కుల సమాజమే కానీ...

9 May, 2022 12:45 IST|Sakshi
కాశ్మీరు లోయ

భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ... దేశంలో మత అసహనం, హిందువుల్లో ఉన్మాదం పెరుగుతోందని; ప్రజాస్వామ్య సంస్థలన్నీ నిర్వీర్యం అవుతున్నాయనీ బీజేపీ వ్యతిరేక పార్టీలు చేస్తున్న ఆరోపణలలో నిజం ఎంత అనే విషయాన్ని వాస్తవిక దృష్టికోణంలో పరిశీలించాలి. హిందుత్వ సంస్థలు హిందువులను రెచ్చగొడుతున్నాయనీ, మైనారిటీలపై ముఖ్యంగా... ముస్లింలపై విద్వేషాన్ని, పగను ప్రోది చేస్తున్నాయని ఆ పార్టీల ఆరోపణ! వాస్తవంగా ఈ దేశంలో హిందువులు ఒక మత సమూహం కాదు. ఇది కులపరంగా విభజితమైన సమాజం. ఈ సమాజంలో అనాదిగా అసంఘటిత ఛాయలే దర్శనమిస్తున్నాయి. ఈ సమాజం నుండి రాజకీయంగా ఎదిగిన నాయకులందరూ కులపరమైన ఆలోచనా దృక్పథంతోనే ఉంటారు. అంతేకానీ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి ఇత్యాది విషయాలను అర్థం చేసుకునే స్థాయి వీరికి ఉండదు.

అదే ఉంటే దేశ విభజన జరిగేది కాదు. కశ్మీర్‌ రావణ కాష్ఠం అయ్యేది కాదు. కాశ్మీరు లోయ నుండి 3 లక్షల మంది హిందువులను తరిమివేయడం జరిగేది కాదు. హిందువులందరూ ఒకే సమూహం అనే భావం ఉన్నట్లయితే ఈ ఘటనలన్నింటికీ ప్రతిచర్యలు వేరే విధంగా ఉండేవి. ఈ దేశంలో మైనారిటీల పట్ల లౌకికవాద పార్టీ నాయకులు అందరూ మూకుమ్మడిగా ఒకే మాట మీద ఉండటంతో... కులాల వారీగా విభజితమైన హిందువుల్లో అసంతృప్తి, ఆవేదన పుట్టుకొచ్చి కొంత చైతన్యం అంకురించింది. దాన్ని హిందుత్వ రాజకీయ పార్టీ అయిన బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుని కేంద్రంలోనూ, అనేక రాష్ట్రాలలోనూ అధికారంలోకి వచ్చింది అనేది వాస్తవం. (క్లిక్: ఇలా ఎన్ని పేర్లు మారుద్దాం?)

లౌకిక వాదులుగా చెప్పుకునేవారు ప్రధాని మోదీపై వ్యతిరేకత, ద్వేషాలను.. దేశంపై వ్యతిరేకతగా మార్చుకోవడం.. వారి విచిత్రమైన భావదాస్యపు ఆలోచనకు ప్రతీక! ప్రపంచంలో ఏ దేశంలోనూ మన దేశంలోని మైనార్టీలు అనుభవించే స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు కనిపించవు. పాక్‌ వంటి చోట్ల దేశ విభజన తర్వాత హిందూ జనాభా తగ్గిపోతుంటే.. మనదేశంలో మాత్రం ముస్లిం జనాభా పెరిగిపోవడం మైనారిటీలకు ఇక్కడ ఉన్న స్వేచ్ఛకు సంకేతంగా చెప్పవచ్చు. (క్లిక్: ఆ హత్యను ఖండిస్తున్నాం)

– ఉల్లి బాల రంగయ్య
రాజకీయ, సామాజిక విశ్లేషకులు

మరిన్ని వార్తలు