ప్రశ్నించడమే ప్రజాస్వామ్య సారం

11 Sep, 2020 01:36 IST|Sakshi

విశ్లేషణ 

పార్లమెంటులో ప్రశ్నలు సంధించడం అనేది చట్టసభ సభ్యుల రాజ్యాంగ హక్కు. ఈ హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 75 నుంచి దఖలుపడింది. ప్రశ్నోత్తరాల సమయం అంటే అమలులో ఉన్న ప్రత్యక్ష ప్రజాస్వామ్య వ్యక్తీకరణగానే చెప్పాలి. అయితే ప్రభుత్వంపై ప్రతిపక్షం ఆగ్రహించిన ప్రతి సందర్భంలోనూ మొట్టమొదటిగా బలయ్యేది ఈ ప్రశ్సోత్తరాల సమయమే. రాజకీయపార్టీలు తరచుగా ప్రశ్నోత్తరాల సమయంలోనే తమ సభ్యులను పోడియం ముందుకు వెళ్లి నిరసన తెలుపాలని ప్రోత్సహిస్తుంటాయి. దీనిద్వారా ప్రశ్నిచే హక్కును కోల్పోతున్నది తామే కానీ ప్రభుత్వం కాదనే విషయాన్ని చట్టసభ సభ్యులు గుర్తించరు. నిజానికి ఇది పార్లమెంటులోని ప్రతి సభ్యుడికీ, సభ్యురాలికీ కలిగే నష్టం మాత్రమే.

సాంప్రదాయానుసారం, తప్పనిసరిగా కొనసాగించాల్సిన ప్రశ్నోత్తరాల సెషన్‌ లేకుండానే సెప్టెంబర్‌ 14 నుంచి పార్లమెంటు సమావేశం కానుంది. సాధారణంగా ప్రతి పార్లమెంట్‌ సమావేశం కూడా ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతుంది. ఇది గంటసేపు కొనసాగుతుంది. ప్రభుత్వం తలపెడుతున్న వివిధ కార్యక్రమాలపై సమాచారం కోరుతూ పార్లమెంటు సభ్యులు ప్రశ్నలు సంధిస్తారు. పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సెషన్‌నే రద్దు చేసిన పక్షంలో దేశంలో ప్రభుత్వ పాలనకు సంబంధించిన కీలక అంశాలపై సమాచారం వెలికి రాకుండా నిలిచిపోతుంది. దీనివల్ల ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలను చట్టసభల సభ్యులు కోల్పోతారు. ప్రశ్నలు సంధించే హక్కును రాజ్యాంగంలోని 75వ ఆర్టికల్‌ కల్పిం చింది. మంత్రిమండలి సామూహికంగా చట్టసభ ప్రతినిధులకు జవాబుదారీగా ఉండాలని ఇది చెబుతోంది. ఈ సామూహిక బాధ్యతే ప్రభుత్వాన్ని పార్లమెంటుకు జవాబుదారీని చేస్తుంది. పన్నులు వసూలు చేసినప్పుడు లేక వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై డబ్బు ఖర్చు పెట్టినప్పుడు ప్రభుత్వం ఎంత మొత్తం పన్నులను వసూలు చేసింది, ఎంత డబ్బు ఖర్చు పెట్టింది అనే అంశాలను తెలుసుకునే హక్కు చట్టసభ సభ్యులకు ఉంటుంది. ప్రశ్నలు అడగడం ద్వారా, అందుబాటులో ఉన్న ఇతర ఉపకరణాల ద్వారా, పార్లమెంటరీ కమిటీలు రూపొందిం చిన సిస్టమ్స్‌ని ఉపయోగించడం ద్వారా చట్టసభ సభ్యులు ఈ హక్కును ఉపయోగించుకుంటారు. 

ప్రశ్నోత్తరాల సమయం.. ప్రత్యక్ష ప్రజాస్వామ్య వ్యక్తీకరణ
పార్లమెంటులో ప్రశ్నలు సంధించడం అనేది చట్టసభ సభ్యుల రాజ్యాంగ హక్కు. ఈ హక్కు ఆర్టికల్‌ 75 నుంచి దఖలుపడింది. ఈ కోణంలోంచి చూస్తే పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రత్యేకంగా చూడాల్సి ఉంది. అదేమిటంటే ప్రశ్నోత్తరాల సమయం అనేది క్రియాశీలంగా ఉన్న ప్రత్యక్ష ప్రజాస్వామ్యపు వ్యక్తీకరణగానే చెప్పాలి. ఈ అర్థంలో చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉన్న వారు పాలనకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వాన్ని నేరుగా నిలదీస్తారు. వారు సంధించే ప్రశ్నలన్నింటికీ సమాధానాలు విధిగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తలెత్తే ప్రశ్న ఏమిటంటే, మొత్తం పార్లమెంటు సమావేశాల కాలంలో ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయాలని నిర్ణయిస్తుందా అన్నదే. చట్టసభ నిబంధనలు దానికి అనుమతించవు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీన్ని ఒక రోజుపాటు సస్పెండ్‌ చేయవచ్చు. అయితే ఆరోజు అప్పటికే జాబితాలో పొందుపర్చిన ప్రశ్నలను సభ్యులు సమాధానం ఆశిస్తున్న ప్రశ్నలుగా పరిగణిస్తారు. అంటే వీటికి కూడా రాతపూర్వకంగా సమాధానాలుండి వీటిని చట్టసభలో ఉంచారని అర్థం. అయితే  మొత్తం పార్లమెంటు సెషన్‌లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయడం అనేది పూర్తిగా భిన్నమైన విషయంగానే చూడాలి.
చట్టసభ సంపూర్ణ ఆమోదం లేకుండా ప్రశ్నోత్తరాలను ఏకపక్షంగా రద్దు చేస్తూ నిర్ణయించే అధికారం కార్యనిర్వాహక వర్గానికి లేదన్నదే ఈ రచయిత అభిప్రాయం. చట్టసభ ఒక తీర్మానం ద్వారానే అలాంటి నిర్ణయానికి అనుమతిని ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుంటే తమ రాజ్యాంగబద్ధమైన హక్కును కార్యనిర్వాహకవర్గం తీసేసుకుందని సభ్యులు గుర్తించాలి. 

గతంలో కూడా కొన్ని సందర్భాల్లో మొత్తం సెషన్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేయడం నిజమే. కానీ కార్యనిర్వాహక వర్గం తీసుకున్న అలాంటి నిర్ణయాలు రాజ్యాంగం ప్రకారం చూస్తే తప్పు. పైగా ప్రభుత్వం మెజారిటీని కలిగి ఉన్నందున చట్టసభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని తీర్మానం ద్వారా రద్దు చేయడం దానికి సులువు అనేది కూడా నిజమే. కానీ అలాంటి నిర్ణయం తీసుకోవడానికి తగిన కారణాన్ని ప్రభుత్వం తప్పకుండా అటు చట్టసభకూ, ఇటు యావద్దేశానికి వివరించాల్సిన అవసరం ఉంది. అప్పుడే.. ప్రభుత్వం దురుద్దేశంతో వ్యవహరిస్తోందా లేక నిజమైన కారణాలతోనే అలాంటి చర్యకు పాల్ప డిందా అని ప్రజలు తేల్చుకోగలరు. వాస్తవానికి, ప్రశ్నోత్తరాల సమయాన్ని మొత్తంగా రద్దు చేయడానికి నిజమైన కారణాలు అనేవి ఎన్నటికీ ఉండవనే చెప్పాలి. అదే పార్లమెంటులో ఇతర కార్యక్రమాలన్నీ సజావుగా జరుగుతున్నప్పుడు ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహించడంలో సమస్యలు ఏం ఉంటాయి? అందుకే ఈ అంశానికి సంబంధించినంతవరకు.. ప్రభుత్వాన్ని నడుపుతున్న వారి సాధారణ వైఖరిలోనే అసలు సమస్య కనపడుతుంది. ప్రభుత్వ యంత్రాంగం అన్ని వేళల్లో సభ్యులు సంధించిన ప్రతి ప్రశ్నను సేకరించి దానిపై పార్లమెంటుకు సమాధానాల రూపంలో సమర్పించిన సమాచారం సరిగ్గా ఉన్నట్లు నిర్ధా్దరించాల్సి ఉంది. 

అందుచేత, రాజకీయ విభేదాలకు తావిచ్చే కీలక అంశాలను ప్రజలకు వెల్లడించటానికి ప్రభుత్వం సమ్మతించనప్పుడు ఇలా ప్రశ్నోత్తరాలను పక్కనపెట్టే ధోరణి సాధారణంగా ఉంటూ వస్తోంది. ఏ ప్రభుత్వం కూడా పార్లమెంటుకు అబద్ధాలు చెప్పకూడదు. అలా చెప్పినట్లు దొరికిపోతే ప్రభుత్వంపై ప్రత్యేకాధికారంతో చర్య తీసుకునే సమస్యలు ఎదురవుతాయి. ఏది ఏమైనా చట్టసభలో ప్రభుత్వానికి మెజారిటీ ఉంటుంది కనుక తన మంత్రులను అది తప్పకుండా కాపాడుకుంటుంది. లేకుంటే వారు ప్రజా విమర్శను ఎదుర్కోవలిసి ఉంటుంది. కొంతమంది మంత్రులకు పార్లమెంటులో ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఏమంత సంతోషకరమైన విషయంగా ఉండదు.

ప్రశ్నలు చికాకుపెట్టవు.. బాధించవు
ప్రభుత్వానికి సంబంధించిన సమస్త కార్యకలాపాలపై పార్లమెంటులో సంధించే ప్రశ్నలు సమాధానం కోరతాయి. ఆ ప్రశ్నలకు తగినట్లుగా వివిధ ప్రభుత్వ శాఖలు విస్తారంగా సమాచారాన్ని సేకరించి ప్రభుత్వ వ్యవహారాలపై వెలుగును ప్రసరిస్తాయి. వాస్తవానికి పార్లమెంటులో సభ్యులు సంధించే ప్రశ్నల కారణంగా కొన్ని ప్రభుత్వ శాఖలు ఒక ప్రత్యేక సమస్యపై దృష్టి సారించి పరిష్కారాలపై దృష్టి పెట్టగలుగుతాయి. అలా ప్రశ్నించకుంటే కీలకమైన సమస్యలు ఆ విభాగాల దృష్టికి రాకుండా పోతాయి. వివిధ ప్రభుత్వ కమిటీలకు కూడా ఇదే వర్తిస్తుంది. వాస్తవానికి పార్లమెంటరీ తనిఖీ అనేది ప్రభుత్వానికి సాయపడుతుంది. అంతవరకు పరిష్కరించని సమస్యలపై ప్రభుత్వ విభాగాలు తీవ్రంగా దృష్టి సారించగలవు. అందుకే కరోనా మహమ్మారిపై సాగిస్తున్న యుద్ధం నుంచి ప్రభుత్వ దృష్టిని పార్లమెంటులో ప్రశ్నోత్తరాలు మళ్లిస్తాయనుకోవడం సరైంది కాదు. కాబట్టే పార్లమెంటు సమావేశాల మొత్తంలో ప్రశ్నోత్తరాలు లేకుండా చేయకూడదు.
గత అయిదు నెలలుగా పార్లమెంటు సమావేశాలు, ప్రశ్నలు లేకుండానే దేశంలోని ప్రతి ప్రాంతానికి కరోనా మహమ్మారి విస్తరించింది. అందుకే ఈ అంశంపై పార్లమెంటులో సంధించే ప్రశ్నలు ప్రభుత్వాన్ని చికాకుపెట్టవు, ఇబ్బంది కలిగించవు కూడా. ప్రభుత్వ జవాబుదారీతనం కోణంలోంచి చూస్తే ప్రశ్నోత్తరాల సమయం అనేది పార్లమెంటు సమావేశాల్లోనే అత్యంత ఆసక్తికరమైన సమయం. ప్రశ్నోత్తరాల సమయం సభ నిర్వహించే అత్యంత ముఖ్యమైన కార్యకలాపాల్లో కీలకమైనది. పైగా ఇది అనేకసార్లు అంతరాయాలకు లోనయ్యే కార్యకలాపం కూడా. ప్రశ్నోత్తరాల సమయం అంతరాయాలకు గురికావడం చాలా మామూలు వ్యవహారం. ప్రశ్నోత్తరాల సమయాన్ని విచ్ఛిన్నపర్చడం అంటే సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగే తమ హక్కును తామే విచ్ఛిన్నపర్చుకోవడమే అని గుర్తించాలి.

భారత రాజ్యాంగమే పార్లమెంటు సభ్యులకు ప్రశ్నించే హక్కును కల్పించింది. దాన్ని కాపాడుకోవడం వారి విధి మాత్రమే. విచారకరమైన విషయం ఏమిటంటే ప్రభుత్వంపై ప్రతిపక్షం ఆగ్రహించిన ప్రతి సందర్భంలోనూ మొట్టమొదటిగా బలయ్యేది ఈ ప్రశ్నోత్తరాల సమయమే. రాజకీయపార్టీలు తరచుగా ప్రశ్నోత్తరాల సమయంలోనే తమ సభ్యులను పోడియం ముందుకు వెళ్లి నిరసన తెలపాలని ప్రోత్సహిస్తుంటాయి. దీని ఫలితంగా చట్టసభ వాయిదా పడుతుంది. ప్రశ్నోత్తరాల సమయం గాలిలో కలిసిపోతుంది. దీనిద్వారా ప్రశ్నిచే హక్కును కోల్పోతున్నది తామే కానీ ప్రభుత్వం కాదనే విషయాన్ని చట్టసభ సభ్యులు గుర్తించరు. నిజానికి ఇది పార్లమెంటులోని ప్రతి సభ్యుడికీ కలిగే నష్టం మాత్రమే. సభ్యులు ఈ వాస్తవాన్ని గుర్తిస్తే ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎప్పటికీ విచ్చిన్నం చేయబోరు. లేక మొత్తం సమావేశాల్లో ప్రశ్నలను రద్దు చేయబోరు కూడా.  ఈ విషయంలో అటు ప్రభుత్వానికి కానీ, ప్రతిపక్షానికి కానీ విభజన అనేది ఉండదు. ప్రశ్నోత్తరాల సమయం అందరికీ సంబంధించింది. దాన్ని కాపాడుకోవలసిన ఉమ్మడి బాధ్యత వీరిపై ఉంది.

వ్యాసకర్త : పి.డి.టి ఆచార్య, వ్యాసకర్త లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శి

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు