జీవ భద్రతకు ‘జన్యు సవరణ’ కూడదు!

5 Jun, 2022 02:58 IST|Sakshi

‘జన్యు మార్పిడి’ చేసిన (జెనిటికల్లీ మాడిఫైడ్‌–జీఎం) వంగ డాల ఉత్పత్తి, జన్యు మార్పిడి ఆహారోత్పత్తులకు సంబంధించి మన దేశంలో కఠినమైన జీవ భద్రతా నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈ సాంకేతికత ప్రజల ఆరోగ్యాన్నీ, రైతుల జీవనో పాధినీ, పర్యావరణాన్నీ వెనక్కి తీసుకోలేని రీతిలో ప్రభావితం చేయగలిగినదై ఉండటం వల్లనే మనం పటిష్ఠమైన జీవ భద్రతా చట్టం రూపొందించుకున్నాం. మన దేశంలో ఇప్పటికి ప్రభుత్వ అనుమతి పొందిన ఏకైక జీఎం పంట బీటీ పత్తి మాత్రమే. జీవ భద్రతాపరమైన సమస్యల కారణంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో బీటీ వంగ, బీటీ ఆవాలు తదితర జన్యు మార్పిడి వంగడాలకు బ్రేక్‌ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇన్నాళ్లూ అన్ని రకాల ‘జన్యు మార్పిడి’ పంటలకు వర్తించే కఠిన జీవ భద్రతా నిబం ధనల పరిధి నుంచి కొన్ని రకాల ‘జన్యుపరంగా సవరించిన’ (జీనోమ్‌ ఎడిటెడ్‌) పంటలను పూర్తిగా మినహా యిస్తూ భారత ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వు జారీచేయటం పట్ల నిపుణులు, పర్యావరణవేత్తలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. 

పర్యావరణ పరిరక్షణ చట్టం–1989 నిబం ధనల ప్రకారం... జన్యు మార్పిడి సాంకేతికతలకు సంబంధించిన అంశాలన్నీ కేంద్ర పర్యావరణ శాఖకు అనుబంధంగా ఉన్న జెనిటిక్‌ ఇంజనీరింగ్‌ అప్రయిజల్‌ కమిటీ (జీఈఏసీ) పరిధిలోకి వస్తాయి. అయితే, వాణిజ్యపరమైన దృష్టితో మొక్కల్లో ‘జన్యు సవరణ’ చేసే రెండు రకాల ప్రక్రియలను ఈ నిబంధనల పరిధి నుంచి పూర్తిగా మినహాయిస్తూ ఈ ఏడాది మార్చి 30న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ నుంచి ‘ఆఫీస్‌ మెమో’ జారీ అయ్యింది. 

ఈ మెమో జన్యు సాంకేతి కతలను మూడుగా వర్గీకరిం చింది. ఒక జాతి మొక్కలోకి వేరే జాతి జన్యువును చొప్పిం చటమే ‘జన్యు మార్పిడి’. పంట మొక్కల్లో ఉన్న కొన్ని జన్యువులను పనిచేయకుండా చేయటం /తొలగించటం లేదా కొన్ని జన్యువుల ప్రొటీన్‌ వ్యక్తీ కరణ తీరులో మార్పులు చేయ టమే ‘జన్యు సవరణ’. ఈ రెండు జన్యు సవరణ ప్రక్రియ లలో ఇతర జాతుల నుంచి జన్యు మార్పిడి జరగటం లేదు కాబట్టి... జీఈఏసీ పర్యవేక్షించే కఠిన జీవ భద్రతా నియమా వళి పరిధి నుంచి జన్యు సవరణ పంటలను పూర్తిగా మినహా యిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంటే, జీనోమ్‌ ఎడిటెడ్‌ మొక్కలపై పరిశోధన, అభివృద్ధి, నిర్వహణలో నిమగ్నమైన ప్రభుత్వ, ప్రైవేటు రంగ పరిశోధనా సంస్థలు ఇక మీదట జీఈఏసీ నుంచి ఏ అనుమతులూ తీసుకునే పనిలేదు. 

జన్యు సాంకేతికతలను నియంత్రించే విషయంలో రాజీ ధోరణితో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణం ఉప సంహరించుకోవాలని ఆహార, ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వాళ్లు డిమాండ్‌ చేశారు. ఆహార జీవ భద్రతనూ, పర్యావర ణాన్నీ, మన ఎంపిక స్వేచ్ఛనూ పరిరక్షించడానికి భారత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జీఎం ఫ్రీ ఇండియా కోకన్వీనర్లు కపిల్‌ షా, శ్రీధర్‌ రాధాకృష్ణన్‌ డిమాండ్‌ చేశారు. ‘భారత రాజ్యాంగం అప్పగించిన నియంత్రణ బాధ్యతను ప్రభుత్వం విస్మరించటం తగదు; జన్యు మార్పిడి మాదిరిగానే జన్యు సవరణలను కూడా అత్యంత జాగరూకత, ముందస్తు జాగ్రత్తలతో పూర్తిగా నియంత్రించవలసిన అవ సరం ఉందని ప్రభుత్వం గుర్తించా’లన్నారు.   

‘జన్యు మార్పిడి, జన్యు సవరణ ప్రక్రియలను విభజించి చూడటం అశాస్త్రీయం మాత్రమే కాదు, అత్యంత ప్రమాద భరితం కూడా! జీఈఏసీ పరిధి నుంచి జన్యు సవరణ ప్రక్రియలను మినహాయించటం తగ’దని అలయన్స్‌ ఫర్‌ సస్టయినబుల్‌ అగ్రికల్చర్‌ కన్వీనర్‌ కవితా కురుగంటి వ్యాఖ్యా నించారు. జన్యు సవరణ ప్రక్రియ చేపట్టే క్రమంలో ఇతర జాతుల డీఎన్‌ఏ మార్పిడి చోటు చేసుకోదని చెప్పలేమని స్వతంత్ర విధాన విశ్లేషకుడు డా. దొంతి నరసింహారెడ్డి కేంద్రా నికి రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. ఆరేళ్ల క్రితం దక్షిణ కొరియాలో ఓ శాస్త్రవేత్త రంగు పుట్టగొడుగులకు జన్యు సవరణ చేసినప్పుడు స్వల్ప మాత్రంగా అన్య డీఎన్‌ఏ మార్పిడి కూడా అసంకల్పంగా జరిగినట్లు తర్వాత తేలిందన్నారు. అందువల్ల, ప్రభుత్వం జన్యు సవరణ ప్రక్రియలను కూడా పటిష్ఠమైన నియంత్రణ వ్యవస్థ పరిధిలోనే ఉంచాలని కోరారు. 

జన్యు మార్పిడితో పాటు జన్యు సవరణ ప్రక్రియలను సైతం జీవ భద్రతా నియంత్రణ వ్యవస్థల పరిధిలోనే ఉంచటం ద్వారా జన్యు కాలుష్యానికి ఆస్కారం లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం విస్మరించ జాలదు. ఈ బాధ్యత నుంచి తప్పుకోవాలనుకుంటే వెనక్కి తీసుకోలేని దుష్పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని అందరూ గ్రహించాలి. 
– పంతంగి రాంబాబు, సీనియర్‌ జర్నలిస్టు
(నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం) 

మరిన్ని వార్తలు