మునుగుడా? తేలుడా?

24 Aug, 2022 01:11 IST|Sakshi

మునుగోడులో కేసీఆర్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ పెద్ద సభను నిర్వహిస్తే, ఆ మరుసటి రోజు బీజేపీ కూడా పెద్ద సభ జరిపింది. మునుగోడులో కాంగ్రెస్‌ పక్షాన ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సందర్భంగా స్వయంగా అమిత్‌ షా హాజరు కావడం... ఈ ఉప ఎన్నికకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం అవుతోంది. ఎన్నిక ప్రకటన రాకముందే కేసీఆర్‌ సభ పెట్టడం కూడా దీనికి మరో ఉదాహరణ. ఇక కాంగ్రెస్‌ పార్టీ పాదయాత్రలు, లక్ష మంది కాళ్లకు మొక్కడం వంటి కార్యక్రమాల ద్వారా తన పట్టు నిలబెట్టుకోవాలని విశ్వయత్నం చేస్తోంది. 

దీనిని పక్కనబెడితే కేసీఆర్, అమిత్‌ షా పోటీపోటీ ప్రసంగాలు ప్రజలకు ఏ సందేశాలు ఇచ్చాయో తెలుసుకోవడం ఆసక్తికరం. కేసీఆర్‌ ఎక్కువగా జాతీయ రాజకీయాలు, దేశంలో ప్రగతిశీల శక్తులు ఐక్యం కావాల్సిన అవసరం, వ్యవసాయ మోటార్లకు మీటర్లు వంటి అంశా లపై దృష్టి పెట్టారు. అమిత్‌ షా పూర్తిగా తెలంగాణ అంశాలకు, కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీలను ప్రస్తావించడానికి పరిమితం అయ్యారు. బీజేపీని గెలిపిస్తే తెలంగాణ ఆగమవుతుందని కేసీఆర్‌ హెచ్చరించారు. అమిత్‌ షా తన ప్రసంగంలో రాజగోపాలరెడ్డి గెలిస్తే కేసీఆర్‌ ప్రభుత్వం మాయం అవుతుందన్నారు. అంటే వచ్చే ఎన్నిక లలో ఓడిస్తామనా, ఇంకేదైనా చేస్తామనా? కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎం అయిందని షా ఆరోపించారు కానీ అదెలా జరిగిందో చెప్పలేదు. పైగా పార్లమెంటులో ఈ ప్రాజెక్టుపై ఆరోప ణలు లేవని చెప్పినా, మునుగోడు ఉప ఎన్నికలో మాత్రం అవినీతి అంటూ విమర్శలు కురిపించారు. 

బీజేపీకి ఓటు వేస్తే మోటార్లకు మీటర్లే అని కేసీఆర్‌ చెప్పడం ఒక విధంగా బలహీనత. రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ భరిస్తున్నప్పుడు మీటర్లు పెడితే వచ్చే నష్టం ఏమిటి? కాకపోతే కేంద్రంపై ఆయన ఆరోపణ చేశారు. నిజానికి దీనిని ప్రతిపాదించిన కేంద్రం ఇప్పటికే వెనక్కి తగ్గింది. మోదీ సర్కారు ఈ అంశంలో ఓట్ల రాజకీయానికి భయపడి మీటర్లు పెట్టాలని తాము చెప్పడం లేదని పేర్కొంది. అమిత్‌ షా ఈ మీటర్ల వివాదంపై బహిరంగ సభలో చెప్పలేదు గానీ, రైతు నేతల భేటీలో వివరణ ఇచ్చారు. రైతుల పొలాల వద్ద కాకుండా విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల దగ్గర వీటిని అమర్చాలని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇతర బీజేపీ నేతలు మాత్రం దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలలో కూడా ఇదే మాట టీఆర్‌ఎస్‌ చెప్పిందనీ, అయినా ప్రజలు బీజేపీకి పట్టం కట్టారనీ అంటున్నారు. 

ఏడాదిలోనే ఎన్నికలు ఉండగా ఈ ఉప ఎన్నిక ఎందుకని ఆయన ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పలు ఉప ఎన్నికలకు కారణమైన టీఆర్‌ఎస్‌ ఈ ఉప ఎన్నికను ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు? ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారదలిస్తే పదవికి రాజీనామా చేయడం మంచి సంప్రదాయమే. దానిని రాజగోపాలరెడ్డి కూడా పాటించారు. ఈ ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తే భవిష్యత్తు తెలంగాణ రాజకీయం మారిపోతుందనీ, బీజేపీ ముఖ్యమంత్రి వస్తారనీ అమిత్‌ షా అన్నారు. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ అధికారాన్ని ఎలా సాధి స్తుందన్నది ప్రశ్న. రాజగోపాలరెడ్డి గెలిస్తే ఏకనాథ్‌ షిండేలను బీజేపీ తయారు చేస్తుందా అని కేసీఆర్‌ ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులను బీజేపీ ప్రోత్సహిస్తుందనీ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందనీ కేసీఆర్‌ హెచ్చరించారు. ఈ విషయంలో రెండు పార్టీలకూ పెద్ద తేడా ఉందని చెప్పజాలం. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో ఎలా విలీనం చేసుకున్నారన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించి, వారితో రాజీనామాలు చేయించి బీజేపీ అధి కారాన్ని కైవసం చేసుకుంది. రాజ్యసభలో నలుగురు టీడీపీ ఎంపీలను విలీనం చేసుకుంది. అందువల్ల టీఆర్‌ఎస్, బీజేపీ రెండింటికీ ఈ అంశం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పక తప్పదు. 

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్లలో బీజేపీ ఒక్క మంచి పని అయినా చేసిందా అని కేసీఆర్‌ ప్రశ్నించడం కూడా రాజ కీయంలో భాగమే. మరి అలాంటి ప్రభుత్వానికి ఆయా సందర్భాలలో టీఆర్‌ఎస్‌ మద్దతు ఎలా ఇచ్చిందని అడిగితే సమాధానం దొరకదు. బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలను కేసీఆర్‌ మూడు తోకలతో పోల్చారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటివాటితో తనకు పడని పార్టీలను బీజేపీ భయ పెట్టాలని చూస్తోందనీ, కానీ తాను నిజాయితీగా ఉన్నందున తనను ఎవరూ ఏమీ చేయలేరనీ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మాటలు ఆయన గట్టిగానే చెబుతున్నా, ఏదో ఒక మూల కేంద్రంపై ఉన్న అను మానాలే ఆయనతో ఈ మాటలు అనిపిస్తున్నట్లుగా ఉంది. దానికి తగినట్లుగానే కేసీఆర్‌ కుమార్తె కవితపై బీజేపీ ఢిల్లీ ఎక్సైజ్‌ స్కామ్‌ను ఆరోపించింది. కవిత ఖండించినా, తర్వాత రోజుల్లో ఏమి అవు తుందో చెప్పలేం. 
నల్గొండ ప్రాంతంలో ఫ్లోరైడ్‌ సమస్యను పరిష్కరించామనీ, ఎవరు అడ్డుపడ్డా రైతు బంధు ఆగదనీ చెప్పడం ద్వారా కేసీఆర్‌ ప్రజలను ఆకట్టుకునే యత్నం చేశారు. హుజూరాబాద్‌ అనుభవం రీత్యా ముందస్తు జాగ్రత్త పడుతున్నట్లుగా ఉంది. దానికి తోడు రాజ గోపాలరెడ్డి బలమైన అభ్యర్థి అవుతారు కనుక కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా ఉంది. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారన్న హామీ ఏమైందని అమిత్‌ షా అడిగారు. భవిష్యత్తులో కేటీఆర్‌ను చేస్తారు తప్ప, దళితుడిని చేయరని చెప్పారు. దేశంలో పెట్రోల్‌ ధర లను కేంద్రం తగ్గిస్తే తెలంగాణలో ఎందుకు తగ్గించలేదని అడిగారు. బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్‌ 17న విమోచన దినం నిర్వహిస్తామనీ, మజ్లిస్‌కు టీఆర్‌ఎస్‌ భయపడుతోందనీ చెప్పడం ద్వారా అటు తెలంగాణ సెంటి మెంట్‌నూ, ఇటు హిందూ సెంటి మెంట్‌నూ షా ఒకేసారి ప్రయోగించారని అనుకోవచ్చు. 

ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే– కేసీఆర్, అమిత్‌ షా ఇద్దరూ కూడా కాంగ్రెస్‌ గురించి పెద్దగా పట్టించుకోలేదు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే వృథా  అవుతుందని కేసీఆర్‌ అంటే, అమిత్‌ షా కాంగ్రెస్‌ ఊసే తేలేదు. మరో వైపు ఈ పరిణామాలను గమనిస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఇప్పటికే లక్షమందికి పాదాభివందనం కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. మరి కాళ్లు మొక్కడం ద్వారా విజయం సాధించగలుగుతారా అన్నది చెప్పలేం. వామపక్షా లైన సీపీఐ, సీపీఎంలను కేసీఆర్‌ కలుపుకొని వెళ్లడం కొత్త పరిణామం. జాతీయ రాజకీయాలతో పాటు తెలంగాణలో ఆ పార్టీలకు అక్కడ క్కడ ఉన్న బలాన్ని ఆయన వినియోగించదలిచారు. బీజేపీకి వ్యతి రేకంగా ఉండాలని భావించే వామపక్షాలు ఇందుకు సిద్ధం కావడంలో ఆశ్చర్యం లేదు. కాకపోతే ఈ ఎనిమిదేళ్లలో ఎన్నడైనా సీపీఐ, సీపీఎం నేతలు ప్రగతి భవన్‌కు వెళ్లి ఆయా సమస్యలపై మాట్లాడగలిగారా? అంటూ మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ పలు ప్రశ్నలు సంధించారు. అవి వామపక్షాలకు ఇబ్బంది కలిగించేవే అయినా, దేశ రాజకీయాలు, తెలంగాణలో పరిస్థితుల రీత్యా, వారికి ఇంతకన్నా గత్యంతరం ఉండకపోవచ్చు. హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికలోనే టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని సీపీఐ తలపెట్టినప్పటికీ, ఆ సమయంలో ఆర్టీసీ సమ్మె అడ్డం వచ్చింది. ఇప్పుడు కేసీఆర్‌ భవిష్యత్తులో కూడా ఈ పార్టీలతో స్నేహం కొనసాగుతుందని ప్రకటించి తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణలకు తెరదీశారు. పత్రికాధిపతి రామోజీరావు, ప్రముఖ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌తో అమిత్‌ షా భేటీ అయ్యారు. తెలంగాణ ఎన్నికలలో సహకరించాలని ఆయన వీరిని కోరి ఉండవచ్చు. మొత్తం మీద   ఈ కబాడి ఆటలో ఎవరు లైన్‌ టచ్‌ చేసి విజేతలు అవుతారో, ఎవరు కాళ్లు గుంజివేస్తారో అన్న ఉత్కంఠభరిత సన్నివేశాలకు మునుగోడు వేదిక కాబోతోంది.
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు     

తెలంగాణలో మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక తేదీ ప్రకటన వెలువడడానికి ముందుగానే రాజకీయ వేడి పెరిగిపోయింది. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ యథాశక్తి ఈ వేడి పెంచడంలో పోటీ పడుతున్నాయి. అందులోనూ టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మరో వైపు రంగంలోకి దిగడంతో ఎవరు విజేత అవుతారన్న ఉత్కంఠ ఏర్పడింది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే – కేసీఆర్, అమిత్‌ షా ఇద్దరూ కూడా కాంగ్రెస్‌ను పట్టించుకోలేదు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే వృథా అవుతుందని కేసీఆర్‌ అంటే, కాంగ్రెస్‌ ఊసే అమిత్‌ షా తేలేదు. ఈ పరిణామాలను గమనిస్తున్న కాంగ్రెస్‌ లక్షమందికి పాదాభివందనం కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించింది.

కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు