సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్ని కణం చాకలి ఐలమ్మ

25 Sep, 2022 00:44 IST|Sakshi

సందర్భం

భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్ని కణం చిట్యాల ఐలమ్మ. రజక కుటుంబంలో పుట్టిన ఒక ఆడ పడుచు వేల ఎకరాల అధిపతైన దొర దోపిడీని ఎదిరించి నిలిచింది. ‘దున్నేవాడిదే భూమి’ అని సాగిన తెలంగాణ సాయుధ పోరా టంలో ఐలమ్మ నిప్పురవ్వ.

రైతులు, కూలీలను ఏకం చేసి ఉద్యమానికి ఊపిరులూదింది. భూమిలేక పోతే జిందగీ లేదని రక్తతర్పణం చేసిన ఐలమ్మ ‘బందగి’ దారిలో నడి చింది. ‘సంఘం’లో చేరితే సంగతి చెప్తానన్న దొరకు ఏ గతీ లేకుండా చేసింది. ‘బాంచెన్‌ నీ కాల్మొక్తా’ అన్న జనం చేత బందూకు బట్టించింది. వెట్టిచాకిరీ చేసేవాళ్ళు అలగా జనం కాదు, సహస్ర వృత్తులు చేసే సకలజనం అని చాటి చెప్పింది.

1895 సెప్టెంబర్‌ 26న సద్దుల బతుకమ్మ నాడు ఓరుగంటి మల్లమ్మ, సాయిలు నాలుగో సంతానంగా జన్మించింది ఐలమ్మ. తల్లిదండ్రులది ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం. 11వ ఏట పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో లగ్గమైంది. ఆమెకు ఐదుగురు కొడుకులు, ఒక కూతురు. దొర ఇంట ఊడిగం, ఊరి జనం బట్టల ఉతుకుడు. ఇదే వారి జీవనాధారం. దీంతో కుటుంబం గడవడం గగనమయ్యేది.

ఎదిగి వచ్చిన కొడుకులతో వ్యవసాయం చేయాలనుకుంది. పాలకుర్తికి పక్కనే ఉన్న మల్లంపల్లి దొర కుటుంబానికి చెందిన ఉత్తంరాజు జయప్రదాదేవి వద్ద 40 ఎకరాల భూమిని కౌలుకు తీసు కుంది. అదే విస్నూరు దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి తట్టుకోలేక పోయిండు! ‘వ్యవసాయం వద్దు, బట్టలు ఉతకడానికి రావాలి’ అని కబురు పంపిన దొరకు... తనకు వ్యవసాయమే ముఖ్యమనీ, ‘గడీలో వెట్టి చేయను పో’ అనీ గట్టిగా చెప్పింది. అప్పుడే వెట్టిచాకిరీలు చేయవద్దని పిలుపు నిచ్చిన ‘ఆంధ్ర మహాసభ’లో చేరింది. 

ఆడది ముందుబడి తన ఆధిపత్యాన్ని వెనుకబడేసిం దని రామచంద్రారెడ్డి రగిలిపోయాడు. దీంతో ఐలమ్మపై దొర కక్ష పెంచుకున్నాడు. ఐలమ్మ కొడుకులను అరెస్ట్‌ చేయించాడు. నల్లగొండలోని జైలులో ఉన్న కుటుంబీకులను కలిసేందుకు ఐలమ్మ ఒంటరిగా 100 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి వచ్చేది. దొర ఐలమ్మ ఇంటిని తగలబెట్టించాడు. ఆమె కూతురిపై లైంగికదాడి జరిగింది. అయినా లొంగని ఐలమ్మ న్యాయ పోరాటం చేసి దొరపై గెలిచింది.

ఇది సహించలేని విస్నూరు దొర... ఐలమ్మ పొలాన్ని అక్రమంగా తన పేర రాయించుకున్నాడు. కానీ దొరను గానీ, దొర గూండాలను గానీ తన పొలాన్ని టచ్‌ చేయనివ్వలేదు ఐలమ్మ. పొలంలోని వడ్లను తీసుకునేందుకు వచ్చిన దొర గూండాలను ‘ఆంధ్ర మహాసభ’ (సంఘం) సభ్యులతో కలిసి తరిమికొట్టింది. ధాన్యాన్ని ఇంటికి చేర్చింది. ఐలమ్మ తెగువను చూసిన జనానికి ప్రేరణ, స్ఫూర్తి కల్గింది. క్రమంగా తెలంగాణ పల్లెపల్లెన ఉద్యమం అలలుఅలలుగా ఎగిసిపడింది.

పల్లెల్లో దొరల పట్టు తప్పింది. ‘బందగి’ రక్త తర్పణంతో ఎరుపెక్కిన పోరుజెండా, ఐలమ్మ సాహసంతో సాయుధపోరు దారి చూపింది. దొరల ఆధిపత్యం క్రమంగా నేలమట్టమైంది. ఐలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగువేల మంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. ఆమె భూమి ఆమెకు దక్కింది. యావత్‌ తెలంగాణ మహిళా పౌరుషానికి ప్రతీకగా నిలిచిన ఐలమ్మ 1985 సెప్టెంబర్‌ 10న తుది శ్వాస విడిచింది. 

తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తాం అని చెప్పడం చాలా గొప్ప విషయమే. కానీ వాటిని ఘనంగా నిర్వహించాలి. ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చి ఆమె గురించి గొప్పగా తెలిసేలా విగ్రహాలు పెట్టాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమె కుటుంబానికి అండగా ఉండాలి. అప్పుడే ఆమెకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం.


- పీలి కృష్ణ , జర్నలిస్ట్‌
(సెప్టెంబర్‌ 26న చాకలి ఐలమ్మ జయంతి)

మరిన్ని వార్తలు