తెలుగు ప్రజల ధిక్కార స్వప్నం అమరజీవి

16 Mar, 2021 10:58 IST|Sakshi

తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం  ప్రాణత్యాగం చేసి  ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్న మహా పురుషుడు పొట్టి శ్రీరాములు.  1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌనులో గురవయ్య, మహా లక్ష్మమ్మ దంపతులకు జన్మిం చారు. విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. ఆ తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజ నీరింగ్‌ చదివారు. ‘గ్రేట్‌ ఇండియన్‌ పెనిన్సులర్‌ రైల్వే’లో చేరి ఉద్యోగం చేసాడు. భార్య, కుమారుడు చనిపోవడంతో జీవిత సుఖాలపై విరక్తి కలిగింది. దీంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసారు.

గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులై సబర్మతి ఆశ్రమంలో చేరి ఆయన అనుయాయిగా ఉన్నారు.  1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్షను అనుభవిం చారు. తర్వాత మళ్ళీ 1941–42 సంవత్సరాల్లో క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడంవల్ల మూడుసార్లు జైలుకు వెళ్ళారు. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవారు. జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటూ, హరిజనోద్ధరణకు కృషిచేసారు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసేవారు.

ఆయన ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యాడు. 1952 అక్టోబర్‌ 10 నుంచి 58 రోజులపాటు చెన్నైలో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. డిసెంబర్‌ 15న ఆయన ఆంధ్రరాష్ట్రం కోసం అసువులు బాసి అమరజీవి అయ్యారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు చేసిన విశేష కృషికి గాను, ఆ అమరజీవికి నివాళులు.
-(నేడు పొట్టిశ్రీరాములు జయంతి)
నరేష్‌ జాటోత్, నల్లగొండ
మొబైల్‌ : 82478 87267

మరిన్ని వార్తలు