గ్రహణం పట్టిన భాస్కరుడు

4 Apr, 2022 00:56 IST|Sakshi
నల్లమిల్లి భాస్కరరెడ్డి (1944–2022)

నివాళి

తెలుగు చలనచిత్ర చరిత్రలో ‘సిరిసిరిమువ్వ’, ‘సిరివెన్నెల’ – రెండు ఆణి ముత్యాలు. ఆ కళాత్మక చిత్రాలు దర్శకులు కె. విశ్వ నాథ్‌ అభిరుచికి ప్రతీకలుగా నిలిచి ఆయనకో ముద్రను సంతరించాయి. ముఖ్యంగా ఇద్దరు ప్రతిభామూర్తులైన కవులు వేటూరి సుందరరామమూర్తి, చేంబోలు (సిరి వెన్నెల) సీతారామ శాస్త్రి గార్లకు మొదటిసారిగా ‘సింగిల్‌ కార్డ్స్‌’తో పాటలు రాసే అవకాశాల నిచ్చాయి. జయప్రద, ఏడిద నాగేశ్వరరావు వంటి వారు చిత్రసీమలో నిలదొక్కుకునేలా చేశాయి. జాతీయ, రాష్ట్రీయ, స్వచ్ఛంద సంస్థల పురస్కారాలతో తెలుగు సినిమా కీర్తిని రెపరెపలాడించాయి. అయినా ఈ చిత్ర ద్వయ నిర్మాతలలో సూత్రధారుడైన నల్లమిల్లి భాస్కరరెడ్డికి మాత్రం తగిన గుర్తింపు దక్కక పోవడం దురదృష్టకరం!

నల్లమిల్లి భాస్కరరెడ్డి తూర్పుగోదావరి జిల్లా లోని పసలపూడి గ్రామంలో జన్మించారు. నటి రాజశ్రీ అభిమాని అయిన భాస్కరరెడ్డికి ఆమె నటించిన చిత్రాల ప్రదర్శన హక్కులను కొనాలనే కుతూహలం కలగడంతో ఆయన సినీ జీవితానికి అంకురార్పణ జరిగింది. సహాధ్యాయి ఉజూరి చిన వీర్రాజు తోడయ్యారు. ఇద్దరూ కలిసి పసలపూడిలో వ్యాపార రంగంలో ఉన్న మరో ఇద్దర్ని నిర్మాత లుగా చేర్చుకొని, అప్పటికే చిత్ర పరిశ్రమతో అంతో ఇంతో సంబంధమున్న అంగర సత్యం (‘పదహారేళ్ల వయసు’ నిర్మాత) సలహాతో ‘వెంకటేశ్వర కల్యాణం’ అనే డబ్బింగ్‌ చిత్రాన్ని నిర్మించారు.  ఆర్థికంగా లాభించడంతో ‘డైరెక్ట్‌ చిత్రం’ తియ్యా లనే కోరిక కలిగింది. అది అప్పటికి మద్రాసులో అస్థిరమైన పరిస్థితిలో ఉన్న ఏడిద నాగేశ్వరరావు ప్రోత్సాహంతో కార్యరూపం ధరించింది.

ఏడిద... విశ్వనాథ్, వేటూరి, కనకాల దేవ దాసులను వెంట పెట్టుకొని రామ చంద్రపురం  వచ్చారు. అందరూ సందేహించిన కథానాయిక మూగతనం అనే అంశాన్ని భాస్కరరెడ్డి సాహసించి ఆమోదించడంతో ‘సిరిసిరిమువ్వ’ చిత్ర నిర్మాణా నికి శ్రీకారం చుట్టారు. ఆ చిత్రానికి నల్లమిల్లి భాస్కరరెడ్డి, ఉజూరి చినవీర్రాజు, చింతా రామ కృష్ణారెడ్డి, కర్రి లచ్చారెడ్డి నిర్మాతలు కాగా – ఏడిద నిర్మాణ సారథిగా వ్యవహరించారు. చిత్రం ‘గీతా కృష్ణా కంబైన్స్‌’ పతాకంపై నిర్మితమైంది. ‘సిరిసిరి మువ్వ’ మద్రాసు మహా నగరంలో 300 రోజుల పాటు ప్రదర్శితమైంది. హిందీలో రిషి కపూర్‌ హీరోగా ‘సర్గమ్‌’ పేరుతో పునర్నిర్మింపబడి విజయవంతం కావడమే కాకుండా, మాస్కోలో కూడా సంచలనాన్ని సృష్టించింది. తరువాత మరింత ప్రయోగాత్మకంగా ‘సిరివెన్నెల’ చిత్రాన్ని నిర్మించడానికి కె. విశ్వనాథ్‌ ప్రతిపాదిస్తే ఒక నిర్మాత జారుకున్నా భాస్కర్‌రెడ్డి ప్రోద్బలంతో మిగతా ఇద్దరూ ముందుకొచ్చారు.

వ్యక్తిగతంగా భాస్కరరెడ్డి సహృదయుడు, స్నేహశీలి, ప్రాంతీయాభిమాని. తన పరిధిలో ఎందరికో సహాయం చేశారు. ఈ వ్యాసకర్త పరి శోధనకు సినిమా పాటల పుస్తకాలనిచ్చారు. భగ వాన్‌ అనే అధ్యాపకునికి సినిమాలో గాయ కునిగా అవకాశాన్నిచ్చారు. అన్నిటికీ మించి ఆంధ్ర దేశా నికి గర్వకారణ మైన రెండు కళాఖండాలను సమర్పించారు. కానీ ఆయన విచారించకపోయినా, పై సినిమాల నిర్మాతగా ఆయనకు గుర్తింపు రాలేదు. అవార్డుల స్వీకారం మొదలైన సంద ర్భాలలో ఆయన వెనక వరుసలోనే ఉన్నారు. మురారి తన చలనచిత్ర నిర్మాతల చరిత్రలో ఆయనను విస్మరించారు. ఎందుచేతనో ఆత్మీ యుడైన వంశీ కూడా ‘పసల పూడి కథలు’లో కానీ, ‘పొలమారిన జ్ఞాపకాలు’లో కానీ ఆయన గురించి రాయలేదు. అనారోగ్యం, ఆర్థిక సమస్యలు తరుముకొని రాగా ఇటీవల అనామకంగా, ఆకస్మి కంగా ఈ లోకానికి దూరమైన ఆ అనాదృత కళామూర్తికి ఆత్మశాంతి చేకూరాలి.

-డాక్టర్‌ పైడిపాల
వ్యాసకర్త సినీ సాహిత్య విమర్శకులు
మొబైల్‌: 99891 06162

మరిన్ని వార్తలు