Bharat Bhushan: ఆదర్శ జీవితానికి కొలమానం

8 Feb, 2022 12:53 IST|Sakshi

రెండో మాట 

సుప్రసిద్ధ ఫొటో జర్నలిస్టుగా, ప్రజల జీవనాన్ని, వారి సంస్కృతిని జీవితాంతం తన కెమెరాకన్నులో బంధించి పేద ప్రజల బతుకు చిత్రాన్ని అక్షర సత్యంగా నాలుగు దశాబ్దాలకు పైగా అందిస్తూ వచ్చిన ప్రజా కళాకారుడు భరత్‌ భూషణ్‌. ఆయన నిజ జీవితంలో కూడా తిరుగులేని ఒక ఆదర్శ శిఖరం! భరత్‌ దశాబ్దాలుగా క్యాన్సర్‌ వ్యాధితో పోరాడుతూ కూడా తన కెమెరా కన్నుకు క్షణం విశ్రాంతి నివ్వలేదు. విద్యావంతురాలైన పేదింటి మహిళా రత్నం సుభద్రను ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం తర్వాత రెండు కుటుంబాలకు కనపడకుండా నెలల తరబడి కాదు, కొన్నేళ్లపాటు అజ్ఞాత జీవితాన్ని కూడా గడుపుతూ ఆమె జీవితాన్ని తీర్చిదిద్దాడు. ఈ జంటను కాపాడుకుంటూ వారి ఆదర్శానికి ఒక దిక్సూచిగా నిలబడవలసిన ధర్మం నాకూ, నా భార్య సుధారాణిపైన పడింది. అలా వారి అజ్ఞాత దాంపత్యం కొత్త చిగుళ్లు తొడిగింది. కలవారి కుటుంబంలో పుట్టిన భరత్, పేద కుటుంబంలో పుట్టిన విద్యావంతురాలైన సుభద్రను చేసుకోవడంతో ఎదురైన కొత్త కష్టాలను ధైర్యంతో, మనో నిబ్బరంతో ఎదు ర్కొంటూ వచ్చాడు.

‘ఉదయం’ దినపత్రిక ద్వారా (1984–86) మొదలైన మా స్నేహం వయోభేదంతో నిమిత్తం లేకుండా, ప్రాంతా లతో సంబంధం లేకుండా ఎదుగుతూ వచ్చింది. అందు వల్ల భరత్‌ భౌతికంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగమైన తెలంగాణకు చెందినా, ఏ కోశానా ప్రాంతాల స్పృహ లేకుండా తెలుగువాళ్లుగా స్నేహ బాంధవ్యం పెరిగి బలపడుతూ వచ్చింది. ఈ బంధం, ఆత్మీయతల అనుబంధంగా పెరుగుతూ వచ్చింది కనుకనే హైదరాబాద్‌ లోని మా ఇల్లు భూషణ్‌ దంపతుల సొంతిల్లుగానే మారిపోయింది. ఈ చరిత్ర మన జర్నలిస్టు మిత్రులలో చాలా కొద్దిమందికే తెలుసు. మొన్న భరత్‌ పేద ప్రజా జీవితాలకు అంకితమైన ఫొటో జర్నలిస్టుగా కన్నుమూసే వరకూ మా కుటుంబాల ఆత్మీయతలు ఎక్కువ మందికి తెలియవు. మొన్నమొన్న భరత్‌ కన్నుమూసే వరకు, చివరి క్షణాల వరకూ భరత్, సుభద్రలు, వారి కుమార్తె అనుప్రియ, కొడుకు అభినవ్‌ నాతో భరత్‌ ఆరోగ్య విషయాల గురించి చెబుతూనే ఉన్నారు.  

వృద్ధాప్యం వల్ల నేను ఎక్కువసార్లు భరత్‌ ఇంటికి వెళ్లి ఇంతకు ముందులా అతడిని పరామర్శిస్తూ ముచ్చటలాడటం కుదరలేదు. అందువల్ల కేవలం ఫోన్‌ కాల్స్‌ ద్వారా సమాచారం తెలుసుకుంటూ ఉండేవాడిని. తను ఏ చిన్న ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసుకున్నా విధిగా నాకు ఫోన్‌ చేస్తూ మీరు కూడా వస్తే ‘నాకు దండి’గా ఉంటుందని చెప్పేవాడు. కానీ నా ఆరోగ్య పరిస్థితి, వృద్ధాప్య దశవల్ల నేను వాటిలో కొన్నింటికీ వెళ్లేవాడిని కాదు. ఐనా విధిగా సమాచారం మాత్రం భరత్‌ అందిస్తూనే ఉండేవాడు. అరుదైన ప్రజల, పేదసాదల ఫొటో జర్నలిస్టుగా, కళాకారుల్లో అరుదైన సమాజ స్పృహ తీవరించి ఉన్న వ్యక్తిగా భరత్‌ను నేను పరిగణిస్తాను. అంతేగాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోనూ, తరువాత ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా తెలంగాణ వాసి అయిన భరత్‌కు తెలిసినంత లోతుగా తెలంగాణ సంస్కృతీ వైభవానికి చెందిన అనంతమైన పార్వ్శాలు మిగతా తెలంగాణ కళాకారులకు తెలియ వంటే ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజా జీవితానికి చెందిన అనేక కోణాలను, చివరికి ఇళ్ల తలుపు చెక్కల సొగసుల్ని, వంటింటి సామాన్ల తీరు తెన్నుల్ని అక్షరబద్ధమూ, చిత్రాక్షర బద్దమూ చేసి చూపరుల్ని ఆశ్చర్యచకితులను చేశాడు భరత్‌. (క్లిక్‌: నిబద్ధ కెమెరా సైనికుడు.. సెల్యూట్‌ మై ఫ్రెండ్‌!)

అందుకే ఏ తెలంగాణ చిత్రకారునికన్నా, ఫొటో జర్నలిస్టుకన్నా లోతైన అవగాహనతో భరత్‌ తెలంగాణ ప్రజా జీవన చిత్రాలను ప్రాణావశిష్టంగా మలిచారని చెబితే అతిశయోక్తి కాదు. భరత్‌ కుంచెలోనూ, కలం లోనూ విలక్షణమైన ఈ శక్తియుక్తులను పెంచి పోషించింది అభ్యుదయ భావ సంప్రదాయాలేనని మనం గుర్తించాలి. సబ్బు ముక్క, తలుపు చెక్క కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. అలాగే తెలంగాణ పల్లెపట్టుల్లో తలుపు చెక్కల సౌందర్యాన్ని ఫొటో జర్నలిజం ద్వారా చిత్రబద్ధం చేశాడు భరత్‌. మహాకవి కాళోజి అన్నట్లు ‘‘చావు నీది, పుట్టుక నీది/ బతుకంతా దేశానిది’’. ఈ సత్యాన్ని ఎన్నటికీ మరవకండి! అందులోనే నిజం ఉంది, నిజాయితీ ఉంది!! (చదవండి: ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు)

- ఏబీకే ప్రసాద్‌ 
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు