భారత్‌ జోడో... కాంగ్రెస్‌కు తాడో పేడో

24 Sep, 2022 00:45 IST|Sakshi

విశ్లేషణ

సాక్షికి ప్రత్యేకం

పన్నెండు రాష్ట్రాల గుండా 150 రోజుల పాటు సాగేలా కాంగ్రెస్‌ పార్టీ ‘భారత్‌ జోడో యాత్ర’ చేస్తోంది. బీజేపీ హిందుత్వ రాజకీయాల నుంచి దేశాన్ని రక్షించేందుకు దీన్ని చేపట్టినట్టుగా పార్టీ చెబుతోంది. కానీ ప్రజాస్వామ్య ప్రస్తుత పోకడలను చర్చకు పెట్టడం... తద్వారా బీజేపీ ఇమేజ్‌ను దెబ్బతీసి రాజకీయ ప్రయోజనాలను పొందడం; బీజేపీని ఓడించాలంటే ఏ కూటమికైనా తమ మద్దతు తప్పనిసరన్న సంకేతాలను పంపడం; కాంగ్రెస్‌ను గద్దెనెక్కించడం రాహుల్‌ గాంధీకి మాత్రమే సాధ్యమన్న భ్రమను కార్యకర్తల్లో కల్పించడం అనే మూడు లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. పడిపోతున్న రాజకీయ గ్రాఫ్‌ మళ్లీ ఎగబాకడం మాత్రం పార్టీ వ్యవస్థ ఎంత సమర్థంగా వ్యవహరిస్తుందన్న అంశంపై ఆధారపడి ఉంటుంది.

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ సరైన దిశగానే వెళుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రాల ఎన్నికల్లో వరుస ఓటములతో కుదేలైన  పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ఈ భారత్‌ జోడో యాత్రతో తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కునే పనిలో పడింది. దేశంలోని మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల గుండా వెళ్లే ఈ పాదయాత్ర భారతీయ జనతా పార్టీ ‘హిందుత్వ’ అజెండా నుంచి దేశాన్ని రక్షించేందుకని కాంగ్రెస్‌ చెప్పుకుంటోంది. బీజేపీ ప్రభుత్వ విధానాలు, ఆ పార్టీ హిందుత్వ అజెండా రెండూ భారత సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఏటికేడాదీ క్షీణిస్తున్న తన ప్రాభవాన్ని పౌర సమాజం, మేధోవర్గం సాయంతో మళ్లీ పొందేందుకు జరుగుతున్న ప్రయత్నమే కాంగ్రెస్‌ చేస్తున్న ఈ భారత్‌ జోడో యాత్ర అని చెప్పక తప్పదు. 

స్థానిక ఎన్‌జీవోలు, ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకోవడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీపై వారిలో నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ పాలన మొత్తం నిరంకుశ ధోరణితోనే నడిచిందనీ, అత్యవసర పరిస్థితులను తలపించేదేననీ కాంగ్రెస్‌ చెబుతోంది. తద్వారా 1978 నాటి ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమాన్ని సృష్టించే ప్రయత్నం జరుగు తోంది. ఎంతో ముందుచూపుతో, పక్కా ప్రణాళికతో కాంగ్రెస్‌ ఈ ‘భారత్‌ జోడో యాత్ర’ చేపట్టినా... పడిపోతున్న రాజకీయ గ్రాఫ్‌ మళ్లీ పైకి ఎగబాకడం మాత్రం ఆ పార్టీ నాయకత్వం, పార్టీ వ్యవస్థ ఎంత సమర్థంగా వ్యవహరిస్తాయన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. 

నిరాసక్త నేత... పాదయాత్ర!
కాంగ్రెస్‌ పార్టీలో నాయకత్వ లేమి ఉందన్నది నిర్వివాద అంశం. 2019 లోక్‌సభ ఎన్నికల ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ప్రభావం రాహుల్‌గాంధీ యాత్రపై కూడా పడే అవకాశం ఉంది. అలాగే ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్‌కు పెద్దగా ప్రయోజనం చేకూరదనేందుకు రెండు కారణాలు కనిపిస్తు న్నాయి. మొదటిగా చెప్పుకోవాల్సింది, అధ్యక్ష పదవిని మళ్లీ చేపట్టే విషయంలో రాహుల్‌ గాంధీ చూపిన మొండితనం. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలన్న పార్టీ సీనియర్‌ నేతలు పదేపదే చేస్తున్న విజ్ఞప్తులను తోసిపుచ్చుతూండటం కూడా రాహుల్‌ గాంధీ నేతృత్వంపై అనుమానాలను రేకెత్తిస్తోంది. రాహుల్‌ ఆలోచనా ధోరణి ఫలితంగా రాజకీయంగా అతడికి నష్టం చేకూర్చేదిగా పరిణ మిస్తోంది. 

ఇక రెండో కారణం... తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగడం వల్ల పార్టీలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. ఇది పార్టీ కార్యకర్తల్లోనూ, సంప్రదాయ మద్దతుదారుల్లోనూ కొంత గందరగోళాన్ని ఏర్పరుస్తోంది. పూర్తిస్థాయి నేతగా బాధ్యతలు చేపట్టే విషయంలో రాహుల్‌ గాంధీ ఇప్పటికీ విముఖంగా ఉండటం, అధికార బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఏదీ లేకపోవడం కూడా రాహుల్‌గాంధీని మాటల నేతగానే మార్చాయే తప్ప... ప్రజలను భారీ ఎత్తున ఆకర్షించే చరిష్మా ఉన్న నేతగా, పార్టీకి అట్టడుగు స్థాయి నుంచి మద్దతు కూడగట్టగల స్థాయి గలవాడిగా మార్చలేక పోయాయి. 

నేతృత్వం విషయాన్ని కాసేపు పక్కనబెట్టినా భారత్‌ జోడో యాత్ర స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించే వనరులు, దానికి తగ్గ ప్రతిష్ఠ కూడా కాంగ్రెస్‌కు లేవనే చెప్పాలి. 2014 ఎన్నికల తరువాత రాజకీయంగా తన ఆధిపత్యాన్ని సాంతం కోల్పోయేందుకు ఉన్న కారణాల్లో ఒకటి వారసత్వ రాజకీయాలు కొనసాగడమైతే... రెండోది మైనార్టీలను బుజ్జగించే విధనాలు. రాజకీయంగా, సైద్ధాంతికంగా ఏర్పడ్డ స్తబ్ధత, పట్టూవిడుపుల్లేని పద్ధతి, పార్టీ వ్యవస్థ కుప్పకూలడం, కీలక నేతలు తండోపతండాలుగా ఇతర పార్టీలకు వెళ్లిపోవడం వంటివి ఇతర కారణాలు. దేశాద్యంతం ఆధిపత్యం చలాయించగలిగే స్థాయిని కూడా కాంగ్రెస్‌ పార్టీ కోల్పోయింది. సమాజానికీ, పార్టీకీ మధ్య ఉన్న సమాచార వ్యవస్థ కూడా కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలో 150 రోజుల పాటు సాగే సుదీర్ఘ పాదయాత్ర ఒకటి చేపట్టే ప్రయత్నం చేయడం కొంచె అమాయకంగానూ, మరికొంచెం అవాస్తవంగానూ అనిపించక తప్పదు. 

బీజేపీని ఎదుర్కోగలదా?
భారత్‌ జోడో యాత్ర ప్రజా ఉద్యమం అని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. పార్టీ లోపలా, బయటా ఉన్న మేధావులు, ఎన్‌జీవోల మద్దతుతో సాగుతోందని కూడా చెబుతోంది. ఇలాంటి ప్రకటనలే పౌర సమా జపు నిష్పాక్షికత, స్వతంత్రతలపై అనుమానాలు రేకెత్తిస్తాయి. లెఫ్ట్‌ లిబరల్‌ పార్టీలతో అంటకాగుతూండే ఎన్‌జీవోలు, విద్యావేత్తల ముసుగులు తొడుక్కున్న నేతలు కొందరు రాహుల్‌ గాంధీ యాత్రలో పాల్గొంటూండటం వారి కృత్రిమత్వాన్ని బయటపెడుతోంది. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ పునరుద్ధరణే లక్ష్యంగా వీరు పని చేస్తు న్నారు. తద్వారా అధికారాన్ని, వ్యక్తిగత ప్రయోజనాలను పొంద వచ్చునని వీరు భావిస్తున్నారు. 

బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా ఎన్‌జీవోల జాతకాలు బట్టబయలయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఎన్‌జీవోలు కొన్ని మనీలాండరింగ్‌కు, ఇతర ఆర్థిక అపసవ్యతలకు, భారత్‌ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమైంది. అలాంటి సంస్థలిప్పుడు భారత్‌ జోడో యాత్రకు మద్దతుగా నిలవడం కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల్లో ఉన్న మర్యాదను మరింత తగ్గించేదిగా మారుతుంది.

అది రాజకీయంగా మరింత దిగజారేలా చేస్తుంది. సగం భారతదేశాన్ని చూసేందుకు రాహుల్‌గాంధీ యాత్ర చేపట్టిన సమయమూ అంత ఉచితంగా ఏమీ లేదు. ఎందుకంటే సొంతింట్లో బోలెడన్ని సమస్యలున్నాయి మరి. వాటిని చక్కదిద్దుకోకుండానే... కాసుల కట్టలతో కళకళలాడుతున్న... విస్తృత స్థాయి కార్యకర్తల మద్దతున్న బీజేపీని ఎదుర్కునేందుకు సిద్ధవమవడం ఎంతవరకూ సబబు? పోనీ రాజకీయంగా అందరినీ ఆకర్షించే విధానం, కథనం ఏదైనా ఉందా అంటే అదీ లేదు. అందరికీ ఆమోదయోగ్యమైన నేత, కాషాయ పార్టీకి చెక్‌ పెట్టగల వ్యవస్థాగత నిర్మాణం, అన్ని వర్గాల ఓట్లను కూడగట్టగలిగే చాతుర్యమూ కరవే. 

రాహుల్‌ ఇమేజ్‌ పెంచేందుకే...
ఆధిపత్య ధోరణలు, ఈగోలపై ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ దృష్టి కేంద్రీకృతమై ఉంది. భారత్‌ జోడో యాత్ర మొత్తాన్నీ కొంచెం నిశితంగా పరిశీలిస్తే కాంగ్రెస్‌ మూడు అంశాలను చెప్పేందుకు ప్రయత్నిస్తోందని అర్థమవుతుంది. ఒకటి.. భారతీయ ప్రజాస్వామ్య ప్రస్తుత పోకడలనూ, పెరిగిపోతున్న ఒంటెత్తు పోకడలనూ అంతర్జా తీయ స్థాయిలో చర్చకు పెట్టడం... తద్వారా భారతీయ జనతా పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీసి రాజకీయ ప్రయోజనాలను పొందడం.

రెండోది... మీడియా సాయంతో క్షేత్రస్థాయిలో తనకు మద్దతు పెరుగుతోందన్న భ్రమ కల్పించడం ద్వారా... బీజేపీని ఓడించాలంటే ఏ పార్టీ, కూటమికైనా తమ మద్దతు తప్పనిసరి అన్న సంకేతాలను పంపడం. కార్యకర్తల్లో రాహుల్‌గాంధీకి ఉన్న ఇమేజ్‌ను పెంచడం, అందుకోసం ప్రజామద్దతును ఉన్నదానికంటే ఎక్కువ చేసి చూపడం, కాంగ్రెస్‌ పార్టీని మళ్లీ గద్దెనెక్కించడం రాహుల్‌కు మాత్రమే సాధ్యమన్న భ్రమను కార్యకర్తల్లో కల్పించడం మూడో ఉద్దేశం. అయితే నాయ కత్వం పరంగా ఇప్పటివరకూ ఏమీ సాధించని రాజకీయ వారసుడు రాహుల్‌ గాంధీ కేంద్రంగా కాంగ్రెస్‌ పార్టీ భారత్‌ జోడో యాత్రను చేపట్టడం ఏమంత సత్ఫలితాలు ఇవ్వకపోగా... నష్టం చేకూర్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి!


వ్యాసకర్త: ప్రవీణ్‌ రాయ్‌,   
రాజకీయ విశ్లేషకులు,
సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్, న్యూఢిల్లీ

మరిన్ని వార్తలు