ఎవరి కోసం ఈ అప్పగింత?

29 Aug, 2021 01:04 IST|Sakshi

‘జాతీయ ఆస్తుల నగదీకరణ’ నష్టదాయకం. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తనకు యాజమాన్య హక్కులు ఉన్నాయని ప్రభుత్వం భావించవచ్చు. కానీ తన మౌలిక రంగ ఆస్తులను ప్రభుత్వం ఎన్నడూ నిర్వహించిన పాపాన పోలేదు. అలాగని సేవలను అందించిందీ లేదు. కానీ ఆ ఆస్తుల విలువను కేవలం డబ్బు చేసుకోవాలనుకుంటోంది. గత అనుభవాలను పరిశీలించినట్లయితే, మదుపుదారులను ఆకర్షించడానికి ప్రభుత్వ ఆస్తుల స్వాధీనం అనేది పెద్దగా పనిచేయదని తెలుస్తుంది.

నష్టాలపాలవుతున్న ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ గురించి కేంద్ర ప్రభుత్వం డాంబిక పదజాలం వెనుక దాక్కుంటోంది కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు అప్పగించే పథకాన్ని ప్రకటించింది. ఈ పథకంలో రహదారులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వే ట్రాక్, స్టేషన్లు, ఇంధన పైప్‌ లైన్లు, టెలికాం టవర్లు, ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్, వేర్‌హౌస్‌లు, స్టేడియంలు వంటి ప్రభుత్వ ఆస్తులను బడా ప్రైవేట్‌ మదుపుదారులకు స్వాధీనం చేయనున్నారు. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి నాలుగేళ్ల కాలంలో రూ.6 లక్షల కోట్ల నగదు సమీకరణ ఈ పథకం లక్ష్యం. ఈ భారీ మొత్తాన్ని కొత్త మౌలిక వసతుల కల్పనకు ఉపయోగిస్తామని ప్రభుత్వం చెప్పింది.

అయితే ఇది ప్రైవేటీకరణ ఏమాత్రం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి వాదించారు. ప్రస్తుతం మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఉనికిలో ఉన్న, పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రాజెక్టుల నుంచి రాబడులు ఆర్జించడానికి ప్రైవేట్‌ మదుపుదారులకు నిర్దిష్ట కాలం వరకు వాటిపై హక్కులను తాత్కాలికంగా ప్రైవేట్‌ యాజమాన్యాలకు అప్పగిస్తున్నామని నిర్మలా సీతారామన్‌ వక్కాణించారు. అయితే ఈ ఆస్తులపై యాజమాన్యం ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని స్పష్టం చేశారు.

ఇక్కడ నాలుగు అంశాలను చర్చించాల్సి ఉంది. మొదటిది– ఉపయోగం లేకుండా వృ«థాగా ఉంటున్న ప్రభుత్వ ఆస్తుల విలువను పెంచడమే జాతీయ నగదీకరణ లక్ష్యం అని చెబుతున్నారు. కానీ ఇలా ప్రైవేట్‌ పరిశ్రమలకు అప్పగించిన ఆస్తులు నిర్దిష్టకాలం తర్వాత ప్రభుత్వానికి తిరిగి దఖలుపర్చడం జరిగినప్పటికీ, తదుపరి దశ నగదీకరణ కోసం వీటిని మళ్లీ మార్కెట్లోకి ప్రభుత్వం పంపించగలదు. ఆస్తులపై తనకు యాజమాన్య హక్కులు ఉన్నాయని ప్రభుత్వం భావించవచ్చు. కానీ తన వద్ద ఉన్నమౌలికరంగ ఆస్తులను ప్రభుత్వం ఎన్నడూ నిర్వహించిన పాపాన పోలేదు. అలాగని సేవలను అందిం చిందీ లేదు. కానీ ఆ ఆస్తుల విలువను కేవలం డబ్బు చేసుకోవాలనుకుం టోంది. కానీ గత అనుభవాల బట్టి, మదుపుదారులను ఆకర్షించడానికి ప్రభుత్వ ఆస్తుల అమ్మకం పెద్దగా పనిచేయదని తెలుస్తుంది. పైగా ప్రభుత్వ ఆస్తుల వేలం ప్రారంభానికి ముందే వాటిద్వారా ఇంత వస్తుందని అంచనా వేస్తున్నప్పటికీ, ఆస్తుల అమ్మకాల ద్వారా లభించే మొత్తం అంత అధికంగా ఉండదు.

రెండు – ప్రభుత్వ మాలిక రంగ ఆస్తులను తీసుకుని, వాటిని నిర్వహించడం ద్వారా, వాటి సేవల అమ్మకాల నుండి వచ్చే రాబడులపై ప్రైవేట్‌ రంగానికి గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే ఈ ఆస్తులకు యజమానిగా ఉన్నప్పటికీ, ధరలు నిర్ణయించడం వాణిజ్యపరంగా ఉంటుంది. ప్రైవేట్‌ రంగం ఆశించే అధిక రాబడులు సిద్ధించాలంటే వినియోగదారులపై భారీగా యూజర్‌ చార్జీలు విధించాల్సి ఉంటుంది లేదా ఈ రాబడుల విషయంలో వచ్చే వ్యత్యాసాన్ని పూడ్చడానికి ప్రభుత్వమే నిధులను పంపిణీ చేయవలసి ఉంటుంది. రాబడులు తక్కువగా ఉండి లేదా పరిమితంగా ఉన్న సందర్భాల్లో ప్రభుత్వ సహాయం గణనీయంగా ఉండాలి. ఈ క్రమంలో ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులను వెచ్చించాల్సి ఉంటుంది.

మూడు – తగినన్ని రాబడులను ఆర్జించడానికి ప్రైవేట్‌ రంగం ఖర్చులను తగ్గించుకునే స్వాతంత్య్రం కావాలని డిమాండ్‌ చేయవచ్చు. వీటిలో కార్మికులు, సిబ్బందిపై పెట్టే ఖర్చులు కూడా ఉంటాయి. లేబర్‌ ఖర్చులను తగ్గించే ప్రయత్నం వేతనాల కోత, ఉద్యోగాల నుంచి తొలగింపు వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. సంఘటిత కార్మిక మార్కెట్ల కోసం ప్రమాణాలు స్ధిరంగా కొనసాగించే ప్రభుత్వరంగ పాత్ర ఈ విషయంలో పూర్తిగా తగ్గిపోవచ్చు లేదా దాని ప్రాధాన్యతను తొలగించవచ్చు కూడా.

చివరిది – ప్రభుత్వ ఆస్తులను సాధించిన ప్రైవేట్‌ రంగ మేనేజర్లు వాంఛనీయమైన సేవలను అందించే విషయమై ప్రభుత్వం ఏ రకమైన పాత్ర నిర్వహిస్తుంది అనే అంశంపై ఈ జాతీయ నగదీకరణ విధానం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ లక్ష్యం కోసం రెగ్యులేటరీ వ్యవస్థను అమలు చేసినట్లయితే, అది ఖర్చుతో కూడుకున్నది. కాలహరణం కూడా జరగవచ్చు. దీనివల్ల అధిక ఖర్చులతో కూడిన సేవల నాణ్యత నిర్లక్ష్యానికి గురై క్షీణించవచ్చు కూడా.

ఆస్తుల నగదీకరణపై ఒక్కమాటలో చెప్పాలంటే, గ్రీన్‌ ఫీల్డ్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై పెట్టుబడి వనరులను సమీకరించడం అంటే బడా వ్యాపార వర్గాల చర్యలకు ఈ రంగం మొత్తాన్ని విస్తరించజేయడమే అవుతుంది. స్పష్టంగా చెప్పాలంటే వినియోగదారులు లేదా ప్రభుత్వ ఖజానా నుంచి పెట్టే ఖర్చుతో బడా పారిశ్రామిక వర్గాలు అధిక రాబడులను ఆర్జిస్తాయి. అంటే సంపద అనే పిరమిడ్‌లో శిఖరాగ్రాన ఉంటున్న వర్గాలవారికే మరింత ఆదాయాన్ని, సంపదను పంపిణీ చేయడమే నగదీకరణ అంతిమ లక్ష్యం.

ప్రజా సంపదను తాకట్టు పెడుతున్న కుంభకోణాన్ని తలపించే ఈ పథకం కొంతమంది ఎంపిక చేసుకున్న వాణిజ్య వర్గాలను మరింతగా బలపర్చడానికే ఉపయోగపడుతుంది తప్పితే కేంద్రప్రభుత్వం ఘనంగా చెబుతున్నట్లుగా కొత్త ఆస్తుల సృష్టికి ఏమంత పెద్దగా దోహదం చేయదు. జాతీయ మౌలిక వసతుల కల్పనా రంగంతో సహా పలు కీలక ప్రాజెక్టుల్లో వచ్చే అయిదేళ్ల కాలంలో మొత్తం 111 లక్షల కోట్ల రూపాయలను మదుపు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ప్రభుత్వ ఆస్తుల అమ్మకం లేదా నగదీకరణ పథకం ద్వారా వస్తుందని భావిస్తున్నది 6 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. అంటే కొత్త మౌలిక రంగ ప్రాజెక్టులకు ఈ నగదీకరణ పథకం ద్వారా అందేది అందులో అయిదు శాతం మాత్రమే. వాస్తవానికి, గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రజాధనం వెచ్చించి సృష్టించిన అపార సంపదలను బడా వాణిజ్య వర్గాలకు కట్టబెట్టడానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుంటోంది. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌ పరం చేయడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే అయిదేళ్ల కాలంలో ముట్టేది అయిదు శాతం కంటే తక్కువే అనేది చేదు నిజం. ఇది పథకం ప్రకారం రూపొందిస్తున్న భారీ కుంభకోణం తప్ప మరేమీ కాదు.

నగదీకరణ వాస్తవ రాబడి ఎంత?
ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రైవేట్‌ సంస్థలకు 25 సంవత్సరాల పాటు లీజు లేదా రెంట్‌కు అప్పగించడం ద్వారా 6 లక్షల కోట్ల రూపాయల రాబడిని కేంద్రం ఆశిస్తోంది. కానీ ప్రభుత్వానికి  అంతిమంగా మిగిలేది పెద్దగా ఉండదని చిన్న ఉదాహరణ చెబుతుంది. ఆస్తుల విలువ ఇప్పుడు 100 రూపాయలు అనుకుందాం. ఈ సంపదపై సంవత్సరానికి 4 శాతం రాబడి  వస్తుందనుకుందాం (ద్రవ్యోల్బణం తీసివేశాక). అయితే ప్రైవేటు వ్యాపారులు వాస్తవ వడ్డీరేటు అంచనా 6 శాతం అనుకుంటే  ఈ వందరూపాయల సంపదపై వారికి వచ్చేది రూ.  51.3. దీన్ని రౌండ్‌ ఫిగర్‌ కింద 50గా మారిస్తే 25 ఏళ్లకాలానికి 4 శాతం వార్షిక రాబడి కింద వంద రూపాయల ఆస్తిపై రూ.50 రాబడి వచ్చినట్లు లెక్క. అంటే ఆస్తుల నగదీకరణ  కింద అప్పగించిన ప్రతి వంద రూపాయలకు ప్రైవేట్‌ ఆపరేటర్‌కి వచ్చే రాబడి 50 రూపాయలన్నమాట. దీంట్లోంచి పెట్టుబడిపై ఆశించే రాబడిని తీసివేయాలి. తన మదుపుపై 50 శాతం కనీస రాబడిని ప్రైవేట్‌ వ్యాపారి ఆశిస్తున్నట్లయితే, ప్రతి రూ.100 ఆస్తిపై రూ.35లను చెల్లించడానికి అతడు సిద్ధపడతాడు. ఇప్పుడు అసలు లెక్క వస్తుంది.  ఆరు లక్షల కోట్ల మార్కెట్‌ విలువ నుంచి రెంటల్‌ తదితర ఖర్చులను మినహాయిస్తే ప్రభుత్వానికి వచ్చే అసలు రాబడి రూ.1.5 లక్షల కోట్లు మాత్రమే. 
వాస్తవానికి కేంద్రప్రభుత్వం పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి విధ్వంసకర నిర్ణయాల ద్వారా ఆర్థిక వ్యవస్థను నిశ్శబ్ద సంక్షోభంలోకి నెట్టివేసింది. 2019లో కార్పొరేట్‌ రంగానికి పన్నుల కోత ద్వారా రూ.1.45 లక్షల కోట్లను మిగిలించడం అతిపెద్ద విధ్వంసకర నిర్ణయం. జీడీపీ వృద్ధి నిరంతరాయంగా పతనం చెందడం, ఆర్థికంగా తప్పుడు నిర్ణయాల వల్ల రాబడులు తగ్గిపోవడం, వీటికి తోడు కార్పొరేట్‌ పన్ను కోతల భారం నుంచి తప్పించుకునేందుకు చమురు ధరను పెంచుతూ పోయారు. ప్రత్యక్ష పన్నులను పెంచడం ద్వారా దిగువ మధ్యతరగతి వినియోగదారులను పరోక్షంగా దెబ్బ తీశారు. దీంతో జీడీపీ పతన బాట పడుతూనే వచ్చింది. ఆస్తుల అప్పగింత ద్వారా వచ్చే రాబడిని ప్రభుత్వం ఏం చేస్తుందనేది ముఖ్యం. పెరిగిన ప్రభుత్వ వినియోగానికి రాబడిని ఉపయోగిస్తూ వస్తున్నారు. మౌలికరంగంపై మరింత పెట్టుబడి పెడతామంటున్నారు కానీ మితిమీరిపోయిన ప్రభుత్వ రుణాన్ని చెల్లించడానికి అది సరిపోతుంది. అంటే ప్రభుత్వ లక్ష్యాలు ఏవీ వాస్తవంగా అమలు కాలేవన్నది నిజం.
– ప్రొఫెసర్‌ సి.పి. చంద్రశేఖర్, ఆర్థిక రంగ నిపుణులు 

మరిన్ని వార్తలు