Presidential Elections 2022: ప్రాతినిధ్యమే రాజకీయంగా కీలకం

28 Jun, 2022 13:03 IST|Sakshi

ద్రౌపది ముర్ము 64 ఏండ్ల ఆదివాసీ విద్యాధికురాలు. రాష్ట్రపతి రేస్‌లో అకస్మాత్తుగా ఎన్డీయే అభ్యర్థిగా తెర మీదికి వచ్చారు. ఆమె పేరు ప్రకటించడమే ప్రతిపక్షాలను ఎందుకు అంతగా కలవరపరిచిందో ఆశ్చర్యం వేసింది.

భారతీయ జనతా పార్టీ ఇటువంటి ప్రయోగాలు అనేకం చేసి రాటు తేలిపోయింది. 2014లో ప్రధానిగా రేసులో ఉన్న నరేంద్ర మోదీ తాను ఒక బీసీ బిడ్డననీ, రాజకీయ అణచివేత, అస్పృశ్యతను అనుభవించినవాడిననీ చెప్పుకున్నారు. తరాలుగా ప్రజాప్రతినిధులుగా ఎదిగే అవకాశాల్లో తీవ్ర అణచివేతనూ, అవకాశ లేమినీ అనుభవిస్తున్న ఒక పెద్ద వర్గం నరేంద్రమోదీని మోసిన ఫలితం అందరం కళ్ళతో చూసినం. 

ప్రతిపక్షాలు రాష్ట్రపతి స్వతంత్రత పెరగాలని... విస్తృత ప్రజా సంబంధాలు, దేశం శక్తిమంతం అయ్యే రాజ్యాంగ వ్యవస్థల కోసం నిలబడి, కలబడే వ్యక్తిని ముందే వెతికి ప్రకటిస్తే చర్చ ముర్ము చుట్టు కాకుండా మరోలా ఉండేది. రాష్ట్రపతి ఎలక్టోరల్‌ కాలేజీలో ఎక్కువ ఓట్లు తమకు ఉన్నప్పుడు విస్తృత ఆమోదంతో అభ్యర్థిని ముందే ప్రకటించడంతో పాటు మద్దతును కూడగడితే బాగుండేది. వాజ్‌పేయి గవర్నమెంట్‌లో మంత్రిగా పనిచేసిన మాజీ ఐఏఎస్‌ ఆఫీసర్, బీజేపీతో సుదీర్ఘ అనుబంధం, ప్రయాణం ఉన్న యశ్వంత్‌ సిన్హా పేరును ప్రతిపక్షాలు ప్రకటించాయి. ద్రౌపది ముర్ము పేరు ప్రకటనతో మర్మం ఏదైనా ధర్మమేనేమో అనే సాఫ్ట్‌కార్నర్‌ అప్పుడే ఏర్పడడం మనం గమనిస్తున్నాం. ముర్మును బ్రాండింగ్‌ చేయడం మోదీ వెంటనే మొదలు పెట్టినారు. 

ఆదివాసీని ప్రకటించి ఏం లాభం...? ఆమె రబ్బర్‌ స్టాంప్‌ మాత్రమే కదా అన్నవాళ్లు వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అభ్యర్థి కావాలని ఎందుకు అంగలార్చారు? మాయావతి రాష్ట్రపతి కోసమే బీజేపీతో సఖ్యంగా ఉంటోందని ప్రచారం కొంత మంది ఎందుకు చేశారు? గోపాలకృష్ణ గాంధీని, శరద్‌పవార్‌ను అడిగినవాళ్లు మాయావతిని ఎందుకు అడగలేదు? ప్రధానమంత్రి కావాలని కోరుకున్న చమార్‌ ఆడబిడ్డ రాష్ట్రపతి అభ్యర్థిగా ఉంటే చర్చవేరే తీరుగా ఉండేది కదా? గత అనుభవం ప్రకారం ఏ గవర్నర్, రాష్ట్రపతి అభ్యర్థీ... తమ వర్గాల, లేదా వ్యవస్థల కోసం ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని నిలదీస్తారని ఎవరూ ఆశించడం లేదు. అది వర్తమానంలో ఒక విషాదం. ఆదివాసీలకు ముర్ము ఏంచేశారు? అని రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా ప్రశ్నించడం గురువిందగింజ సామెతకు పదిరెట్లు అపహాస్యంగా ఉంటుంది.

బీజేపీలో అన్ని పదవులూ అనుభవించి కొడుకుకు ప్రాతినిధ్యం కోసం బయటకు వచ్చి, తన పదవీ కాలంలో ఒక రాజ్యాంగ విలువ గురించీ, ఏ ఒక్క వ్యవస్థల పతనం, అమ్మకాల గురించీ మాట్లాడని సిన్హా ఇప్పుడు ముర్మును అని ఏమి లాభం? (క్లిక్‌: ఆదివాసీ రాష్ట్రపతి కావడానికి ఇన్నేళ్లా?)

దేశ స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరుగుతున్నవేళ మునుపెన్నడూ లేనంత అణచివేత, దోపిడీ ఆదివాసీలపై కొనసాగుతోంది. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదంపై మొదటి సాయుధ తిరుగుబాటు చేసిన సంతాల్‌ తెగ వారసురాలు ద్రౌపది ముర్ము... ఇప్పుడు ఆదివాసీల సమస్యలకు కనీసం పునఃసమీక్ష అవసరమని ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తుందని కూడా ఎవరూ ఆశించకున్నా... ఆమే ఒడిషాలోని మయూర్‌భంజ్‌ నుండి 280 కిలోమీటర్లు రోడ్డు వెంట భువనేవ్వర్‌ చేరినప్పుడు వెల్లివెరిసిన ఆనందాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రాతినిధ్యం కనీస సవ్య పొందికను కలిగి ఉండాలని అణగారిన వర్గాలు కోరుకుంటున్నాయని గుర్తించమంటున్నాం. భవిష్యత్తులో ఏ రాజకీయ పదవికైనా పోటీ వచ్చినప్పుడు ‘గేమ్‌ చేంజర్‌’ నిర్ణయాలు ఉంటాయని గమనించమంటున్నాం.

- డా. చెరుకు సుధాకర్‌ 
వ్యాసకర్త తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు

మరిన్ని వార్తలు