Pravasi Bharatiya Divas: రవి అస్తమించని ప్రవాస భారతీయం

7 Jan, 2023 12:43 IST|Sakshi

సందర్భం

ప్రపంచ నలుమూలలా భారతీయులు నివసిస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 210 దేశాలలో భారతీయ మూలాలున్న వారు, ఎన్నారైలు కలిపి 3.2 కోట్లకు పైగానే ఉన్నారు. ప్రవాస భారతీయ జనాభా కంటే తక్కువ జనాభా కలిగిన దేశాలు 150 పైనే ఉన్నాయి. 

నేడు అనేక దేశాల్లో రాజకీయంగా కూడా భారతీయులు కీలక పదవుల్లో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవిని  కమలా హారిస్‌ అలంకరించిన సంగతి తెలిసిందే. అలాగే హైదరాబాద్‌లో జన్మించిన తెలుగింటి బిడ్డ అరుణ మిల్లర్‌ (కాట్రగడ్డ అరుణ) మేరీలాండ్‌ రాష్ట్రానికి గత నవంబర్‌లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వివిధ దేశాల్లో భారతీయ మూలాలున్న వ్యక్తులు వివిధ దేశాలకు అధినేతలుగా వ్యవహరిస్తున్నారు. 

రిషి సునాక్‌ (బ్రిటన్‌ ప్రధాని), అంటో నియ కోస్టా (పోర్చుగల్‌ ప్రధాని), మహ్మద్‌ ఇర్ఫాన్‌ అలీ (గయానా ప్రెసిడెంట్‌), పృథ్వీరాజ్‌ రూపన్‌ (మారిషస్‌ అధ్యక్షులు), చంద్రిక పెర్సద్‌ శాన్‌ టోఖి (సురినామ్‌ ప్రెసిడెంట్‌) లతోపాటు 200 మందికి పైగా భారతీయులు 15 దేశాల్లో వివిధ హోదాల్లో ప్రజాసేవలో ఉన్నారు. వీరంతా అమెరికా, యూకే, కెనడా, గయానా, సురినామ్, ఫిజీ, ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగో, సింగపూర్, మారిషస్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, మలేసియా, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో పనిచేస్తున్నారు. వీరు కాకుండా వివిధ దేశాల్లో, కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో సభ్యులుగా ఉన్నవారు చాలామందే ఉన్నారు. గతంలో సింగపూర్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నఎస్‌.ఆర్‌.నాథన్‌ (1999–2011), దేవన్‌ నాయర్‌ (1981 –1985)లు, ఫిజీ ప్రధానిగా పనిచేసిన మహేంద్ర చౌదరి, మలేసియా ప్రధానిగా పని చేసిన మహతీర్‌ బిన్‌ మహ్మద్‌ వంటి వారు భారతీయ మూలాలున్నవారే.

ప్రపంచంలోని అగ్రస్థానాల్లో ఉన్న గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ళ, ఈ మధ్య వరకు ట్విట్టర్‌ సీఈఓగా కొనసాగిన పరాగ్‌ అగర్వాల్, పెప్సికోలా ఒకప్పటి సీఈఓ ఇంద్రనూయి వంటి వారెందరో భారతీయ మూలలున్నవారే. నేడు ప్రపంచంలో వివిధ దేశాల్లో ప్రముఖపాత్ర వహిస్తున్న ప్రవాస భారతీయులు బ్రిటిష్‌ రాజ్‌ కాలంలో, తదనంతరం విదేశాలకు వెళ్ళినవారే. ముఖ్యంగా వ్యవసాయం పనుల కోసం వెళ్ళిన భారతీయులు అక్కడ స్థిరపడ్డారు. మారిషస్, గయానా, ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగో, కెనడా, దక్షిణాఫ్రికా  మలేసియా, ఫిజీ వంటి కామన్వెల్త్‌  దేశాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నవారు వీరే! 

స్వాతంత్య్రానంతరం ప్రపంచ కలల దేశమైన అమెరికాకు భారతీయ వలసలు ప్రారంభమై, నేడు సుమారు 45 లక్షల మంది ఆ గడ్డపై తమవంతు పాత్ర నిర్వహిస్తున్నారు. 10 దేశాల్లో భారతీయుల జనాభా 10 లక్షలు దాటితే మరో 22 దేశాల్లో లక్షకు పైగా వున్నారు. డర్బన్‌ నగరాన్ని మినీ ఇండియాగా అభివర్ణిస్తారంటే ఆ నగరంలో భారతీయుల హవాని అర్థం చేసుకోవచ్చు. ప్రతీ ఏడు 25 లక్షల భారతీయులు విదేశాలకు వలస వెళ్తున్నారు. భారతీయ వలసల్లో ఇదే పంథా కొనసాగితే ఈ శతాబ్దం అంతానికి భారతీయ పరిమళాలు ధరణి అంతా మరింత వ్యాపించి రవి అస్తమించని ‘భారతీయం’ సాక్షాత్కరిస్తుంది. (క్లిక్ చేయండినా జీవితంలో మర్చిపోలేని భయానక ఘటన అది..!


- కోరాడ శ్రీనివాసరావు 
ప్రభుత్వాధికారి, ఏపీ
(జనవరి 8–10 ప్రవాసీ భారతీయ దివస్‌ ఉత్సవాల సందర్భంగా)

మరిన్ని వార్తలు