COP27: కార్యాచరణకు దిగాల్సిన సమయమిదే

24 Nov, 2022 00:21 IST|Sakshi

ఈజిప్టులో జరిగిన ‘కాప్‌ 27’ సమావేశాలు వాడిగా వేడిగా జరిగాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు రెండుగా విడిపోయాయి. ‘పేమెంట్‌ ఓవర్‌డ్యూ’ ఈసారి హాట్‌ టాపిక్‌! వాతావరణ కాలుష్యానికి కారణమైన ధనిక దేశాలు అందుకు తగ్గ పరిహారం చెల్లించడం ఇప్పటికే ఆలస్యమైందన్న భావన ఈ పేమెంట్‌ ఓవర్‌డ్యూ. అయితే ఈ దేశాలు తాము అంగీకరించిన విషయాల్లోనూ వెనకడుగు వేస్తుండటంతో వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చల్లో పురోగతి ఉండటం లేదు. అభివృద్ధి చెందిన దేశాలు తమ కాలుష్య తప్పిదాలకు బాధ్యత వహించి పరిష్కార మార్గాలకు నేతృత్వం వహించే విధానాలు రావాలి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి స్పష్టం చేసినట్టు, కార్యాచరణకు దిగాల్సిన సమయమిదే!

ఈజిప్టులోని షర్మ్‌ అల్‌–షేఖ్‌లో నవంబరు ఆరున మొదలైన కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (కాప్‌) 27వ సమావేశాలు ముగిశాయి. ఐక్యరాజ్య సమితి సంస్థ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైౖమేట్‌ ఛేంజెస్‌ (యూఎన్‌ఎఫ్‌సీసీసీ) ఆధ్వర్యంలో నడిచిన ఈ సమావేశాల్లో తీవ్ర చర్చోపచర్చలు, వాదోప వాదాలు జరిగి, ఒక్కరోజు పొడిగింపు తరువాత నవంబరు 20వ తేదీ తెల్లవారుజామున ముగిశాయి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేదెలా అన్న అంశంపై ఏటా జరిగే ‘కాప్‌’ సమావేశాల్లో ఈసారి ‘పేమెంట్‌ ఓవర్‌డ్యూ’ అంశంపై తీవ్రస్థాయి ప్రతిష్టంభన ఏర్ప డింది. వాతావరణ కాలుష్యానికి కారణమైన ధనిక దేశాలు అందుకు తగ్గ పరిహారం చెల్లించడం ఇప్పటికే ఆలస్యమైందన్న భావనను సంక్షి ప్తంగా పేమెంట్‌ ఓవర్‌డ్యూ అని పిలుస్తున్నారు. ఈ అంశంపై అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు రెండుగా విడిపోయాయి. నవంబరు 18నే ముగియాల్సిన చర్చలు ఇరు వర్గాల విమర్శలు, ప్రతి విమర్శలతో రోజంతా కొనసాగాయి. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటో నియో గుటెరస్‌ కలుగచేసుకుని, కార్యాచరణకు దిగాల్సిన సమయ మిదేనని స్పష్టం చేయాల్సి వచ్చింది. ‘‘కాప్‌27 సమావేశాలు నవం బరు 18నే ముగియాల్సి ఉండింది. అయితే చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఒక రోజుపాటు పొడిగించారు’’ అని భారత పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ తెలిపారు. 

వాతావరణ మార్పులపై ఏళ్లుగా జరుగుతున్న చర్చలు తరచూ ఆయా దేశాలు, వర్గాల మధ్య కలహాలు, జగడాలతో అర్ధంతరంగా ముగుస్తున్నాయి. ఈ దేశాలు, వర్గాలు సంకుచితమైన భావాలతో... ఇతరులపై పైచేయి సాధించేందుకు ఈ సమావేశాలు వేదికలుగా మారిపోయాయి. ‘‘వాతావరణంలోని గ్రీన్‌హౌస్‌ వాయువుల మోతాదు పెరిగిపోకుండా స్థిరీకరించాల్సి ఉంది’’ అన్న యూఎన్‌ ఎఫ్‌సీసీసీ ఆర్టికల్‌ 2 లక్ష్యాన్ని 30 ఏళ్లయినా అందుకోలేకపోవడం ఇందుకు ప్రత్యక్ష తార్కాణమని చెప్పాలి. ఈ ఏడాది జూన్‌ రెండున స్టాక్‌హోమ్‌+ 50 సమావేశాల్లోనూ ఐరాస ప్రధాన కార్యదర్శి ప్రపంచ వాతావరణ అత్యయిక పరిస్థితిపై మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ‘‘మూప్పేట ముప్పు ఎదుర్కొంటూ ఉన్నాం. ఏటికేడాదీ ప్రజ లను చంపేయడమే కాకుండా... నిరాశ్రయులను చేస్తున్న వాతావరణ అత్యవసర పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు మనం మన తీరుతెన్నులు మార్చుకోవాలి. ప్రకృతిపై చేస్తున్న మతిలేని ఆత్మహత్యా సదృశమైన పోరును ఆపాలి’’ అని ఆంటోనియో గుటెరస్‌ విస్పష్టంగా పేర్కొ న్నారు. ఈ హెచ్చరికలు 1992లో యూఎన్‌ఎఫ్‌సీసీసీ... రియో సద స్సులో ఆమోదించిన తీర్మానాన్ని ధ్రువీకరించాయని చెప్పాలి.

‘‘ప్రపం చంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి... ఎక్కువ కాలం కొనసాగేది కాదు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా ప్రకృతిని జయించాలన్న మానవ కాంక్ష మన మనగడనే ప్రశ్నార్థకం చేసే స్థితికి తీసుకొచ్చింది’’ అన్నది ఆ రియో సదస్సు తీర్మానం. ‘ఎన్విజనింగ్‌ అవర్‌ ఎన్విరాన్‌ మెంటల్‌ ఫ్యూచర్‌’ పేరుతో 2002లో వెలువడ్డ ఓ పుస్తకంలోనూ ‘‘పర్యావరణ విధ్వంసానికి సంబంధించిన హెచ్చరికలు వెలువడు తున్న ఈ తరుణంలో మన భవిష్యత్తును కాపాడుకునేందుకు తీసు కోవాల్సిన చర్యలకు తగినంత సమయం లేదన్నది గుర్తించాలి’’ అని చెప్పడం ఇక్కడ ప్రస్తావనార్హం. 

యూఎన్‌ఎఫ్‌సీసీసీలో దాదాపు 198 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. వాతావరణ మార్పులన్నవి మానవాళికి అత్యంత ఆందోళ నకారి అని అంగీకరిస్తూ అందరితోనూ తొలినాళ్లలోనే ఒక ఒప్పందం చేసింది ఈ సంస్థ. 1997 నాటి క్యోటో ప్రోటోకాల్, 2015 నాటి ప్యారిస్‌ ఒప్పందాల ద్వారా యూఎన్‌ఎఫ్‌సీసీసీ వాతావరణ మార్పు లను ఎదుర్కొనేందుకు మూడు చట్టపరమైన ఆయుధాలు కలిగి ఉంది.  రియో సదస్సు జరిగి ముప్ఫై ఏళ్లయిన సందర్భం ఇది. 2050 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్సియస్‌ కంటే ఎక్కువ పెరగకుండా చూసుకోవాలన్న శాస్త్రీయ లక్ష్యాన్ని సాధించేందుకు ఇదే అవకాశం. ఎందుకంటే... ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘ద ఇంటర్‌ గవర్న మెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైౖమేట్‌ ఛేంజ్‌’ విడుదల చేసిన ఆరవ అంచనా నివేదిక కూడా... గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలు పెరిగిపోతున్నాయని హెచ్చరించింది. గత నెలలోనే యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రోగ్రామ్‌కు చెందిన ఎమిషన్‌ గ్యాప్‌ రిపోర్ట్‌ కూడా ప్యారిస్‌ ఒప్పందం అమలులో వెనుకబడుతున్నామనీ, లక్ష్యాన్ని అందుకు నేందుకు నమ్మ దగ్గ మార్గమేదీ లేని నేపథ్యంలో వాతావరణ పెను విపత్తును నివారిం చేందుకు అత్యవసరంగా ఓ విస్తృతమైన మార్పు అనివార్యం అవు తుందనీ స్పష్టం చేసింది.

వాతావరణ మార్పుల సమస్య అనేది ఇప్పుడు కేవలం ఒక ఆందోళనకరమైన అంశం మాత్రం కాదు. ప్రపంచం మొత్తాన్ని పీడించగలదని అందరూ గుర్తించాలి. అయితే అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటివరకూ చేసిన కాలుష్య తప్పిదాలకు బాధ్యత వహించి పరిష్కార మార్గాలకు నేతృత్వం వహించేలా విధానాలు లేకుండా పోయాయి. భూమ్మీద అత్యధిక కర్బన ఉద్గారాలకు కారణమైన అమెరికా వాతావరణ మార్పులపై పోరు విషయంలో కప్పదాట్లు వేయడం, 2019లో ప్యారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగడం, ఆ తరువాత 2021లో మళ్లీ చేరుతున్నట్లు ప్రకటించడం అభివృద్ధి చెందిన దేశాల తీరుకు తార్కాణంగా నిలుస్తోంది. అంతేకాకుండా... వాతా వరణ మార్పులపై జరిగిన ఒప్పందాల్లోని డొల్లతనాన్ని ఎత్తి చూపు తుంది కూడా. అంతర్జాతీయ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ ఒడిదుడుకులకు గురయ్యేందుకు యూఎన్‌ఎఫ్‌సీసీసీ తన ప్రధాన సిద్ధాంతం నుంచి కొంత పక్కదారి పట్టడమే కారణమని అనిపిస్తుంది.

వాతావరణ మార్పుల సమస్య అందరిదైనా... బాధ్యతలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయని చెప్పే సిద్ధాంతం మాత్రమే కాకుండా... క్యోటో ప్రోటో కాల్‌లోని కొన్ని కీలకాంశాల్లో సడలింపులు, ప్యారిస్‌ ఒప్పందంలోనూ బాధ్యతల విషయంలో ఆయా దేశాలు తమకు తగ్గ నిర్ణయం తీసు కుంటాయని చెప్పడం... వెరసి వాతావరణ మార్పులపై మనిషి పోరు నిర్వీర్యం అని చెప్పక తప్పదు. అభివృద్ధి చెందిన దేశాలు తాము అంగీకరించిన ప్రతి విషయంలోనూ వెనకడుగు వేయడం వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చల్లో పెద్దగా పురోగతి లేకపోయేందుకు కారణమని చెప్పాలి. అభివృద్ధి చెందిన దేశాలు తాము అంగీకరించిన అంశాల నుంచి వెనక్కు వెళ్లడం... వాతావరణ మార్పులు, దాని దుష్ప్రభావాలను ఎదుర్కొనే విషయంలో ధనిక దేశాలు నేతృత్వం వహించాలని యూఎన్‌ఎఫ్‌సీసీసీ చేసిన ప్రకటనను వెక్కిరించేదిగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల తీరు యూఎన్‌ఎఫ్‌సీసీసీ లక్ష్యాలకు పూర్తిగా భిన్నమన్నది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.

యూఎన్‌ ఎఫ్‌సీసీసీ నిబంధనల ప్రకారం... అభివృద్ధి చెందిన దేశాలు నేతృత్వం వహించేందుకూ; అవసరమైన అంశాల్లో తామిచ్చిన హామీల అమలు జరుగుతున్నదా లేదా అన్నది సమీక్షించేందుకూ తగిన ఏర్పాట్లు చేయాలి. అయితే ఇవేవీ జరగడం లేదు. ఈజిప్టులో ఇటీవల ముగిసిన కాప్‌ 27 సమావేశాల సారాంశమూ ఇందుకు భిన్నంగా ఏమీ లేదని చెప్పాలి. అభివృద్ధి చెందిన దేశాలు తగిన చర్యలు తీసుకోకపోతే ప్యారిస్‌ ఒప్పందం ప్రకారం జాతీయంగా నిర్దే శించుకున్న కంట్రిబ్యూషన్స్‌ వల్ల తమకేమీ ప్రయోజనం ఉండబోదని అభివృద్ధి చెందుతున్న దేశాలూ త్వరలో గుర్తిస్తాయి. ఈ విషయాల న్నింటినీ ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ ఇప్పటికైనా గుర్తించాలి. ఇప్పటివరకూ వాతావరణ మార్పులపై చర్చలను నిర్వహించడానికి మాత్రమే పరిమితమైన జనరల్‌ అసెంబ్లీ సమస్య మరింత తీవ్రమైనది అన్న విషయాన్ని అర్థం చేసుకునేలా చేయాలి. యూన్‌ఎఫ్‌సీసీసీతో పాటు ప్యారిస్‌ ఒప్పందం అమలుకు, భవిష్యత్తు కార్యాచరణకు తగిన తీర్మానాలు చేయాలి.

భరత్‌ హెచ్‌. దేశాయి, వ్యాసకర్త ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ లా, జేఎన్‌యూ 
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు