కేంద్ర పథకాలకు మార్గదర్శి

10 Feb, 2022 11:07 IST|Sakshi

పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ గొప్ప మేధావి, కార్యశీలి, రాజనీతిజ్ఞుడు, నిస్వార్థ సేవకుడు. దీనదయాళ్‌ ఉన్నత విద్యను అభ్యసించిన అనంతరం ఉత్తరప్రదేశ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలో చేరారు, డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ ముఖర్జీ ప్రేరణతో 1951లో రాజకీయ క్షేత్రం భారతీయ జనసంఘ్‌లో ప్రచారకులుగా చేరారు. ఆ పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా దేశ వ్యాప్తంగా పార్టీ విస్తరణలో క్రియాశీలక పాత్ర పోషించారు. అఖిలభారత అధ్యక్షులుగా పట్నాకు రైలులో ప్రయాణిస్తున్న దీన దయాళ్‌ ఉపాధ్యాయ 1968 ఫిబ్రవరి 11న మొఘల్‌ సరాయ్‌ రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫారం వద్ద శవమై పడి ఉన్నారు. ఆయన మరణం గురించి ఇప్పటివరకు అసలు నిజాలు వెలుగులోకి రాలేదు.

దీనదయాళ్‌ అందించిన ఏకాత్మ మానవ దర్శనం (ఇంటిగ్రల్‌ హ్యూమనిజం) అనే గొప్ప తాత్విక సిద్ధాంతాన్ని బీజేపీ తన రాజకీయ తాత్విక సిద్ధాంతంగా పేర్కొంటుంది. దీన దయాళ్‌ తన ఏకాత్మ మానవ దర్శనంలో ఈ దేశం అభివృద్ధికి చేపట్టే ప్రణాళిక ఏదైనా... అది దేశానుగుణం, కాలానుగుణమై ఉండాలని చెప్పారు. రాజకీయ, ఆర్థిక రంగాలలో వికేంద్రీ కరణను; ప్రభుత్వ రంగంతో పాటు ఉపాధి కల్పనలో ప్రైవేట్‌ రంగం ప్రాధాన్యం కూడా గుర్తించాలనీ, దేశంలో ప్రతి వ్యక్తీ ఉపాధి పొందాలనీ, తద్వారా ఉత్పత్తికి దోహదపడాలనీ వారు కోరుకున్నారు. భారీ పరిశ్రమలు వద్దన్నారు. కుటీర పరిశ్రమలే కావాలన్నారు. లోటు బడ్జెట్, ద్రవ్యోల్బణాలకు ప్రభుత్వం చేసే అధిక ఖర్చు కారణమని చెప్పి... పొదు పును ప్రోత్సహించారు. ఆర్థిక అవసరాల కోసం ప్రకృతిని నాశనం చేయకూడదనీ, ఆర్థిక ఫలాలు అందరికీ అందజేయాలనీ అన్నారు. (చదవండి: శతవసంత స్వరమాధురి)

ఈ సిద్ధాంతం ఆధారంగానే... దీన దయాళ్‌ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన, ప్రధాని ఆవాస్‌ యోజన, గ్రామ జ్యోతి యోజన, కౌశల్‌ యోజన, ప్రధాన మంత్రి సడక్‌ యోజన, బేటీ బచావో బేటీ పఢావో, ఆత్మనిర్బర్‌ భారత్‌ వంటి అనేక పథకాలతో సబ్‌ కా సాథ్, సబ్‌ కా వికాస్, సబ్‌ కా విశ్వాస్‌ వంటి నినాదాలతో అందరికీ తను నిర్దేశించిన లక్ష్యాల ఫలాలు అందించాలని భారత ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. దీనదయాళ్‌ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి!

– శ్రీశైలం వీరమల్ల, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు
(ఫిబ్రవరి 11న దీనదయాళ్‌ ఉపాధ్యాయ వర్ధంతి) 

మరిన్ని వార్తలు