నిబద్ధ కెమెరా సైనికుడు.. సెల్యూట్‌ మై ఫ్రెండ్‌!

3 Feb, 2022 12:59 IST|Sakshi

 నివాళి

భరత్‌ భూషణ్‌ (బి.బి)... ఆ పేరు చెప్పగానే ముఖం మీద ఓ చిన్న నవ్వు, మెడల వరకూ పొడవాటి జుట్టు, భుజానికి కెమెరా గుర్తు కొస్తాయి. కానీ, ఆ చిరునవ్వు వెనుక ఎన్నో ఒడుదొడుకులు, కష్టాలు, కన్నీళ్ళు. వాటన్నిటినీ దిగమింగుకొని పైకి మాత్రం అదే నవ్వుతో పలకరిస్తూ ఉండే వాడు. క్యాన్సర్‌ ఆపరేషన్‌ అయ్యాక తన మెడ మీద మచ్చ ఏర్పడింది. ఆ మచ్చ, క్యాన్సర్‌ తాలూకు బాధ ఎవరికీ కనపడకుండా దాచాలని తను జుట్టు పొడుగ్గా పెంచాడు.

భూషణ్‌ స్వతహాగా మిత భాషి. జర్నలిస్టు, ఫోటో గ్రాఫర్‌ సహచరులు ఏ అసైన్‌ మెంట్‌లో కనపడినా, ‘ఎలా ఉన్నావు మిత్రమా’ అన్న పిలుపు, పలకరింపు. ‘ఏం కొత్త కెమేరాలు కొన్నారు’ అనే స్టాండర్డ్‌ ప్రశ్న. అలా 1984లో ‘ఉదయం’ రోజుల నుంచి పరిచయం. భూషణ్‌ ఎక్కువగా వామపక్ష (సీపీఐ, సీపీఎం, ఎంఎల్‌) ప్రోగ్రామ్స్‌ కవర్‌ చేసేవారు. అవి జరిగే ముఖ్దూమ్‌ భవన్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం లాంటి చోట్ల కెమేరాతో ప్రత్యక్ష మయ్యేవాడు. అప్పట్లో పేపర్లలో ఎవరైనా మావోయిస్టుల ఫొటోలు కావాలన్నా, సీపీఐ, సీపీఎం లీడర్ల క్లోజప్‌ ఫొటోలు కావాలన్నా తననే అడిగేవాళ్లం. ఆ ఫొటోలకు తను ఫేమస్‌. ఫొటోలలో ఎవరు ఏది అడిగినా ప్రింట్‌ చేసి, ఇచ్చేవాడు. కాల క్రమేణా ఫొటో ప్రింట్స్, డిజిటల్‌గా మార డంతో కొంత ఇబ్బంది పడ్డాడు. ఫొటోగ్రాఫర్‌ వృత్తిని కొన్ని రోజులు పక్కనపెట్టి కార్టూన్స్, పెయింటింగ్స్‌ సాన బెట్టాడు. అప్పుడప్పుడు పిలిచి మరీ చూపించేవాడు. ఆ సమయంలోనూ ఫొటో గ్రాఫర్లకు గుర్తింపు లేదని బాధపడేవాడు. (చదవండి: నాన్న చూపిన ఉద్యమ పథం...)

అనారోగ్యం, ఆర్థిక కష్టాలు, కుటుంబ బాధ్యతలు మానసికంగా కుంగదీశాయి. అయినా ఎక్కడా బాధపడేవాడు కాదు. ఎప్పుడూ తెలంగాణ గురించి, సంస్కృతి గురించి మాట్లాడేవాడు. అప్పుడే ప్రత్యేక తెలంగాణ గురించి తన ఆలోచనకు పదును పెట్టాడని చెప్పవచ్చు. ‘రంగుల కల’ లాంటి కొన్ని ఆర్ట్‌ సినిమాలకూ పనిచేశాడు. కొత్త రాష్ట్రం వచ్చాక బతుకమ్మ, తెలంగాణ సంస్కృతిపై ఎగ్జిబిషన్‌ పెట్టడం అతనికి సంతోషాన్నిచ్చింది. తనకు బ్లూ కలర్‌ ఇష్టం. వేసుకొనే టీ షర్ట్‌లు, రాసుకొనే పెన్ను, ఆఖరికి తను వాడే వస్తువులు, ఇంట్లో కూడా అంతా ‘బ్లూ’ కలరే. ఆయన తీసిన ఫొటోలలో బ్లాక్‌ అండ్‌ వైట్, బ్లూ, రెడ్, గ్రీన్, ఆరెంజ్‌ రంగులు కనపడేవి. (చదవండి: తెలుగు కవితా దండోరా ఎండ్లూరి)

గజ్జెల మల్లారెడ్డి, ఏబీకే ప్రసాద్, వి. మురళి, కె. శ్రీనివాస్‌ లాంటి ఎడిటర్లందరికీ ఇష్టమైన ఫొటో జర్నలిస్టుల్లో బి.బి. ఒకడు. ఇటీవల క్యాన్సర్‌ మళ్ళీ తిరగబెట్టినప్పుడు ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ వ్యక్తిగతంగా సాయపడింది. ప్రెస్‌ అకాడమీతో ప్రస్తుత తెలంగాణ సర్కార్‌ ఆర్థికంగా సాయపడింది. అనారోగ్యాలు, ఆర్థిక కష్టాలు ఎన్ని ఉన్నా అసోసియేషన్‌ మీటింగంటే, ఓపిక చేసుకొని, తోటి ఫొటోగ్రాఫర్ల బండి మీద వచ్చి, వెళ్ళేవాడు. అందరితో కలవడం అతని కెమేరాకి కొత్త రీఛార్జ్‌. రోజుకో ఉద్యోగం మారే రోజుల్లో దశాబ్దాల తరబడి నమ్ము కున్న వృత్తిలోనే నిబద్ధతతో పని చేసినవాడు... పని తప్ప బతకడం తెలీనివాడు.. ఫోటోనే ప్రేమించిన వాడు భూషణ్‌. పాతికేళ్ళుగా క్యాన్సర్‌పై పోరాడిన అతనొక సైనికుడు. చేతిలోని కెమేరానే కన్ను, గన్ను. ఆఖరి వరకూ అలాగే నిలిచాడు. ప్రాణం పోయినా, పోరాటస్ఫూర్తిలో గెలిచాడు. సెల్యూట్‌ మై ఫ్రెండ్‌!

– కె. రవికాంత్‌ రెడ్డి
ఫొటో ఎడిటర్, సాక్షి 

మరిన్ని వార్తలు