ పొలిటికల్‌ సైన్స్‌ పరిశోధక విద్యార్థి కార్తీక్‌ రాజా కరుప్పుసామి సంపాదకత్వంలో వెలువడింది. 

సంపాదకుల పరిచయ వ్యాసంతో కలిపి మొత్తం 12 అధ్యాయాలున్న ఈ పుస్తకం, శూద్రుల సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక స్థితిగతులను విశ్లేషించింది. రచయితలు శూద్ర సామాజిక వర్గం నుంచి రావడం, వివిధ రంగాలలో గుర్తింపు పొందినవాళ్లు కావడం పుస్తకానికి బలాన్ని చేకూర్చింది. పార్లమెంటు సభ్యుడు శరద్‌ యాదవ్, సామాజిక కార్యకర్త సునీల్‌ సర్దార్, జర్నలిస్ట్‌ ఉర్మిలేష్, సోషల్‌ జస్టిస్‌ లాయర్‌ బిందు దొడ్డ హట్టి, వైద్యుడు పుంజాల వినయ్‌ కుమార్, యూనివర్సిటీ ఫ్యాకల్టీ అరవింద్‌ కుమార్, రామ్‌ భీనవేని షెపర్డ్, ప్రాచీ పాటిల్, పరిశోధక విద్యార్థి ఓం ప్రకాష్‌ మహతో వంటి వారి వ్యాసాలున్నాయి. అనేక ప్రశ్నలను దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ముందుంచారు వ్యాసకర్తలు. శూద్ర విప్లవ దశను, శూద్ర విముక్తిని ఈ పుస్తకం అత్యవసరంగా సూచిస్తున్నది. బీజేపీ ప్రభుత్వం మళ్లీ వర్ణ ధర్మ పాలననూ, గుప్త యుగాన్నీ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని హెచ్చరిస్తున్నది. ప్రాంతీయ పార్టీల ద్వారా తమ ఉనికిని ఆయా రాష్ట్రాలలో కాపాడుకుంటున్న శూద్రుల రాజకీయ పార్టీలను అంతం చేసే పనిలో హిందుత్వ రాజకీయం ఉందని చెబుతున్నది.

ఈ వ్యవస్థ ఎవరి కోసం ధనాన్ని కూడగట్టే ప్రయత్నం చేస్తుంది? ఎందుకు తరచుగా ‘ఉగ్రవాది’ అనే వాడుకభాషను అలవాటు చేస్తుంది? ‘రాజ్య/ రాజద్రోహి’ తనాన్ని ఎందుకు ‘దేశద్రోహి’ తనంగా చిత్రీకరిస్తుంది? స్త్రీలను కేవలం పునరుత్పత్తి యంత్రాలుగా ఎందుకు చూస్తుంది అనే ప్రశ్నలను వేసుకుంటే విముక్తి పథంలో తొలి అడుగు వేసినట్టే. శూద్రులకు ఆధ్యాత్మిక సమానత్వం లేదనే మాట ఎంత నిజమో, అసలు సమానత్వం అనే భావనను ఈ వ్యవస్థ వాళ్లకు పరిచయం లేకుండా చేసిందనే మాట కూడా అంతే నిజం. శూద్రత్వం అంటే పనితత్వం అని గొప్పగా చెబుతారు ద్విజులు. కానీ, పనితత్వానికి, అంటే లేబర్‌ వర్క్‌కు గౌరవం ఇవ్వటం బ్రాహ్మణిజానికి అలవాటు లేదు. ఇక్కడ పనితత్వం అంటే పై వర్ణాలకు, ముఖ్యంగా బ్రాహ్మణులకు సేవ చేయటమే. గాంధీ తెలివిగా శూద్రుల సేవా గుణాన్ని పొగుడుతూ దాన్ని శాశ్వతం చేసే ప్రయత్నం చేశాడు. 1933లో వర్ణధర్మ వ్యవస్థను సరిచేయడం ఎలా అనే అంశంపై రాస్తూ, ‘తన విధిని విస్మరించే బ్రాహ్మణుడి కంటే తనకు తగిన కర్తవ్యాన్ని చేసే శూద్రుడే ఉత్తమం’ అన్నాడు. ఈ పుస్తకం చదివినవాళ్లు ఈ విషయాన్ని ఇంకోవిధంగా అర్థం చేసుకోవచ్చు. తనకు కేటాయించిన విధిని చేసే బ్రాహ్మణుడి కంటే, తనకు తగని కర్తవ్యాన్ని విడిచిపెట్టిన శూద్రుడే ఉత్తమం!

శూద్రులు తమ మేధో సామర్థ్యాన్ని, స్పృహను, ఆధ్యాత్మిక సమానత్వం, ప్రజాస్యామ్యం కోసం ఉపయోగిస్తూ, మనువాద హిందుత్వ రాజకీయాలకు బానిస అవ్వకుండా తమ జీవన విధానాన్ని, లక్ష్యాలను గొప్పగా ఉంచుకుంటూ వాటి కోసం ప్రయత్నించినప్పుడే ఈ రాజకీయ ప్రజాస్వామ్యంలో శూద్రులకు సామాజిక ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో అధికారంలో ఉన్న రెడ్డి, కమ్మ, వెలమ, యాదవ్, కూర్మి, వొక్కలిగ, లింగాయత్, నాయర్, పటేల్, జాట్, గుజ్జర్‌ శూద్ర కులాలు ఈ ప్రశ్నలు వేసుకోవలసిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఒక్క నోబెల్‌ బహుమతి ఎందుకు శూద్రులకు రాలేదు? ఇంకా ఎన్నో ఉత్పత్తి కులాలు, భూమిని నమ్ముకొని బతుకుతున్న కులాలు అధికారం వైపు కాదు కదా, సంపూర్ణ విద్య, ఉద్యోగం వైపు కూడా ఎందుకు అడుగులు వేయలేదు? దీనికి గల కారణాలను ఈ పుస్తకం లోతుగా విశ్లేషించింది. రాజకీయ ఎదుగుదల ఉన్నంత మాత్రాన శూద్రులు సామాజిక సమానత్వ ఫలాలను అనుభవించే దశలో లేరు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమానత్వం చాలా అవసరం. అలా లేని పరిస్థితుల్లో సామాజిక బానిస త్వాన్ని శాశ్వతం చేసినవాళ్లం అవుతాము. అలాంటి చారిత్రక తప్పిదం జరగకూడదనే హెచ్చరికను ముందుకు తెచ్చిన పుస్తకమే ‘ద శూద్రాస్‌’.  


-  పల్లికొండ మణికంఠ
సమీక్షకుడు పరిశోధక విద్యార్ధి, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ

మరిన్ని వార్తలు